Pages

Friday, May 13, 2011

వామపక్షాలకు తీవ్రమైన ఎదురు దెబ్బ




పశ్చిమ బెంగాల్‌ శాసన సభ ఎన్నికల్లో వామపక్షాల పరాజయం రాజకీయంగా వాటికి తీవ్రమైన ఎదురుదెబ్బ. కేవలం కమ్యూనిస్టు ఉద్యమాభిమానులే గాక ప్రజాస్వామిక వాదులు, ప్రత్యామ్నాయ శక్తులు వుండాలని కోరుకునే వారంతా ఈ పరిణామానికి విచారిస్తారు. అదే సమయంలో ఆ ప్రజాస్వామ్య స్పూర్తితోనే ప్రజల తీర్పును గౌరవిస్తారు. 2009 పార్లమెంటు ఎన్నికలతో మొదలు పెట్టి వరసగా మూడు ఎన్నికల్లో వామపక్ష ఫ్రంట్‌ ఓటమి పరంపర చూస్తూ వచ్చింది.దీనికి తోడు సింగూరు, నందిగ్రామ్‌, లాల్‌గడ్‌లలో పరిణామాలు ప్రతికూలత పెంచి ప్రజలను దూరం చేశాయి. దూరమైన వారిని తిరిగి రాబట్టుకోవడంలో వామపక్ష ఫ్రంట్‌ తీవ్రంగానే కృషి చేసినప్పటికీ
అది చాలలేదని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. 34 ఏళ్ల సుదీర్ఘ అసాధారణ విజయ పరంపరల తర్వాత బెంగాల్‌ ఓటర్లలో ఒక భాగం మార్పు కోరుకున్నారని కూడా ఫలితాలను బట్టి తేలుతున్నది. వీటన్నిటికీ మమతా బెనర్జీ తృణమూల్‌ కాంగ్రెస్‌ కేంద్ర బిందువైంది. ఇందుకు తోడు అమెరికాలో క్లింటన్‌(హిల్లరీ) నుంచి అడవుల్లో వుండే కిషన్‌జీ వరకూ, ఇస్లామిక్‌ హిందూత్వ ఛాందస శక్తుల వరకూ అందరూ ఆమెతో జట్టు కట్టడం వల్ల మార్క్సిస్టు వ్యతిరేక సమీకరణ కేంద్రంగానూ మమత ఆవిర్భవించింది. (దీనిపై సందేహాలున్న వారు వికీలీక్స్‌ పత్రాలను పరిశీలించుకోవచ్చు) ఇవన్నీ కలసి ఫ్రంట్‌ ప్రభుత్వాన్ని ఓడించడంతో పాటు బుద్ధదేవ్‌ భట్టాచార్జీతో సహా హేమాహేమీల పరాజయానికి కూడా కారణమైనాయి. బెంగాల్‌ ప్రభుత్వం ప్రజానుకూల ప్రత్యామ్నాయ విధానాలు అమలు చేసిన తీరు అందరికీ తెలుసు. వాటన్నిటిని వివరంగా పేర్కొనవలసిన సమయం కాదు గాని ప్రపంచీకరణ నేపథ్యంలో వచ్చిన విధాన పరమైన మార్పులను సమన్వయ పూర్వకంగా సమర్థంగా ముందుకు తీసుకుపోవడంలోనూ వైఫల్యాలు సంభవించాయన్నది కాదనలేని నిజం. ఏమైనా ఎనిమిదో సారి ఓడి పోవడం ఏ ప్రభుత్వానికైనా పెద్ద అవమానంగా భావించనవసరం లేదు. ప్రజాస్వామ్యంలో ఇలాటి రాజకీయ మార్పులను సహజమైనవిగా అర్తం చేసుకుంటూనే దీని వల్ల గతంలో అమలు జరిగిన మంచి విధానాలు తలకిందులు కాకుండా చూసుకోవలసిన బాధ్యత మాత్రం వుంటుంది. ఉద్యమాలు సిద్దాంతాలపై ఆధారపడిన కమ్యూనిస్టులకు ఈ ఓటమితోనే అంతా తలకిందులు అయ్యేది కూడా వుండదు.
...కేరళలో ఎల్‌డిఎప్‌ ఎన్నటికంటే ఎక్కువగా మంచి ఫలితాలు సాధించి విజయానికి దాదాపు చేరువగా వచ్చింది. ఇది వామపక్షాలకు ఉత్సాహం కాకున్నా ఉపశమనం కలిగించే అంశమే. ఈ ఫలితాలను కేవలం అచ్యుతానందన్‌ కోణం నుంచి మాత్రమే చూసే వారు కేరళ ప్రభుత్వ విజయాలను విస్మరిస్తున్నారని చెప్పాలి.ఇప్పుడు ఓడిపోయిన బుద్దదేవ్‌ కూడా 2004,2006 ఎన్నికలలో అద్భుత ఫలితాలకు కారణమైనాడనీ గుర్తుంచుకోవాలి. విధానపరమైన అంశాలను వ్యక్తుల పరంగా చూడటం వల్ల ప్రయోజనం వుండదు.
.... తమిళనాడు విషయంలో ఎన్నికల సర్వేలు తలకిందులవడం, డిఎంకె ఘోర పరాజయం పాలు కావడం ఆహ్వానించదగిందే. అవినీతిని ప్రజలు పట్టించుకోవడం లేదని కొందరు చేసిన వ్యాఖ్యలు సరి కాదని ఈ ఫలితాలు చెబుతున్నాయి. ఎఐడిఎంకె విస్త్రత స్తాయిలో ఎన్నికల సర్దుబాట్లు చేసుకోవడం ఇందుకు దోహదపడింది.సిపిఎం ఇక్కడ పోటీ చేసిన పది స్థానాలలోనూ గెలుపు సాధించింది.
...... అసోంలో కాంగ్రెస్‌ సాధించిన విజయం చెప్పుకోదగింది. ఆ సంక్షుభిత ఈశాన్యరాష్ట్రంలో శాంతి స్థాపనకు దోహదం చేస్తుందని ఆశించాలి.


3 comments:

  1. ఏ పర్వాలేదు. మళ్ళీ మనం తిరిగివస్తాం. 34 యేళ్ళ అధికారం పిమ్మట ఒక ఐదేళ్ళపాటు ప్రతిపక్షంలో కూర్చోవడం కూడా అవసరమే. అప్పుడే మనలోని తప్పులూ, ఒప్పులూ బలాలూ బలహీనతలూ పునస్సమీక్షించుకునే అవకాశం వస్తుంది. బాధ్యతాయుత ప్రతిపక్షంలా వ్యవహరిద్దాం, అదే సమయంలో మన సిద్ధాంతాలు ప్రజలనుండి దూరంగా ఎందుకు జరుగుతున్నాయో ఆత్మవిమర్శ చేసుకుందాం. నామటుకు నాకు ఈ ఐదేళ్ళసమయం మన సైద్ధాంతిక పునస్సమీక్షకోసం, ఎక్కడ మనకి ప్రజలతో గాప్ ఏర్పడిందో తెలుసుకుని తప్పులని సవరించుకుని రెట్టీంచిన ఉత్సాహంతో ముందుకుదూకడానికి ఒక అద్భుతమైన అవకాశంలా కనిపిస్తుంది.
    బుద్దదేబ్ దా ఓడిపోవడం కొంతమటుకు బాధకలిగించినా, అప్పుడప్పుడు ఓడిపోతేనే నిజమైన గెలుపును అస్వాదించగలం.
    మీరు సరిగ్గా చెప్పినట్లు, పరస్పర వ్యతిరేక ధ్రువాల్లాంటి- అమెరికానుండీ కిషన్ జీ కాదా, ఇస్లామిక్ చాదసవాదులనుండి, హిందూత్వ చాందసులదాకా, అన్నిటికీ మించి కాంగ్రెస్సు లాంటి వల్నరబుల్ శక్తులతో అంటకాగుతున్న తృణమూల్ కి ఇది నల్లేరుమీద నడకానేరదు.
    Having said that, మమతా కృషినీ, ఒకమహిళగా ఆమెచూపిన పోరాటపటిమనీ, సహనాన్నీ మనస్ఫూర్తిగా అభినందించకతప్పదు.

    కేరళ లో ఫలితాలు అనుకున్నంత నిరుత్సాహకరంగా లేవు. నిజంగా చెప్పాలంటే నైతిక విజయం మనదే, యాంటి ఇంకంబెన్సీ ఫాక్టర్ ని దాటుకుని కేవలం 4 సీట్లు వెనకబడడం ఏమంత పెద్దవిషయం కాదు. కామ్రేడ్ అచ్యుతానందన్ సేవలని పూర్తిస్థాయిలో వినియోగించుకోగలిగితే ఇంకొంచెం ఫలితం ఉండేదేమో. అయినా 72 స్థానాల్లో UDF కుటమి ఉంది అన్న విషయం గమనార్హం. కూటమి చీల్చడం ఏమంత పెద్దవిషయం కాదు అలాగే క్షేత్రస్థాయిలో నిర్మాణం ఉన్న మనకి అధికారం నిలబెట్టుకోవడం పెద్ద సమస్యకాదు.
    తమిళనాడులో పది సీట్లు నిజంగా ఉత్సాహాన్నిచ్చాయి, దక్షిణాది రాష్ట్రాల్లో సంకీర్ణరాజకీయాలు త్వరలో పెనుమార్పులుతేనున్నాయి.
    అలాగే ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి సారించాలి, పాతబస్తీ లో బలపడుతున్నాం, అలాగే విశాలాంధ్ర నినాదంతో సమైక్యవాదులకి దగ్గరౌదాం. అన్నిటికీ మించి ఈ అవకాశవాద పార్టీల పొత్తుల కబంధహస్తాల నుండి బయటపడి ప్రజాభీష్టాలని గౌరవిస్తూ ప్రజాదరణ ఉన్న యువ నాయకత్వం వైపు క్రమంగా జరగడం ఈనాటి చారిత్రక అవసరం.

    ReplyDelete
  2. ఇది ఒక హిక్‌ అప్‌ లాంటిదే కానీ తీవ్రమైన ఎదురుదెబ్బకాదని పైన ఉదహరించిన కారణాలవల్ల నా అభిప్రాయం, ప్రతీ అపజయం నుంచీ పాఠాల్ని నేర్చుకుని తిరగబడాలన్న ఉడుకురక్తం మీ శీర్షికతో ఏకీభవించదు :)

    ReplyDelete
  3. ఉడుకు రక్తంగా చెప్పే మీ ఆశా విశ్వాసాలు ఆహ్వానించదగినవే. ఎదురు దెబ్బ తీవ్రతను గుర్తించగలిగితేనే దాన్ని అధిగమించే ప్రయత్నం జయప్రదమవుతుంది. ఒక వైపున ఫలితాలు వస్తుంటే ముందు దానిపై స్పందించాలి. భవిష్యత్తులో చేయవలసింది చేయాలి. అదీ పద్ధతి. మీరు ఏం చేయగలమనుకుంటున్నారో దాన్ని బట్టి మిమ్మల్ను మీరు అంచనా వేసుకుంటారు. ఏం చేశారన్న దాన్ని బట్టి ఏం జరిగిందన్న దాన్నిబట్టి ఇతరులు అంచనా వేస్తారు అన్నది ఒక నానుడి. ఇక ఆశాభావం అంటారా? నాకూ పుష్కలంగా వుంది. ఆశయమే ప్రధానం తప్ప అధికారం కాదు.తాజ్‌ లేకపోయినా ప్రేమ వుంటుంది,సోవియట్‌ విచ్చిన్నమైనా కమ్యూనిస్టు ఉద్యమం వుంటుంది అన్న సత్యమే శివం సంభాషణలను నేను నిన్న చాలా సార్లు ఉటంకించాను. అయితే అది కలిగిన ఓటమి తీవ్రతను నిరాకరించేందుకు దారి తీయకూడదు.తమిళనాడులో సిపిఐ పోటీ చేసిన పదిలో తొమ్మిడి స్థానాలు తెచ్చుకున్నది. సిపిఎం 12లో పది తెచ్చుకున్నది. కేరళలో సిపిఎం ఏకైక పెద్ద పార్టీగా వచ్చింది. ఎన్నికల ఫలితాలపై నా వివరమైన వ్యాసం రేపు చూడొచ్చు.

    ReplyDelete