Pages

Thursday, January 6, 2011

శ్రీకృష్ణ కమిటీ నివేదిక- ప్రతిస్పందనలు

ఈ రోజు మొత్తం ఛానళ్ల ప్రదక్షిణ కారణంగా బ్లాగు మిత్రుల కోసం వివరమైన వ్యాసం రాయడం కుదరలేదు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక గొప్పగా వుందని గాని చప్పగా వుందని గాని నిర్ధారణలు చేయగలిగిందేమీ లేదు. దానికి ఏ విషయాలు పరిశీలించవలసిందిగా చెప్పారో ఆ అంశాలనే నివేదిక ప్రతిబింబిస్తుంది. తెలంగాణా విభజనే కోరుకునే వారికి అవిభక్త రాష్ట్రాన్ని కొనసాగించడం అత్యుత్తమ పరిష్కారమని చెప్పడం నచ్చక పోవడం సహజమే. అదే సమయంలో తెలంగాణాను హైదరాబాదు రాజధానిగా విడదీసి, ఆంధ్ర ప్రాంతానికి కొత్త
రాజధానిని ఏర్పాటు చేయాలని చెప్పడం వారికి నచ్చుతుంది. విడదీయరాదనే వారికి మొదటిది నచ్చి రెండవది నచ్చదు. అయితే విభజన అనేది అనివార్యమైనప్పుడే అన్ని ప్రాంతాల వారిని ఒప్పించిన తర్వాతే చేయాలన్న మాట కూడా వాస్తవికమైందే. హైదరాబాదు విస్తీర్ణాన్ని బాగా పెంచి మహబూబ్‌ నగర్‌, నల్గొండ జిల్లాలలో పెద్ద భాగాలు కలపాలన్న సూచన భౌగోళిక అనుసంధానం కోసం ఉద్ధేశించిందే గాని కొంత అవాస్తవమనిపిస్తుంది. అదే సమయంలో కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేయాలన్న వాదన అప్పుడప్పుడు వినిపిస్తున్నదే. గుర్తుంచుకోవలసింది ఏమంటే శ్రీకృష్ణ కమిటీ క్రోడీకరణ పరిశీలన కమిటీగానే పని చేసి వివిధ మార్గాలను సూచించింది. నిన్నటి వ్యాసంలో చెప్పుకున్నట్టు దీనిపై కేంద్రం భావాలేమిటో చెప్పకుండా పార్టీల భావాలను అడగడం కోసం కాలం గడపడం రాజకీయ ఎత్తుగడ మాత్రమే.
తెలంగాణా విభజన కోరేవారు వివిధ రకాల వాదనలు లెక్కలు చెబుతున్నా మరో వైపు నుంచి దీనికి సంబంధించిన వివరాల క్రోడీకరణ జరగలేదు. ప్రజాస్వామ్యంలో ఔనన్నా కాదన్నా అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకోవడం సాధ్యం. కనక కమిటీ నివేదిక వాటన్నిటి సేకరణ ద్వారా ఒక సాధికారిక సమాచార పత్రమవుతుంది. ఈ లెక్కలన్ని సరైనవా అనే ప్రశ్న అన్ని లెక్కలకూ వర్తిస్తుంది. కావలసింది రాజకీయ సంకల్పం ప్రజల పట్ట నిబద్ధత మాత్రమే. పాలక పక్షమే కావలని దాగుడుమూతలాడుతున్న స్తితిని ఇతర పక్షాలు కూడా ఉపయోగించుకున్నాయి.ఇప్పుడు ఈ నివేదికనైనా కేంద్రం ప్రాతిపదికగా తీసుకుంటుందో లేదో చూడాలి. అనిశ్చితిని కొనసాగించడమే దాని వ్యూహమైతే రాష్ట్ర ప్రజలు హర్షించరు. ఏదో ఒక పరిష్కార ప్రతిపాదనతో కేంద్రం ముందుకు రావడం తప్పని సరి. అలాగే ఈ రాజకీయ మాయాజాలంలో పాలకుల ప్రాంతీయ పాచికల పట్ల అప్రమత్తంగా వ్యవహరించగల చైతన్యాన్ని ప్రజలు ప్రదర్శించాలి. ఎందుకంటే విభజన జరగాలా వద్దా అనేది ఒకటైతే అన్నిటికీ విభజనే పరిష్కారమన్న ఆలోచన అవాస్తవికమైంది.పాలక పక్షాలు నేతలు ప్రయోజనాల వేట సాగిస్తుంటే ప్రాంతీయ రేఖలు ప్రజల మధ్య దూరాలు పెంచడాన్ని అనుమతించకూడదు.
ఇది తక్షణ స్పందన. మరింత వివరంగా తర్వాత.

1 comment:

  1. mee matalu mee hav bavalu tv charchallo atma hatyalanu puri golpe vidanga unnayi.

    ReplyDelete