Pages

Sunday, June 10, 2012

ఉపయోగం లేని ఉప ఎన్నికలు: ఉత్తుత్తి ఉద్రేకాలు


ఉపయోగం లేని ఉప ఎన్నికల ప్రహసనంలో మూడు ప్రధాన పార్టీల నేతల సరళి విసుగుపుట్టించేంత మూస ధోరణిలో సాగుతున్నది. తమ తమ కోణాల్లో రాజకీయ సవాళ్లను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌, వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌ తెలుగు దేశం పార్టీలు అరిగిపోయిన రికార్డుల్లా అవే వ్యక్తిగత అంశాల చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. కీలకమైన ప్రజా సమస్యలు విధాన పరమైన విషయాలు తెర మరుగై పోయి ఒకరిని మించి ఒకరు దూషణల్లో నేతలు మునిగి తేలుతున్నారు. ప్రతివారికి అవతలి వారి లోపాలు తప్ప తమ తప్పిదాలు పొరబాట్లు అసలు కనిపించని పరిస్థితి. వివాదాలు తప్ప విధానాల లోతుల్లోకి పోవడం ఎవరికీ ఇష్టం లేదు. ఎందుకంటే విధానాల పరంగా చూస్తే వీరంతా ఏదో ఒక బిందువు దగ్గర ఆరోపణలన్ని సంగమిస్తాయని తెలుసు. జగన్‌ మోహన రెడ్డిపై విమర్శలు చేసి తాము బయిటపడాలని కాంగ్రెస్‌, ఆ ఇద్దరిని విమర్శించి తాను మెరుగని చూపించుకోవాలని తెలుగు దేశం ఈ ఇద్దరిపై ధ్వజమెత్తి తాము కక్ష సాధింపుకు బలవుతున్నామని ఒప్పించాలని వైఎస్‌ఆర్‌ పార్టీ. ఇది మౌలికంగా 17 స్థానాల్లో ప్రచార పోకడ.
ఈ క్రమంలో వైఎస్‌ఆర్‌ పార్టీపై కేంద్రీకరణ అధికంగా వుండటం సహజం. ఎందుకంటే ఈ ఎన్నికలు రావడానికి ఆ జగన్‌ అనుయాయుల రాజీనామాలే ఏకైక కారణం.తద్వారా తన సత్తా చాటుకోవడం, కాంగ్రెస్‌ తెలుగు దేశంల నుంచి వలసలు ఆకర్షించడం పైకి కనిపించే లక్ష్యాలైతే అంతకన్నా కీలకమైన భాగం మరొకటి వుంది.ఇప్పటికే జైలులో వుండి దర్యాప్తు విచారణ ఎదుర్కొంటున్న తనను ఏ పరిస్థితుల్లోనైనా సమర్థించే సైన్యాన్ని తయారు చేసుకోవడం జగన్‌ వ్యూహం. రేపు ప్రజా జీవితంలో తన స్థానాన్ని కాపాడుకోవాలంటే సిబిఐ ద్వారా కోర్టులలో బయిటకు వచ్చే ప్రతి విషయం కక్ష సాధింపులో భాగమని ప్రజలముందు చెబుతుండాలి. కేవలం తన కుటుంబ సభ్యులే చెబితే నమ్మించడం కష్టం గనక వారే చాలరు గనక ఒక యంత్రాంగం
వుండాలి. కాంగ్రెస్‌పై వత్తిడి తేవడానికి వీలైతే బేరసారాలు నడపడానికి కూడా ఎంఎల్‌ఎల బలం తప్పనిసరి. తను బయిటకు రాకపోయినా వీరి ద్వారా వ్యూహం నడపించవచ్చు. ప్రభుత్వ మనుగడను కూడా ప్రభావితం చేసేలా ఫిరాయింపుదార్లను అకర్షించే ప్రయత్నం చేయొచ్చు. తమ బలం పెరిగితే అప్పుడు ప్రధాన ప్రతిపక్షమైన తెలుగు దేశం నుంచి మరింత మంది వచ్చే అవకాశం పెరుగుతుందనేది మరో అంశం. శాసనసభలో ఈ విషయమై ఎలాటి చర్చలు చర్యలు వచ్చినా అడ్డుకోవడానికి కూడా స్వంత సభ్యులంటూ వుండాలి.ఒకప్పుడు వారు ఆశించిన సంఖ్య కన్నా చాలా తక్కువగానే శాసనసభ్యులు వచ్చినప్పటికీ జగన్‌ వర్గం వ్యూహం మారలేదంటే వారికి మరో గత్యంతరం కూడా లేదు.
తన అరెస్టు తర్వాతి పరిణామాలపై జగన్‌ అనేకరకాలైన అభద్రతా యుత వ్యాఖ్యానాలు చేశారు. ఆరోపణలు చేశారు.అయితే అవన్నీ ఆచరణలో నిజం కాలేదు. ఆయన అరెస్టు తర్వాత రాష్ట్ర స్థాయిలో వ్యక్తమైన స్పందన నిరసన కూడా పరిమితంగానే వున్నాయి. బంద్‌ కూడా పాక్షికంగానే జరిగింది. విజయమ్మ రాజ్‌భవన్‌ ముందు తర్వాత ఇంటి దగ్గర ధర్నా చేసినా ఇతర చోట్ల ఆ విధమైన కదలిక కనిపించలేదు. నిజానికి అరెస్టు తర్వాత గుండె జబ్బుతో చనిపోయారన్న వార్తలు కూడా సాక్షి బలంగానే ప్రచారం చేసినా మరో ఓదార్పు యత్ర స్తాయికి చేరుకోలేదు.జగన్‌ అరెస్టుపై సానుభూతి వెల్లువ వచ్చే సూచనలు లేకపోవడంతో రాజశేఖరరెడ్డి మరణాన్ని వివాద గ్రస్తం చేసే వ్యూహం పెద్ద ఎత్తునే అమలు జరిపినా పెద్ద సంచలనం కాలేదు.మైసూరా రెడ్డి, నానీ, రంగారావు వంటి వారిని ప్రచార ప్రధానమైన సందర్భంలో ప్రవేశపెట్టినా ప్రభావం పరిమితమే అయింది. ప్రస్తుత దఫా ఎన్నికల్లో జగన్‌ వర్గీయులకు అవకాశాలు ఎక్కువని సర్వేలు చెప్పిన మాట నిజమే అయినా ఈ వాస్తవాలను కూడా గమనించక తప్పదు. మాపై కక్ష సాధిస్తున్నారనే ఒక్క అంశం తాత్కాలికమైంది, వివాదాస్పదమైంది తప్ప శాశ్వతమైందీ తిరుగులేనిది కాదని వారికి తెలుసు. అరెస్టు తర్వాత తటస్తులలో కాస్త మార్పు ఛాయలు మొదలైనాయని కొన్ని సర్వేలు అభిప్రాయ సేకరణలు చెబుతున్నాయి.మొత్తంపైన ఈ ఉప ఎన్నికలు ఏకపక్షంగా వుంటాయన్న అంచనా కాస్త సడలడానికి ఎదురు దాడి కూడా తీవ్రం కావడానికి ఇవన్నీ కారణమైనాయి. ఒక వేళ ఈ దఫా ఉప ఎ న్నికల ఫలితాలు అనుకూలంగా వచ్చినా దర్యాప్తులో వెల్లడయ్యే అంశాలను బట్టి తర్వాత మార్పులు వుండొచ్చని కూడా ఇప్పుడు అందరూ అంగీకరించక తప్పడం లేదు. విజయమ్మతో పాటు లేదా ఆమెను మించి షర్మిల ప్రచారంలోకి దిగడాన్ని బట్టి చూస్తే దీన్ని ఒక కుటుంబ రాజకీయంగా చేయాలనే వ్యూహం ్ట స్పష్టమవుతుంది.ఈ సమస్యను ఆర్థిక రాజకీయ కోణాలతో నిమిత్తం లేకుండా వ్యక్తిగత కుటుంబ వ్యవహారంగా చేసి మద్దతు కూడగటే ్ట కృత్రిమ రాజకీయం నడుస్తున్నది. అది ఎన్నికల ఫలితాలతో ముగిసి పోదు. తీవ్రమవుతుంది. ఇప్పుడు నీళ్లు నమిలేవాళ్లు, తటపటాయించే వాళ్లు కూడా విమర్శించక తప్పని దశ వస్తుంది.
ఎ13ను అరెస్టు చేసిన వారు ఎ1ను ఎందుకు అంటుకోవడం లేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు చాలా సార్లు ప్రశ్నించారు.ఈ అవినీతి వ్యవహారాల లోతుపాతులు సరళీకరణ విధానాల్లో వున్నాయని ఇతర నాయకులు కూడా చాలా సార్లు ఎత్తి చూపించారు. జగన్‌తోనే ఆగకుండా మంత్రులను కూడా ప్రశ్నించాలని రాఘవులు పదే పదే చెప్పారు. కొంతమంది ఇవన్నీ పట్టించుకోకుండా సిపిఎంపై అవాకులు చవాకులు విసరడానికి ఆరాటపడుతున్నారు. తెలుగుదేశంను ఈ ఎన్నికల్లో బలపర్చడం లేదు గనక పరోక్షంగా సిపిఎంపై ఆపోహలు కలిగించేట్టు కొందరు ముఖ్యులే వ్యాఖ్యలు గుప్పించారు. నేను పాల్గొన్న ఒక చర్చలో ఆ పార్టీ నేత నెల్లూరు నుంచి మాట్లాడుతూ సిపిఎం వారు ఓట్లు ఎవరికి వేస్తారో తెలియదని అన్యాపదేశంగా అనుమానాలు సృష్టించే ప్రయత్నం చేసి తర్వాత సర్దుకున్నారు. కాగా మిత్రులుగా కనిపించే వారు కూడా చాటుమాటున అనేక కథనాలు వ్యాప్తిలో పెడుతున్నట్టు ఇతర చోట్ల విన్నదాన్ని బట్టి తెలిసింది. మీడియాలోనూ కొందరు ఈ పనిలో వున్నారు. ఇదంతా చాలా కుటిలమైన చవకబారు రాజకీయం. ఈ వారం ఈనాడు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఇంకా అనేక సందర్భాలలోనూ రాఘవులు జగన్‌పై కేసులో విషయంలో ఎవరికంటే ఖచ్చితంగా మాట్లాడారు.
అయితే తెలుగు దేశం విషయం వేరు. జగన్‌ అవినీతిని బయిటకు తెచ్చిన ఘనత మొత్తం తమదేనని చెప్పుకోవడానికి వారు ప్రాధాన్యత నిస్తున్నారు. ఈ క్రమంలో అనుకోకుండానే చంద్రబాబు నాయుడుపై ఆరోపణలపై దాడికి కారకులవుతున్నారు.వ్యాన్‌పిక్‌ నిమ్మగడ్డ ప్రసాద్‌ నుంచి కాకినాడ సెజ్‌ల వరకూ ఎమ్మార్‌ నుంచి ఫార్మా సిటీల వరకూ చాలా వ్యవహారాల మూలాలు తమ పాలనలోనే మొదలైనాయనే వాస్తవాన్ని వారు దాచి పెట్టలేరు. అయితే తాము మంచి ఉద్దేశంతో మొదలు పెడితే వైఎస్‌ఆర్‌ దారి తప్పించారని అంటారు. తర్వాత కుంభకోణాల తీవ్రత ఎక్కువైనప్పటికీ మూల కారణాలను దాటవేయడం కూడా కుదిరేపని కాదు. పాలనా పరంగానైనా తెలుగు దేశం వీటిపై సంజాయిషీ ఇచ్చుకోక తప్పదు కూడా. జగన్‌ కాంగ్రెస్‌ను సవాలు చేస్తున్న తొలి దశలో తెలుగుదేశం ఉదాసీన పాత్ర వహించడం, అవిశ్వాస తీర్మానంపై ఉభయులు కలసి ఓటు చేయడం వంటివి కూడా వున్నాయి. ఇప్పటికీ ఆ పార్టీ ముఖ్యులైన
నేతలు కొందరు కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శించేందుకు చూపించినంత దూకుడు జగన్‌పై చూపించలేక సన్నాయి నొక్కులు నొక్కుతుంటారు. వలసలు పోయే వారి జాబితాలు కూడా ఇస్తుంటారు. ఎన్నికల ప్రచారంలోనూ చంద్రబాబు వంటిరి పోరాటం తప్ప ఇతరులు ఆ స్థాయిలో పాలు పంచుకోవడం లేదన్న భావన కూడా బలంగా వుంది. మొత్తంపైన ప్రజలలో తెలుగు దేశం విశ్వసనీయత పెంచుకోవడంలో పెద్ద ముందంజ లేదనేది కనిపిస్తున్న వాస్తవం. పైగా జగన్‌కు అతిగా ప్రాధాన్యత నిస్తున్నామని కొందరు సరిగ్గా తిప్పికొట్టలేకపోతున్నామని మరికొందరు మాట్లాడుతున్నారు. ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యుల అసమ్మతి స్వరాలు కూడా అలాగే వున్నాయి. ఇవన్నీ తెలుగుదేశం ముందున్న సవాళ్లు.
నాయకుల సంఖ్య చూస్తే కాంగ్రెస్‌ ప్రథమ స్తానంలో వుంటుంది గాని ప్రచార వ్యూహం మొత్తం అయోమయం. అధికారంలో వుండి అనిశ్చితి తెచ్చి పెట్టి అంత:కలహాలలో మునిగి తేలుతున్న ఆ పార్టీ నేతలు ఎంతమంది కలసి మాట్లాడినా జనం స్పందన కనిపించడం లేదు. గులాం నబీ ఆజాద్‌ వంటి వ్యక్తి కూడా జగన్‌ గురించి చేసిన వ్యాఖ్యలు అయోమమాన్ని ప్రతిబింబించాయి. వారితో లేనందుకే కక్ష సాధిస్తున్నారని జగన్‌ వర్గం అంటుంటే మాతో వుంటే మహాయోగం పట్టేదని వీరు అనడం విడ్డూరంగా వుంది.తర్వాత నాలుక కర్చుకున్నా ఫలితం నాస్తి. సిబిఐ దర్యాప్తుపై అంతగా మాట్లాడేవారు లిక్కర్‌పై ఎసిబి దాడులకు ఎందుకు అడ్డం పడ్డారంటే జవాబు లేదు. జగన్‌ క్విడ్‌ప్రోకో జీవోలలో భాగస్వాములైన మంత్రులకు సంబంధించి సూటిగా ముందుకు రావడం లేదు. తాజాగా న్యాయమూర్తి అవినీతి వ్యవహారంలో ఒక మంత్రి పేరు బయిటకు వస్తే ముఖ్యమంత్రి పెదవి మెదిపింది లేదు. అసలే అంతంత మాత్రంగా వున్న కాంగ్రెస్‌ పరిస్తితిని మరింత దెబ్బతీస్తున్నాయి.
పరకాలకు వస్తే ఈ పార్టీలతో పాటు బిజెపి టిఆర్‌ఎస్‌ల వివాదం తీవ్ర స్తాయిలో నడుస్తున్నది. మతతత్వ రాజకీయాలకు ఉప ప్రాంతీయ రాజకీయాలకు మధ్య చివరకు జెఎసి టిఆర్‌ఎస్‌వైపే నిలిచింది. కాకపోతే ఈ క్రమంలో రాజకీయాలకు అతీతమైన తెలంగాణా వాదం అన్న భ్రమ పటాపంచలై ఎవరి ప్రయోజనాల కోసం వారు పాకులాడుతున్నారన్న పరమ సత్యం విదితమైంది. ఫలితం టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా వుంటుందన్న అంచనాలు వున్నా ప్రచారం హౌరాహౌరీగానే వుంది. మూడు మాసాలలో తెలంగాణా వచ్చేస్తుందని కెసిఆర్‌ పున: ప్రారంభించిన జోస్యాలు మరింత ఆసక్తి పెంచుతున్నాయి. మహబూబ్‌నగర్‌కు పరకాలకు చాలా తేడా వుంది గనక బిజెపి ఆశలు నెరవేరకపోవచ్చని గట్టిగా చెబుతున్నారు.
సిపిఎం పోటీ చేస్తున్న చోట్ల రాజకీయ ప్రధానంగా ప్రచారం నడుస్తున్నది.  జయాపజయాలు ఎలా వున్నా జనం అజెండా రంగం మీదకు తేవడానికి ఇ ది అవసరమన్న స్పందన వచ్చింది. లోక్‌సత్తాతో వున్న పరస్పర అవగాహన కూడా ప్రచారానికి తోడవుతున్నది. విధాన పరమైన తేడాలు ఏమైనా ఉప ఎన్నికల్లో ప్రజా సమస్యలు ప్రజా వనరుల పరిరక్షణ ప్రధానాంశాలుగా కేంద్రీకరించడం ఉభయ పార్టీల ఉమ్మడి అంశంగా వుంది. సిపిఐ తెలుగు దేశంకు మద్దతు ప్రకటించినా పరకాలలో మాత్రం టిఆర్‌ఎస్‌ తరపున ప్రచారం చేయడం కొన్ని విమర్శలకు కారణమైంది.
మొత్తంపైన వచ్చే ఫలితాలతో తలకిందులయ్యేదేమీ వుండక పోవచ్చు. ఉప ఎన్నికల ఫలితాల కన్నా అనంతర పర్యవసానాలే ముఖ్యం అన్న భావం ఇప్పుడు అందరిలో నెలకొన్నది. ఎందుకంటే జగన్‌ భవిష్యత్తు, ముఖ్యమంత్రి కొనసాగింపు, తెలంగాణా రాజకీయాలు, వగైరాలన్నిటితో రాష్ట్ర రాజకీయాలు ముడిపడివున్నాయి. కనీసం ఆ తర్వాతనైనా వ్యర్త రాజకీయాలు వ్యక్తి రాజకీయాలు వెనక్కు పోయి ప్రజల కోసం పనిచేయడంపై ప్రతివారు కేంద్రీకరిస్తే మంచిది.

No comments:

Post a Comment