Pages

Saturday, January 1, 2011

నిజరూపాలు చూపనున్న 2011

గత ఏడాది యావత్తూ రాజకీయ అనిశ్చితితో ముగిసి పోతే ఈ ఏడాది ఆరంభంలో దాని పరిష్కార ప్రహసనం కొత్త రూపంలో ముందుకొస్తున్నది. శ్రీకృష్ణ కమిటీ నివేదికతోనే నిర్ణయాలు జరిగిపోతాయని ఎవరూ అనుకోవడం లేదు గాని అది ఒక ప్రాతిపదికగానూ అధికారిక చర్చా పత్రంగానూ వుంటుందనేది కాదనలేని విషయం. అదే అంతిమం కాదు, దాంతోనే అంతా ముగిసి పోదు అనేది కూడా సత్యమే. దాన్ని వ్యతిరేకించే హక్కు కూడా వుండొచ్చు. 15 కోట్ల రూపాయల ప్రజాధనంతో లక్ష వినతి పత్రాలు, వందలాది అభిప్రాయ సేకరణలు, మరెన్నో భేటీల తర్వాత రూపొందిన ఒక సాధికారిక పత్రానికి విలువే వుండదని ఎవరు చెప్పినా వాస్తవికంగా వుండదు. కాకపోతే పత్రాన్ని ముందు తనుగా పరిశీలించి అభిప్రాయాలతో ముందుకు రావలసిన కేంద్రం ఆ బాధ్యతను రాష్ట్రంలోని రాజకీయ పక్షాలపై నెట్టి వేసింది. తన చేతికి మట్టి అంటకుండా అదే సమయంలో అన్ని ప్రాంతాలలో రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడం కేంద్రం ఏకైక సూత్రంగా వుంది. 125ఏళ్ల పాలకవర్గ కాంగ్రెస్‌ రాజకీయ చాణక్యమంతా ఇక్కడే కనిపిస్తుంది.
శ్రీకృష్ణ కమిటీ ఎవరికి అనుకూలంగా లేక ఎవరికి వ్యతిరేకంగా నివేదికనిచ్చి వుంటుందన్న వూహాగానాలలో అర్థం లేదు. ఎందుకంటే దానికి ఇచ్చిన విచారణాంశాలలోనే అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి సూచనలు చేయమని వుంది. విభజన, అవిభాజ్యత అన్న రెండు కోణాల నుంచి జరిగే ఆందోళనలను పరిశీలించాలని వుంది. కనక ఏకపక్షంగా లేదా ఏక కోణంలో నివేదిక వుండే అవకాశం దాదాపు వుండదు. కమిటీ సభ్యులు చేస్తున్న వ్యాఖ్యలను బట్టి చూసినా అదే తెలుస్తుంది. దానిపై వూహాగానాలు చేయకూడదని ఆంక్షలు పెట్టినప్పటికీ కొందరు కాంగ్రెస్‌ ఎంపిలు, జెఎసి చైర్మన్‌ కోదండరాం వంటి వారు అది తెలంగాణా విభజనకు అనుకూలంగా వుండక పోవచ్చన్న మాట చెప్పనే చెబుతున్నారు. తమ పోరాటం దీర్ఘకాలం కొనసాగుతుందని నొక్కిచెప్పడం ద్వారా టిఆర్‌ఎస్‌ నేతలు కూడా అదే ధ్వనిస్తున్నారు.అదే సమయంలో తాము వెనకబడి పోకూడదని సీమాంధ్ర జెఎసి కన్వీనర్‌ కూడా తమకు అనుకూలంగా లేకపోతే ప్రజా ప్రతినిధులు రాజినామా చేయాలని పిలుపునిస్తున్నారు. ఈ ప్రతిస్పందనలన్ని అనుకోనివి కానప్పటికీ కేంద్రం తీసుకున్న వైఖరి మాత్రం విచిత్ర విన్యాసాన్ని తలపిస్తున్నది.
డిసెంబర్‌ 9 ప్రకటన, తర్వాతి పరిణామాలు, డిసెంబర్‌ 23 ప్రకటన, 2010 జనవరి 5 అఖిల పక్ష సమావేశంలో మరింత సంప్రదింపులకై నిర్ణయం,ఫిబ్రవరిలో శ్రీకృష్ణకమిటీ నియామకం ఇవన్నీ తెలిసినవే గాని ఈ అన్ని దశల్లోనూ హౌంమంత్రి చిదంబరం స్థిరంగా చెబుతూ వచ్చిన తర్కం విస్మరించరానిది. అంతా ఆంధ్ర ప్రదేశ్‌లోని రాజకీయ పార్టీల ఇష్ట ప్రకారమే చేస్తున్నామన్నట్టు చూపించుకునే అతి లౌక్యం, అమిత చాకచక్యం ఇందులో వున్నాయి. అధికార పక్షంగా తన విధానం ఏమిటో సూటిగా చెప్పకుండా ఇతరులను ముందు ఇరికించి దాగుడుమూతలు పునరావృతం చేస్తున్నది. రాజ్యాంగ పరంగానైనా రాజకీయంగానైనా రాష్ట్ర సమస్యలను ఆ రాష్ట్రానికి చెందిన పక్షాలకే వదిలేయడం అన్న సూత్రం పైకి చాలా ప్రజాస్వామికంగా కనిపించినా వాస్తవంలో కేంద్రం తన బాధ్యతను దాటవేస్తున్నది. రెండవది సూటిగా వ్యవహరించకపోవడం ద్వారా కావాలని అనిశ్చితికి అవకాశం కలిగిస్తున్నది. 2009 మే నెలలో ఒకసారి చిదంబరం పరిష్కారం రాష్రంలో ఎనిమిది ్ట పార్టీల చేతుల్లోనే తప్ప తన చేతుల్లో ఏమీ లేదని అన్నప్పుడు సాక్షాత్తూ జస్టిస్‌ శ్రీకృష్ణ కూడా విభేదించారు.రాష్ట్రాల సమాఖ్యగా వున్న భారత దేశంలో ఇలా ఎక్కడి సమస్యల పరిష్కారం అక్కడే అన్న విధానాన్నే అనుసరించి వుంటే మన చిత్ర పటం ఇలా వుండేది కాదు. ఇంతకూ తాజా ఘట్టంలోనూ చిదంబరం అదే క్రీడను మరోసారి అడుతున్నట్టు కనిపిస్తుంది. కాని ఈ ఏడాది కాలంలోనూ తెలుగు ప్రజలు ఇలాటి విన్యాసాలను చూసీ చూసీ పండి పోయారు.
గత సారి అఖిలపక్ష సమావేశం నాటికి సిపిఎం(మరో కోణం నుంచి మజ్లిస్‌) తప్ప ఇతర రాజకీయ శక్తులన్ని రకరకాలైన రాజకీయ గజిబిజిలో వుండేవి. శ్రీకృష్ణ కమిటీకి నివేదికలిచ్చినప్పుడు కూడా ఈ గందరగోళం విదితమైంది. స్థూలంగా సిపిఐ, బిజెపిలు టిఆర్‌ఎస్‌ తో పాటు విభజనను బలపర్చినా కాంగ్రెస్‌ తెలుగు దేశం ద్వంద్వ ధోరణి మార్చుకునే అవకాశాలేమీ కనిపించడం లేదు. కేంద్రం వైఖరికి కట్టుబడి వుంటామని రాష్ట్ర మంత్రివర్గం అంటుంటే కేంద్రం అంతా రాష్ట్రంలోనే వుందన్న పల్లవిని ఆలపిస్తున్నది. కాని శ్రీకృష్ణ కమిటీ నివేదికకు రెండు రోజుల ముందు ఆ పార్టీ ఎంపిలు కేసుల ఎత్తివేతపై నిరాహారదీక్షలు చేయడం ఈ హాస్యాస్పద రాజకీయ విన్యాసంలో ఇటీవలి అధ్యాయమే. గత అరవై డెబ్బై ఏళ్లలోనూ రాష్ట్ర ఏర్పాటులోనూ విభజన వాదాల విషయంలోనూ కాంగ్రెస్‌ నేతలు వివిధ ప్రాంతాల్లో పోషించిన విభిన్న పాత్రలు చూసిన తర్వాత ఇప్పుడు ఎలాటి భ్రమలు వుండే అవకాశం లేదు. ఈ విన్యాసాలను విమర్శించడంలో ముందుండ వలసిన తెలుగు దేశం తను కూడా అలాటి సంధిగ్గంలో చిక్కుకుని పరిస్థితిని సంక్లిష్టం చేసింది. అధిష్టానం హుకుంల మేరకు కాంగ్రెస్‌ నేతలు మౌనం పాటిస్తున్నామంటున్నా తెలుగు దేశం నాయకులు మాత్రం తీవ్రంగానే మాట్లాడుతున్నారు. అయితే ఎంత గట్టిగా మాట్టాడినా ద్వంద్వ వాణి వల్ల ఇరకాటం తప్పేదు..

టిఆర్‌ఎస్‌ ఒక ఉప ప్రాంతానికి సంబంధించిన పార్టీ గనక ఈ విధమైన ద్వంద్వత్వం వుండే అవకాశం లేదు గాని దానిలోనూ వైరుధ్యాలు అనేకం. 2009 డిసెంబర్‌ ప్రకటన అంతిమమైనదన్నట్టు తర్వాతి పరిణామాలకు ప్రాంతీయంగా సీమాంధ్ర నేతలు, రాజకీయంగా తెలుగుదేశం మాత్రమే కారణమైనట్టు వారు మాట్లాడుతుంటారు. డిసెంబర్‌ 31న కెసిఆర్‌ మాటల్లోనూ అదే వినిపించింది. అధికారంలో వున్న పార్టీది కీలక పాత్ర అని సూటిగా కేంద్రీకరించకపోగా దాని ప్రత్యర్థి పార్టీపై దాడిని ఎక్కుపెట్టడం కాంగ్రెస్‌కు సంతోషం కలిగించే పరిణామమే. అంతటితో ఆగక కాంగ్రెస్‌ను బలోపేతం చేయడం, సోనియా నాయకత్వంలో విలీనం కావడం వంటి మాటలు కూడా వచ్చాయి. సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు గట్టివారు గనక రాజినామా ఇచ్చారనీ, తెలంగాణా కాంగ్రెస్‌ నేతలు దద్దమ్మలని ఇక్కడి వారిపైనే విమర్శలు ఎక్కుపెట్టిన కేసిఆర్‌ తర్వాత నిరాహారదీక్ష శిబిరంలోకి వెళ్లి మళ్లీ ప్రశంసలు కురిపించారు. ఇది చూసి కొన్ని పత్రికలు కెసిఆర్‌ వుచ్చులో కాంగ్రెస్‌ అని వార్తా కథనాలు రాశాయి గాని వాస్తవంగా ఎవరి వుచ్చులో ఎవరు పడ్డారు, ప్రజలను పడేస్తున్నారు అన్నది లోతుగా పరిశీలించవలసిన విషయం. మొదట జెఎసిగా బయిలు దేరి తర్వాత తలో విధంగా మాట్లాడుతూ ఏడాది గడిపి మళ్లీ ఇప్పుడు అందరం ఒకటేనని చెప్పడం, జగన్‌ శిబిరానికి ఆనందం కలిగించే మరికొన్ని వ్యాఖ్యానాలు చేయడం గందరగోళాన్ని పెంచాయి. పైగా ఎన్నికలలో స్థానాలు పెంచుకోవడంపై దృష్టి ఎక్కువగా కేంద్రీకృతమవుతున్నదా అనే అభిప్రాయానికి కూడా ఆస్కారం ఏర్పడుతున్నది. తక్షణం రాష్ట్ర విభజన జరక్కపోవచ్చన్న వాస్తవాన్ని ఏదో విధంగా మింగించే పరిభాషను ఉపయోగించడం కూడా క్రనిపిస్తున్నది. ఇదంతా వ్యూహ కౌశలమని చెప్పుకోవచ్చుగాని దీనిలో వైరుధ్యాలు దాచేస్తే దాగని సత్యాలు. మరచిపోరాని పాఠాలు.

ముందే చెప్పినట్టు శ్రీకృష్ణ కమిటీ నివేదిక తీరు తెన్నులపైనా వేర్వేరు అంచనాలు అభిప్రాయాలు వెలువడుతున్నాయి. తాము అందరికీ సంతృప్తి కలిగించే నివేదికనిస్తామని శ్రీకృష్ణ కమిటీ చెప్పడం పొరబాటన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. తెలంగాణా విభజనకోర్కె ఎంత తీవ్రంగా చెప్పినా దానికి భిన్నమైన భావనే వినిపించకూడదని శాసించే అధికారం వుండదు. కొంతమంది వర్గ పరిభాషలో విభజన కోర్కెలను సమర్తించినా ప్రాంతీయ వాదాలు పాలక వర్గాల పాచికల నుంచి ఉత్పన్నమైనవనే వాస్తవం మటు మాయమైపోదు. ఒక ప్రాంతంలో వెనకబాటు గురించి ఎంత చెప్పినా వెనకబాటు తనం అన్ని ప్రాంతాలలోనూ వుందనే వాస్తవాన్ని గుర్తించకా తప్పదు. కాకపోతే చారిత్రిక నేపథ్యాలు సమస్య స్వరూప స్వభావాలూ ఒకోచోట ఒక విధంగా వుండొచ్చు. దోపిడీ పీడనలకు ఏ ప్రాంతం మినహాయింపు కాదు. తమ ప్రాంతానికి ఇచ్చిన హామీలను ఉల్లంఘించారంటూ వచ్చే ఫిర్యాదులను పెడచెవిని పెట్టడం కూడా సరికాదు. అలాగే పరిష్కారాల పట్ల కూడా రకరకాలైన అభిప్రాయాలుండటం సహజం. రాజ్యాంగ నిర్మాతలు వీటికి కొన్ని తరుణోపాయాలు సూచించిన మాట కూడా నిజం. అలాగే గతంలో ఈ రాష్ట్రంలో అనుభవాల పట్ల కూడా వేర్వేరు అంచనాలుంటాయి. ఎవరి కోణం నుంచి వారు సమర్పించే అంకెలు కూడా అనేకం.కనకనే ఇంత సమాచారాన్ని సేకరించడానికి క్రోడీకరించడానికి శ్రీకృష్ణ కమిటీ దోహదపడిందన్నది కాదనలేని విషయం. అది దిక్కు మాలిన కమిటి అని కెసిఆర్‌ అన్నప్పుడు దిక్కు చూపే కమిటీ అని శ్రీకృష్ణ సమాధానమిచ్చారు. ఒకటి కాకున్నా అనేక దిక్కులు అది ప్రస్తావించే అవకాశాలుంటాయి గనక రాజకీయ నిర్ణయం తీసుకోవలసి వుంటుంది.ఆ పని చేయడానికి కేంద్రం సిద్దంగా లేదని ఇప్పటికే తేలిపోతున్నది. నివేదికకు ముందు రోజే అధికార ప్రతినిధి షకీల్‌ తాము తెలంగాణాతో సహా చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం కాదని అయితే ఏకాభిప్రాయం కావలని చెప్పడం, ఈ నివేదికే అంతిమం కాదని కేంద్రం వ్యాఖ్యానించడం వంటివన్నీ భిన్న సంకేతాలతో కాలం గడిపే విద్యలో భాగాలు.
రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు జాతీయ సమస్య తప్ప ఏదో ఒక ప్రాంతానికే పరిమితమైంది కాదు. గతంలో వున్న రాష్ట్రాన్ని రద్దు చేశారన్న వాదన చారిత్రికంగా సరైంది కాదు. నాడున్న మధ్యభారత్‌, సౌరాష్ట్ర,పెప్సు,తిరువాన్కూర్‌ కొచ్చిన్‌ కూడా హైదరాబాదు రాష్ట్రంలాగే కలసి పోయాయి. కనక ఇక్కడే ఏదో జరగరానిది జరిగినట్టు ఇప్పుడు ఏదైనా చేయవచ్చన్నట్టు మాట్లాడ్డం రాజ్యాంగంతో పొసిగేది కాదు.రాజ్యాంగంలో 3వ అధికరణం ప్రకారం పార్లమెంటు రాష్ట్రాల సరిహద్దులను మార్చడం, విభజించడం క లపడం చేయొచ్చు గాని అందుకు రాష్ట్రపతి అనుమతితోనే బిల్లు పెట్టాలి. దానికన్నా ముందు రాష్ట్రపతి సంబంధిత శాసనసభ అభిప్రాయం కోసం గడువు విధించి పంపించాలి. గతంలో రాష్ట్రాల పునర్విభజన భాష లేదా పాలనా సౌలభ్యం , గిరిజన ప్రాంతాల వంటివాటి పాలనాసౌలభ్యం వగైరా ప్రాతిపదికలపై జరిగిందే తప్ప ఏకపక్షంగా కాదు.ఇప్పుడు రాష్ట్రంలో పరిస్తితి ఆ కోవలోకి వస్తుందా అన్నది పరిశీలించవలసిన విషయం. ఆఖరుగా రాష్ట్ర శాసనసభతో నిమిత్తం లేకుండానే పార్లమెంటులో బిల్లు పెట్టవచ్చునన్న వాదన వాస్తవికమైంది. ఇలాటి నిర్ణయాలు తీసుకునే ముందు మొత్తం తెలుగు ప్రజల ప్రాంతాల అభిప్రాయాలు ఏదో ఒక రూపంలో తీసుకోవడమూ తప్పదు. కొంత వరకు ఆ ప్రయత్నం చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదికను ముందు సాకల్యంగా వస్తుగతంగా పరిశీలించి తగు రాజకీయ నిర్ణయాలు తీసుకోవచ్చు. దాన్ని ప్రాంతీయ ఉప ప్రాంతీయ నాయకులు భే ఖాతరు చేస్తూ మాట్లాడ్డం సమంజసం కాదు. ఏడాది తర్వాత తేలిగ్గా కేంద్రం కూడా దానిపట్ల సమగ్రంగా స్పందించకుండా ఇతరులపై భారం నెట్టడానికి పాకులాడటం మరింత విపరీతం. ఎవరి నిజ స్వరూపం ఏమిటన్నది మరో అయిదు రోజుల్లో ఎలానూ బయిటపడక మానదు.

No comments:

Post a Comment