Pages

Tuesday, December 25, 2012

మూడో మోడీత్వం .


గుజరాత్‌, హిమచల్‌ ప్రదేశ్‌ శాసనసభల ఎన్నికల ఫలితాలు బిజెపి బులపాటాాలకు సమాధానాలు. ప్రత్యేకించి గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ చుట్టూ కార్పొరేట్‌ మీడియా సహాయంతో కాషాయ దళాలు సృష్టించిన కాల్పనిక భ్రమలు తొలగిపోవడానికి కూడా దారితీసేవిగా వున్నాయి. సంఘ పరివార్‌ ప్రత్యక్ష ప్రతినిధిగా ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన తొలి నేత మోడీ ఆ సిద్ధాంతాలను ఆచరణలో అమలు చేసి అల్లకల్లోలానికి కారకులైనారు. ఇప్పుడేమో ఆ విషయాలన్ని మర్చిపోయి అభివృద్ధినే చూడమని ఆయన చెప్పడం దానికి మేధావులు పారిశ్రామిక వేత్తలనబడేవారంతా వంత పాడటం మహా విచిత్ర దృశ్యంగా గోచరిస్తుంది. ప్రపంచీకరణకు మత మార్కెట్‌ తత్వాలు రెండు ముఖాలనుకుంటే అవి అక్షరాలా మూర్తీభవించిన కాషాయ కరోడా మోడీ. మూడోసారి ఆయన గుజరాత్‌లో సాధించిన విజయం ఎన్నికల ప్రమాణాల రీత్యా ఘనమే అయినా సాగిన ప్రచారాలు అంతులేని అతిశయోక్తులతో పోలిస్తే అంత కాదు! నాలుగు వందల ఏళ్లకిందట బాబర్‌ హయాంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని చెప్పేవారు గుజరాత్‌కు వచ్చేసరికి మాత్రం పదేళ్ల కిందటి మారణకాండను మర్చిపొమ్మన్నారు. కొన్ని సర్వేలైతే ఏకంగా 140 వరకూ వచ్చేస్తాయని జోస్యాలు చెప్పాయి. చివరకు అతిశయోక్తులన్నీ అవాస్తవాలుగా తేలిపోయి.ఆయన పరిమితులేమిటో స్పష్టమైంది.
బడా మీడియా ఎంతగా కీర్తిస్తున్నా న్యాయస్థానాల్లోనూ పౌర సమాజంలోనూ మోడీకి ఎదురు దెబ్బలు తగులుతూనే వచ్చాయి. ఈ పదేళ్లలో ఒక్కసారి కూడా ఆయన జరిగిన దానికి విచారం వెలిబుచ్చిన దాఖలాలు లేకపోగా పరోక్షంగా అహంభావం ప్రదర్శిస్తూ వచ్చారు. ఈ కారణంగానే ి మోడీని మొదటి నుంచి అభద్రత వెన్నాడుతూనే వచ్చింది. ఆఖరి నిముషంలో వచ్చిన నరహరి అమీన్‌ వంటి కాంగ్రెస్‌ వాదులను కూడా పిలిచి పీట వేశారందుకే. మైనారిటీల పట్ల ఆయన అనుచిత వైఖరి తీసుకోవడమనేదే గాక
స్వంత పార్టీ వారు కూడా సహించలేనంత నిరంకుశంగా ప్రవర్తించారు. ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు, ఆరుగురు మాజీ మంత్రులు ఆయనతో వేగలేక నిష్క్రమించారు. అద్వానీ సుష్మా స్వరాజ్‌లతో సహా అగ్రనేతలందరూ ఆయనను ఆశీర్వదించినట్టుగా ఆమోదించిన తర్వాతే అక్కడ అడుగుపెట్టగలిగారు.విహెచ్‌పి నేతలు కూడా తన ఏకపక్ష వైఖరిని సహించలేక ప్రత్యర్థులను బలపర్చారు. ఇదంతా మోడీ వ్యక్తిగత లక్షణమా లేక బిజెపి ఆరెస్సెస్‌ విధాన ఫలితమా అంటే రెండూ వుంటాయి. అధికారం ప్రధానంగా దేనికైనా పాల్పడ్డమే సంఘ పరివార్‌ ఏకైకసూత్రం. దానికోసం ఎవరికి సేవ చేయడానికైనా ఎవరిపై దౌర్జన్యం సాగించడానికైనా వారు సిద్ధపడిపోతారు. హిట్లర్‌ నుంచి థాకరే వరకూ అనుసరించిన వేదవాక్యమూ అదే. దానికి ప్రతిరూపం వంటి మోడీ కూడా ముస్లింలనూ రాజకీయ ప్రత్యర్థులనూ నచ్చని అధికారులనూ వెంటాడి వేధిస్తూనే కార్పొరేట్‌ ప్రపంచానికి ఎర్రతివాచీ పర్చి ఆహ్వానిస్తూ వచ్చారు. వారి చేతుల్లోని మీడియాను మచ్చిక చేసుకోవడానికి అహౌరాత్రాలు తంటాలు పడ్డారు. 2002 ఘటనల తర్వాత కొన్నేళ్లపాటు మీడియాకు దూరంగా మెలుగుతూ టీవీ షోల మధ్య నుంచి లేచిపోయిన మోడీ తానే ఒక షోమాన్‌గా మారి నమో టీవీని ప్రారంభించారు. ఈ మతమార్కెట్‌తత్వాల మేళవింపుగానే దేశ విదేశీ కార్పొరేట్ల ఆమోదం పొందగలిగారు. వీసా ఇవ్వం పొమ్మన్న దేశాలన్ని ఇతనే మన ముద్దుబిడ్డ అని పసిగట్టాయి. కనకనే ఆయనను అసాధారణ పాలనా దక్షుడిగా అభివృద్ధికి మారుపేరుగా చిత్రించే ప్రక్రియ పెద్ద ఎత్తున సాగింది.అయిదు సార్లు వరుసగా గెలిచిన జ్యోతిబాసు గాని, తర్వాత మరో రెండు సార్లు విజయం సాధించిన బుద్ధదేవ్‌ భట్టాచార్య ప్రభుత్వం గాని కేవలం బెంగాల్‌ లక్షణాలే అన్నారు తప్ప ప్రత్యామ్నాయంగా ప్రజలముందుంచిన పాపాన పోలేదు.ఆ జ్యోతిబాసును ప్రధానిని చేయాలని తక్కిన పార్టీలన్నీ ప్రతిపాదించిన రోజున కూడా పాక్షికంగానే వ్యవహరించాయి.జ్యోతిబాసుతో పోలిస్తే మోడీ విజయాలు ఏ మూలకూ నిలవవని, ఆఖరుకు మూడు సార్లు ముఖ్యమంత్రులైన నవీన్‌ పట్నాయక్‌, షీలా దీక్షిత్‌ల ముందు కూడా దిగదుడుపేనని లెక్కలు చెబుతున్నాయి.కనకే ఇదంతా ఒక కాల్పనిక ప్రచారం.
మోడీకి కార్పొరేట్‌ జగత్తు ఎంత ప్రచారమిచ్చినా గుజరాత్‌ వెలుపల ఆయనను ఆమోదయోగ్యత లేదు గనకే యుపిలో ప్రచారానికి రాలేదు.బీహార్‌కు నితిష్‌ కుమార్‌ రానివ్వలేదు. వామపక్ష ప్రాధాన్యత గల రాష్ట్రాలతో పాటు ఈ రెండు రాష్ట్రాలను ఒరిస్సా కర్ణాటక తప్ప తక్కిన దక్షిణాది రాష్ట్రాలను మినహాయిస్తే ఇంకా ఎక్కడ అఖిలభారత ఆమోదయోగ్యత? బిజెపిలోనే ఇప్పటికీ దీనిపై స్పష్టత లేకపోగా తగాదాలు సాగుతున్నాయి.ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కినట్టు గుజరాత్‌ ముఖ్యమంత్రిత్వం కోసమే ఇంత సమరం అవసరమైతే ఆయన ప్రధాని అయిపోయినట్టే మాట్టాడ్డం ఎంత హాస్యాస్పదం? ఈ సారి కాంగ్రెసేతర బిజెపియేతర ప్రధాని అవుతాడని అద్వానీ వాకృచ్చడం వెనక నేపథ్యమేమిటి? మోడీ విజయం ఘనమైందైనా తనదైనందన్నా దాంతోనే దేశ రాజకీయాలు తలకిందులై పోవు. హిమచల్‌ ప్రదేశ్‌ పరాజయాన్ని కూడా కలిపి చూస్తేే బిజెపికి సగమే సంబరం మిగులుతుంది. పైగా ఈ రెండు ఫలితాలను బట్టి కాంగ్రెస్‌ బిజెపిలు పరస్పరం ప్రత్యామ్నాయాలు కాదని తేలిపోతున్నది. ఈ రెండూ దెబ్బతింటున్న పరిస్థితుల్లో ఎందుకు చెప్పినా ఆద్వానీ జోస్యమే నిజమయ్యే అవకాశాలు వుంటాయి. అయితే అది లౌకిక ప్రాంతీయ పార్టీలు ప్రదర్శించే విజ్ఞతపై ఆధారపడి వుంటుంది.

No comments:

Post a Comment