Pages

Monday, May 2, 2011

లాడెన్‌ హతమైతేనే ఉగ్రవాదం ఖతం కాదు





బిన్‌లాడెన్‌ను హతమార్చినట్టు అమెరికా అద్యక్షుడు ఒబామా అధికారికంగా ప్రకటించారు. ఆ దేశ ప్రజలు ఆనందోత్సవాలు చేసుకుంటున్నట్టు కనిపిస్తుంది. భారత ప్రభుత్వం కూడా దీనిపై సానుకూలంగా స్పందించింది. ప్రపంచంలో ఉగ్రవాదాన్ని వ్యవస్థీకృతం చేసి దేశ దేశాలలో అనేక మారణహౌమాలకు కారణమైన లాడెన్‌ మృతి నిస్సందేహంగా ముఖ్య ఘటనే. ఉగ్రవాదం ఏ పేరుతో ఎవరు చేసినా అంతిమంగా ప్రజలకే నష్టదాయకమవుతుంది. అయితే దాని మూలాలు ఏ ఒక్క వ్యక్తికో పరిమితమైనవి కావు. లాడెన్‌ను సృష్టించి పెంచి పోషించడంలో అమెరికా కీలక పాత్రను ఎవరూ మర్చిపోకూడదు. భస్మాసుర హస్తంలా సెప్టెంబరు 11 తర్వాత అమెరికాకే అతను ముప్పుగా తయారైనాకే శత్రువుగా ప్రకటించారు. ఆ పేరుతో అఫ్ఘనిస్తాన్‌పై దండయాత్ర సాగించారు.నాటి సోవియట్‌ మద్దతు గల ఆఫ్ఘన్‌ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు తాలిబాన్లను సృష్టించి పాక్‌ను వత్తాసుగా నిలిపి లాడెన్‌ను కూడా అక్కడ చేర్చింది అమెరికానే.
ప్రతిదశలో అమెరికాకు అరబ్‌ ప్రపంచం నుంచి ఒక శత్రువు కావాలి. అతన్ని బూచిగా చూపించి తన ఆధిపత్య వ్యూహాలను సాగించుకోవాలి. నాజర్‌; అరాఫత్‌,గడాఫీ,ఖొమెనీ,సద్దాం హుస్సేన్‌ అందరూ ఆ పరంపరలో వారే. బిన్‌ లాడెన్‌ను కూడా ఆ క్రమంలోనే సృష్టించారు. ఇప్పుడు తుదముట్టించారు. అయితే ఇప్పటి వరకూ అతనికి ఆశ్రయం ఇచ్చిన పాకిస్తాన ను అంటుకోకుండా వదిలివేస్తున్నారు. పైగా సహకరించినట్టు కితాబులిస్తున్నారు ్‌ఇప్పటికీ సౌదీ నుంచి పాకిస్తాన్‌ వరకూ అన్ని చోట్లా సైనిక నియంతలను మత ఛాందసులను పోషిస్తూ, ఇజ్రాయిల్‌ యూదు జాత్యహంకారాన్ని పాలు పోసి పెంచుతూ అమెరికా ఉగ్రవాద వ్యతిరేకపోరాటం గురించి చెప్పడం హాస్యాస్సదమే. ముంబాయిలో టెర్రరిస్టు దాడులకు కారణమైన పాక్‌ అమెరికన్‌ హెడ్లీని భారత్‌కు అప్పగించేందుకు కూడా సిద్దం కావడం లేదు. చెప్పాలంటే ఇలాటి ఉదాహరణలు ఇంకా చాలా వున్నాయి. ఈ విధానాలు అమెరికా మార్చుకోనంత వరకూ ఉగ్రవాదంపై ఎన్ని సుద్దులు చెప్పినా వాటికి విలువ ఏ మాత్రం వుండదు. లాడెన్‌ వారసుడుగా
ఎవరు వస్తారనే కథనాలు కూడా అప్పుడే వదులుతున్నారు కూడా. తక్కిన ప్రపంచం సంగతి అటుంచి ఇండియాకు మాత్రం ఇది పరీక్షా సమయమే. లాడెన్‌ హతమైన రీత్యా ప్రతీకార దాడులకు భారత్‌ లక్ష్యం కావచ్చు. లాడెన్‌ లేని నేపథ్యంలో అమెరికా మరింతగా పాక్‌లో తిష్ట వేయవచ్చు. ఇప్పుడు అమెరికా ఆఫ్‌- పాక్‌ విధానం పట్ల మన దేశం మరింత అప్రమత్తంగా వుండాల్సిందే గాని అలసత్వానికి అమెరికా పట్ల విధేయతకు సమయం కాదు. వికీలీక్స్‌ను దగ్గర పెట్టుకుని చూస్తే అంత నికరంగా మనం నిలబడగలమా అని సందేహం కలగక మానదు. నాగరికతల యుద్ధం పేరిట మత యుద్ధాలను మరో పేరుతో రగిలించే ఆధిపత్య వ్యూహాలు మారకపోతే ఉగ్రవాద ప్రమాదం కూడా కొనసాగుతూనే వుంటుంది. దాన్ని అమెరికా సామ్రాజ్యవాదులు కోరుకుంటారు కూడా.

3 comments:

  1. హ్వా హ్వా హ్వా..మొదలయ్యిందీ? ఇప్పుడే అనుకున్నా.. ఇహ కానీయండి.:))
    మీ చివరి ముగింపు వాక్యం వ్యాసానికే హైలైట్.

    ReplyDelete
  2. @ snkr sir
    boy! You can tell the future.

    ReplyDelete
  3. అమెరికావి తోడేలు తెలివితేటలు. ఆ దేశాన్ని నమ్మినవాళ్ళు ఎవరైనా గొర్రెలు అవుతారు. అమెరికా ఇండియాకి వ్యతిరేకంగా పాకిస్తాన్‌కి ఆయుధాలు అమ్ముతుంది, పాకిస్తాన్‌కి వ్యతిరేకంగా ఇండియాకి ఆయుధాలు అమ్ముతుంది. గతంలో రష్యాకీ, ఇరాన్‌కీ వ్యతిరేకంగా సద్దాం హుస్సేన్‌ని ఉపయోగించుకుని అతన్నీ బలిపశువుని చేసింది అమెరికా. ఇప్పుడు అమెరికా చేతిలో ఒసామా బిన్ లాడెన్ బలి అయ్యాడు. ఒకప్పుడు రష్యాకి వ్యతిరేకంగా ఒసామా బిన్ లాడెన్‌కి ఆయుధాలు అమ్మింది అమెరికాయే.

    ReplyDelete