తెలుగుదేశం అద్యక్షుడు చంద్రబాబు నాయుడు రైతు పోరు బాట పేరిట నిర్వహించిన యాత్ర సందర్భంగా ఓరుగల్లు పోరుగల్లుగా మారిపోయిందిన్న కథనాలు మీడియా యావత్తూ పొంగిపొర్లాయి. ఆయన యాత్ర పాలకుర్తి దగ్గర జరిగింది. వరంగల్లు ప్రత్యేకించి పాలకుర్తి వీర తెలంగాణా పోరాట కాలం నుంచి భూస్వామ్య వ్యతిరేక పోరాట చైతన్యానికి ప్రసిద్ధి గాంచాయి. అసలు దొడ్డి కొమరయ్య బలిదానంతో తెలంగాణా పోరాట అగ్నికణం రగిలిందే అక్కడ. మరి ఇప్పుడు చెబుతున్న ఈ పోరుకూ ఆ వీరోచిత వారసత్వానికి ఏమైనా సంబంధం వుందా అంటే బొత్తిగా లేదు. తెలంగాణా ప్రాంతంలో రాజకీయ ఆధిక్యత కాపాడుకోవడానికి ఒకరు, అస్తిత్వం నిలబెట్టుకోవడానికి మరొకరు సాగించిన సంఘర్షణగానే ఇదంతా సాగింది. ఇందులో చంద్రబాబు యాత్రను అడ్డుకోవడానికి జెఎసి పిలుపునిచ్చిందంటూ టిఆర్‌ఎస్ నాయకులు కదలి రావడంతో మొదట ఉద్రిక్తత పెల్లుబికింది. ఖమ్మం నుంచి కరీం నగర్ వరకూ జరిగిన చంద్రబాబు యాత్రను లాంఛనంగా అడ్డుకుంటున్నా వరంగల్‌లోనే అది పరాకాష్టకు చేరింది. ఈ లోగా ఉప ఎన్నికలూ దగ్గరకొస్తున్న నేపథ్యంలో ఈ అడ్డుకోవడాన్ని అడ్డుకోకపోతే రాజకీయ అస్తిత్వమే వుండదన్న అభిప్రాయం తెలుగు దేశంలోనూ ఏర్పడింది.ఆ వైరుధ్యాల ప్రజ్వలనానికి ప్రతిబింబమే వరంగల్లు ఘటనలు. ఈ గుణపాఠం నేర్చుకునే బదులు ఇప్పుడు ఆర్మూర్‌లో జగన్ దీక్షలనూ అడ్డుకోవడం గురించిన హెచ్చరికలు వెలువడుతున్నాయి. ఇదంతా ప్రజల నిజమైన సమస్యలతో సంబంధం లేని ప్రజాస్వామ్య సూత్రాలకు విలువనివ్వని విన్యాసం మాత్రమే. ఇలాటి చర్యలను ప్రజలు హర్షించరు సరికదా తమ యాత్రలు విజయవంతమైనాయంటూ దాన్నే ఒక వ్యూహాత్మక కార్యక్రమంగా మార్చుకునే అవకాశం అవతలివారికి లభిస్తుంది. టిఆర్‌ఎస్ కూడా ఏ ఉపయోగం లేని ఈ అర్థరహిత ప్రహసనమే గొప్ప ప్రజా కార్యక్రమం అని ప్రచారం చేసుకోవడానికి అవకాశమేర్పడుతుంది.అంతే. ఒకప్పుడు ఎడతెగని అభద్రతతో తెలుగు దేశం ఈ ప్రాంతంలో కార్యక్రమాలు నిర్వహించకుండా దాటేస్తూ వచ్చింది. ఇప్పుడు దాని కార్యక్రమాలు జరిగాయి గనక టిఆర్‌ఎస్ అభద్రతకు గురి కావలసిన అవసరం లేదు. ఎవరిని ఎంత విశ్వసించాలో ప్రజలకు తెలుసు.
మరోసారి రానున్న ఉప ఎన్నికల రణ నాదాలుగానే ఈ రాజకీయ పరిణామాలను చూడవలసి వుంటుంది.కాంగ్రెస్ యుపిఎ ప్రభుత్వం రాష్ట్రంతో రాజకీయ చెలగాటమాడుతుంటే పోటాపోటీ వీరంగాలతో పరిస్థితిని ఇంకా కలుషితం చేసుకోవడం వల్ల ఉపయోగం శూన్యం. ఇందుకు ి బదులు ప్రజలను వేధించే తక్షణ సమస్యల పరిష్కార సాధనకై ఉద్యమాలలో పోటీ పడితే మంచిది. తెలంగాణాతో సహా వివిధ విషయాలలో ఎవరిని ఎంత వరకు నమ్మాలో ప్రజలకు అర్థమైంది గనకే ఇన్ని పరిణామాల తర్వాతా ఈ రాష్ట్రం ఇలా వుంది. ఎవరెన్ని పిలుపులు ఇచ్చినా రాజకీయ ప్రక్రియ సాగుతూనే వుందంటే కారణం అదే. మరి వరంగల్లు ఘటనల తర్వాతనైనా సంబంధిత నాయకులు పునరాలోచించుకుంటారా అన్నది ప్రశ్న. ఎందుకంటే తమ అంతర్గత తగాదాలే పరిష్కరించుకోలేని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ప్రాంతీయ సమస్యపై పరిష్కారం చూపడమనే ప్రసక్తి అసలే లేదు. పైగా గత చరిత్రను బట్టి చూస్తే ప్రాంతీయ వివాదాలను ముఠా తగాదాల కోసం వినియోగించుకునే సంప్రదాయం కాంగ్రెస్‌కు వుంది. అదే జరిగితే పరిస్థితి పెనం మీంచి పొయిలోకి పడినట్టవుతుంది.సరిగ్గా చంద్రబాబు పర్యటన రోజునే అదే జిల్లా మహబూబాబాద్‌లో సిపిఎం బహిరంగ సభ, రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు పర్యటన జరిగిన సంగతి కూడా గుర్తు చేసుకోవలసి వుంది.కనక సూత్ర బద్ద విధానాలు ప్రజా సమస్యలపై కేంద్రీకరణ మాత్రమే అవకాశవాద రాజకీయాలకు సమాధానమవుతాయి.
No comments:
Post a Comment