Pages

Sunday, January 1, 2012

జన్మస్థలాల కన్నా విధానాలే కీలకం..కె.సి.ఆర్‌ విజయనగరం జిల్లాలో పుట్టారని తెలుగు దేశం నేతలు చేస్తున్న వాదన నిజానికి చాలా కాలం నుంచి వున్నదే గాని ఇప్పుడు అధిక ప్రచారం లభించింది. కాదు తాము ఏడు తరాలుగా కరీం నగర్‌ వాసులమని కెటిఆర్‌ వాదన. నా వరకు నాకు ఈ రెండు వాదనల్లో ఏది నిజమైనా పెద్ద పేచీ లేదు. ఎందుకంటే ఎవరి తాతలు ముత్తాతలు ఎప్పుడు ఎక్కడ పుట్టి ఎక్కడకు చేరారన్న దాన్ని బట్టి ఇప్పటి రాజకీయాలను నిర్ణయించలేము. పుట్టిన స్థలాన్ని బట్టి చట్టరీత్యా వుండే అంశాలు తప్ప ఇతర అనర్హతలు అర్హతలు ఏవీ సంక్రమించవు. వాటిపై తలలు పగలగొట్టుకోవడం కూడా అనవసరం. నల్లజాతి రచయిత ఎలెక్స్‌ హేలీ తన పూర్వీకుల గురించి శోధించి రాసిన రూట్స్‌ సంచలనం సృష్టించింది. పాలకుల విధానాలను బట్టి అవసరాలను బట్టి ప్రకృతి పరిస్థితులను కుటుంబ పరిస్థితులను బట్టి దారి వెతుక్కుంటూ పోవడం సహజంగా జరిగేదే. ఏడు తరాలు కాకుంటే అంతకు ముందు ఏం జరిగిందనేది చెప్పాలంటే మరింత లోతైన పరిశోధనలు జరగాల్సి వుంటుంది. ఇప్పుడున్న కుల మత ప్రాంత హద్దులు కొన్నిసార్లు జాతీయతులు కూడా నిలవక పోవచ్చు. ఎవరి రాజకీయం దేనిపై నిర్మింబచడిందన్నదే సమస్య. 2000 తర్వాతనే తెలంగాణా విభజన నినాదం కెసిఆర్‌ ఎత్తుకున్నారు. అంతకు ముందు చెన్నారెడ్డి వంటివారున్నారు. ప్రజల ఆదరణ ఏ మేరకు ఎంత కాలం పొందగలిగితే అంత కాలం వారు రాజకీయ ప్రాధాన్యత పొందుతారు. అంతే . తమిళ దురభిమానం బాగా ఉపయోగించుకున్న కరుణానిధి, ఎంజిఆర్‌ ఇద్దరూ జన్మతా తమిళులు కాదని అంటుంటారు. మహారాష్ట్రలో శివసేన జాతి దురహంకార పోకడలను దేశ ప్రజలు హర్షించలేదు. హైదరాబాద్‌ సంస్థానంగా వున్నప్పుడు నిజాం అనుసరించిన విధానాల కారణంగా ్ల ప్రాంతాలు విడిపోయి వాటి మధ్య అసమానతల వల్ల అభివృద్ధిలో ముందు వెనకల వల్ల అటూ ఇటూ రాకపోకలు చాలానే జరిగాయి. ఇందులో ఎవరిదీ తప్పు కాదు. అయితే సమస్యల్లా ఒకే రాష్ట్రంలో ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లడాన్ని వలస అంటూ తప్పు పట్టడం, రాజకీయ అవసరాలను బట్టి వారిని లక్ష్యంగా చేసుకుని మాట్లాడ్డం , హెచ్చరికలు గుప్పించడం వల్లనే సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. ఆ విషయంలో కెసిఆర్‌ వంటి వారి వైఖరి మారవలసిందే. అంతేగాని జన్మభూమి వివాదాలు అవసరం లేదు. ఇక ఉద్యమ ఉధృతి తగ్గుముఖం పట్టిందనే అంచనాతో కెసిఆర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించే తెలుగు దేశం వైఖరి అర్థమవుతున్నా ఇక్కడ తెలంగాణా కోసం సరిగ్గా పోరాడటం లేదని ఇక్కడ, పోరాడుతున్నందుకు అక్కడా ఏకకాలంలో ఒకే పార్టీ వారు విమర్శిస్తుంటే విశ్వాసం వుంటుందా అనేది వారు ఆలోచించుకోవలసిన విషయం. ఎందుకంటే ఈ వైరుధ్యం వారికీ ఇబ్బంది కరంగా మారే అవకాశం చాలా వుంది.ఇప్పుడు తాజాగా జగన్‌ కూడా ఈ వ్యూహాత్మక విన్యాసాల్లోకి ప్రవేశించారు గనక తెలంగాణా రాజకీయం మరింత రసవత్తరంగా సాగొచ్చు.

1 comment:

  1. బుడ్డి పేట కథనం అంత నమ్మదగ్గదిగా లేదు.కెసీఆర్-ఉత్తరాంధ్ర ఐనంత మాత్రాన ఉద్యమానికి అనర్హుడు కాదు కదా!తె-ఉద్యమమ్లో బొమ్మిని తిమ్మిని చేస్తున్నారు...అందుకని తెదేపా ఎదురుదాడి.ప్రపంచంలో..ముఖ్యంగా భారత దేశంలో వర్ణ సంకరం కాని,వలస పోని జాతి/కులం/మతం లేదు. కర్నాటక, తమిళనాడులో ఆయా భాషా సంస్క్రుతుల గురించి పాటుపడుతోంది తెలుగు వాళ్ళే!

    ReplyDelete