Pages

Saturday, August 27, 2011

ప్రజాస్వామిక విజయం



అన్నా హజారే నిరాహార దీక్షతో లేవనెత్తిన కోర్కెలకు పార్లమెంటు ఆమోదం తెల్పడం ప్రజాస్వామిక విజయం. ప్రజల విజయం. అయితే పటిష్టమైన బలిష్టమైన లోక్‌పాల్‌ బిల్లు చట్టంగా మారేంత వరకూ ఈ పోరాటం పూర్తయినట్టు కాదు.సగమే సాధించినట్టు భావించాలని అన్నా స్వయంగా చెప్పడంలో ఆంతర్యం అదే. అన్నా మొదటి సారి దీక్ష చేసినపుడు చాలా గౌరవంగా స్పందించిన కేంద్రం తీరా ఆయన గట్టిగా నిలళబడే సరికి రెండవ సారి నిజ స్వరూపం చూపింది.అరెస్టు చేసి అప్రజాస్వామిక స్వభావం వెల్లడించుకుంది. తర్వాత కూడా ఈ విషయంలో వ్యక్తిగతంగా మన్మోహన్‌ సింగ్‌, ఆయన ప్రభుత్వం కూడా విపరీతమైన తత్తరబాటు తడబాటు
ప్రదర్శిస్తూ తప్పుమీద తప్పు చేశారు. ఎన్ని భిన్న సంకేతాలు ఇచ్చారో వారికే తెలుసు. అఖిలపక్ష సమావేశం తర్వాత రాహుల్‌ గాంధీ మాట్లాడినప్పుడు కూడా అదే ధోరణి కొనసాగింది.పార్లమెంటు ముందున్న బిల్లులో లోపాలను ఎత్తిచూపడం దాని సార్వభౌమత్వాన్ని కించపర్చడమనే వాదన పొరబాటు. ఈ అరవై ఏళ్లలోనూ అనేక ప్రజా వ్యతిరేక అప్రజాస్వామిక శాసనాలను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తూనే వచ్చాయి.ముందుగానే ఉద్యమాలు కూడా నిర్మించాయి. కార్మిక సంఘాల వత్తిడి వల్ల అనేక బిల్లులు వెనక్కు పోయాయి కూడా.తమ బిల్లులోని విషయాలను లోక్‌సభ చర్చించాలని ఆయన పట్టుపట్టడం తప్పేమీ కాదు. దాన్నే అమోదించాలని గడువు పెట్టడం ఆచరణ సాధ్యమా కాదా అన్న ప్రశ్నను మినహాయిస్తే అన్నా చేసిన దానిలో అభ్యంతరకరమైందేమీ లేదు. ఆయనే వూహించినదానికన్నా ఎక్కువ స్పందన వచ్చినపుడు ప్రతిస్పందనలో కాస్త గజిబిజి వుండటం సహజమే. అన్నా హజారే బృందంలోనే విభేదాలు వ్యక్తం కావడానికి,కొన్ని విమర్శలు రావడానికి అదే కారణం. అయితే మౌలికంగా ఆయన కోర్కెటను గౌరవించాలనే అందరూ చెప్పారు. ఇప్పుడు ఆ చర్చ ఏ రూపంలో ఎప్పుడు జరుగుతుందో చూడాలి. ఆసంగతి అలా వుంచితే అన్నా ప్రతిపాదనల్లో కూడా కార్పొరేట్‌ అక్రమాల ప్రస్తావన లేదు.
1.ఇప్పటికి బయిటపడిన లక్షల కోట్ల కుంభకోణాల్లో వాటిదే పెద్దపాత్ర. ఇప్పుడున్న 1988 అవినీతి నిరోధక చట్టంలో కంపెనీలను వ్యక్తులుగా చూసి వాటికి కలిగిన లాభాన్ని అనుచితంగా పరిగణించే అవకాశం లేదు.కేవలం వ్యక్తులను నేరుగా లంచం లేదా అక్రమ చెల్లింపులు జరిగితేనే నేరం. దాన్ని మార్చకుండా అవినీతిని అరికట్టడం సాధ్యం కాదు.
2.పార్లమెంటు సభ్యులకు రక్షణ కల్పించే 105వ నిబంధనను మార్చడం అవసరం.అప్పుడే వారి నిర్వాకాలను విచారించడం సాధ్యమవుతుంది.
3.న్యాయ సంస్కరణలు, ఎన్నికల సంస్కరణలు, పాలనా సంస్కరణలు మూడు కలిస్తేనే అవినీతి నిరోధంలో ఫలితాలు సాధ్యం.
రేపటి చర్చలో అలాటి సమగ్ర వైఖరి తీసుకుంటారని ఆశించాలి. అన్నా దీక్ష ప్రజాస్వామిక అందోళనల పట్ల గౌరవం పెంచింది.ఆయనకు అభినందనలు.

4 comments:

  1. అన్నా ప్రతిపాదనల్లో కూడా కార్పొరేట్‌ అక్రమాల ప్రస్తావన లేదు.
    -------
    రాజకీయ సపోర్ట్ లేకుండా కార్పొరేట్‌ అక్రమాలు జరగవని భావిస్తాను. రాజకీయ పరిస్థుతులను సరిచేస్తే కార్పొరేట్‌ అక్రమాలు చాలావరకు సరిచేసినట్లే కదా. థాంక్స్ ఫర్ ది పోస్ట్.

    ReplyDelete
  2. అన్నీ అన్నానే చేయాలంటే ఎలా?! తప్పులెతకడంలో వామ పచ్చాలను మించిన పార్టీలు ఇహలో కలవే?!

    అవినీతి కాంగ్రెస్ తో అవసరార్థం జతకట్టే వామపక్షాలు కూడా ఉద్యమాలు చేయొచ్చుగా, మాయాబజార్లో వంగర లా 'అది లేదు, ఇదిలేదు , అసలైనది ఆంధ్ర శాకము లేదు' అని వంకలు పెట్టకపోతే!? :P

    రవి గారు, అరుంధతి రాయ్ అన్నా మీద నోరుపారేసుకోవడం పై ఓ పోస్ట్ రాయరూ. ఆవిడ అన్నా కాదట, ఎవరు అవమన్నారో! పులిని చూచి కుక్క వాత పెట్టుకున్నట్టనిపించింది. :D

    ReplyDelete
  3. మీ వ్యాసంలో చివరి వాక్యాలు నిజమే... బాగుంది, ఒప్పుకుంటాను.
    "That's one small step for man; one giant leap for mankind." అన్నట్టు, అన్నా హజారే కష్టపడి ససేమిరా అంటున్న గాడిదను చెరువు దాకా లాక్కెళ్ళారు, నీళ్ళు కూడా ఆయనో, ఆయన వారసులో తాగిస్తారనే ఆశిద్దాము.

    హజారే మీద మీ మొదటి ఆర్టికల్‌లో వున్న పార్టీ పరమైన వ్యతిరేకత బాగా సడలినట్టు నాకనిపించింది.. :) ఏమంటారు?

    ReplyDelete
  4. శంకర్‌,


    మొదటి వ్యాసానికి తర్వాతకు తేడా ప్రభుత్వ నిర్వాకం వల్ల వచ్చింది. ప్రజల స్పందనను బట్టి వచ్చింది. ప్రభుత్వం ఘొరంగా తప్పుచేసింది. దాన్ని ఖండిచాల్సిందే. ప్రజలు బాగా స్పందించడాన్ని ఆహ్వానించాల్సిందే. ఇవి రెండూ అన్నాతో ముడిపడి వున్నవే. గనక మీకు తేడా కనిపించవచ్చు. అది నా వాస్తవికతను కూడా చెబుతుంది. ఇకపోతే అన్నా బృందం కూడా అనేక సమస్యలను విమర్శలను ఎదుర్కొంది. ఆ మేరకు అనేక మార్పులు చేసుకుంది.ఏతావాతా సమస్యలను పరిస్థితులను బట్టి స్పందించడం తప్ప వ్యక్తులను బట్టి కాదు. అన్నా ఉద్యమానికి అనేక ప్రత్యేకతలు వున్నట్టే అనేక పరిమితులు కూడా వున్నాయని ఇప్పుడూ చెబుతాను భవిష్యత్తులో ఇంకా అనేక కోణాలు చూస్తాము.
    నేను కొంతమంది వ్యాఖ్యలకు స్పందించడం మానేశాను. తప్పనిసరై తీసేస్తున్నాను కూడా.వారు రాసే తీరు అందుకు కారణం. మీ విషయంలో అలా చేయాలనుకోవడం లేదు. అయితే మీ ప్రయోగాలు కూడా ఎబ్బెట్టుగా వుంటున్నాయి. మనం మాట్లాడుకోవలసిన అవసరం వుందని మీరు భావిస్తే ఇలాటివి దొర్లకుండా చూడండి.ఎందుకంటే ఆరోపణలకు, అపహాస్యాలకు బ్లాగులే అవసరం లేదు.

    ReplyDelete