నూతన ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్ రెడ్డి 39 మందితో పూర్తి చేసిన మంత్రివర్గ ఏర్పాటులో కాంగ్రెస్ రాజకీయ దృశ్యం యావత్తూ గోచరిస్తుంది. అసలు మంత్రివర్గం ఖరారుకు ఇంత సమయం తీసుకోవడంలోనూ, తర్వాత ఇంతమందికి చోటు కల్పించడంలోనూ కూడా ఇప్పటి అస్థిరత్వపు నీలినీడలు ఆధిపత్య క్రీడలూ అగుపిస్తాయి. ఈ ఏర్పాటుకు రెండు రోజుల ముందే కడప ఎంపి వైఎస్‌జగన్‌మోహన్ రెడ్డి తన తల్లి విజయ లక్ష్మితో సహా
పదవులకూ పార్టీకీ రాజినామా చేయడం ఈ ఘట్టాన్ని మరింత రక్తి కట్టించింది. ఆ రాజినామా పర్వం తర్వాత కూడా పెద్ద ప్రకంపనాలు లేకుండా మంత్రివర్గ ప్రమాణ స్వీకార ప్రక్రియను కానివ్వడం నూతన ముఖ్యమంత్రికి వూరట కలిగించే విషయమే. సహజంగానే కొన్ని అసమ్మతి స్వరాలు వినిపించినా సవాలు చేసే విధంగా లేకపోవడం, ఆ పైన జగన్ వైపు వారు నడవక పోవడం ఇంకా ప్రాధాన్యత గల విషయం. సహనం కట్టలు తెగితే ఉప్పెన అవుతుందనిజగన్ చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటే అలాటి రాజకీయ ఉప్పెన లేదా దాని తాలూకూ సూచికలు ప్రస్తుతానికి కనిపించలేదు.
జగన్ రాజినామాను ప్రకటించేందుకు ఎంచుకున్న సమయం చాలా కీలకమైంది. మంత్రివర్గంలో తన అనుయాయులకు స్థానం కల్పించబోరన్నది ముందే తేలిపోయింది. కనక జాబితా ప్రకటన తర్వాత వైదొలగితే పదవులు రానందుకు వెళ్లారన్న ఆరోపణ అనివార్యంగా ఎదురవుతుంది. దాంతోపాటే కిరణ్ కుమార్ సాఫీగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నట్టు కనిపిస్తుంది. ఈ రెంటినీ తప్పించుకోవడానికే వ్యూహాత్మకంగానూ హఠాత్తుగానూ జగన్ రాజినామా ప్రకటించారు. విచిత్రమేమంటే ఆ రోజు ఉదయం ఆయన లేఖ మీడియాకు అందిన తర్వాత కూడా ఆయన శిబిరంలోనే ముఖ్యులైన కొందరు అదంతా బూటకమని కొట్టిపారేస్తూ మాట్లాడుతుండటం! ఈ సందర్భంగా సోనియా గాంధీకి ఆగ్రహావేశాలతో అసహనంతో రాసిన అయిదు పేజీల లేఖలో అరవాక్యమైనా ఆంధ్ర ప్రదేశ్ ప్రజల గురించిన ప్రస్తావన లేకపోవడం యాదృచ్చికం కాదు.తమ కుటుంబాన్ని అవమానించడం, తమకు గౌరవం ఇవ్వక పోవడం వంటి విషయాలపైనే ఆయన దృష్టి యావత్తూ కేంద్రీకృతమైంది. అంటే ఆయన ఆగ్రహం రాజకీయ వారసత్వం దక్కకపోవడంనుంచే ఉత్పన్నమైందనడానికి ఇదొక సూచిక. తాను తన తల్లి రాజినామాలు చేస్తూ తన వారెవరినీ రాజినామా చేయొద్దని చెప్పడంలో కూడా వ్యూహం వుండొచ్చు. ఆ విధంగా మొదటే ముఖాముఖి ఘర్షణను ఆహ్వానిస్తే తనతో నిలబడేవారెందరో ఎక్కువో తక్కువో తేలిపోతుంది. తద్వారా వున్న పరిమిత ప్రభావం కూడా పలచబడవచ్చు.కడప, పులివెందుల నియోజకవర్గాల ఉప ఎన్నికలలో విజయం సాధించడం ద్వారా రాష్ట్ర రాజకీయాలలో ఒక పునాది సృష్టించుకోవాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తుంది. అయితే రాజినామా ప్రకటన తర్వాత మంత్రివర్గ ఏర్పాటు తర్వాత కూడా ఆ శిబిరం ఆశించిన స్థాయిలో స్పందన రాలేదని ఎవరైనా చెప్పగలరు. తమకు జనంలో మద్దతు వుందని ఇప్పటికీ జగన్ వర్గం చెబుతున్నా దానికి కొలబద్దలేమీ లేవు. అది శాశ్వతంగా అలాగే వుంటుందా, కాంగ్రెస్‌లో వుండగా కలిగించిన ప్రభావం బయిటకు నడిచిన తర్వాత కొనసాగుతుందా అనేవి నిరాధారమైన ప్రశ్నలు కావు.
కాంగ్రెస్ గత చరిత్రను పరిశీలిస్తే చెన్నారెడ్డి ఒకసారి తెలంగాణా ప్రజాసమితి పేరిట మరోసారి నేషనల్ డెమోక్రటిక్ పార్టీ పేరిట బయిటకు వెళ్లి మళ్లీ వచ్చిన ఉదంతాల వంటివి చాలా వున్నాయి. జాతీయ స్తాయిలోనూ ప్రణబ్ ముఖర్జీ తదితరులు స్వంతంగా పార్టీని పెట్టుకుని తిరిగి వచ్చిన ఉదాహరణలున్నాయి. ఇందుకు భిన్నంగా విపిసింగ్ వంటివారు అవినీతి సమస్యపైన, జగ్జీవన్ రామ్ ప్రజాస్వామ్య సమస్యపైన బయిటకు రావడం పెను మార్పులకు దోహదపడింది. శరద్ పవార్,మమతా బెనర్జీ దీర్ఘ కాలం పాటు కీలక బాధ్యతలు నిర్వహించి ప్రాంతీయ పార్టీలు ఏర్పర్చుకుని ప్రాబల్యం పెంచుకున్నారు గాని జూనియర్ భాగస్వాములగానే దీర్ఘకాలం వుండాల్సి వచ్చింది. ఈ అనుభవాలన్ని గమనించకుండా పార్టీపై అధిష్టానంపై తిరుగుబాటు చేశారు గనక గొప్పవాళ్లయిపోతారన్న అంచనాలు అతిశయోక్తులు మాత్రమే. ఎప్పడైనా ఎక్కడైనా విధానాలతో నిమిత్తం లేని ప్రజలతో సంబంధం లేని రాజకీయ తిరుగుబాట్లను వ్యక్తిగతంగానే పరిగణించాల్సి వుంటుంది.వాటివల్ల జనానికి పెద్దగా ఒరిగేది కూడా శూన్యం.
ఈ వ్యవహారంలో వైఎస్ వివేకానంద రెడ్డి సోనియాను కలిసి విధేతయ ప్రకటించడం, మంత్రివర్గంలో చోటు సంపాదించడం మహాపరాధాలన్నది జగన్ వర్గం వాదనగా వుంది.కుటుంబాన్ని చీల్చడంపై దుమారం లేవనెత్తేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.అయితే రాజకీయ విధానాలు ప్రజా సమస్యలతో సంబంధం లేకుండా వ్యక్తిగత విధేయతలు, కుటుంబ విభజనల చుట్టూ చర్చను తిప్పడం ప్రజాస్వామ్యాన్ని పటిష్టపరచేది కాదు. వారి వారి స్వప్రయోజనాలు పదవీ అవకాశాలను బట్టి పాలకవర్గ నేతలు నిర్ణయాలు తీసుకుంటుంటారు. జగన్ ముఖ్యమంత్రి కావాలనుకోవడం ఎలాటిదో వివేకానంద మంత్రి కావాలనుకోవడం కూడా అలాటిదే. కనక ఇందులో ఎవరు తప్పు ఒప్పు అన్న మీమాంస అర్థం లేనిది. దీన్ని రాష్ట్ర రాజకీయాలలో పెను వివాదంలా చిత్రించడంలోనూ వాస్తవికత లేదు. కాకపోతే జగన్‌పై తానుగా నేరుగా చర్య తీసుకోకుండా ఆయన తనుగానే బయిటకు వెళ్లేలా చేయడంలో కాంగ్రెస్ అధిష్టానం కృతకృత్యమైంది. ఆపైన ఆయన కుటుంబంలో ఒక కీలక వ్యక్తిగా అనేక ప్రజా ప్రాతినిధ్యాలు నిర్వహించిన వివేకాను కూడా తన వైపు తిప్పుకోవడంలోనూ వ్యూహాత్మకంగానే వ్యవహరించింది. దీని ప్రభావం తెలుసుగనకే ఒకటికి రెండు సార్లు ఆయనతో చర్చలు జరిపి తమ వైపు తిప్పుకోవడానికి విఫల యత్నాలు జరిగాయి. పార్టీ చెబితే పులివెందులలోనైనా పోటీ చేస్తానని చెప్పడం ద్వారా వివేకా కూడా బలమైన సమాధానమే ఇచ్చారు. ఇప్పుడు ఆయనతో పాటు మొదటి నుంచి ఆ కుటుంబానికి మింగుడు పడని డి.ఎల్.రవీంద్రారెడ్డికి కూడా క్యాబినెట్‌లో చోటు కల్పించారు గనక కడప రాజకీయం రసవత్తర రణక్షేత్రంగా మారవచ్చు.ఈ మొత్తం కుటుంబ వారసత్వ వివాదంలో విస్త్రత ప్రజానీకానికి సంబంధించిన అంశాలు మచ్చుకైనా లేవని గుర్తుంచుకోవాలి.
ఇదే సమయంలో ప్రాంతీయ వాదాలను నినాదాలను కూడా ముందుకు తేవడానికి కొందరు ప్రయత్నాలు చేయడం మరో ప్రహసనం. జగన్ వర్గంలో అగ్రభాగాన వున్న కొండా సురేఖ తెలంగాణా కాంగ్రెస్ వాదులు మంత్రి పదవి తీసుకోరాదన్న వాదన లేవనెత్తారు. టిఆర్‌ఎస్ పైనా ఆమె ధ్వజమెత్తారు. కాగా మంత్రివర్గంలో ఆయా ప్రాంతీయ సంఘాలకు సారథులుగా వున్న వారితో సహా అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం పెంచారన్నది పాలక పక్ష సమర్థనగా వుంది. సమస్య ఏమంటే వివిధ ప్రాంతాలలో వివిధ రాగాలు వినిపించే వారంతా అధికారాన్ని పంచుకోవడంలో అధిష్టానానికి విధేయులగా వుండటం, బయిట ప్రజలలో మాత్రం వివాదాల బీజాలు నాటడం.గతంలో రోశయ్య మంత్రివర్గం కూడా ప్రాంతాల వారీగా విడిపోయి అసలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అస్తిత్వాన్నే ప్రశ్నార్థకం చేసింది. మరి వీరందరినీ చేర్చుకున్న కిరణ్ కుమార్ అయినా ఆ దుస్తితి పునరావృతం కాకుండా చూడగలరా అన్నది ప్రశ్నార్థకమే.అలాగే పదవులు వచ్చిన వారందరినీ ప్రాంతాల వారిగా సామాజిక వర్గాల వారిగా క్రోడీకరించి చూడటం ఇందులో న్యాయా న్యాయాల నిష్పత్తి గురించి అతిగా చెప్పడం కూడా పాక్షిక పరిశీలనే అవుతుంది. సామాజిక న్యాయ కోణంలో ఇది ఒక భాగమే తప్ప పదవుల పంపకాలే పరమార్థమనుకోరాదు.ఏది ఏమైనా ఈ మంత్రివర్గ సభ్యులెవరూ ప్రాంతాల వారి ప్రతిధ్వనులు వినిపిస్తే ప్రజాస్వామ్య సూత్రాలు అపహాస్యం పాలవుతాయి. అధిష్టానం కూడా ఆ సంగతి గుర్తు పెట్టుకొని రాష్ట్ర భవిష్యత్తుపై దాగుడు మూతలు మాని పారదర్శకమైన ప్రజాస్వామిక విధానాన్ని ప్రకటించి ప్రశాంతతకు దోహదం చేయాలి.
మంత్రివర్గ పొందికను పరిశీలిస్తే కళంకితులు, అలంకృతులను పక్కనపెట్టి పని చేసే వారికి చోటు కల్పించాలన్న సూచన అరణ్య ఘోషగానే మిగిలిపోయింది.తీవ్రమైన ఆరోపణల వూబిలో చిక్కిన వారు కూడా మళ్లీ పాగా వేయగలిగారు. మరోవైపున గతంలో చోటు చిక్కని హేమాహేమీలు కూడా జెసి దివాకరరెడ్డి వంటివారిని మినహాయిస్తే స్థానం సంపాదించుకున్నారు.వీరిలో తొంభై శాతం మంది ముఖ్యమంత్రితో సహా వైఎస్ అనుయాయులే కాగా ఆ దశలో పక్కన పెట్టిన వారిలోనూ కొందరు తిరిగి ప్రవేశించగలిగారు. మంత్రివర్గ ఏర్పాటు ముఖ్యమంత్రి అభీష్టం అని లాంఛనంగా అంటున్నా అధిష్టానం అదేశానుసారమే అంతా జరుగుతుందని అందరికీ తెలుసు. కనక ఈ మొత్తం కసరత్తులో ఎలాగైనా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలనే తాపత్రయం తేటతెల్లమవుతుంది. ఈ విస్త్రత ఏర్పాటు ఒక విధంగా కిరణ్ కుమార్ సవాళ్లను సరళతరం చేయొచ్చునేమో గాని మటుమాయం చేయదు.ఎందుకంటే అస్తిరత్వానికి అనిశ్చితికి మూలాలు విధానాల్లో వున్నాయి గనక విన్యాసాలతోనే అవి తొలగిపోవడం అసాధ్యం. అన్నిటికన్నా ముఖ్యంగా వరుసగా ఆందోళనల్లో మునిగివున్న వివిధ తరగతుల ప్రజల సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టడం ముఖ్యమంత్రి పరిధిలోనే వుంటుంది.దీనికి అధిష్టానం అనుమతి ఆదేశాలు అవసరం లేదు. ప్రాంతాల వారీ తేడాలు కూడా ఇందుకు అడ్డంకి కావు.కొత్త నేత ఆ దిశలో అడుగులు వేస్తారా లేదా అనేది వేచి చూడవలసిన విషయం.
ప్రస్తుత పరిస్థితి పట్ల వివిధ రాజకీయ పక్షాల ప్రతిస్పందన చూస్తే ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం వేచి చూసే వైఖరిని అనుసరిస్తున్నట్టు కనిపిస్తుంది. సంఖ్యాబలాలు, జగన్ భవిష్యత్తు వ్యూహాలు చూడాలన్న ఆలోచన ఇందుకు కారణం కావచ్చు. గతంలో రెండు సార్లు కాంగ్రెస్‌తో రాజకీయ అవగాహనకు సిద్ధమైన ప్రజారాజ్యం ఈ సమయంలో కూడా సంక్షోభం తలెత్తితే సాయపడే విషయం ఆలోచిస్తామంటున్నది. మొదట్టో మంత్రివర్గంలో చేరిక వరకూ పయనించి పునరాలోచనలో పడినట్టు చెబుతున్నారు. జగన్ రాజినామా తర్వాత పాలకపక్షంతో రాజకీయ బేరసారాలకు అవకాశం పెరిగిందన్న ఆలోచన, పదవులు తీసుకుంటే రాని ఎంఎల్‌ఎలు ఏమవుతారోనన్న ఆందోళన ఇందుకు కారణమంటున్నారు. టిఆర్‌ఎస్ నేతలు కూడా ప్రస్తుత పరిస్థితిపై పరిపరి విధాల వ్యాఖ్యలు చేశారు. తమ ప్రధాన కోర్కె అయిన రాష్ట్ర ఏర్పాటుపై బిల్లు ఆమోదిస్తే ప్రభుత్వాన్ని ఆదుకోగలమన్నట్టు ఒకవైపు మధ్యంతర ఎన్నికలు వస్తే ఇక్కడున్న 119 స్థానాల్లో ఎక్కువభాగం వశపర్చుకోగలమన్నట్టు మరో వైపు ప్రకటిస్తున్నారు కాంగ్రెస్ చేతులను బలోపేతం చేస్తామని చెప్పిన కెసిఆర్ రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు సిద్దమవుతారా అన్న ప్రశ్న వెన్నాడుతున్నది.మధ్యంతర ఎన్నికల పరిస్తితే వస్తే ఎవరి బలం ఎలాగైనా వుండొచ్చు గాని ప్రస్తుతం ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న ఆలోచన ఎవరూ వ్యక్తం చేయడం లేదు. జగన్ వర్గం కూడా కూల్చివేత ఉద్దేశం లేదంటున్నది. ఇది శక్తిలేక కలిగినా యుక్తి వల్లనూ కావచ్చు. సిపిఎం వరకూ ఈ పరిణామం కాంగ్రెస్ అంతర్గత కలహాలకు అద్దం పడుతుందని స్పష్టం చేసింది. కొత్తగా వచ్చిన ప్రభుత్వమైనా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని గట్టిగా కోరింది. ఆ దిశలో కిరణ్‌కుమార్ ఏం చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
Ravi Gaaru, mee visleshana chalaa bhaagumtaayi, pratyekamga. morning TV programme on News analysis chalaa bhagumtumdi.
ReplyDeleteI need help from you, Can you please tell me where can I get Telugu version of Indian Constitution.(Digital version or printed)
Thank you
Thank you. Asia Law House,HYD WARU N.K.Acharya anuvadinchina rajyanga prachurincharu. iratara kuda konni ynnayi. choodandi.VARI PHONE NUMBER 040 24742324
ReplyDeleteరవిగారూ నమస్తే,
ReplyDeleteదూకుడు ప్రదర్సిస్తాడని సీమ రెడ్డి ని సీయం ను చేస్తే అన్ని విషయాల్లోనూ రాజీ పడి ఉత్తరకుమారుడిగానే మిగిలిపోయాడు .వట్టి లాంటి చిల్లరదొంగలకు కూడా భయపడితే రాజ్యం ఎలా నడపగలడు?జగన్ సెంట్రిక్ రాజకీయాలతో పరిపాలన చేయడం సాధ్యమా ?అధిష్టానం రెడ్డి కులానికి దాశోహం అయ్యింది అన్నది సుష్పస్టం.2009 లో రాశేరె కు నియంత్రణ లేని అధికారమిచ్చిన అధిష్టానం రెడ్డి వర్గానికి దాసోహం అయి తప్పు చేసిందా? కాలమే నిర్ణయించాలి .
Thank you sir
ReplyDeletek.Dayalan