Pages

Wednesday, January 5, 2011

చెయ్యెత్తి జై కొట్టు, తెలుగోడు!

24 గంటల ఛానెళ్ల యుగంలో గడువులూ, ఉత్కంఠలూ కీలకం. శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించే డిసెంబరు 31 చుట్టూ బోలెడు కథ నడిచిన తర్వాత జనవరి 6 ఆ స్థానాన్ని ఆక్రమించింది. ఇంటర్‌ నెట్‌లో విడుదల చేయదగిన లేదా టపాలో పంపదగిన ఆ నివేదికపై అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కేంద్రమూ నాటకీయత కొనసాగించింది. విమర్శలూ వివాదాల తర్వాత ఇప్పుడు రావడం రాకపోవడం ఒకరా ఇద్దరా తేల్చుకోవడం అంతా సదరు పార్టీల ఇష్టమేనని ప్రకటిస్తున్నది. నివేదిక ఇవ్వడం తప్ప చేసేదేమీ వుండదనిచల్లగా సెలవిస్తున్నది. కేంద్ర రాష్ట్రాలను పాలించే కాంగ్రెస్‌ నిజంగా అంత నిష్కామ కర్మగా వ్యవహరించి వుంటే ఈ అనిశ్చితి ఇంత కాలం కొనసాగేదే కాదు. ఇప్పుడు అది సమసిపోయే సూచనలూ
లేవు. ఎందుకంటే ప్రధాన పక్షాలు అనిశ్చితికి మూలమైన అవకాశవాద రాజకీయాలను వదులుకున్న దాఖలాలు లేవు. తను నియమించిన కమిటీ నివేదికను ముందు తనుగా పరిశీలించి అభిప్రాయాలతో ముందుకు రావలసిన కేంద్రం ఆ బాధ్యతను రాష్ట్రంలోని రాజకీయ పక్షాలపై నెట్టి వేయడంలో కనిపించేది స్వచర్మ పరిరక్షణా తంత్రం మాత్రమే. పదే పదే హౌం మంత్రి చిదంబరం ఈ సమస్యకు పరిష్కారం రాష్ట్రంలోని రాజకీయ పక్షాల చేతుల్లోనే వుందని చెప్పడం రాజ్యాంగాన్ని వెక్కిరిస్తున్నది. ఒక దశలో జస్టిస్‌ శ్రీకృష్ణ కూడా విభేదించిన ఈ అభిప్రాయాన్ని పునరుద్ఘాటించడంలో చిదంబర రహస్యం రాజకీయ ప్రయోజనాల పరిరక్షణే. తెలుగు దేశం కూడా ద్వంద్వ భాషణ వ్యూహానికి డిటో అనడం వూహించిందే. ఈ విషయంలో తెలుగుదేశంపై దాడి కేంద్రీకరించే టిఆర్‌ఎస్‌ నేతలు ముందే ఢిల్లీ సమావేశాన్ని బహిష్కరించడం ద్వారా తామే దానికి అవకాశమిచ్చారు.
శ్రీకృష్ణ కమిటీ ఇచ్చే పరిష్కారం ఏమీ వుండదని మొదటి నుంచి చెప్పిన నాయకులు తీరా ఆ ఘడియ వచ్చాక అనుకోనిది జరిగినట్టు స్పందించడంలో అర్థం లేదు. ఏది ఏమైనా ఆ నివేదిక ఏకపక్షంగా వుండే అవకాశమూ వుండదు. ఎందుకంటే విచారణాంశాలలో సకల ప్రాంతాల సమగ్రాభివృద్ధికి సూచనలు చేయమని వుంది. విభజన, అవిభాజ్యత ఆందోళనలను పరిశీలించాలని వుంది. అందుకే ఆ నివేదక తెలంగాణా విభజనకు అనుకూలంగా వుండక పోవచ్చన్న మాట విభజన వాదులు ముందే చెబుతున్నారు. తమ పోరాటం దీర్ఘకాలం కొనసాగుతుందని చెప్పడం ద్వారా టిఆర్‌ఎస్‌ నేతలు కూడా దాన్నే ప్రతిధ్వనిస్తూ అదే సమయంలో దీర్ఘకాలం అంటే కొన్ని నెలలు మాత్రమేనని వివరణనిస్తున్నారు. సీమాంధ్ర జెఎసి కన్వీనర్‌ కూడా తమకు అనుకూలంగా లేకపోతే ప్రజా ప్రతినిధులు రాజినామా చేయాలని పిలుపునిస్తున్నారు. ఏతా వాతా ఏడాది తర్వాత మళ్లీ అనిశ్చిత పర్వమే సాక్షాత్కరిస్తున్నది.కనీసం అశాంతిని అరికట్టేందుకైనా అధినేతలు యత్నిస్తారా అని అశేష జనం నిశితంగా చూస్తున్నారు. ఈ ప్రతిస్పందనలేవీ అనుకోనివి కానప్పటికీ వీటన్నిటి మధ్యనా కేంద్రం తీసుకున్న వైఖరి మాత్రం వారిలో సందేహాలు పెంచుతున్నది. ఏ రాష్ట్ర సమస్యను ఆ రాష్ట్రానికి చెందిన పక్షాలకే వదిలేయడం అన్న సూత్రం రాజకీయంగానే గాక రాజ్యాంగ రీత్యా కూడా ప్రహసన ప్రాయమే తప్ప ప్రజాస్వామికం కాదు. అనుకూలమైనా ప్రతికూలమైనా ఒక వైఖరిని ప్రకటించి పర్యవసానాలను రాజకీయంగా ఎదుర్కోవడానికి సిద్ధం కావాలే తప్ప ఎడతెగని అనిశ్చితి తెలుగు ప్రజలు హర్షించేది కాదు.

ఈ సమావేశానికి ఒకరు వెళ్లాలా ఇద్దరా అన్న చర్చ, ఆ కారణంగా సమావేశాన్ని బహిష్కరించడం అనివార్యమైన ఎత్తుగడలు మాత్రమే. వెళ్లేది ఇద్దరైనా ఒకేమాట చెప్పొచ్చు, ఒకరే వెళ్లి వంద రకాలుగా మాట్టాడనూ వచ్చు. ఎప్పుడైనా ఎక్కడైనా పార్టీలకు కావలసింది రాజకీయ లాభ నష్టాలతో నిమిత్తం లేనివిధాన స్పష్టత, విధానం సరైందనుకుంటే నష్టమైనా భరించాలి, సరైంది కాకపోతే లాభమైనా వదులుకోవాలి. గతంలో సిపిఎం(మరో విధంగా మజ్లిస్‌) తప్ప ఇతర రాజకీయ శక్తుల్లో రాజకీయ గజిబిజి వుండింది. శ్రీకృష్ణ కమిటీకి నివేదికలిచ్చినప్పుడు ఆయన ప్రశ్నలు జవాబుల కార్యక్రమంలో ఈ గందరగోళం బహిర్గతమైంది. సిపిఐ, బిజెపిలు, టిఆర్‌ఎస్‌ విభజనను బలపర్చినా కాంగ్రెస్‌ తెలుగు దేశం ద్వంద్వ రాగం వినిపిస్తూనే వున్నాయి. కేంద్రం వైఖరికి కట్టుబడి వుంటామనేది రాష్ట్ర మంత్రివర్గ పల్లవి కాగా కేంద్రం ఏమీ తేల్చబోవడం లేదు. దీనిపై జనం దృష్టిని ఆకర్షించేందుకు హడావుడి చేస్తున్న తమ ప్రతినిధులకు గప్‌చిప్‌ సంజ్ఞలు పంపుతున్నది. అరవై డెబ్బై ఏళ్ల కిందట రాష్ట్ర ఏర్పాటు సందర్భంలోనే కాంగ్రెస్‌ నేతలు వేర్వేరు గొంతులతో మాట్టాడారు. ఆ తర్వాత కూడా వివిధ ప్రాంతాలలో విభజన వాదాలను లేవనెత్తి రెచ్చగొట్టడం తర్వాత సర్దుకోవడంలో గొప్ప చాతుర్యం ప్రదర్శించారు. ఈ ఎత్తుగడనే అనుసరించబోయిన తెలుగు దేశం అంత అనుభవం లేకపోవడం వల్ల సంకట స్థితిలో పడింది. ఈ రెంటికీ మధ్య టిఆర్‌ఎస్‌ కూడా వైరుధ్యాలనుంచి బయిట పడలేకపోతున్నది. 'తెలంగాణాకు అనుకూలమైతే' అన్న మాట జోడిస్తున్నప్పటికీ కాంగ్రెస్‌ను బలోపేతం చేయడం, సోనియా నాయకత్వంలో విలీనం కావడం వంటి మాటలు, జగన్‌ విజయావకాశాల గురించిన సానుకూల వ్యాఖ్యలు భిన్న సంకేతాలిస్తున్నాయి. ఎవరి వుచ్చులో ఎవరు పడుతున్నారు, పడేస్తున్నారు అన్నది నేడు కాకపోతే రేపైనా తెలియక పోదు. తెలుగుదేశం నుంచి టిఆర్‌ఎస్‌లోకి భారీగ వలసలు జరుగుతాయన్న వూహలు ఏ మేరకు నిజమవుతాయో కూడా వేచి చూడాల్సిందే. లెక్కకు మిక్కుటమైన జెఎసిల తీరు తెన్నులు ఎలా వుంటాయన్నది మరో ప్రశ్న. ఒక ప్రాంతంలో పరిస్థితికి మరో వైపున పాలక పక్షాల నేతలు ఎలాటి ప్రతి స్పందన పెంపొందిస్తారనేది ఇంకో ప్రశ్న. ఎందుకంటే మౌలికంగా ప్రాంతీయ వాదాలు పాలక వర్గాల పాచికల నుంచి ఉత్పన్నమైనవనేది కాదనలేని ే వాస్తవం. అంతిమంగా ప్రాంతాల కన్నా ప్రయోజనాలే వారిని నడిపిస్తుంటాయి.
చారిత్రిక నేపథ్యాలు స్వరూప స్వభావాలూ భిన్నమైనప్పటికీ వెనకబాటు తనం అన్ని ప్రాంతాలలోనూ వుందనేది కనిపిస్తున్న సత్యం. ఈ వ్యవస్థలో . దోపిడీ పీడనలకు ఏ ప్రాంతం మినహాయింపు కాదు. ఎవరి కోణం నుంచి వారు చేసే వాదనలు, ఇచ్చే అంకెలు క్రోడీకరించడానికి శ్రీకృష్ణ కమిటీ నివేదిక సాధికార పాత్ర పోషించింది. అది దిక్కు మాలిన కమిటి అన్న కెసిఆర్‌ మాటలు, దిక్కు చూపే కమిటీ అన్న శ్రీకృష్ణ వ్యాఖ్యలు ఎలా వున్నా అనేక దిక్కులు అది ప్రస్తావించే అవకాశాలుంటాయి. కనక అటూ ఇటూ తిరిగి బంతి తిరిగి కేంద్రం వైపునే పడుతుంది. దీనిపై ఎంత కాలమైనా చర్చ చేస్తాననే దాని సహనాన్ని స్వాగతిస్తూనే ఏ ప్రాతిపదిక చర్చ చేస్తారని అడగవలసి వుంటుంది. ఈ రోజున ఢిల్లీలో జరిగే సమావేశానంతర పరిణామాలకు ఆ ప్రశ్ననే ప్రాతిపదిక కావాలి. అంతే తప్ప మధ్యంతర ఎన్నికల గురించిన వూహలూ ఆశలూ లేదా రాష్ట్రపతి పాలన పెట్టుకోవచ్చనే వ్యూహాలూ రాష్ట్రాన్ని తీరం చేర్చవు. గతంలో ఈ మార్గాన్ని అనుసరించి అధికారాన్ని కాపాడుకున్న కాంగ్రెస్‌ సమస్య శాశ్వత పరిష్కారానికి మార్గం చూపలేకపోయింది. అపారమైన ప్రకృతి వనరులూ అద్బుతమైన మానవ వనరులూ రాజకీయ చైతన్యం సమరశీల వారసత్వం వున్నా ఈ రాష్ట్రం రావణకాష్టంలా ఉద్రిక్తతల వలయంలో కొనసాగుతున్నదంటే దానికి కేంద్రానిదే ప్రప్రధాన బాధ్యత. రాజకీయ నిర్ణయాలు దాటవేస్తూ సాయుధ బలగాలతో అణచివేత చర్యలు సాగించడం సమస్యను జటిలం చేస్తుందే గాని పరిష్కరించదు. అలాగే రాష్ట్రపతి పాలనతో రాష్ట్రంపై పరోక్ష పాలన వల్ల పట్టు నిలబడవచ్చు గాని ప్రజల ఆమోదం మాత్రం వుండదు. ఏడాది పాటు ఎవరు ఎన్ని విధాల రెచ్చగొట్టినా ఎన్ని వికృత విన్యాసాలు చేసినా చాణక్య లౌక్యాలు ప్రదర్శించినా ప్రాంతాలకు అతీతంగా ప్రజలు ప్రదర్శించిన శాంతి కాంక్ష రాష్ట్రానికి రక్షా కవచమైంది. గత చరిత్ర అటుంచి ఈ ఏడాది కాలంలోనూ వివిధ రాజకీయ పక్షాల నేతల తీరు తెన్నులూ మాటలూ బాటలూ తెలుగు ప్రజలకు గొప్ప గుణపాఠాలు నేర్పించాయి. జీవన పోరాటాలూ సమస్యలపై సమరశీల ఉద్యమాలు తప్ప ఏకాంశ ప్రధానమైన ఎడతెగని వివాదాలు ఎవరికీ శ్రేయస్కరం కాదన్న మెళకువ ప్రతిచోటా ద్యోతకమవుతున్నది. వీరులకు మొగసాల తెలగాణ, చైతన్య రాస్తా కోస్తా, రాణకెక్కిన రాయలసీమ ప్రాంతాలేవైనా సరే ప్రతివారి అసలు రూపాలుఈ తాజా ఘట్టంలో ప్రజలు మరింత బాగా తెలుసుకోగలుగుతారు. ఈ పరీక్షా సమయంలో పరిపక్వత ప్రదర్శించి చెయ్యెత్తి జై కొడతారు. కుటిల రాజకీయాలను చీ కొడతారు.

No comments:

Post a Comment