పుచ్చలపల్లి సుందరయ్య పేరు తల్చుకోగానే ప్రజల మనిషి అన్న ఆయన సార్థక నామం గుర్తుకు వస్తుంది. ధన స్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క అన్న పల్లవి నిరంతరం వినిపిస్తున్నా ఆచరణలో అది ప్రజల పేరిట ప్రజల ద్వారా ప్రజల నెత్తిన అన్న అర్థంలోనే అమలవుతుంటుంది. తమ స్వప్రయోజనలనే ప్రజల వాంఛలుగా చూపించే విద్య పాలకులకు బాగా తెలుసు.ఇందుకు ప్రచారాలు, ప్రలోభాలు, కుదరకపోతే ప్రభుత్వ నిర్బంధాలు కూడా ప్రయోగించేందుకు ఎంత మాత్రం వెనకాడరు.ఏ నినాదం ఏ ప్రచారం ఏ శక్తుల ఏ వర్గ ప్రయోజనాలకు ఉపయోగపడుతుందో తెలుసుకోవడం అంత సులభం కాదు. కనకనే కమ్యూనిస్టులు సామాన్య ప్రజల ముఖ్యంగా కష్టజీవుల శ్రేయస్సు పరమావధిగా పోరాడుతూనే వారి చైతన్యం పెంచడంపైనే కేంద్రీకరిస్తారు. ఇది విసుగూ విరామం లేని వుండకూడని ఒక నిరంతర ప్రక్రియ. ఈ సత్యానికి సుందరయ్య జీవితం ఆచరణలే నిదర్శనం. ఆయనలో ఆలోచనా శక్తి పెరిగిన నాటి నుంచి ఆఖరి శ్వాస విడిచే వరకూ ప్రజలతోనే ప్రజల కోసమే జీవించారు. ప్రజా సేవా కార్యక్రమాలతో మొదలు పెట్టి ప్రజల తరఫున పోరాడే సంఘటిత శక్తిగా కమ్యూనిస్టుపార్టీని తీర్చిదిద్ది విప్లవోద్యమాలు నిర్మించే వరకూ అనేక ఘట్టాలు ఆయన జీవితంలో మనకు దర్శనమిస్తాయి. వీటన్నిటితో పాటు ఈ ధనస్వామ్య ప్రజాస్వామ్యం పరిధిలోనే ప్రత్యామ్నాయాలను నిర్మించేందుకు నిలబెట్టేందుకు కూడా ఆయన అనుపమ సేవలందించారు. ఆ ప్రయత్నాలకు ప్రతిబంధకాలు ఎదురైనప్పుడు ప్రమత్తత కారణంగా ప్రభు వర్గాల పాచికలు పారినప్పుడు కూడా కాస్తయినా నిరాశ చెందక ద్విగుణీకృత దీక్షతో మరింతగా జనంలో లీనమయ్యారు. పశ్చిమ బెంగాల్‌లో సుదీర్ఘ వామపక్ష ప్రభుత్వ పాలనకు ఈ పర్యాయం పరాజయం ఎదురైన నేపథ్యంలో ప్రత్యామ్నాయ శిల్పిగా సుందరయ్య చేసిన కృషి గుర్తుకొస్తుంది.
ఎన్నికల్లో జయాపజయాలు: సిపిఎం
ఆంధ్ర రాష్ట్ర ఎన్నికలలో కమ్యూనిస్టులు విజయం అంచుల వరకూ వెళ్లి తర్వాత శతృవర్గాల మూకుమ్మడి దాడిలో దారుణంగా దెబ్బ తిన్న సంగతి అందరికీ గుర్తుంటుంది. 1955లో ఆ పోరాటానికి నాయకుడు భావి ముఖ్యమంత్రిగా
ప్రచారం పొందిన నేత సుందరయ్య. ఆ పోరాటం విఫలమైనందుకు ఆయన కించిత్తయినా కుంగిపోలేదు.ప్రభుత్వం రాకపోయినా రాజ్యసభ సభ్యత్వానికి రాజినామా చేసి ప్రతిపక్ష నాయకత్వం స్వీకరించారు. ఆ ఓటమి సంభవించి వుండకపోతే దేశంలో తొలి కాంగ్రెసేతర ముఖ్యమంత్రి ఆయనే అయివుండేవారు. అయితే 1957లో కేరళలో నంబూద్రిపాద్ ప్రభుత్వం ఏర్పడటంతో ఆ ఘనత కమ్యూనిస్టులకే దక్కింది. అంతేగాక పార్లమెంటులోనూ నాడు 30 మంది సభ్యులతో కమ్యూనిస్టులే ప్రధాన ప్రతిపక్షంగా వున్నారు.సుందరయ్య ఈ విషయం చెబుతూనే మొత్తంపైన చూసుకుంటే ఇది చాలా పరిమితమైన బలమే అన్నది గుర్తుంచుకోవాలని చెబుతుండేవారు.కేరళ విజయాన్ని కూడా అతిగా చెప్పుకోవడాన్ని ఆయన హర్షించలేదు.1959లో ఆ ప్రభుత్వాన్ని నెహ్రూ అక్రమంగా రద్దు చేయడం పార్లమెంటరీ వ్యవస్థలో కమ్యూనిస్టులపై నగంగా జరిగిన దాడికి నిదర్శనంగా నిలిచిపోయింది. మరో రెండేళ్లలోనే చైనా యుద్దం సందర్బంగా శాంతియుత సంప్రదింపులు జరగాలని సూచించినందుకే భావి సిపిఎం నాయకత్వాన్ని ప్రభుత్వం జైళ్లపాలు చేసింది. చివరకు 1964లో సుందరయ్య ప్రధాన కార్యదర్శిగా కొల్‌కతాలోనే సిపిఐ(ఎం) ఆవిర్భవించింది.ఆ మహాసభకు ముందు రోజునే ప్రమోద్ దాస్‌గుప్తాతో సహా బెంగాల్ ముఖ్య నాయకులు కొందరిని ప్రభుత్వం నిర్బంధించింది. ఇంతకన్నా తీవ్రమైన దాడి జరిగినా ఎదుర్కోవడానికి బెంగాల్‌లో బలం వుందన్న నమ్మకంతోనే మహాసభను ఆ ఏడాది అక్టోబర్ 31 నుంచి నవంబర్ 7 వరకూ యధాతథంగా నిర్వహించారు. చైనా ఏజంట్ల ముద్రతో జైళ్ల పాలు చేసిన పార్టీ కార్యకర్తలను విడిపించుకోవడం కోసం పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తుండగానే కేరళలో ఎన్నికలు వచ్చాయి.అప్పటికి ఇంకా సిపిఐ(ఎం)అన్న పేరు కూడా నిర్ణయం కాలేదు. ఎన్నికల సంఘం రెండు పార్టీల మధ్య తేడా వుండాలని నొక్కి చెప్పడంతో బ్రాకెట్‌లో మార్క్సిస్టు అని జోడించారు. అరెస్టయిన వారి విడుదల కోసం ప్రయత్నం జరుగుతుండగా ప్రభుత్వం దేశ వ్యాపితంగా కొత్తగా ఏర్పడిన పార్టీ నాయకులను స్తానిక స్తాయి వరకూ నిర్బంధించింది. నంబూద్రిపాద్, జ్యోతిబాసులను మాత్రం అంతర్జాతీయ ప్రచారం కోసం అరెస్టుచేయలేదు. అయితే ఇంతటి ప్రతికూల పరిస్థితిలోనూ కేరళ ఎన్నికలలో సిపిఎం ప్రథమ పార్టీగా వచ్చింది! కాని కేంద్రం అవకాశం ఇవ్వకుండానే శాసనసభను రద్దు చేసింది.ఈ కాలంలో కొత్త పార్టీని సూత్రబద్ద ప్రాతిపదిన సిపిఎం నిర్మాణాన్ని పటిష్టపర్చడంలో సుందరయ్య కీలక పాత్ర పోషించారు.
నగ్జటైల్ విచ్చిన్నం వెనక..
1967లో దేశ వ్యాపితంగా కాంగ్రెసేతర ప్రభుత్వాలు తొమ్మిది రాష్ట్రాలలో ఏర్పడగా కేరళ, బెంగాల్‌లలో మాత్రమే సిపిఎం నాయకత్వాన వామపక్ష ప్రధానమైన ఐక్య సంఘటనలు అధికారంలోకి వచ్చాయి. బెంగాల్‌లో రకరకాల మాయోపాయాలతో ప్రభుత్వాలను రద్దు చేస్తూ వచ్చిన కాంగ్రెస్ కేరళలోనూ కుతంత్రాలతో నంబూద్రి సర్కారును కూలదోసింది. సిపిఎం సిపిఐల మధ్యన ఐక్యత కూడా ఆ దశలో పూర్తిగా దెబ్బ తినిపోయింది. ఇదే సమయంలో బెంగాల్‌లో సిపిఎం నాయకత్వాతన గల ఐక్య సంఘటన మళ్లీ అధికారంలోకి రాకుండా నిరోధించేందుకు నగ్జలైట్ చీలిక కారణమైంది. వామపక్ష ప్రభుత్వం భూ పంపిణీ చేస్తూ ప్రజల తరపున పోరాడుతున్న కాలంలో ఈ నగ్జలైట్ చీలిక రావడం వెనక పాలక వర్గాల పాచికలున్నాయని సుందరయ్య ఆత్మకథలో స్పష్టంగా చెప్పారు. కానూ సన్యాల్ వంటి నాయకులతో తను వ్యక్తిగతంగా మాట్లాడిన అంశాలు కూడా రాశారు. (వారి పట్ల ఆయన ఏదో మెతగ్గా రాశారని కొందరు చేసే ప్రచారాలు వాస్తవాలు కావు) ఈ రాజకీయ పెడధోరణని దుస్సాహసాన్ని నిర్ద్వంద్వంగా రాజకీయంగా ఎదుర్కోవలసిందే తప్ప రాజీకి అవకాశం లేదని కూడా ఆయన పేర్కొన్నారు. నిజంగానే 1969-72 మధ్య బెంగాల్‌లో నగ్జలైట్లు కాంగ్రెస్ అరాచక మూకలతో కలసి సిపిఎంపై సాగించిన హత్యాకాండ అంతులేనిది. 1200 మందిని బలిగొన్న భయానక కాలం అది.1972లో సైన్యం సహాయంతో ఎన్నికలనే బూటకంగా మార్చి గెలిచినట్టు ప్రకటించుకుని సిద్ధార్థ రే ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని వేలాది మంది సిపిఎం కుటుంబాలను నివాసాల నుంచి తరిమేశారు. 1975లో ఎమర్జన్సీ దానికి పరాకాస్టగా దేశమంతా విస్తరించింది. ఈ కాలమంతా సిపిఎం కేంద్ర కార్యాలయం కొల్‌కతాలోనే వుండేది గనక సుందరయ్య కూడా ఆ అగ్ని పరీక్షా కాలంలో కీలక పాత్ర వహించారు. బెంగాల్ గురించి జ్యోతిబాసు దాస్‌గుప్తాల కంటే తనకే ఎక్కువ తెలుసని కొందరు అంటుంటారు గాని అది నిజం కాదని ఆయన నమ్రతగా చెప్పుకున్నారు.అయితే అక్కడ ఉద్యమంతో యువ కార్యకర్తలతో తనకు ప్రత్యక్ష సంబంధాలున్నాయని వివరించారు.
పరిమితులపై అప్రమత్తత
1977లో ఎమర్జన్సీ ఎత్తివేత ఎన్నికల తర్వాత జరిగి లోక్‌సభ ఎన్నికలలో బెంగాల్‌లో ఘన విజయం లభించింది. కేరళలోనైతే పార్లమెంటు అసెంబ్లీ రెండిటా ఓటమి సంభవించింది. 1977 జూన్‌లో బెంగాల్ శాసనసభకు జరిగిన ఎన్నికలలో సిపిఎం తొలిసారి పూర్తి ఆధిక్యత సాధించడమే గాక వామపక్ష సంఘటన మిశ్రమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ విజయాన్ని ఎంతగా హర్షించినా సుందరయ్య వంటి నాయకులకు గత చరిత్ర తరచూ కళ్లముందు మెదులు తుండేది. పాలక వర్గాలు ఎప్పుడు ఏ కుట్రకైనా సిద్ధపడతాయని వారు హెచ్చరిస్తుండేవారు. అలాగే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి వున్న పరిమితులు ప్రజలకు వివరిస్తూ వుండాలని కూడా సదా హెచ్చరిస్తుండేవారు. 1981 ఆగష్టులో ఆయన బెంగాల్‌లో జరిగిన ఏదో సభకు హాజరై వచ్చినప్పుడు నేను నోట్సు తీసుకున్నాను.అప్పుడు కూడా ఈ అంశమే పదే పదే చెప్పారు. సందర్భాన్ని బట్టి నేను ఆ భాగాన్ని కాస్త తగ్గించి రాశాను. మరుసటిరోజు ఆ వైపుగా వెళ్తున్న సుందరయ్య గారు దగ్గరకు పిలిచి బెంగాల్ ప్రభుత్వ పరమితులు ఎప్పటికప్పుడు చెబుతుండాల్సిందేనని వివరించారు. ఇది ఆయన దృష్టి కోణాన్ని తెల్పుతుంది.
అనేక అనుభవాలు చూసిన నాటి నాయకత్వం ఏనాడూ బెంగాల్‌లో అధికారం శాశ్వతమని భావించలేదు. అసలు మొదటి సారి విజయం తర్వాత 1982లో ఎప్పుడు ఎన్నికలు జరపాలనే దానిపై ఆ ప్రభుత్వ సిఫార్సును కేంద్రం ఆమోదించకుండా నాటకాలు నడిపినప్పుడు మళ్లీ పోరాడవలసి వచ్చింది. మరో రెండేళ్లకు 1984లో ఇందిరాగాంధీ హత్యానంతర సానుభూతిలో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో వామపక్షాల బలం సగానికి తగ్గి తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షంగా మారింది! ఆ మరుసటి ఏడాది సుందరయ్య కన్నుమూశారు. తర్వాత 1989లో జ్యోతిబాసును ప్రధానిగా ప్రతిపాదించడం, 1991లో రాజీవ్ గాంధీ హత్యానంతర నేపథ్యంలో కేరళ ఓడిపోతే అంతకన్నా ముందే జరిగిన బెంగాల్‌లో గెలవడం వంటి విషయాలు బాగా తెలిసినవే.1996,1998లో మమతా బెనర్జీ నిలదొక్కుకోవడమే గాక బిజెపిని కూడా తీసుకొచ్చి సీట్లు సంపాదించి పెట్టింది. 2001లో మొదటి సారి కాంగ్రెస్ బిజెపిలతో సహా మహాజోత్ ఏర్పాటు చేసినా విజయం లభించక చతికిల పడింది.2004,2006 సంవత్సరాలలో యుపిఎ భాగస్వామిగా మారినా విజయాలు దక్కలేదు. ఎట్టకేలకు 2009 విజయాలతో మొదలై ఇప్పటికీ బెంగాల్ పీఠం కైవశం చేసుకోగలిగింది. ఈ పరిణామ క్రమంలో మావోయిస్టులు నిర్వహించిన విధ్వంసకర పాత్ర సుందరయ్య ఆనాడే చేసిన హెచ్చరికను నిజం చేసింది. ఆయన అనేక సార్లు చెప్పినట్టు ఈ వ్యవస్తలో వామపక్షాలకు వున్న ప్రతిబంధకాలను కూడా మరో మారు గుర్తు చేసింది. వీటికి విరుగుడు ఏమంటే ఆయనే నిరంతరం బోధించినట్టు ఆచరించి చూపినట్టు ప్రజలకు మరింత చేరువగా వెళ్లడమే. కార్యకర్తలతో నాయకత్వం మమేకం కావడమే.
మరువ రాని పాఠాలు
ఎన్నికల్లో ఓడిపోయినా వామపక్షాలకు నలభై శాతం పైగా ఓట్టు రావడాన్ని బట్టి ప్రజలలో పునాది ఏమిటో బోధపడుతుంది. ఇన్నేళ్లలో ఏడు శాసనసభలు, పదిలోక్‌సభ ఎన్నికలలోనూ, పదే పదే స్తానిక సంస్థల్లోనూ విజయపరంపరలు సాధించిన వామపక్ష ఫ్రంట్ ఒకసారి ఓటమితోనే తలకిందులై పోవడం ,తెరమరుగు కావడం జరగని పని. ఆ మేరకు కొందరు కంటున్న కలల కల్లలై కూలక తప్పదు. అలాగే కొంతమంది వ్యాఖ్యాతలు పార్టీ కమిటీలను శాఖలను తప్పు పడుతూ ప్రజా ప్రతినిధులకు వారిపై ఆధిక్యత వుండాలని సూచించడం కూడా తలకిందులు సిద్ధాంతమే. రాజకీయ నిర్దేశం పార్టీ నుంచి వస్తే పాలనా బాధ్యతలలో దాన్ని అమలు చేయడం ప్రజా ప్రతినిధుల పని. ఈ రెండు బాధ్యతలనూ జయప్రదంగా నిర్వహించిన సుందరయ్య జీవితమే అందుకో సజీవ నిఘంటువు. ప్రజలతో సంబంధాలే అందుకు ప్రాణవాయువు.సుందరయ్య ఆత్మకథ ఆఖరి అధ్యాయం మొత్తం అందుకే కేటాయించారు. అందులో మొదటే ఇలా వుంటుంది:
''సైద్ధాంతికంగా, నక్సలిజానికి అరాచకత్వానికి వ్యతిరేకంగా పోరాటం సాగుతూనే వుండాలి. నేటికీ అది అవసరమే ముఖ్యంగా యువతీ యువకులలో, విద్యార్థులలో, మేధావులలో ఈ రకమైన అడ్డదారులను, దగ్గరి దారులను విప్లవ వాగాడంబరానికి ఆకర్షణ ఎక్కువగా వుంటుంది. వ్యవసాయ కార్మికులు, రైతులపై కూడా విప్లవ పోజుతో ఇది కొంత ప్రభావాన్ని చూపిస్తుంది. నిరంతరం ఓర్పుగా ఇలాంటి అడ్డదారులకు, ఎన్నికల చిట్కాలకు వ్యతిరేకంగా పారీyని, ప్రజానీకాన్ని ప్రత్యేకించి ఈ సెక్షన్లను చైతన్యం చేస్తూనే వుండాలి. రివిజనిజం కన్నా ఇదేమి తక్కువ ప్రమాదకారికాదు. అది ఒక రకంగా విప్లవ చేవను తొలిచేస్తే ఇది మరో రకంగా విప్లవోద్యమాన్ని ధ్వంసం చేస్తుంది. ఏది ఎక్కువ ప్రమాదకారి అన్నది అప్పటి పారీy ఎదుర్కొంటున్న పరిస్థితిపై ఆధారపడి వుంటుంది. ఈ విధంగా ఓర్పుగా ప్రజా చైతన్యాన్ని పెంచడం అన్నది ప్రజలే తనను తాను విముక్తి చేసుకోవలసినవారు అన్న విషయాన్ని నిరంతరం గమనంలో వుంచుకుని, ప్రచారంలో పెటిy ఆచరించాలి. పరిస్థితి విప్లవానికి పరిపక్వం అయ్యే వరకు ఇది తప్పదు. అందుకనే ఒక్కోసారి మన వాళ్ళు బ్రహ్మాండమైన అవకాశాలు వచ్చాయి, ఇది మూల మలుపు అని కొందరు అంటుంటే నాకు చిరాకు అనిపిస్తుంది. 50 ఏళ్ళ నుండి ఇలాంటి మాటలు వాడుతూ తదనుగుణంగా ఆచరణలో చూపించలేనప్పుడు ఆ మాటలవల్ల ప్రయోజనం ఏమిటి? అందుకని భౌతిక పరిస్థితిని జాగ్రత్తగా అంచనా వేసుకొని నిగ్రహంతో వ్యవహరించాలి.''
నాటి నగ్జలైట్టు మావోయిస్టుల పేరిట మమతా బెనర్జీతో జట్టుకట్టడమే గాక అనేక హానికర సిద్దాంతాలు ఎన్జీవోల రూపంలోనూ కుహనా మేధావుల రూపంలోనే స్వైర విహారం చేస్తున్న నేటి నేపథ్యంలో సుందరయ్య మాటలు మరింత ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.అయితే ఆయనే పదే పదే చెప్పినట్టు ప్రజలకు దగ్గరై చైతన్య పర్చడం, వారిని ఉద్యమాలో సంఘటితపరిచే కార్యకర్తలతో సన్నిహితంగా వుంటూ సమాయత్తం చేయడం ఇవే ఇప్పుడు అత్యావశ్యకం. ఆయన వర్థంతి అందుకు ప్రతిన బూనే సందర్భం. ఎదురీతలోనూ ఎడతెగని స్థయిర్యమే ఆయన చూపించిన మార్గం. ఎన్నికల పరాజయాలతోనే ఎర్రజండా చిన్న బోతుందనుకోవడం అత్యాశే గాక అవగాహనా రాహిత్యం కూడా.
(ప్రజాశక్తి మే 19- సుందరయ్య వర్థంతి సందర్భంగా)
No comments:
Post a Comment