Pages

Wednesday, November 24, 2010

రోశయ్య నిష్క్రమణ పర్వం

తెలకపల్లి రవి

కాంగ్రెస్‌ పార్టీని ప్రభుత్వాన్ని రకరకాల పద్ధతుల్లో తన స్వాధీనంలో వుంచుకున్న వైఎస్‌ రాజశేఖర రెడ్డి హఠాన్మరణం పాలైనప్పుడు వెంటనే గద్దెక్కేవాళ్లెవరన్న విషయంలో ఎవరికీ సందేహం లేదు. అనుభవం రీత్యానూ విధేయత రీత్యానూ ఆ స్థానం రోశయ్యకు దక్కుతుందనే ఏకాభిప్రాయం . అధిష్టానమూ అదే చేసింది. అయితే ఆయన ఏ ప్రాతిపదికపై వచ్చారు ఎంత కాలం కొనసాగుతారు సాగనిస్తారు అన్న దానిపై మాత్రం
పరిపరివిధాలైన అభిప్రాయాలుండేవి.టీవీ చర్చలలోనే గాక ఇతరత్రానూ జగన్‌ శిబిరం ఆయన తాత్కాలిక ముఖ్యమంత్రి మాత్రమేనంటూంటే కాదని వాదించవలసి వచ్చింది. ఎందుకంటే అధిష్టానం ఆ విషయం స్పష్టం చేయడానికే చాలా కాలం తీసుకుంది.ఇదంతా యాదృచ్చికం కాదనీ రాజనీతి లెక్కలు తేలని ఫలితమని అందరికీ అర్థమైంది. అయినా అనుభవం నేర్పిన పాఠాలతో రోశయ్య ఎప్పుడూ అధిష్టానం విషయంలో గీత దాటకుండానే మాట్లాడుతూ వచ్చారు. ఇంకా చెప్పాలంటే తన స్థానం వల్ల బాధ్యతతో పాటు పెరిగిన పరిధిని దృష్టిలో తీసుకోనట్టే వ్యవహరించారు.నిన్నటి దాకా తనను అన్నా అని పిలిచిన నాయకుని వారసుడి అనుచరులు తన అస్తిత్వాన్నే గుర్తించ నిరాకరిస్తున్న స్తితితో రాజీ పడటానికే ప్రయత్నించారు.నా బిడ్డలాటి వాడు అని తను చెబుతున్న వ్యక్తి తనను తండ్రిలాటి వాడు అనకపోయినా కనీసం ముఖ్యమంత్రి రోశయ్య అని ఒక్కటంటే ఒక్కసారైనా సంబోధించక పోయినా సరిపెట్టుకున్నారు. సత్యాసత్యాలేవైనా సాక్షి రాతలపై కోపగించుకోవడం దగ్గరే ఆగిపోయారు తప్ప సాక్షాత్తూ దాని సారథులతో సంవాదంలోకి దిగే సాహసం చేయలేదు. తన మంత్రి వర్గ సహచరులు సచివాలయం గడప తొక్కబోమన్నట్టు మాట్లాడిన రోజున కూడా సవాలుగా స్వీకరించలేదు.
ే రోశయ్య సర్దుకున్నారే గాని సహనంగా వున్నారని చెప్పడం కష్టం. అంతర్గతంగా సమస్యలు ఏమున్నాయో తెలియదు గాని బయిట ప్రజలను చుట్టుముడుతున్న సమస్యలను పరిష్కరించడంలోగాని చేపట్టడంలో గాని ఆయన తగినంత శ్రద్ధాసక్తులు చూపిస్తున్నానన్న భావన కలిగించలేకపోయారు. పైగా ప్రతిదానికి నా చేతిలో ఏముంది అన్నట్టు నేను నిమిత్తమాత్రుడనన్నట్టు మాట్టాడుతూ తనను తనే తక్కువ చేసుకున్నారు. అది లౌక్యమని ఆయన అనుకుని వుండొచ్చుగాని బాధ్యతా లోపంగా జనానికి కనిపించింది. నేపథ్యం ఏదైనా నేతృత్వం ఒకసారి స్వీకరించాక అనివార్యంగా భారాలు వచ్చి పడతాయని అరవై ఏళ్ల అనుభవ శాలికి తెలియనిది కాదు. అయితే అంతర్గత అసౌకర్యం ఆయనను అలా మాట్లాడింపచేసిందనుకోవాలి. అందులోనూ ఈ ఏడాది కాలంలోనూ రాష్ట్రాన్ని చుట్టుముట్టిన సమస్యలు సాధారణమైనవి కావు. వెంటాడిన ఉద్రిక్తత మామూలుది కాదు.ఇలాటి పరిస్తితుల్లో పైనున్న వారు భద్రత కల్పించలేకపోయినా భరోసా ఇవ్వాల్సి వుండింది. కాని తామరాకు మీద నీటిబొట్టు మనస్తత్వం , చేతికి మట్టి అంటరాదనే లౌక్యం ఇలాటి సింక్లిష్ట సన్నివేశాల్లో అసలే పనికి రాదు. జగన్‌ ఓదార్పు రోశయ్య నిట్టూర్పు అధిష్టానం ఏమార్పు రాష్ట్రానికి వడగాడ్పు అని ఒకసారి రాశాను. నానాటికి ఆ పరిస్థితి మారకపోగా మరింత క్షీణిస్తూ రావడం అందరికీ ఆందోళన కలిగించింది.
ప్రాంతీయ వివాదాలు ఆయన సృష్టించినవి కాకపోవచ్చు. వాటి పరిష్కారం కూడా పూర్తిగా ఆయన చేతిలో లేదు. కాని ఆ ఉద్రిక్తతలు తీవ్రం కాకుండా ఉపశమించే చొరవ చూపించడం ఆయన చేతిలో వుంది. కనీసం ప్రీ జోన్‌ వివాదం వంటివి కోరి కొరివితో తలగోక్కున్నట్టు గాకుండా చూడగల అవకాశం ఆయనకే వుంది. ఎన్జీవోలు, అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, బీడీ కార్మికులు,104 ఉద్యోగులు,పారామెడికల్‌ సిబ్బంది, మైక్రో ఫైనాన్స్‌ మరణాలు, బోధనా ఫీజుల వంటివాటిని సావధానంగా విని సాద్యమైన పరిష్కార చర్యలు తీసుకోగల అధికారం ఏ ప్రభుత్వాధినేతకైనా వుంటుంది. పనిచేయని మంత్రులను అధికారులను పక్కనపెట్టినా పనిచేసే వారితో చేయించుకున్నా ఫలితం వుంటుంది. కాని ఆ విధమైన మానసిక స్థితి సంకల్పం కూడా కొరవడటం వల్లనే రాష్ట్ర పరిస్తితి తెగిన గాలిపటంటా తయారైంది. ఆయనను మంత్రివర్గ విస్తరణ చేసుకోవడానికి కూడా అనుమతించని అధిష్టానం ఇందుకు బాధ్యత వహించవలసి వున్నా వీలైన మేరకు కూడా భారం వేసుకోని ముఖ్యమంత్రి కూడా విమర్శకు అతీతుడు కాలేరు.
పని చేయలేకపోయినా పలుకైనా చల్లగా వుంటే సగం సంతోషించే దేశం ఇది. రోశయ్య వాక్చతురుడుగా పేరొంది వాక్సమరుడు కూడా. వైఎస్‌ వుండగా ఆయనకు ఆర్థిక శాఖతో పాటు ఆ బాధ్యత కూడా అప్పగించాడు. ఏక కాలంలో పెద్దరికమూ గద్దింపూ కలగలిపి మాటా ్లడటం ఆయనకు సహజంగా అబ్బిన విద్య.కాకపోతే తను ద్వితీయ స్థానంలో వున్నప్పుడు ఫరవాలేదు గాని ప్రథమ పీఠంపై కూచున్నాక అది అంతగా నప్పదని తెలుసుకోలేదు. సహనం కట్టలు తెగి ఉప్పెన అవుతుందన్న యువ నేత సంగతి ఎలా వున్నా వృధ్ద ముఖ్యమంత్రి కూడా అనేక సార్లు ఉప్పెనలా చెలరేగిపోయారు. అనేకానేక అనుచిత భాషణాలకు కారకులైనారు. పొరబాటునో గ్రహపాటునో ముఖ్యమంత్రినయ్యానన్న మాట వాటన్నిటికీ పరాకాష్ట. ఆ తర్వాత హుస్సేన్‌ సాగర్‌ ఖాళీగా వుందనడం మరో వైపరీత్యం. మొదట తనను పదవిలో కూచోబెట్టినప్పుడు ఆయన అధిష్టానం చెబితే అందులో దూకుతానన్నారు. ఆఖరులో ప్రజలకూ దాన్నే చూపించారు.ఆ మరుసటి రోజున అనంతపురంలో రాజినామా చేయమంటారా అని ఉక్రోషానికి గురైనారు. ఇవన్నీ ఆయన స్తాయి అనుభవం వున్నవ్యక్తి నుంచి ఎవరూ ఆశించరు. ప్రతిపక్ష నేతపై ఫిరంగులు మీడియాపై మిరియాలు కారాలు సరే సరి. పెద్దాయన వయోభారం పనిభారం వల్ల చికాకు పడ్డానన్నాక ఇవన్నీ గుర్తు చేయకూడదు గాని ఈ ప్రస్తావనలు ముఖ్యమంత్రి గురించి. పెద్దాయన గురించి కాదు.
మళ్లీ మొదటికొస్తే రోశయ్య ముఖ్యమంత్రి కావడం ఆ రోజున అందరూ వూహించిందే గాని ఈ రోజున ఈ రీతిలో నిష్క్రమింపచేయడం మాత్రం వూహించనిది. పదవి అప్పగించి పటిష్టం చేయని అధిష్టానం, పదవికి తగిన రీతిలో పని చేసేందుకు పనిచేయించేందుకు ప్రయత్నించని ఆయన, అనుక్షణం అవమానాలకు గురి చేసిన తస్మదీయ నేతలు అందరూ ఈ పరిస్తితికి కారకులే. ఈ క్రమంలో కుప్పకూలింది సమిష్టి రాజకీయ బాధ్యత. నష్టపోయింది రాష్ట్ర ప్రజానీకం. క్షీణించింది ప్రజల పరిస్తితులు.పేరుకుపోయింది సవాలక్ష సమస్యలు.స్తంభించిపోయింది విచారణ నోచని అవినీతి కుంభకోణాలు. కొత్తగా ఎవరిని ఏ రీతిలో ఎంపిక చేసినా జరగాల్సింది పరిస్తితులను చక్కదిద్దడం. ప్రభుత్వ అస్తిత్వాన్ని ప్రతిష్టించడం, ప్రతిపక్షాలతో సత్సంబంధాలు నెలకొల్పి సముచిత ప్రజాస్వామ్య వాతావరణాన్ని తీసుకురావడం. ఆరు పదుల అనుభవంతో ఏడాది రెండు నెలల 22 రోజుల పాలనకుస గాను రోశయ్య రాజకీయ చరిత్రలో ఎలాగూ తన స్థానం తను పొందుతారు. ఏడు పదుల ఆజానుబాహువుగా నిండైన ఆయన మూర్తిని ప్రజలు ఎలాగూ గుర్తు పెట్టుకుంటారు. దాంతో పాటే ఈ రాజకీయ పాఠాలూ గుర్తుపెట్టుకోవాల్సి వుంటుంది. ఏ పదవీ ఎవరికీ శాశ్వతం కాదు. పరిస్తితులను గమనంలో పెట్టుకుని చూస్తే రోశయ్య ఏడాది పైగా కొనసాగడం కొందరు కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల కన్నా చాలా బాగా ఎక్కువ. ఆయనే చెప్పినట్టు వయస్సురీత్యా ఆరోగ్యం కాపాడుకుంటూ సేవాధర్మం కొనసాగిస్తారని కోరుకుంటూ షుక్రియా చెప్పాలి. వ్యక్తుల మార్పుతో సరిపెట్టడం గాక విధానాల మార్పునకు సిద్దమైతేనే ప్రజలు ఆమోదిస్తారని భావి నేతలు గ్రహించాలి.

6 comments:

  1. పని చేయలేకపోయినా పలుకైనా చల్లగా వుంటే సగం సంతోషించే దేశం ఇది-
    రోశయ్య ముఖ్యమంత్రి కావడం ఆ రోజున అందరూ వూహించిందే గాని ఈ రోజున ఈ రీతిలో నిష్క్రమింపచేయడం మాత్రం వూహించనిది-
    వ్యక్తుల మార్పుతో సరిపెట్టడం గాక విధానాల మార్పునకు సిద్దమైతేనే ప్రజలు ఆమోదిస్తారని భావి నేతలు గ్రహించాలి-
    మూడు ముక్కల్లో రాష్ట్ర రాజకీయ రామాయణాన్ని కట్టె- కొట్టె-తెచ్చె అనే రీతిలో ఒక రాజకీయ విశ్లేషకుడిగా చక్కగా చెప్పారు .కానీ వినే సంస్కృతి పాలక పక్షం వారిలో వుండాలి కదా ! అదే ప్రధాన సమస్య !

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. తెరకు నమస్కారం సమస్యలు ఉన్నది వాస్తవం కాని కుల, ధన బలం ముందు రోశయ్య ఓడిపోయారని నా అభిప్రాయం.

    ReplyDelete
  4. రోశయ్య ను సీయం చేస్తూ అధిష్టానం ఇచ్చిన బ్రీఫ్ ను అమలు చేయడం లో ఘోరం గా విఫలమయ్యాడు.రాష్ట్ర కాంగ్రెస్ ను కబంధహస్తాల్లో ఇరికించుకొన్న రెడ్డి వర్గాన్ని విభజించి పాలించు సూత్రం తో విడదీసి ,కాంగ్రెస్ లో రెండవ బలమైన మున్నూరు కాపులను,మిగతా ఒబిసి లను సంఘటితం చేసి ఒక బలమైన ప్రత్యామ్న్యాయం తయారు చేయాల్సిన రోశయ్య తనపిరికితనంతో,,అసమర్థతతో,నిష్క్రియాపరంతో,అధిష్టానాన్నీ
    ఆం.ప్ర. రాష్ట్రాన్నీ చిక్కుల్లోకి నెట్టేసాడు.అధిష్టానానానికి ప్రత్యామ్న్యాయం లేక మళ్ళా రెడ్డి కులానికి దాసోహం అయ్యే పరిస్థితి కల్పించాడు.
    (నేను ద్వేషించే కుల రాజకీయాల ప్రస్థావన తెచ్చినందుకు మన్నించండి.రాశేరె నేత్రుత్వంలో రాష్ట్రం 300 సం. వెనక్కు వెళ్ళిన నేపధ్యం లోనే కులరాజకీయాలు విజృంభించాయని నమ్ముతూ)

    ReplyDelete
  5. రోశయ్య గారి పరిపాలన, తను చేసిన తప్పులు చాలా బాగా ఎనలైసు చేసారు.

    తారకం గారు, మీతో మాత్రం ఏకీభవించలేను.

    నిజానికి అధిష్టానం తనకు బ్రీఫ్ ఇస్తే, మంత్రిమండలి పెంచుకోవటానికో, మార్చుకోవటానికో, లేక పిల్లి, బాలినేని లాంటి వాళ్లను బయటకు పంపటానికో తనకు ఏమాత్రం వెసులుపాటు ఇవ్వకుండా, (ఎంత కాదన్నా) దానికితోడు చచ్చిన దేముడు కు ముఖ్యులయిన సలహాదారుని, ఆయన డబ్బులు తిన్న విశ్వాసము మెండుగా ఉన్న మొయిలీని తన మీద అంతకాలం రుద్దేది కాదు. వాళ్లిద్దరనీ ఎదురుగా పెట్టుకొని కాశయ్య గారు ఎలా తన ఊహ్యాలంటూ ఏమయినా ఉన్నా అమలు పరచగలరు? అందునా దేముడు కొడుకు కాంగీ లో ఉంటాడో, ఉండడో క్లారిటీ లేకుండా, తను ఏమయినా చేయాలన్న, అప్పటి పరిస్తితులలో మళ్లీ అధిస్టానం, దేముడు గారి కుటుంబం ఇద్దరూ అలవాటయిన దోపిడీ కోసం కలసిపోరు అన్న నమ్మకం కూడా ఏమీ లేదు కదా!! ఆ రకంగా కాశయ్యను ఓ బలమయిన వర్గాన్ని అణచలేకపోయాడు అన్న విషయంలో తప్పుబట్టలేము.

    కాకపోతే అవి అన్నీ పక్కన పెట్టినా, కాశయ్య తను చేయగలిగినంతలో చేయగలిగిన పనులు కూడా చేయలేదేమో అని మాత్రం అనిపించింది, దానికి తోడు తను ఓ తాత్కాలిక పదివి పొందినవాడిని అని తనకు తనే fix అయిపోయారేమో అన్న అనుమానాలు తన అల్లుడు/మనవడు మరియు front man గా ఆమంచి లాంటి ఆకు రౌడీ లను పెట్టుకొని సాగించిన సెటెల్మెంట్ వ్యవహారాలు చూసినా కలుగుతుంది. అందుకని కాశయ్య ను అధిష్టానం సాగనంపటంలో తన స్వయంకృతపరాధం కూడా ఉంది అని నా ఉద్దేశ్యం.

    ReplyDelete
  6. తారకం గారు,
    /*నేను ద్వేషించే కుల రాజకీయాల ప్రస్థావన తెచ్చినందుకు మన్నించండి*/
    మీరు సామాన్యులు గారు.మీ మాటలు తూటాలు.మీరు బహు చమత్కారి సుమా.మీలాంటి వాళ్ళు తెలుగు జాతిలో జన్మించడం తెలుగు జాతి 'అదృష్టం'.
    కానీ సార్,మీరు చిన్నప్పటినుండి ఇంతేనా,మధ్యలో ఎమన్నా ఈ తెలివితేటలు సంపాదించారా?
    మీరు చంద్ర బాబుది వెన్నుపోటు కాదు.నీలం సంజీవ 'రెడ్డి', కాసు బ్రహ్మానంద 'రెడ్డి',రాజశేఖర 'రెడ్డి',జలగం వెంగల రావు,etc etc అందరు వెన్ను పోటు దారులు అని మీ బ్లాగులో సెలవిచ్చారు.
    అందులో ఉద్దేశ పూర్వక మతిమరుపుతో 'నాదెండ్ల' భాస్కరావు ని ఒగ్గేసారు. కానీ మీరు కుల అభిమానములేని సజ్జనులు. మేము నమ్మాలి,నమ్మాల్సిందే, నమ్మక తప్పదు. మీలాంటి వాళ్ళు చెపితే నమ్మక సస్తామా?
    కానీ సార్, మీలాగే ,మీరు అభిమానించే నాయకులు(???????) కూడా ఉంటారా ? ఎంతయినా చెప్పేవాడికి వినే వాడు లోకువ.

    ReplyDelete