Pages

Monday, November 19, 2012

తెలుగు భాషా వికాసం: వాస్తవిక దృక్పథం
ఇటీవలి కొన్ని సంవత్సరాలుగా రాష్ట్రంలో తెలుగు భాష పరిరక్షణ అన్న నినాదం ఎక్కువగా వినిపిస్తున్నది. ఈ పేరుతో అనేక వేదికలు సంస్థలు నెలకొన్నాయి. అధికార అనధికార ప్రముఖులు ముందుండి కార్యక్రమాలు నడిపిస్తున్నారు. తెలుగు భాషా పరిరక్షణ ఉద్యమాలని పిలుస్తున్నారు.కొన్నేండ్ల కిందట తమిళ భాషకు ప్రాచీన హౌదా కల్పించిన కేంద్ర ప్రభుత్వం తెలుగును నిర్లక్ష్యం చేసిందని నిరసనలు మార్మోగాయి. ఎట్టకేలకు ఆలస్యంగానైనా ఆ హౌదా తెలుగుకూ ఇచ్చారు గాని తర్వాత దానివల్ల ఒరిగిందీ జరిగిందీ ఏమిటనేది ఇంకా అస్పష్టంగానే వుంది. డిసెంబర్‌ నెలలో తిరుపతిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రపంచ తెలుగు మహాసభలు తలపెట్టడం, ఇటీవలనే అధికార భాషా సంఘం అద్యక్షుడుగా మండలి బుద్ధ ప్రసాద్‌ను నియమించడం వంటి పరిణామాలు ఈ అంశపై ఆసక్తి పెంచాయి.
ఇంతకూ తెలుగు భాషను కాపాడుకోవడమంటే ఏమిటి? ఎవరి నుంచి? ఏ విధంగా? ఇప్పుడు మమ్మీ డాడీ చదువుల నుంచి అని టక్కున జవాబు చెప్పేస్తారు. నిజానికి ఈ సమాధానం సమగ్రమైంది కాదు. ఎందుకంటే ఇలాటి ప్రశ్నలకు ఒక్కొక్క దశలో ఒక్కొక్క జవాబు వుంటూ వచ్చింది. ఇంగ్లీషు నుంచి మాత్రమే గాక సనాతనవాదుల నుంచి సంసృత వ్యామోహం నుంచి తెలుగును కాపాడుకోవడం ఒకనాడు పెద్ద ఉద్యమంగా సాగింది. నిజానికి తెలుగు కోసం పోరాటం సంస్కరణోద్యమంలో పెద్ద భాగం. మా వాళ్లకుతెలుగులో రాయడమంటే చులకన అని శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి స్వయానా రాసిన మాట. గురజాడ మరింత సూటిగానే చెబుతారు: ' విశాల ప్రజానీకం చదువుకోవడం పూర్వాచార సంప్రదాయంలో భాగం కాదు. నాడు జ్ఞానార్జన సాహిత్యం బ్రాహ్మణుని గుత్తసొమ్ము. అతని దృష్టిలో సంసృతం పెట్టిన వరవడి పవిత్రమైనదీ, మీరరానిదీ సంసృత సాహిత్యం క్షీణ దశలో వున్నప్పుడు తెలుగు సాహిత్య సృష్టి ప్రారంభమైనందున ఆ క్షీణ దశ లక్షణాలైన బాషా కళా సంప్రదాయాలు తెలుగులో పాతుకు పోయాయి. రాజకీయ రంగంలో లాగానే భాషా రంగంలో కూడా వేర్పాటు తత్వమూ ప్రభువర్గ తత్వమూ చివరకు పతనోన్ముఖం కాక తప్పదు.అనేకుల అవసరాలు కొద్దిమంది వాటికన్నా ముఖ్యమైనవి. తుదకు వాటిదే పై చేయి అయి తీరుతుంది''
ఇంత స్పష్టతతో గురజాడ గిడుగు సాగించిన వాడుక భాషా పోరాటం కేవలం భావోద్వేగ సంబంధమైంది కాదు. మాతృభాష అందులోనూ ప్రజల భాషను పెంపొందించుకోవడం ఒక ప్రజాస్వామిక అవసరం. అయితే ఆంగ్లేయులు పాలించడం వల్ల తర్వాత ప్రపంచాధిపత్యం సాగిస్తున్న అమెరికాలో మాట్లాడేది కూడా ఆ భాషే కావడం వల్ల(అయితే వారి ఆధిపత్యం కారణంగా అమెరికన్‌ ఇంగ్లీషు!) తెలుగుతో సహా వందలాది దేశ భాషలు కునారిల్లిపోవలసి
వచ్చింది. ప్రపంచీకరణ ఆ క్రమాన్ని మరింత వేగవంతం చేసింది. ఈ లోతుపాతులు పరిశీలించకుండా కేవలం ఉద్వేగంగానో ఆవేశంగానో మాతృభాష గురించి ఘోషించినంత మాత్రాన దాన్ని కాపాడుకోలేము. 65 ఏళ్లస్వాతంత్రానంతరం కూడా దేశంలో ఒక ప్రధాన భాషగా వున్న తెలుగుకు రక్షణ లేకపోవడానికి ఎవరిని నిందించాలి? రాజకీయ సామాజిక కోణాలు కారణాలు సవ్యంగా అర్థం చేసుకుంటేనే తెలుగుకు నిజంగా వెలుగు సిద్ధిస్తుంది. తెలుగు ప్రజలకూ వెలుగు వస్తుంది.
ఉత్పత్తి సాధనాలు,సామాజిక పరిస్తితులు మారినప్పుడల్లా భాష చర్చనీయం కావడం అసహజమేమీ కాదు.ప్రవాహం లాటి భాషలో ప్రమాణాలు ఎప్పుడూ సాపేక్షమే.అత్యధిక జనానికి అందుబాటులో వుండటం,అమోదయోగ్యంగా అభివృద్ధికి దోహదకారిగా వుండటం, ఆధునీకరణ అవకాశాలు వుండటం ఇవి భాషా విధానంలో కీలకాంశాలు. భాష ప్రాచీనతను కీర్తించడం ఎంత ముఖ్యమో ఆధునికత అవసరాన్ని ఆహ్వానించడం అంతకన్నా ముఖ్యం. తమిళుల వలె మనం తెలుగు భాష చరిత్రను తగినంతగా తవ్వితీయలేకపోయామంటే కారణం ఆదికవులను స్మరిస్తూ సోదికవులైన జానపదులను విస్మరించడమే. కందుకూరి వీరేశలింగం వంటి సంస్కర్త కూడా భాషా సంస్కరణఅవసరాన్ని గుర్తించడానికి చాలా కాలం పట్టింది.ఈ సమస్య ఇప్పటికైనా తొలగిపోయిందని చెప్పలేము.
ఏ ప్రపంచీకరణ ప్రభావమైతే తెలుగుతో సహా దేశ భాషలను అనుచితంగా దెబ్బ తీసిందో దాన్నే విముక్తి ప్రదాతగా చూసే మేధావులు ఒకవైపు.. జాను తెనుగు సంప్రదాయానికి బద్ద విరుద్ధమైన సంసృత సమాసాలే తెలుగు అనుకునే చాందసులు లేదా అమాయకులు మరో వైపు.. తెలుగులో సర్వం వుందనుకునే అవాస్తవిక వాదులు ఒక వైపు.. తెలుగులో ఏమీ లేదనే అజ్ఞానులు మరో వైపు భాషా పరిణామాన్ని సమాజంలో దాని స్థానాన్ని సవ్యంగా అర్థం చేసుకోలేకపోతున్నారు. మీడియా( ఇదీతెలుగు కాదు. కాని ప్రచార ప్రసార సాధనాలనడం కంటే మెరుగ్గా తె లుస్తుంది) లో ఎంతో పరవశంతో పాడే మాట్లాడే భాషలో నిజమైన తెలుగు పదాలు ఎన్నో లెక్కవేస్తే ఈ పెద్ద మనుషులు ఏమవుతారు?
భాషకు సంబంధించిన అనేకాంశాలు వివాదంగా వున్నా ఈ వ్యాసంలో రెండు విషయాలకు పరిమితమవుదాం. సాంకేతిక పదజాలం తప్ప తెలుగులో అన్ని విషయాలు చెప్పొచ్చుననే వాదన ఒకటి. తెలుగులో వ్యక్తీకరణ సాధ్యం కాదనే వాదన మరొకటి. ఇవి రెండూ పాక్షిక వాదనలే. కుటుంబ సంబంధాలు, ప్రేమానురాగాలు, వ్యక్తిగత భావాలు,వ్యవసాయ సమాజం నాటి అంశాలు వెల్లడించడానికి తెలుగు పదాలు సరిపోతాయి. కంప్యూటర్‌ వంటి సాంకేతిక పదాలు అలా వుంచి ఆధునిక భావాలైన ప్రజాస్వామ్య భావాలను వెల్లడించే చాలా పదాలు తెలుగులో వుండవు. ఎందుకంటే మన రాచరిక భూస్వామ్య సమాజాలు అగ్రవర్ణాలు అధమ వర్ణాలుగా విభజితమైనందున సమధర్మాన్ని పాటించలేదు. నమస్కారం ఆశీర్వాదం తప్ప ధాంక్స్‌, జెస్చర్స్‌, సారీవంటి జెస్చర్స్‌ వుండవు. అలాగే సంతకెళ్లడం దగ్గర ఆగిపోయిన కారణంగా పెట్టుబడిదారీ సంసృతి సృష్టించిన షాపింగ్‌ వంటి మార్కెట్‌ మాటలు వుండవు. సెమినార్‌, ఇంటర్‌ యాక్షన్‌ తదితర సమాలోచన పదాలు వెతకడం కష్టం. గుడ్‌ మార్నింగ్‌, గుడ్‌ ఈవెనింగ్‌ వంటి మాటలు అక్కడి వాతావరణం వచ్చినవంటే అర్థం చేసుకోవచ్చు గాని ఈ తరహా ప్రజాస్వామ్య పదాల విషయం వేరు. తరచూ చెప్పుకునేట్టుగా శాస్త్ర సాంకేతికాభివృద్ధికి సంబంధించిన మాటలూ వుండవు గనక మనమే సరైన దృష్టితో సృష్టించుకోవలసి వుంటుంది.ఆ ప్రయత్నమే సరిగ్గా జరగలేదు.
ఇన్నేళ్ల తర్వాత ఎవరైనా స్కూలు లేదా బడి అంటారు గాని పాఠశాల అంటున్నారా?హాస్పిటల్‌ నుంచి వచ్చిన ఆస్పత్రి అంటున్నారు గాని వైద్యశాల అంటారా?బస్సు రైలు రోడ్డు వంటి మాటలే గాక గేటు లాటి మాటలను కూడా ఎంత ధారాళంగా వాడేస్తున్నారు? ప్రమోషన్‌ను పదోన్నతి అంటే బాగుందా? ఆ మాట బాగున్నా వాడకంలోకి వస్తుందా? ప్రమోషన్‌ ఒక్కటే కుదిరినా రివర్షన్‌, ఇంక్రిమెంటు, సర్వీసు వంటి మాటల సంగతేమిటి? ఇదంతా సహజ సమస్యగా పరిగణించాలా? సెక్రటేరియట్‌ను సచివాలయం అంటే కొంతవరకూ వాడుతున్నారు.కాని దాని పక్కనే వున్న సెక్యూరిటీ ప్రెస్‌ను ప్రతిభూతి ముద్రణాలయం అనడం తెలుగా? ఇది ఒక కోణం.ఇక తెలుగులో సంతకం చేయడం కూడా రాక వేలిముద్రలు వేసే జనంకోట్లలో వుంటే ఇంగ్లీషు మీడియం ఒక్కసారిగా విజ్ఞానవేత్తలను చేస్తుందని చెప్పే మేధావుల మాటలెంత వరకూ సరైనవి? తెలుగు చదువులే రాని వారు ఇంగ్లీషులో అల్లుకుపోతారా? కంప్యూటర్‌ కు తెలుగు పదం వుండదు గాని ఇంటర్నెట్‌కు అంతర్జాలం అంటే ఆనందం ఏమిటి?
కనక తెలుగు వికాసం తగినంతగా జరగలేదంటే దానికి పాలనా పరమైన నిర్లక్ష్యం సామాజిక పరమైన సమస్యలు కూడా కారణాలుగా వున్నాయి. వాటిని సవివరంగా చర్చించుకుంటే ఫలితంవుంటుంది గాని వూరికే తెలుగు పాటలు పాడుకున్నంత మాత్రాన వెలుగులు పర్చుకోవు. తెలుగును కాపాడుకోవడం ఈ నాటి జనబాహుళ్యం మధ్యన జరగాలి గాని శ్రీకాకుళాంధ్ర దేవుడిని పూజించడం వల్ల కాదు. మాతృభాషలో పాలన విద్యార్జన ప్రజాస్వామిక అవసరం. ప్రజల భాషా వికాసం ఒక సాంసృతిక హక్కు.. ఈ క్రమంలో చర్చకు వచ్చే మాండలికాల సమస్య మరోసారి పరిశీలిద్దాం.

2 comments:

 1. రవి గారూ, ఈ వ్యాసం ప్రశ్నలతోనే ఆగిపోయింది. మీరన్న సామాజిక సమస్యలపై వివరంగా మరిన్ని వ్యాసాలు రాస్తారని ఆశిస్తున్నాను.

  వాటితో బాటు ఈ క్రింది విషయాలపై కూడా మీ ఆలోచనలు పంచుకోగలరు. (1) సామాన్య జనం నుండి తెలుగు వికాసం ఎలా జరగాలి లేదా అలాంటి వికాసాన్ని గుర్తించడం ఎలా? ఉదాహరణకు రోడ్డు, రైలు, బస్సు అన్నవి తెలుగు పదాలే (అయిపోయాయి) అని లాంఛనంగా గుర్తించాలా? (2) సరైన దృష్టితో మనమే పదాలను సృష్టించుకోవలసి ఉంటుంది అన్నారు. ఈ విషయమై వివరమైన సూచనలు. ఈనాడు తెలుగు వెలుగు, నడుస్తున్న చరిత్ర పత్రిక, ఆంధ్రభూమిలో నుడి శీర్షికన, జాలంలో తెలుగుపదం వంటి చోట్ల ఇప్పటికే పదాల కాయింపు ప్రక్రియ జరుగుతూంది. వీటిలో లోపాలూ మార్చుకోవాల్సిన అంశాలు. (3) "అనేకుల అవసరాలు కొద్దిమంది వాటికన్నా ముఖ్యమైనవి. తుదకు వాటిదే పై చేయి అయి తీరుతుంది" అని గురజాడ అన్నట్టుగా, అప్పటి వ్యావహారిక భాషోద్యమం తర్వాత ఇలాంటి పరిణామాలు జరిగాయా లేదా భవిష్యత్తులో వాటి తీరు ఎలా ఉండవచ్చు?

  ReplyDelete
 2. రవి గారూ, తెలుగు భాషకు సంభందించి చాలా సమస్యలను ప్రస్తావించారు, బావుంది. కొన్ని ఆంగ్ల పదాలకు తెలుగు పదాలు ఎందుకు లేవో కూడా చెప్పారు.

  తెలుగు భాషకు నేడు జాలాముఖంగా లభిస్తున్న ఆదరణకు నాకు చాలా సంతోషంగా వున్నా, ఈ మధ్యకాలంలో ఆంగ్ల సాంకేతిక పదాలకు మనవాళ్ళు పనిగట్టుకొని సృష్టిస్తున్న కొత్త కొత్త అనువాద పదాలు భాషను అనవసరంగా జఠిలపరిచి కొద్దో గొప్పో తెలుగు వచ్చిన వాళ్ళు కూడా భయపడిపోయి "ఈ వ్యాసం ఎక్కడైనా ఇంగ్లీషులో వుంటే చెబుదురూ!" అని అడిగే పరిస్ధితి ఏర్పడుతుంది. ఆ మధ్య నేను "తెలుగు భాషను ఇతర భాషల్లోకి యాంత్రికంగా అనువదించడంలో వున్న కష్టాలు" అన్న టాపిక్ మీద కొంతమంది వ్రాసిని పత్రాలను చదివినప్పుడు ఈ ఆటోమేటిక్ ట్రాన్సలేషన్ లో వున్న కష్టాల కంటే ఆ పత్రరచనలలో వందలకొద్దీ దొర్లించిన కఠినమైన అనువాద సాంకేతిక పదాలను అర్ధం చేసుకోవడమే కష్టమనిపించింది! మెషీన్ ట్రాన్సలేషన్ మీద నాకు ఆసక్తి వున్నా ఒక దశలో ఆ పత్రాలను చదవడం ఆపేయవలసి వచ్చింది. ఇటువంటి జటిలమైన కొత్త తెలుగు పదాలు కనిపెట్టే బదులు ఆ ఆంగ్ల సాంకేతిక పదాలకు కావాలంటే డు,ము,వు,లు తగిలించి వాడుకొంటే మనకొచ్చిన నష్టమేమిటో తెలియదు. వీరావేశంతో జరుగుతున్న ఈ సాంకేతిక పదానువాదాలు ఇలాగే కొనసాగితే ఇంకో రెండు మూడు సంవత్సరాలలో మన భాషను మనమే గుర్తు పట్టలేని పరిస్ధితి వస్తుందనడంలో సందేహంలేదు.

  ఇదిలా వుండగా 'ఆకాశం' లాంటి పదాలు సంస్కృతమనీ వీటికి 'నింగి' లాంటి తెలుగు పదాలను మాత్రమే వాడాలనీ, తెలుగు భాషలో ఇమిడిపోయిన సంస్కృత లేదా మరే ఇతర భాషా పదాలన్నింటినీ ఏరి పారేయాలనీ వాదించే మరి కొంతమంది భాషా హిట్లర్లు తయారయ్యారు! ఇలా ఏరుకొంటూ పోతే ఏభాషలోనైనా మిగిలేవి ఎన్ని పదాలు?

  గమనిక: ఈ వ్యాఖ్య ద్వారా ఎన్నో నెలలుగా నా మనసులో వున్న బాధను కొంతవరకు వెళ్ళబోసుకొన్నానే కానీ ఎవరినీ వ్యక్తిగతంగా కించపరచాలని కాదు. ఎవరు ఏం చేసినా తెలుగు భాషకు ఎంతో కొంత మేలు చేస్తున్నామన్న సదుద్దేశంతో చేస్తున్నవారే.

  ReplyDelete