ఏమంటివి, ఏమంటివి మట్టికుండలో పుట్టితివి కదా నీది ఏ కులము? అంటూ ఎన్టీఆర్ డైలాగులు మార్మోగుతుంటే తెలుగు వారు హాయిగా ఆస్వాదించగలుగుతున్నారు. అద్వానీ అయోధ్య కాండ అనంతర వాతావరణంలో దేశంలో చాలా చోట్ల ఏ చిన్న మత విషయమైనా ప్రస్తావించడానికి భయపడే దశలోనూ తెలుగు నాట యమలోకం గురించి ఎన్నెన్నో తమాషా చిత్రాలు వస్తూనే వున్నాయి. కాని యమగోల ఇక్కడ పెద్ద విజయం సాధిస్తే హిందీలో లోక్ పర్‌లోక్ అన్న పేరిట చేసిన రీమేక్ వివాదాస్పదమై విజయం సాధించలేకపోయింది.రాజకీయ పాలనాధికారాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర వహిస్తున్న పలు హిందీ రాష్ట్రాలలో మత సామరస్య పరిరక్షణ పెద్ద సవాలుగా వుంటే దక్షిణాదిన దాదాపుగా లౌకిక భావాలదే ప్రధాన స్థానంగా వుంది. అతి ముఖ్యమైన ఈ సామాజిక వ్యత్యాసానికి మూలాలు తెలుసుకోవాలంటే తెలుగు సాంసృతిక రంగ చరిత్రలో వున్నాయి. వాటిని పరిశీలిస్తే పెద్ద పరిశోధన అవసరం లేకుండానే ఎందరో మహామహులు ఇక్కడ సంఘ సంస్కరణ కోసం సాగించిన సమరాలు కనిపిస్తాయి. మూఢనమ్మకాలపై వారు మోగించిన ఢమరుకాల శబ్దం ప్రతిధ్వనిస్తుంది. వేమన నుంచి గురజాడ, కందుకూరి వీరేశలింగం వరకూ సాగిన ఆ సంస్కరణ కృషికి హేతువాద దృష్టికి కొనసాగింపు కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి.ఇది ఆయన 125 వ జయంతి సంవత్సరం.
కవిరాజు పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది ఆయన రాసిన శంభూక వధ నాటకం. ధర్మావతారుడుగా పూజలందుకునే రాముడు మహా తపస్సు చేస్తున్న శంభుకుణ్ని కేవలం శూద్రుడైన నేరానికి గాను నిస్సంకోచంగా
వధించాడం ఈ నాటకం ఇతివృత్తం. అలాగే బ్రాహ్మణాధిక్యతను ప్రశ్నించిన పాపానికి వేనరాజును అతని కుమారుడైన పృథునిచేతనే ఆర్య రుషులు హత్య చేయించిన ఉదంతం ఖూనీ. ఈ రెండు ఇతివృత్తాలు ఎంచుకోవడం ఇప్పటికీ సాహసంగా భావించే దేశంలో ఎనభై ఏళ్లకిందటే ఆ పని చేసిన హేతువాది త్రిపురనేని. ఆ విధంగా ఆయన తెలుగునాట మాత్రమే గాక దక్షిణాది మొత్తంలో ఒక కొత్త వరవడికి ప్రతినిధి అయ్యారు. పెరియార్ రామస్వామి నాయకర్ ( పెరియార్ అంటే పెద్దాయన)తో త్రిపురనేనిని పోలుస్తూ అన్నాదురై ' మాకు ఒక రామస్వామి. మీకు ఒక రామస్వామి.వారిద్దరూ మన రామస్వాములే.వారి పేర్లలోనే కాదు, వారి మనస్సుల్లో కూడా ఏకత్వం కనిపిస్తుంది.ఇద్దరూ సాంఘిక విప్లవ యోధులే.వారి ఆలోచనా విధానాలతో హేతువాదం ప్రాతిపదికగా అన్ని పార్టీల వారూ సమైక్యంగా కృషి చేద్దాం' అన్నారు.
1887 జనవరి 15న కృష్ణా జిల్లా అంగలూరులో పుట్టిన త్రిపురనేని బార్ ఎట్లా చదివిన ఉన్నత విద్యావంతుడు. అందుకోసం ఐర్లండు వెళ్లి నూతన భావాలు వంటపట్టించుకున్నారు. వీర గంధము తెచ్చినారము, వీరులెవ్వరో తెల్పుడి.. అంటూ స్వాతంత్ర పోరాట యోధులకు స్వాగతం పలికారు. ప్రజా జీవితంలోనూ రాజకీయాలలోనూ పాత్ర వహించిన ఆయన తెనాలి పట్టణానికి దీర్ఘకాలం పాటు చైర్మన్‌గా పనిచేశారు.రాజకీయంగా మాత్రం మితవాద పార్టీ అయిన జస్టిస్ పార్టీలో వున్నారు.
మూఢ నమ్మకాలు కులాధిక్యత దట్టంగా అలుముకుని వున్న ఆ రోజుల్లో సనాతన విశ్వాసాలను పురాణ ప్రబోధాలను నూతన దృష్టితో చూడటం అలవాటు చేసుకున్నారు. ఆయన కుమారుడు ప్రసిద్ధ రచయిత అయిన గోపిచంద్ తన రచనను నాన్నకు అంకితం చేస్తూ ' ఎందుకు' అన్న ప్రశ్న నేర్పినందుకు అని కారణం చెప్పారు. కవిరాజు ఆయనకు మాత్రమే గాక కొన్ని తరాలకు ఆ ప్రశ్న నేర్పారు.వివాహ విధులను కూడా సంస్కరించాలంటూ పౌరోహిత్యం ఒక కులానికే పరిమితం కానక్కర్లేదన్నాడు. ఇవన్నీ సంచలనాలే. వీటిని ఈనాటి కుల రాజకీయాలతో పోల్చడం చారిత్రికంగా పొరబాటవుతుంది. సామాజిక చలనంలో భాగంగా అర్థంచేసుకోవాల్సి వుంటుంది. హేతువాదం సామాజిక సమానతా సూత్రం ముందుకు తెచ్చిన సవాలుగా వాటిని చూడాల్సి వుంటుంది. మొదట్లో ప్రస్తావించిన దుర్యోధన సంభాషణలు రాసిన కొండవీటి వెంకట కవికూడా కవిరాజు శిష్యుడే.కురుక్షేత్రసంగ్రామం నాటకంలోనే కవిరాజు ధర్మం పాండవులవైపే వుందా అన్న సుదీర్ఘ చర్చ చేశారు
తెలుగులో నూతన భావాలు అంకురించిన కాలం 1920 వ దశకం. అప్పుడే ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి నవల రాశారు.చలం ముందుకు వచ్చారు. ముద్దుకృష్ణ అశోకం వంటి నాటిక రాశారు. వీరిలో ఉన్నవ గాంధేయ వాది అయినప్పటికీ తొలిసారి బొల్షివిక్ విప్లవ ప్రస్తావన చేశారు. ఇక ముద్దుకృష్ణ రామాయణ పాత్రలను కొత్త కోణంలో చిత్రిస్తూ అశోకం రాశారు. కాని త్రిపురనేని రామస్వామి చౌదరి అలా గాక పురాణాలలో చెప్పిన విషయాల ఆధారంగానే వాటిలోని అమానుషత్వాన్ని ఎత్తిచూపించగలిగారు. దీనిపై ఆ రోజుల్లో కమ్యూనిస్టు నాయకులైన మద్దుకూరి చంద్రం, పుచ్చలపల్లి సుందరయ్యల సాహిత్య విమర్శలలోనూ ప్రముఖంగా ప్రస్తావనలు చూడొచ్చు. ఆయన రాజకీయ పరిమితులను కూడా మద్దుకూరి ప్రస్తావించారు:
'' త్రిపురనేని రామస్వామి చౌదరిగారి కురుక్షేత్ర సంగ్రామం,సూత పురాణం వగైరా రచనలు ఇలాటివే. వీరి భాష కవిత్వ పోకడ చక్కగా వుంటుంది. హిందూ సంప్రదాయాలను బ్రాహ్మణ మతాన్ని నిరసించుతూ బయిలుదేరిన వీరు రాజకీయంగా జమీందారీ నాయకత్వంలో వున్న జస్టిస్ పార్టీకి అనుబంధమై పోయారు.అందుకే ప్రజలను ఏ మాత్రం ఉత్తేజ పర్చలేకపోయారు.వీరు వేనరాజు కథను ఖూనీ పేరుతో నాటకంగా అభ్యుదయ కరమైన పోకడలతో చిత్రించారు. వీరి రచనలలో ఎన్నదగిన పాట ' వీర గంధము తెచ్చినారము వీరు లెవ్వరో తెల్పుడీ' .. త్రిపురనేని రామస్వామి వారి శంభుక వధ, ముద్దు కృష్ణ గారి అశోకం, చలం గారి సావిత్రి వగైరాల్లో పురాణ గాధలనే తీసుకుని వాటిని కొత్త దృక్పథం నుండి చిత్రించారు. ః'
మద్దుకూరి చంద్రం విమర్శలోని లోపాన్ని పేర్కొంటూ పుచ్చలపల్లి సుందరయ్య వారి రచనల కన్నా త్రిపురనేని ఏ విధంగా మెరుగో ఇలా రాశారు:
''ఖూనీ, శంభుక వధలు ఆ రోజులలోని దురాచారాన్ని ఖండిస్తూ నేటి ప్రజలకు మార్గం చూపిస్తూ రాసిన అభ్యుదయ రచనలు.అశోకం,సావిత్రి వంటి రచనలు అలాటివి కావు'' దీనికి తన కారణాలేవో కూడా సుందరయ్య చూపించారు. మొత్తంపైన నాటి పురాణ పాత్రలను నేటి ప్రమాణాలతో మార్చి రాయడంలో కన్నా నాటి బోధలలో బూటకత్వాన్ని నిరూపించి నేటి కాలంలో మూఢ నమ్మకాలపైన కులాధిక్యతల పైన వివక్షతలపైన పోరాటానికి వినియోగించుకోవడం కీలకం అన్నది సుందరయ్య భావన.
హైటెక్ యుగంలో ఉన్నత విద్యావంతులనుకున్న వాళ్లు కూడా విచక్షణా రహితంగా ప్రతి దానికి తలవూపుతూ మూఢత్వంలో కూరుకుపోతున్న నేటి దశలో త్రిపురనేని వంటి వారి రచనల అవసరం మరింత పెరుగుతున్నది. ఎందుకంటే ఎవరో చెప్పారని చదవకుండానే సంప్రదాయం పేరుతో ప్రతిదీ అనుసరించే విపరీతం చూస్తున్నాం. కవిరాజు ఆ రోజుల్లోనే పురాణాలను మధించి వాటిలో విషయాల ప్రకారమే విశ్లేషించి విమర్శించారు. ఆయన ఖూనీకి పూర్తి వ్యతిరేకమైన ఇతివృత్తంతో వేనరాజు రాసిన విశ్వనాథ సత్యనారాయణ కూడా కవిరాజును ఇలా ప్రశంసించారు
'' హేతువాద యుగంలో కవులందరికీ ఆదిపురుషుడు త్రిపురనేని రామస్వామి చౌదరి. ఆయన సూత పురాణమొక మహాగ్రంధం.ఆయన పద్య రచనా శైలి ఎంతో మనోహరంగా వుంటుంది. భావాలు పురాణాలకు వ్యతిరేకం.మొదట విప్లవం తెచ్చింది ఆయన''
విశ్వనాథ ఏమన్నప్పటికీ నిజానికి కవిరాజు పురాణాల్లో చెప్పిన దాని ఆధారంగానే వాదించారు. వాటిని కావ్యాలుగా గౌరవిస్తూనే కాలానుగుణంగా అర్థం చేసుకోవడానికి గాను ఆ పేరిట చలామణి అవుతున్న అసంబద్ద అమానుష భావాలను ప్రశ్నించారు. ఆ ప్రశ్న ప్రతిఘటన ఈనాడు మరింత అవసరం. అందుకు కవిరాజు 125వ జయంతి సందర్బం ఉపయోగపడాలి. ఆయన రచనలు జీవితంపైన మరింత అధ్యయనం పరిశీలన జరగాలి ( ప్రజాశక్తి 15-1-12)
''
విశ్వనాథ సత్యనారాయణ కూడా కవిరాజును ఇలా ప్రశంసించారు
ReplyDelete'' హేతువాద యుగంలో కవులందరికీ ఆదిపురుషుడు త్రిపురనేని రామస్వామి చౌదరి. ఆయన సూత పురాణమొక మహాగ్రంధం.ఆయన పద్య రచనా శైలి ఎంతో మనోహరంగా వుంటుంది. భావాలు పురాణాలకు వ్యతిరేకం.మొదట విప్లవం తెచ్చింది ఆయన''
విశ్వనాథ వారి మాటలను పట్టించుకోకుండా కవిరాజు నెత్తి మీద లేని పోని అభాండాలను వేయడమే కొన్ని వర్గాల వారు చేసిన దుష్కృత్యాలు. నేటికి వారి హేతువాదం అవసరం ఎంతైనా ఉన్నది.
అనిల్‌గారూ,
Deleteవిశ్వనాథ పొగిడింది ఎంత నిజమో అందులో శ్లేష అంతే నిజం. కవిరాజు కత్త్థిఝళిపించింది అలాటి చాందసులపైనే. నిజానికి ఖూనీ వేనరాజుకు ఖండనే. విశ్వనాథ గొప్ప కవి రచయిత అయినా ఆయన భావాలను గమనించకుండా అందరూ ఒకటే అనుకుంటే పొరబడతాము. ధన్యవాదాలు.