ప్రభుత్వాలకు పోలీసులుంటారు. ఉసిగొలిపితే చాలు విరుచుకుపడి విరగ్గొడతారు. నిజమే. ఆ బలం చూసుకుని జులం చూపి విర్రవీగిన విరగబడిన వారందరూ ప్రజల ముందు శృంగభంగం పాలయ్యారన్నది అంతకన్నా పెద్ద నిజం.కాని అధికారబలంలో అహంకరించే వారికి, అప్రజాస్వామికంగా హుంకరించేవారికి చరిత్ర చెప్పిన ఈ పాఠాలు చెవికెక్కవు. నిరంతర గుణపాఠాలు తలకెక్కవు. చరిత్ర బుద్ధిమంతులకు దారి చూపిస్తుంది. బుద్ధి హీనులను ఈడ్చుకుపోతుంది అంటారు. తప్పదు. వికసించిన విద్యుత్తేజం ఎంతటి విస్పోటనమై విజృంభిస్తుందో బషీర్‌బాగ్ ఆ నాడు చెప్పింది. నాలుగు రోజులుగా వామపక్ష నేతలు సాగిస్తున్న నిరవధిక నిరాహారదీక్షలో పెల్లుబికిన ప్రజాభిమానమూ చాటించింది. అయినా ఆ గ్రహింపు లేని పాలకులు ఆగ్రహం తప్ప అవగాహన కనీసంగా ప్రదర్శించలేకపోయారు. ఖాకీలను ప్రయోగించడం తప్ప కాస్త విజ్ఞతతో స్పందించేందుకు నిరాకరించారు.
నిరాహారదీక్షలు ఎక్కువ రోజులు సాగి ఉద్రిక్తంగా మారితే, దీక్షలో కూచున్న వారి ఆరోగ్యం మరీ క్షీణిస్తే ప్రభుత్వాలు జోక్యం చేసుకుని అదుపులోకి తీసుకోవడం అస్పత్రిలో చేర్పించడం కొత్త కాదు. కాని దానికి ముందు ప్రజాస్వామ్య ప్రక్రియవుంటుంది. ప్రభుత్వం సానుకూలంగా ప్రస్తావనలు చేస్తుంది. శాసనసభలో ముఖ్యమంత్రి వంటి వారు సాధికారికంగా ప్రకటన చేసి ప్రతినిధులను పంపిస్తారు. మధ్యవర్తులైన పెద్దమనుషులతో సంప్రదింపులు జరుపుతారు. సగౌరవంగా ముగింపు పలికేందుకు ప్రయత్నం చేస్తారు. ప్రస్తుత పాలక పక్షం