Pages

Wednesday, December 21, 2011

మాఫియా మహా సామ్రాజ్యాలుకారణమేదైనా మీరు మంచి పని చేశారు, ఆ చేసిందాంట్లో తెలిసిందేమిటో మాకూ చెప్పండి అని ప్రజలు ప్రతిపక్షాలు, మీడియా అడుగుతుంటేే పాలకులే తటపటాయించే పరిస్థితి గతంలో ఎప్పుడైనా చూశారా? ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయ రంగస్థలంపై ి దృశ్యం అదే. లిక్కర్‌ మాఫియాపై దాడులను ఆహ్వానిస్తూ వాటిలో పట్టుబడిన వారి వివరాలను పారదర్శకంగా ప్రజల ముందుంచమని కోరుతుంటే ప్రభుత్వం ప్రతిస్పందించడం లేదు. దాడులు చేసిన ఎసిబి అధిపతులు గాని, వారికి ఆదేశాలిచ్చే ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి గాని తమ దాడుల తీరు తెన్నులు ఫలితాలు పర్యవసానాలు రేఖా మాత్రంగానైనా పంచుకోవడం లేదు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అఖిలపక్ష సమావేశం జరపాలన్నారు. స్వపక్షం అద్యక్షుడు, సమిష్టి మంత్రివర్గ బృంద సభ్యుడు బొత్స సత్యనారాయణ విషయాలు బయిటపెట్టమని 'సవాలు' చేశారు. మహిళా సంఘాలు ఆందోళనలు మొదలెట్టాయి. మీడియా చర్చల్లో మాలాటి వాళ్లం మద్యం మాఫియా మతలబులు బహిర్గతం చేయాలని కోరుతూనే వున్నాం. అయినా సరే, ప్రభుత్వం కిమ్మిన్నాస్తి అన్నట్టుగా వుండిపోతున్నది. గనుల మాఫియా, భూముల మాఫియా, మాదకద్రవ్యాల మాఫియా, మద్యం మాఫియా, ఇసుక మాఫియా, ఆయుధాల మాఫియా, అడవుల మాఫియా, అశ్లీల కృత్యాల మాఫియా, టెండర్ల మాఫియా, మర్దర్ల మాఫియా , మనీ లాండ్రింగ్‌ మాఫియా అన్నిటినీ మించి కనిపించని కార్పొరేట్‌ మాఫియా.. ఇన్ని మాఫియా మహా సామ్రాజ్యాల పదఘట్టనలో మన ప్రజాస్వామ్యం మనుగడ ఏమిటి?

మిగిలిన కొన్ని మాఫియాల్లాగా లిక్కర్‌ వ్యవహారం కేవలం ప్రకృతి సంపదనో ప్రజల ధనాన్నో కొల్లగొట్టడంతో ఆగదు. నేరుగా ప్రజల ఆరోగ్య సౌభాగ్యాలను దెబ్బతీస్తుంది. పురుషులు తాగితందనాలాడుతుంటే
తట్టుకోలేని పేద మధ్య తరగతి కుటుంబాలను కల్లోలితం చేస్తుంది. నేరస్త ధోరణులకూ అనేక వికృతాలకూ ఆజ్యం పోస్తుంది. వెరసి సామాజిక భద్రతకూ ముప్పు తెస్తుంది. తాగే వారి కన్నా తాగించే ముఠాలు ప్రజాస్వామ్యాన్నే శాసించే స్థితి. ఏవైనా కొన్ని తేడాలున్నా తెలుగు దేశం, కాంగ్రెస్‌ వంటి ప్రధాన పాలక పార్టీలన్ని ఈ పాపంలో పాలు పంచుకుంటున్నవే. అయితే వైఎస్‌ ప్రభుత్వం లక్ష కోట్ల బడ్జెట్‌ బాట పట్టిన నాటినుంచి ఈ జాడ్యం బాగా ముదిరిపోయింది. వైన్‌ షాపుల వేలం పాటలో పోటీలు పెట్టి పాడుకునే పద్ధతి గొలుసు కట్టు విష వలయంగా మారిపోయింది. పదేళ్ల కిందటితో పోలిస్తే లైసెన్సు ఫీజు 30 కోట్ల నుంచి 300 కోట్ల రూపాయలకు పెరిగింది.ఇక వేలం పాటల పోటీకి పరాకాష్టగా గుంటూరు జిల్లా దాచేపల్లి వైన్‌ షాపు అయిదు కోట్లకు పైనే పలికింది. రాష్ట్రంలో వి ఆరు వేలకు అటూ ఇటుగా లైసెన్సు దుకాణాలైలే అంతకు పదింతలుగా గ్రామ గ్రామానా రోడ్ల పొడుగునా మద్యం దుకాణాలు. గుడి బడి నివాసాలు జనావాసాలు తేడా లేకుండా ఎక్కడ బడితే అక్కడ లిక్కర్‌ షాపులు తెరుచుకున్నాయి. పగలూ రేయి వాటి ముందు పడిగాపులు పడే మందు బాబులకు మామూలుకన్నా కొన్ని వందల శాతం ఎక్కువ రేటుకు అది కూడా నకిలీ లేబుళ్లతో హానికరమైన ద్రావకాలు తాగించే దుస్థితి నిరంతరంగా సాగిపోతున్నది. ఈ విషయంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోకుండా ఎవరి రాజ్యంలో వారు యథేచ్చగా దోచుకోవాలంటే సిండికేట్లుగా ఏర్పడాలి. ఆ గుత్త పెత్తనం తీసుకున్నాక గుత్తంగా కాపాడుకోవడానికి అవినీతి పరులను మేపాలి. అదే ఈ సమస్య సారాంశం.
ప్రధానంగా కల్లు గీత సొసైటీలు, ప్రసాదు అన బడే ప్రభుత్వ సారాయి దుకాణాల కాలం ఒకటుండేది. కల్తీ కల్లు, కాపు సారా అంటూ దాడులూ జరిగేవి. వాటన్నిటి స్థానాన్ని ఇప్పుడు నయా మాఫియాలే ఆక్రమించాయి. కృత్రిమ కల్లు నుంచి కల్తీ విదేశీ మద్యం వరకూ ఇవే సరఫరా చేస్తూ అటు ఖజానాకు ఇటు ప్రజల ఆరోగ్యాలకు కూడా చిల్లులు పొడుస్తున్నాయి. మద్యం ఆదాయం రు.12 వేల కోట్ల రూపాయలైతే దానిమీద ఆదాయపు పన్ను, లైసెన్సు ఫీజు వగైరాలు , ఆ పైన పన్ను ఎగవేతలు, ఎక్కువ వసూలు చేసే రేట్లు అన్ని కలిపి బడ్జెట్‌లో మూడో వంతుకు పైమాటే.నిరుత్సాహ పరుస్తామన్న వారు తాగండిరా తాగి వూగండిరా అని మహౌత్సాహంగా కోటాలు నిర్ణయిస్తుంటే నగరాలు పట్టణాల్లో బ్యానర్లు కట్టి మరీ తాగబోయిస్తున్న దౌర్భాగ్య స్థితి.క్లబ్లులూ పబ్బుల గబ్బులు జుగుప్స కొల్పుతున్న స్థితి.అందుకే ఇది కేవలం రాజకీయ ఆర్థిక సమస్య కాదు, ఒక సామాజిక సమస్య. ఏ పట్టణంలో చూసినా కుర్రకారు నుంచి నడి వయస్కుల వరకూ మద్యం దుకాణాల దగ్గర ఎగబడి పోవడం, ఓ మోస్తరు మండల కేంద్రాల్లో కూడా రోడ్లపైనే చీప్‌ లిక్కర్‌ గుటకేసుకోవడం సర్వసాధారణమై పోయాయి. సారా వ్యతిరేకోద్యమంతో దేశాన్నే కదిలించిన రాష్ట్రంలో ఇలా జరగడం నిజంగా వికృతమే గాక విషాదం కూడా.
ఈ మాఫియా ముఠాల చెల్లింపుల జాబితాలో రాజకీయ ప్రముఖులు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఆఖరుకు మీడియా వారూ వున్నట్టు దొరికిన చిట్టాలు చెబుతున్నాయి. ఉత్తరాంధ్రకు సంబంధించి తమ కుటుంబం ఈ వ్యాపారం చేసుకోవడం తెలిసిన విషయమేనని సత్తిబాబు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఈ దాడులు ఆయన లాటి వారిని ఇరుకున పెట్టేందుకే చేశారన్న కథనాల నేపథ్యంలో వివరాలు బయిటపెట్టాలని ఆయన కోరిక. అసలు వేలం పాటలకు హెచ్చు రేట్లు పెట్టడం వల్లనే వైన్‌ డీలర్లు అధిక రేట్లకు అమ్ముతున్నారని సంబంధిత శాఖా మంత్రి మోపిదేవి వెంకట రమణ సమర్థన! తనకు సంబంధం లేదని ప్రకటన ఏడుగురు మంత్రులు డెబ్బయి మంది ఎంఎల్‌ఎలు జాబితాలో వున్నారని అనధికార సమాచారం. చాలా చోట్ల మద్యం సిండికేట్ల మనుషులు కొన్ని చోట్ల నేరుగా ఆ కుటుంబాల సభ్యులు రాజకీయ పదవులు అనుభవిస్తున్నారనడానికి ఉత్తరాంధ్ర ఉదాహరణ చాలు. ఇన్నిటి మధ్యనా ఎసిబి అధికారులు కూడా సమీక్షలు చేసుకోవడం, ముఖ్యమంత్రికి నివేదించడం తప్ప ప్రజల ముందు వాస్తవాలు వుంచడం లేదు. దాడులను అనుమతిచ్చిన కిరణ్‌ కుమార్‌ కూడా ఏ వత్తిళ్లు వ్యూహాల వల్లనో గాని విషయాలు వివరాలు ప్రజలతో పంచుకోవడం లేదు. ఆయన నీతి వంతుడు గనకే దాడులు చేయిస్తున్నారని అనుకూల నేతలు కొనియాడటం బాగానే వుంది గాని అదే వేగం వాటిని బయిటపెట్టడంలో ఎందుకు చూపించడం లేదు? ఇంత హఠాత్తుగా దాడులు చేసి గుంభనగా వుండిపోవడం సందేహాలకు దారితీయడం లేదా? అవినీతి పరులనూ అక్రమలాభాల వాటాదార్లను బయిటపెడితే ప్రజలు హర్షించరా? మహిళలు హారతి పట్టరా? అంతకంటే కూడా ముఖ్యమంత్రి సాధించాలనుకుంటున్నదేమిటి? అధికారులు ఉద్యోగులపై ప్రత్యక్ష ప్రసారాల స్థాయిలో దాడులు చేసే ఎసిబి ఈ విషయంలో ఎందుకు గుంభనగా వుండిపోతున్నట్టు? వారిపై ఒత్తిడి ఆ స్థాయిలో వుందా?
మద్యం మాఫియా గుట్టుమట్టులు బయిటపెట్టకుండానే ఇప్పుడు ఇసుక మాఫియాపై దాడులు మొదలెట్టారు. ఇదీ మంచి పనే. చాలా జిల్లాల్లో రీచ్‌ల పాటలంటూ పాడుకుని ఆ పైన నదీ తీరాలను వాగులూ వంకలనూ వదలకుండా ఇసుక తవ్వేసుకునే మాఫియాల బెడద విపరీతం. ఇసుకలో తైలం తీసినట్టుగా కొనుగోలు దార్లను పీల్చి పిప్పి చేసేలా వేల రూపాయల రేట్లు వసూలు చేయడంతో ఇసుక భారం కూడా భరించలేనిదిగా తయారైంది. ఇందులోనూ పాలక పక్ష ప్రతినిధులదే ప్రధాన పాత్ర. భూ మాఫియాల విషయానికి వస్తే గతంలో కేటాయింపులపై సమీక్ష అన్నది మిథ్యగా మారిపోతే మంత్రిపైనే మరో మంత్రి తనయుడి మద్దతు దారులు దౌర్జన్యానికి దిగిన వైపరీత్యం ఆంధ్ర ప్రదేశ్‌లోనే సాధ్యం అనుకోవచ్చు.
అయితే ఇలాటి దాడులలో తెలిసిన వివరాలు దాచిపెట్టుకుంటే ప్రజలకు విశ్వాసం కలగదు. రాజకీయంగా దారికి తెచ్చుకోవడానికి దాన్ని ఉపయోగించుకుంటే సరికాదు.. జాతీయ స్థాయిలో ప్రధాన మంత్రినే విచారించగల లోక్‌పాల్‌ను లోక్‌సభ చర్చిస్తూంటే లిక్కర్‌ చెల్లింపుల వివరాలపై ఇన్ని శషభిషలు అవసరం లేదు. ఇలాటి దాగుడు మూతలు దుష్టశక్తులను శిక్షించడం కన్నా రక్షించడానికే దారి తీస్తాయి. ఆ విధంగా వారి వ్యవహారాలు మాపీ చేయించే మాఫియాలు కొత్తగా పుట్టుకొస్తాయి. అది మరింత ప్రమాదకరం. దేశమంతటా అవినీతి వ్యతిరేక వాతావరణం, రాష్ట్రంలోనూ రాజకీయ ప్రముఖల ఆస్తులపై దర్యాప్తులు జరుగుతున్న ప్రస్తుత ఘట్టమే అన్ని మాఫియాలనూ మార్ఫియాలనూ వెలికి తీయడానికి సరైన సందర్భం. ఆ విధమైన సాహసాన్ని సంకల్ప శుద్ధిని ముఖ్యమంత్రి ప్రదర్శిస్తారా అన్నది చూడాల్సిందే. అలా చేస్తే మాత్రం హర్షామోదాలు లభిస్తాయి. లేదంటే అనుమానాలు మిగిలేవుంటాయి.

4 comments:

 1. తెర గారూ, ప్రభుత్వాలు సరె..అవ్వెలాగూ దుర్మార్గమైనవని మనమెప్పుడొ తేల్చేశాం? కానీ అమాయకులు, నిజాయితీ పరులు, సంస్క్రుతీ సమంప్రదాయ పరిరక్షకులైన సామన్య ప్రజలెందుకు తాగి తందానాలాడు తున్నారంటారు?

  ReplyDelete
 2. we nenver absolved the people or society of their responsibility. any way it is also a serious point and you are not wrong. that is what we call cultural degradation.. tks

  ReplyDelete
 3. Liquor prohibition is still in force in Gujarat. In Sourashtra area of Gujarat,I never found a single wine shop/Bar or even a Mutton shop. If at all any Mutton shop is there for Muslims and others, it will be located at a secluded place. They will not sell non-veg openly. AP is getting major chunk of income from liquor only.Then, how Gujarat has become prosperous without any revenues from liquor.

  ReplyDelete
 4. @ prasiddha,

  please don't forget the notorious gujarat mafia is basically a product of that. speaking of prosperity there is a long history... any way i do agree that we are wrong to treat it as a major income source.. and that is my contetion

  ReplyDelete