Pages

Thursday, January 5, 2012

ఉప ఎన్నికల వీరంగాలు




మాది తెలంగాణా కోసం పోరాటం తప్ప రాజకీయం లేదు అని ప్రతివారూ చెబుతుంటారు.ఆ పేరుతో తమ రాజకీయం తాము చేస్తుంటారు.ఇంతకూ తెలంగాణా సమస్య రాజకీయాలతో సంబంధం లేనిది కాదు. ఆ జపం చేసే పార్టీలకూ రాజకీయాలు లేకపోలేదు. అదే ఏకైక రాజకీయంగా వున్న పార్టీ టిఆర్‌ఎస్‌ , తమ రాజకీయాల్లో దాన్నీ ఒక భాగంగా చేసుకున్న కాంగ్రెస్‌ తెలుగుదేశం( బిజెపి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లు కూడా) తీరు తెన్నులు భిన్నంగా వుండటమే దానికి నిదర్శనం. తెలంగాణా రంగస్థలంగా టిఆర్‌ఎస్‌ టిడిపిల మధ్య సాగుతున్న ఎడతెగని రాజకీయ రగడ ఒక ప్రాంతీయ పార్టీకి, ఒక ఉప ప్రాంతీయ పార్టీగా మధ్యన అనివార్యమైన రాజకీయ ఘర్షణ మాత్రమే. ఇందులో ఎవరిది ఒప్పు ఎవరిది తప్పు అనే మీమాంస అర్థరహితం. కాకపోతే తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణాలో పర్యటించకుండా అడ్డుకుంటామని చాలా కాలం చేసిన ప్రకటనలు, ఘటనలు ఎవరు బలపర్చలేరు. దీన్ని అధిగమించి చంద్రబాబు యాత్ర నిర్వహించడాన్ని సహేతుకంగా కొనసాగించుకునే బదులు మోత్కుపల్లి నరసింహులు వంటి నాయకులు ఉరితాళ్ళ ప్రహసనంగా మార్చారు. ఈ క్రమంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సవాళ్లు బొత్తిగా అనుచితమైనవి. ఆయనపై టిఆర్‌ఎస్‌ నేతలు విరుచుకు పడిన తీరూ డిటోనే. దీనంతటితో వినోద కాలక్షేపం చేస్తున్న కాంగ్రెస్‌ రాజకీయం ఇంకా విపరీతమైంది.
ఎవరి రాజకీయాలు వారివి అని వదిలేయవచ్చు గాని ఈ మొత్తం వ్యవహారంలో పదే పదే తెలంగాణా ప్రాంతం ప్రజల ప్రస్తావన వస్తుంది. తెలంగాణా విభజన సాధించాలన్న ఉద్యమంలో ఎవరు మొనగాళ్లన్న సవాళ్లు
వుంటాయి. తెలంగాణాలో ఎవరు ఆధిక్యత ఆధిపత్యం సాధించుకోవాలన్న తాపత్రయం తప్ప ఇందులో నిజంగా ప్రజలకు వొరిగిపడేది శూన్యం. ఎందుకంటే ఇన్ని విధాల పోరాడుకునే ఈ నేతలు రెండేళ్ల కిందట భుజం భుజం కలిపి ప్రాంతీయ వాదమే ప్రాణమన్నట్టు వూరేగిన దృశ్యాలు ప్రజలు మర్చిపోలేదు.తర్వాత ఆ పార్టీల కలయికలు మారాయి. చాలా మంది నేతల చిరునామాలూ మారాయి. అయినా తెలంగాణా మంత్ర జపంలో మాత్రం ఒకరిని మించి ఒకరు వూగి పోతున్నారు. తమలో తాము ఎంతగా కీచులాడుకుంటున్నా ప్రత్యేక రాష్ట్ర పల్లవి మాత్రం ఆలపిస్తున్నారు.
తెలంగాణా విభజన కోర్కె యాభై ఏళ్ల నాటిదని పదే పదే అంటున్న ఈ నేతలు యాభై ఏళ్లలోనూ ఎన్ని మజిలీలు మార్చారో ఇప్పుడు కూడా మాటలు ఎలా మారుస్తున్నారో చెప్పరు. వారు ఎప్పుడు ే ఏ పార్టీ గొడుగు కింద వుంటే ఆ పలుకులు ఆలపించడం తప్ప ఇందులో తెలంగాణా ప్రజలకు వొరగబెట్టేదేమిటి?ఒకటి గాక రెండు మూడు రాష్ట్రాలైనంత మాత్రాన పరిస్థితులు తలకిందులై పోతాయా? ఆర్థిక స్థితి గతులు మారతాయా? అసమానతలు అక్రమాలు పోతాయా? పదే పదే చెబుతున్నట్టు ఒకప్పుడు నిజాం సంస్థానం వున్నప్పుడు సాగిన వెట్టిచాకిరీకి కట్టుబానిసత్వానికి కర్కశ హత్యాకాండకు కారణమేమిటి? ఇలాటి జమీందారీ వ్యతిరేక పోరాటాలే చల్లపల్లి, మందసా, మునగాల వంటి చోట్ల జరగలేదా? రాచరిక పీడనపై పోరాటం అప్పుడు ప్రధానం. మార్కెట్‌ ప్రేరిత ప్రపంచీకరణ ముట్టడి నుంచి ప్రజలను కాపాడుకోవడం ఇప్పటి అవసరం. ఇది ప్రాంతాలు రాష్ట్రాలే కాదు, దేశాల సరిహద్దులకు కూడా అతీతమైన సమస్య. దాన్ని వదలిపెట్టి కేవలం ఒక ప్రాంతం విడిపోతే ప్రజలకు అరచేతిలో వైకుంఠం వచ్చేస్తుందన్న ప్రచారం సాగుతున్నది. విధానాలు మారని విభజనల వల్ల నిజంగా వచ్చేది రాజకీయ నేతలకు పదవులే తప్ప ప్రజలకు సదుపాయాలు కాదు. పదవులు పొందడంలో పోటీ ప్రాంతీయ రాజకీయాల పోటీగా దర్శనమిస్తున్నది తప్ప పరమార్థం వేరే లేదు.
తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు లేదా వేర్పాటు ఏకైక అజెండాగా వున్న టిఆర్‌ఎస్‌ ఏ సమయంలో ఎవరితో కలవాలి, ఎప్పుడు ఎవరితో మెతకగా వుండాలి,ఎవరితో బహిరంగంగా కలవాలి, ఎవరితో లోపాయికారీ అవగాహన కలిగివుండాలి వగైరా అనేక మల్లగుల్లాలు పడటం అందరికీ తెలిసేట్టే జరిగింది. వారి ఉద్యమాల్లోనూ ఉద్రేకాల్లోనూ దశల వారీ మార్పులున్నాయి.వారి అంతర్గత పరిస్తితిలోనూ హెచ్చు తగ్గులున్నాయి.ఇక ముందూ వుంటాయి. రాజకీయ పార్టీగా తమ ఆధిక్యత నిలబెట్టుకోవడం తప్ప ఇందుకు వేరే కారణమేమీ లేదు. తాము ఏం చేసినా ఏం మాట్టాడినా వ్యూహాత్మకం అని సమర్థించుకునే టిఆర్‌ఎస్‌ తప్పయినా ఒప్పయినా అదే హక్కు ఇతర పార్టీలకూ వుందని ఎందుకు అంగీకరించదు? మాది వ్యూహం మీది ద్రోహం అనే రీతిలో మాట్లాడ్డం సరైందేనా? కాంగ్రెస్‌ నాయకులకన్నా గట్టిగా రెండు వారాల్లో వచ్చేస్తుంది,రెండు మాసాల్లో వచ్చేస్తుంది అంటూ సంకేతాలందాయని పదే పదే చెప్పిన కెసిఆర్‌ ఇప్పట్లో విభజన ప్రసక్తి లేదని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తెగేసి చెప్పిన తర్వాత తను చెప్పింది వాస్తవం కాదని ఒప్పుకున్నారా? వచ్చే క్రిస్‌మస్‌ నాటికి జరుగుతుందని ఇప్పటికీ వూరించడం బాధ్యత గల వ్యవహారమేనా? తెలుగు దేశం లేఖ ఇస్తే కాంగ్రెస్‌ దగ్గర మేము సాధించుకుంటామని పదే పదే అనడం ప్రచారం కోసమే తప్ప నిజంగా సాధ్యమవుతుందా?
ఇందులో తెలుగు దేశం వూగిసలాట కూడా తక్కువేమీ కాదు. రెండు చోట్ల పార్టీని కాపాడుకోవాలన్న పేరిట పరిపరి విధాల మాట్లాడితే ప్రయోజనమేమిటి? చాలా కాలం పాటు దీనిపై వైఖరి చెప్పలేదు. ఆ తర్వాత మహానాడులో చంద్రబాబు చెప్పాల్సింది చెప్పాము అన్నారు. కొన్ని మాసాల తర్వాత మాది తటస్థ వైఖరి అన్నారు. తాజా పర్యటనలో మేము తెలంగాణాకు వ్యతిరేకం కాదు అని ముక్తాయింపు నిచ్చారు. వ్యతిరేకం కాదు, అనుకూలం కాదు అంటేనే అది తటస్థవైఖరిగా వుంటుంది. ఉప ఎన్నికల రీత్యా రాజకీయంగా టిఆర్‌ఎస్‌ను ఎదుర్కోవాలనుకుంటే దానికి ఈ అస్పష్టత తోడ్పడుతుందా? రాష్ట్ర విభజనే రాజకీయ భవిష్యత్తుకు సోపానం అనుకున్న తెలుగు దేశం నాయకులు కొందరు టిఆర్‌ఎస్‌ నేతలను మించి రెచ్చగొట్టేలా మాట్లాడుతుంటే ఆపలేకపోవడం ఇతర ప్రాంతాలలోనే గాక అక్కడ కూడా సంయమనం పాటించే వారికి ఇబ్బంది కాదా? సమైక్యత లేదా విభజన ఏదో విధానం తీసుకోకుండా ప్రధాన పార్టీలూ రెండూ ఎడతెగని ద్వంద్వ భాషణంతో గందరగోళ పడటం ప్రజలను గజిబిజిలో నెట్టడం ఎంత కాలం?

టి టిడిపి నేతలు, టి.కాంగ్రెస్‌ నేతలు అంటూ కృత్రిమంగా చెప్పుకోవడం తప్ప ప్రధాన పార్టీలు నేతలంతా కలసి కట్టుగానే పథకాలు వేస్తుంటాయి. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత జగన్‌ కూడా ప్రవేశించడంతో ఈ ప్రహసనం ఇప్పుడు మరింత రసవత్తరంగా మారింది. కారణాలేమైనా టిఆర్‌ఎస్‌ (మహబూబాబాద్‌ తర్వాత) ఆయనను విమర్శించడం లేదు. కొంత సానుకూల వ్యాఖ్యలనే వినిపిస్తున్నది.ఈ నేపథ్యంలో తెలంగాణా కోసం రాజీనామా చేసిన వారిపై పోటీ పెట్టబోమని ఆ ఆకాంక్షను గౌరవిస్తామని జగన్‌ అన్నమాటల్లో విధాన స్పష్టత వుందా? అసలు అడ్డంకి రాజశేఖర రెడ్డి అని పదే పదే చెప్పే టిఆర్‌ఎస్‌ ఆయన వారసుడిని ఎందుకు ఉపేక్షిస్తున్నట్టు? కాంగ్రెస్‌ నుంచి సంకేతాలు అందడం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పట్ల సానుకూలంగా కనిపించడం వెనక ఏ రాజకీయాలు వుండవా?
కెసిఆర్‌ కొద్ది రోజులు మౌనం వహిస్తే మోత్కుపల్లిలా విరుచుకుపడాల్సిన పని లేదు. లేక కెటిఆర్‌ చెప్పినట్టు భవిష్యత్తులో తుపాకి మోతలు తుపాను హౌరులను చూపించాల్సిన పనీ లేదు. ఇదే పత్రికలో కొందరు రాస్తున్నట్టు రాజకీయ అర్థిక విధానాలతో సంబంధం లేని అచ్చ తెలంగాణా సమస్య అంటూ వుండదు. రాజకీయం అన్నాక ఎవరి ప్రయోజనాలు వారికి లేకుండానూ వుండవు.ఆ ప్రయోజనాల పోటీకి ప్రాంతీయ ముసుగులు, మనోభావాల తొడుగులు అనవసరం. దీని వెనక చాలా చారిత్రిక కారణాలే వున్నాయి. ఈ నాడు కేంద్రంలో కాంగ్రెస్‌ యుపిఎ ప్రభుత్వం రాష్ట్రంతో ఆడుతున్న చెలగాటాన్ని పరిసమాప్తి చేసి ప్రశాంతత సాధించుకునే బదులు పోటాపోటీ వీరంగాలతో పరిస్థితిని ఇంకా కలుషితం చేయడం అనర్థదాయకం. దీనికి బదులు ప్రజలను వేధించే తక్షణ సమస్యల పరిష్కార సాధనకై ఉద్యమాలలో పోటీ పడితే మంచిది. ఎందుకంటే తెలంగాణాతో సహా ఏ విషయంలో ఎవరిని ఎంత వరకు నమ్మాలో నిర్ణయించుకోగల విజ్ఞత ప్రజలకుంటుంది. వాస్తవాలు వారికి అర్థం అయ్యాయి గనకే ఇన్ని పరిణామాల తర్వాతా ఈ రాష్ట్రం ఇలా వుంది. రాజీనామాలు ఉప ఎన్నికలూ గతంలో చాలా జరిగాయి. వాటిలో జయాపజయాలు రకరకాలుగా వున్నాయి. కనక ఇప్పుడు కూడా ఆ ఉప ఎన్నికల కోసం ఎవరూ ఉద్రేకాలు పెంచనవసరం లేదు.

4 comments:

  1. రవి గారూ, రెండు ప్రశ్నలు:

    అడ్డుకోవడానికి నిరసన తెలియజేయడానికి తేడా లేదా?

    కమ్యూనిస్టులు మద్యం దుకాణాలను ధ్వంసం చేయడం మీ వామపక్ష మేధావులకు దౌర్జన్యం అనిపించదా?

    ReplyDelete
  2. naa itemlo veetanitiki jawabulunnayi.

    ReplyDelete
  3. Let me repeat my points because I can't find your answers in this post.

    1. What is the difference between objecting and obstructing?

    2. Is it not true that all obstructive activities have precedence in the communists "movements" whether it is physical violence or even murder.

    ReplyDelete
  4. i once again humbly submit that my article is self explanatory. thanks for repeating in English.it is not an objective test but a test in objectivity. ok?

    ReplyDelete