Pages

Wednesday, January 23, 2013

తలచినదే జరిగినదీ!



తలచినదే జరిగినదా దైవం ఎందులకూ అనే ఒక సినిమా పాట కాంగ్రెస్‌ విషయంలో మాత్రం తిరగబడుతుంటుంది. దేవుడి విషయం పక్కనబెడితే ఆ పార్టీ మాటల గారడీని రాజకీయ మాయాజాలాన్ని పదే పదే చూసిన ప్రజలు చెప్పగానే నమ్మేసే స్థితి ఎప్పుడో మారిపోయింది. నెల రోజుల గడువులో తెలంగాణాపై ప్రకటన చేస్తామన్న హౌం మంత్రి హామీని కూడా నా వంటి వాళ్లం విమర్శనాత్మకంగానే తీసుకున్నాము. ఆ ప్రకటన వచ్చిన రోజున నేను తిరుపతిలో తెలుగు మహాసభల్లో వున్నాను. నెల అంటే బాగానే వుంది గాని నెలకు 365 రోజులు కాకుండా చూడాలని సరదాగా అన్నాను. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఖచ్చితంగా అదే నిజమైనట్టు కనిపిస్తుంది. మూడు రోజులు ముందుగానే గులాం నబీ ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలు కథ మొదటికి వచ్చిందని తేల్చేశాయి. ఇందుకు సీమాంధ్ర నాయకుల లాబీయింగ్‌ కారణమని తెలంగాణా వాదులు చేసే ఆరోపణ పాక్షికంగానే సత్యం. కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశాల మేరకు తెలంగాణా సీమాంధ్ర నాయకులు వుభయులూ వ్యవహరిస్తుంటారన్నది పూర్తి సత్యం. ఉభయ ప్రాంతాల నేతలకూ ఎవరి ప్రయోజనాలు వారికి వున్నాయి. ఏదో విధంగా కేంద్ర రాష్ట్రాలలో అధికారాన్ని కాపాడుకోవడంలో వారికి ఎలాటి విభేదాలు వుండవు. ఆజాదూ అని మీడియాలో ఆయన పేరును సరదాగా రాస్తుంటారు గాని నిజానికి ఆ జాదు కాంగ్రెస్‌ రాజనీతిదే!రేపు దీనిపై మరో సవరణో వివరణో వచ్చినా ఆశ్చర్యం లేదు. కనక అన్ని ప్రాంతాల ప్రజలూ అప్రమత్తంగానూ సంయమనంతోనూ వుంటేనే ఈ రాజకీయ మాయోపాయాలను తిప్పికొట్టడం సాధ్యమవుతుంది. విద్యుచ్చక్తి భారాలు, ఆర్టీసీ చార్జీలు అధిక ధరలు అవినీతి వ్యవహారాలపై పోరాడటం అందుకో మార్గం. అన్ని పార్టీలూ 2014 ఎన్నికలపై దృష్టి పెట్టి వున్నాయి గనక అసలు సంగతి అప్పుడే తేలుతుంది.

2 comments:

  1. అన్ని ప్రాంతాల ప్రజలూ అప్రమత్తంగానూ సంయమనంతోనూ వుంటేనే ఈ రాజకీయ మాయోపాయాలను తిప్పికొట్టడం సాధ్యమవుతుంది. విద్యుచ్చక్తి భారాలు, ఆర్టీసీ చార్జీలు అధిక ధరలు అవినీతి వ్యవహారాలపై పోరాడటం అందుకో మార్గం. అన్ని పార్టీలూ 2014 ఎన్నికలపై దృష్టి పెట్టి వున్నాయి గనక అసలు సంగతి అప్పుడే తేలుతుంది.

    ReplyDelete
  2. ఓ యదార్ధం అదే , కాంగ్రెస్ = బ్రహ్మపదార్ధం

    ReplyDelete