Pages

Tuesday, July 5, 2011

రాజీనామాల ప్రభావం - అంచనాలు, అతిశయాలుతెలంగాణా ప్రాంత కాంగ్రెస్‌, తెలుగు దేశం( తాజాగా టిఆర్‌ఎస్‌) ప్రజా ప్రతినిధుల రాజినామాల పర్యవసానాలపై ఇప్పుడు తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఈ నిర్ణయంతో అధిష్టానం దిగిరాక తప్పదని టిఆర్‌ఎస్‌ నేతలు ముందుకు నెడుతూ వస్తున్నారు గాని కేంద్ర పరిశీలకుడు గులాం నబీ ఆజాద్‌ హొంమంత్రి చిదంబరం ఆ అంచనాలను పూర్తిగా పూర్వపక్షం చేసేలా మాట్లాడారు. రాజినామాలకు సంబంధించి కొన్ని అంశాలు స్పష్టంగా చెప్పుకోవచ్చు.
1.ప్రత్యేక రాష్ట్రానికి తాము కట్టుబడి వున్నామని నిరూపించుకోవడానికి కాంగ్రెస్‌ నేతల రాజినామాల సమర్పణ ఉపకరిస్తుంది.
2.ఇప్పటి వరకూ దాడులకు విమర్శలకు లక్ష్యంగా వున్న తెలుగుదేశం నేతలు ఆ తాకిడి నుంచి కాస్తయినా బయిటపడటానికి తాము ఈ విషయంలో గట్టిగా వున్నామని తప్పు కాంగ్రెస్‌దేనని చెప్పుకోవడానికి అవకాశం కలుగుతుంది
3.కేంద్రం నుంచి అన్నీ అననుకూల సంకేతాలే వస్తున్న నేపథ్యంలో టిఆర్‌ఎస్‌, జెఎసిలు వేడి పెంచేందుకు
ఇది దారి తీస్తుంది.
4.దీనిపై ఎలాగూ ఇతర ప్రాంతాల వారూ తమ శైలిలో స్పందిస్తారు గనక మరోసారి కేంద్రం భిన్నాభిప్రాయాలను సాకుగా చూపే అవకాశం లభిస్తుంది.
5. ఈ సంక్షోభాన్ని కారణంగా చూపి రాష్ట్రపతి పాలన వంటిది పెట్టేస్తే పాలక పక్షం అన్ని సమస్యలనూ తాత్కాలికంగా దాటవేసేందుకు దారి దొరుకుతుంది.ప్రజాస్వామ్య ప్రక్రియ వెనక్కు పోతుంది గనక పాలకుల జవాబు దారీ తనం వుండదు. ఏకపక్ష చర్యలు ప్రకటనలు పెరగుతాయి.

6.రాజినామాలు చేసి గుండె బరువు దించుకున్న కాంగ్రెస్‌ నేతలు షరామామూలుగా అధిష్టానంతో మంతనాలు సుదీర్ఘంగానే కొనసాగిస్తున్నారు. అందువల్ల ఈ అంశంలో తుది వాక్యం ఇంకా వెలువడలేదనే అనుకోవాలి.

7. ఇవన్నీ ఎలా వున్నా చిదంబరం సుస్పష్టంగా కాంగ్రెస్‌ తెలుగు దేశం అభిప్రాయాలతో అఖిలపక్షం జరిగిన తర్వాతే తమ వైఖరి చెబుతామని ప్రకటించడం కేంద్రం ధోరణిని తెల్పుతుంది. ప్రాంతాలతో చెలగాటం ఇప్పట్లో అగేది కాదని కూడా వెల్లడవుతుంది.

8.రాజీనామాలతో వున్న ఫలంగా రాజ్యంగ సంక్షోభం వచ్చేస్తుందన్న లేదా రాష్ట్ర ప్రకటన జరుగుతుందన్న అంచనాలు ఎంత అతిశయోక్తులో అర్థమవుతుంది.

సాంకేతికంగా చూస్తే స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ 12 వ తేదీ వరకూ హైదరాబాదు రారు గనక అప్పుడే వీటి పరిశీలన మొదలవచ్చు. తర్వాత ఆయన ఏ వైఖరి తీసుకుంటారో, ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా కలవడానికి అబిప్రాయానికి రావడానికి ఎంత సమయం తీసుకుంటారో ఆయన ఇష్టం. ఈ లోగా కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధుల వైఖరులు ఎలా వుంటాయనేది మరో ప్రశ్న. కేంద్ర మంత్రి జైపాల్‌ రెడ్డి . ఉప ముఖ్యమంత్రి, గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎంఎల్‌ఎలు మంత్రులు వీరితో కలవక పోవడం కూడా రాజకీయ భౌగోళిక ప్రాధాన్యత గల విషయం.

తెలంగాణా ప్రాంత కాంగ్రెస్‌ నేతల కోణంలో ఈ రాజినామా నిర్ణయం వారి అస్తిత్వం కోసం అనివార్యంగా తీసుకున్నదే కావచ్చు. అదే విధంగా ఇతర ప్రాంతాలలో అదే పార్టీ ప్రతినిధులు తాము కూడా తక్కువ తినలేదనిఢిల్లీ వెళతామని అంటున్నారు. తెలుగు దేశం పరిస్తితి కూడా ఇందుకు పెద్ద భిన్నంగా లేదు. టిఆర్‌ఎస్‌, జెఎసిలు కాంగ్రెస్‌ వారిని హర్షించిన స్థాయిలో వారి నిర్ణయాన్ని హర్షించకపోవడంలోనూ బోలెడు రాజకీయముంది. పైకి ఏమి ప్రకటనలు చేసినా ఈ మూడు రాజకీయ శక్తుల ఆదిపత్య వ్యూహాలు వైరుధ్యాలు కొనసాగుతున్నాయనేది ఈ సందర్భంలోనూ తేటతెల్లమవుతున్నది. ఈ వైరుధ్యాలను పరిష్కరించుకోవడం అంత సులభం కాదు కూడా. కె.సి.ఆర్‌. మంత్రి జానారెడ్డి ఇంటికి వెళ్లడంతో మొదలైన ఈ కొత్త అధ్యాయం భవిష్యత్తులో ఆయన నాయకత్వాన్ని కాంగ్రెస్‌ ఒప్పుకోవడానికి దారి తీస్తుందా? అదే జరిగితే ఇంతగా రాజినామాలు చేస్తామన్న వారు ఆ ఘనత ఆయన ఖాతాలో వేసేస్తారా? అసలు కేంద్ర కాంగ్రెస్‌ మాయాజాలం వల్లనే ఆంధ్ర ప్రదేశ్‌ ఇంతటి సంక్షోభంలో కూరుకుపోతే ఆ పార్టీ పతాకం పట్టుకుని వారు వెళ్లడాన్ని జనం హర్షిస్తారా? కాంగ్రెస్‌ టిఆర్‌ఎస్‌లు కలసి వ్యవహరిస్తే తెలుగుదేశంకు అందులో చోటుంటుందా? ఇవన్నీ ప్రశ్నలే. వాస్తవానికి తెలంగాణా కాంగ్రెస్‌కు నాయకుడెవరనేదే ఇంకా అంగీకారం కుదరని సమస్య.
ఇంతకూ పదే పదే ఢిల్లీ యాత్రలు చేస్తూ అక్కడ ప్రధాని తదితరుల స్పందనను వూరించి చెప్పిన వారు ఇప్పుడు రాజినామాలు చేసే పరిస్తితి ఎందుకు వచ్చినట్టు? అంటే గతంలో చెప్పినవన్నీ అవాస్తవాలు అర్థసత్యాలు అనుకోవాలా? నిజంగా కేంద్రం అలాటి వైఖరితో వుంటే కేవలం ఈ రాజినామాలు దాన్ని మార్చి వేయడం సులభం కాదు. గులాం నబీ ఆజాద్‌ ఆలస్యంగా చెప్పినా ఇది జాతీయ స్థాయి నిర్ణయం అనడంలో పొరబాటేమీ లేదు. డిసెంబరు 9 నే గాక 23నూ పరిగణనలోకి తీసుకోవాలన్నది కూడా వాస్తవమే. కాకపోతే ఆ రెండు కూడా కాంగ్రెస్‌ రాజకీయ మాయాజాలంలో భాగమన్నది అసలు విషయం. ఎందుకంటే అన్ని ప్రాంతాల వారినీ ఒప్పించాలనడంలోనూ తప్పు లేదు. ఆ రాజకీయ ప్రక్రియ సరిగ్గా నిర్వహించకుండా హడావుడిగా ఒక పాక్షిక ప్రకటన చేసి రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిన దోషం కాంగ్రెస్‌దే. అలాటి కాంగ్రెస్‌ పతాకాన్నే పట్టుకుని ప్రాంతీయ కోణాన్ని మాత్రమే చూడమంటే ఎలా సాధ్యం? 1969,1972 వదిలేసినా గత ఇరవై మాసాలలో రకరకాల రాజినామాల పిల్లిమొగ్గలను కూడా విస్మరించడం కుదిరేపని కాదు. రాజినామా చేస్తామన్నారు గనక వారి వెనక నడుద్దామని కె.సి.ఆర్‌ లేదా కోదండరామ్‌ చెప్పొచ్చు గాని ప్రజలు తమ అనుభవంతోనే తగు నిర్ణయాలు తీసుకుంటారు.

కొంతమంది అంటున్నట్టు అనుకుంటున్నట్టు రాజినామాలు రాజ్యాంగ సంక్షోబానికి దారి తీయవు. రాజకీయ సంచలనానికి మాత్రమే పనికి వస్తాయి. ఎందుకంటే రాజ్యాంగం అమలు బాధ్యత కేంద్రానిది రాస్ట్రపతిది తప్ప రాష్ట్రాలది కాదు. 356వ అధికరణం ప్రకారం కేంద్రం రాష్ట్రంలో జోక్యం చేసుకుని ఏదో ఒక విధమైన రాష్ట్రపతి పాలన విధించే అవకాశముంటుంది. వాస్తవంలో 1969లో ప్రత్యేక తెలంగాణా ఉద్యమ సందర్భంగా వి.బి.రాజు తదితర మంత్రులు రాజినామా చేస్తే చాలా తతంగం నడిచింది. చివరకు రాజినామా చేసిన వారే కాంగ్రెస్‌ను కాపాడుకుందాం అని నినాదమిచ్చి ముఖ్యమంత్రి మార్పుతో సరిపెట్టారు.1972లో జైఆంధ్ర నినాదంపై ఎనిమిది మంది మంత్రులు రాజినామా చేసినప్పుడూ రాజిగానే ముగిసింది. 2009 డిసెంబర్‌ 9 ప్రకటన తర్వాత జరిగిన రాజినామాల ప్రహసనం కూడా ఏమైందో ప్రజలు చూశారు.కనక రాజినామాలు వేడి వొత్తిడి పెంచవచ్చునేమో గాని రాజకీయ పరిష్కారాలు రాష్ట్ర విభజనలు సాధించలేవని ఇప్పటి వరకూ నడిచిన చరిత్ర చెబుతున్నది. అయినా కాంగ్రెస్‌ నేతలు, వారిని పురికొల్పిన వారు ఈ నిర్ణయంపై అతిశయోక్తిగా మాట్లాడుతున్నారు. వీటిని ఆ పార్టీ కేంద్ర నాయకులే తేలిగ్గా తీసేస్తున్నారు. దీనికి రెండు కారణాలుండొచ్చు- మొదటిది - అఖిల భారత నేతృత్వం కోరుకునే వారికి ఒక ఉపప్రాంతం గురించిన ప్రత్యేకమైన శ్రద్ద వుండకపోవడం రెండు- ఎలాగూ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి ప్రతికూలంగా వుంది గనక దీన్ని ఖాతరు చేయనవసరం లేదనే మేకపోతు గాంభీర్యం. వారు ఏ ఉద్దేశంతో అలా చేసినా రాజీనామా చేసిన నేతలు సంప్రదింపులకు వెనువెంటనే హాజరవడం ద్వారా సంస్థాగత విధేయత చాటుకున్నారు. ఆ విధేయతే విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేయొచ్చు.
ప్రాంతీయ సమస్యల విషయంలో కాంగ్రెస్‌ తెలుగు దేశం నేతలకూ టిఆర్‌ఎస్‌కూ స్పష్టంగా తేడా వుంటుంది. తెలంగాణా విభజన కోర్కెపై వేడి చల్లారకుండా చూడటంపైనే టిఆర్‌ఎస్‌ రాజకీయ మనుగడ ఆధారపడి వుంటుంది. కాగా ఆ వేడి తమకు నష్టం చేయకుండా చూసుకుంటూ వ్యక్తిగత స్థానాన్ని కాపాడుకోవడం మాజీ ప్రస్తుత పాలక పక్షాల లక్ష్యంగా వుంటుంది. అవసరమైతే వారు అటూ ఇటూ సర్దుకుని అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఆధిక్యత కాపాడుకోవడానికి చూస్తారు తప్ప ఒకే అంశం చుట్టూ తిరగడానికి టిఆర్‌ఎస్‌లాగా సిద్ధం కాలేరు. కాకపోతే ఆ ప్రాంతానికి సంబంధించిన నాయకుల వరకూ అలా చేయొచ్చు గాని అది పార్టీ అంతటి వైఖరి కాదు. టిఆర్‌ఎస్‌కు వున్న రాజకీయ ప్రాతినిధ్యమే పరిమితం గనక దాన్ని విస్తరించుకోవడం, తెలంగాణాకు తానే ప్రధాన ప్రతినిధిగా రూపొందడం ఎజెండాగా వుండటంలో ఆశ్చర్యం లేదు. ఇక్కడ రాజినామాలకు సిద్ధం కాకపోతే వారికన్నా తనే గట్టిగా వున్నట్టు చెప్పుకోవచ్చు. సిద్ధమైతే అది తన వొత్తిడి పలితంగా చూపించుకోవచ్చు. ఏ విధంగా చూసినా ఈ విషయంలో వ్యూహాత్మక లాభం టిఆర్‌ఎస్‌కు ఎక్కువగా వుంటుంది. ఈ సంగతి సూటిగా తెలుసు గనకే కాంగ్రెస్‌ నాయకులు తటపటాయిస్తుంటారు.హైదరాబాదు నగరంలో టిఆర్‌ఎస్‌ పట్టు పరిమితంగా వుండటం కూడా ఒక అననుకూలత. ఈ వాస్తవాలన్ని ప్రస్తుత పరిణామాల్లో ప్రతిబింబిస్తున్నాయి. కనకనే వున్న ఫలాన ఏవో నాటకీయమైన మార్పులు వచ్చేస్తున్నట్టు అనుకూలురు వ్యతిరేకులు ఎవరూ అనుకోనవసరం లేదు. ప్రాంతీయ రాజకీయ క్రీడ నిరాఘాటంగా కొనసాగడానికి మాత్రం రాజినామాల నిర్ణయం తప్పక దోహదపడుతుంది.
ఇప్పుడు తెలంగాణా నేతల వైఖరిని సాకుగా చూపించి కోస్తా రాయలసీమల్లో వేడి పెంచడానికి పాలక పక్ష నేతలు ప్రయత్నం చేస్తారు.వారిలో వారే తీవ్రంగా మాట్లాడుకుని కృత్రిమంగా ఉద్రిక్తత పెంచుతారు.కేంద్రం తన నిర్ణయం ప్రకటించే సూచనలు కూడా ఇవ్వక ముందే ఇన్ని ఎత్తులు పై ఎత్తులు వేయడం దాని ఎత్తులు పారడానికి బాగా అక్కరకు వస్తుంది. ఈ పరిస్తితులు మూలంగానే తాను ఏమీ చేయలేకపోతున్నానని మరింత కాలం చెలగాటం కొనసాగిస్తుంది.మరింతగా దాగుడుమూతలాడుతుంది. కేంద్రానికి ఏ మాత్రం బాధ్యత వున్నా రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన 14(ఎఫ్‌) రద్దుకు అంగీకరించి సుహృద్భావ వాతావరణం కలిగేంచుందుకు ఎప్పుడో చర్యలు తీసుకునేది. ఇప్పుడు తీసుకున్నా ప్రభావం పరిమితంగానే వుంటుంది. అన్ని పార్టీలూ శాసనసభ వేదికపైనే వెలిబుచ్చిన ఏకాభిప్రాయాన్ని బేఖాతరు చేస్తూ ఇంకా తేదీలు చెప్పని అఖిల పక్ష సభకు అందరూ వస్తేనే నిర్ణయం ప్రకటిస్తాననడం హాస్యాస్పదం. పార్టీ పరంగా చేయవలసింది చేయకుండా ప్రాంతాల వారి విన్యాసాలు నడపడం కూడా అంతకంటే భిన్నమేమీ కాదు. ఒకే ప్రాంతంలో ఒకే పార్టీలో భిన్న స్వరాలు కూడా తీవ్రంగానే వినిపిస్తున్న తరుణం ఇది. కేశవరావు ఎంత ఆవేశంగా అభిభాషించినా ఈ ప్రాథమిక వాస్తవాలు మాత్రం మారేవి కావు. కెసిఆర్‌ ఎంతగా కోరుకున్నా కేంద్రం క్రీడలూ ఆగేవి కావు. శైలజానాథ్‌, టిజి వెంకటేష్‌ ఎంత గట్టిగా వాదించినా ఈ పరిణామాలలో తమ పార్టీ దోషమూ దాగేది కాదు.ఈ పోటాపోటీ ఎత్తుగడల పర్యవసానాలు మాత్రం ప్రజలు భరించవలసి వుంటుంది. చివరకు వీటికి స్వస్తి చెప్పే బాధ్యతా ప్రజలే తీసుకోవలసి వస్తుంది.

3 comments:

 1. రవి గారు ,
  మీ విశ్లేషణ చదివిన తరవాత గుండె బరువెక్కింది . రాజకీయాలు ప్రజల సమస్యలని పరిష్కరించే దిశగా సాగాలి . కానీ మన ఖర్మ ! రాజకీయమే సమస్యగా మారిపోయింది . మీ విశ్లేషణ విశ్వనాథన్ ఆనంద్ వేసే చదరంగపు ఎత్తుగడలని వివరిస్తున్నట్లుగా సాగింది . వాస్తవం కావచ్చు . కానీ .. దిగులుగా ఉంది .

  ReplyDelete
 2. చక్కటి విశ్లేషణ."ఇంతకూ పదే పదే ఢిల్లీ యాత్రలు చేస్తూ అక్కడ ప్రధాని తదితరుల స్పందనను వూరించి చెప్పిన వారు ఇప్పుడు రాజినామాలు చేసే పరిస్తితి ఎందుకు వచ్చినట్టు? అంటే గతంలో చెప్పినవన్నీ అవాస్తవాలు అర్థసత్యాలు అనుకోవాలా?" - ఖచ్చితంగా అలాగే అనుకోవాలండి. అయితే హైకమాండు వీళ్ళకు మాయమాలు చెప్పి ఉండాలి, లేదా వీళ్ళే మనకు అబద్ధాలు చెప్పి ఉండాలి. ఏదైనాగానీండి.. మీరు చెప్పినట్టు ఈ రాజీనామాలు వివిధ పార్టీలకు ఏదో ఒక రకమైన ప్రయోజనం కలిగిస్త్తాయే తప్ప, సమస్య పరిష్కారానికి ఉపయోగపడవనే అనిపిస్తోంది.

  ReplyDelete
 3. సమస్యా పరిష్కారం రాష్త్ర నాయకుల చేతుల్లో ఉంది. కేంద్రం చేతుల్లో కాదు కాక కాదు. ఇంత పెద్ద రాష్ట్రాన్ని అన్ని ప్రాంతాల వారు ఒప్పుకుంటేనే విభజించటమో కలిపి వుంచటమో సాధ్యం. అది తేలాల్సింది రాష్ట్రంలో. ఇలా కాక ఇంకో లాగా అవ్వొచ్చని ఎవరికైనా అనిపిస్తే అదేంటో చెప్పగలరు.

  ReplyDelete