Pages

Sunday, May 8, 2011

కడప కదనంలో కడపటి అంచనాలుగత నెల రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో కడప, పులివెందుల ఉప ఎన్నికల పోరాటమే ఏకైక అంశంగా ప్రచారం పొందింది. పోలింగ్‌ శాతం కూడా ఇందుకు తగినట్టే వుంది. ఎన్నికల కమిషనర్‌ భన్వర్‌లాల్‌ కోరినట్టు 80 శాతం దాటకపోయినా వున్న వుద్రిక్త వాతావరణంలో ఇది మంచి ఓటింగే. పైగా మరీ తీవ్రమైన శాంతి భద్రతల ఘటనలు లేకుండా ముగియడం మరో ఉపశమనం. పోలింగ్‌పై ఎక్కువ భాగం ఫిర్యాదులు తెలుగు దేశం నుంచే రావడం గమనార్హమైంది. అలాగే డిఎల్‌ తనకు జగన్‌ వర్గం నుంచి ప్రాణాపాయం వుందని చెప్పడం, సాక్షి విలేకరిపై ఆయన వర్గీయుల దాడిని జగన్‌ సహా తీవ్రంగా ఖండించడం ఇవన్నీ ప్రచార పర్వంలోని ఉద్రిక్తతలకు కొనసాగింపు వంటివే. అతిశయోక్తులు, అవాస్తవాలు, అర్భాటాలను పక్కన బెడితే
రాష్ట్ర రాజకీయ రంగంలో వచ్చిన త్రిముఖ విభజనను కూడా ఈ పరిణామం విదితం చేసింది. రాను రాను రాజకీయ రంగంలో ప్రాబల్యం కోరుతున్న శక్తుల మధ్య వ్యక్తుల మధ్య ఎంతటి భీషణ పోరాటం నడవనున్నదీ కడప తెలియజెప్పింది. ఏక పక్ష రాజకీయాలకు కాలం చెల్లిందనీ బహుళ పక్ష సంకీర్ణ దశలో రాష్ట్రం ప్రవేశించిందనీ ప్రస్పుటంగా వెల్లడించింది.
ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే దానిపై పెద్దగా భిన్నాభిప్రాయాలు లేవు గాని ఎంత ఉధృతంగా గెలుస్తారనే దానిపై మాత్రం తప్పక తేడాలున్నాయి. కడప పార్లమెంటరీ స్థానానికి, పులివెందుల అసెంబ్లీ స్థానానికి ఒకే విధంగా ఫలితం వుండకపోవచ్చన్న దానిపైనా ఏకాభిప్రాయం కనిపిస్తోంది. కాంగ్రెస్‌ నుంచి వైదొలగి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ స్థాపించిన జగన్‌ ఈ సారికి నాన్న వారసత్వ ఫలం పొందగలుగుతాడనేది దాదాపు ప్రతివారూ చెబుతున్నారు. అయితే ఆయన ఆధిక్యత ఎంత అంటే గతంలో వచ్చిన లక్షా 76 వేల కన్నా కొంచెం ఎక్కువగా 2 లక్షలకు అటూ ఇటూ వుంటుందని కొందరంటున్నారు. కాదు, రెట్టింపుగా పెరిగి 4 లక్షలవుతుందని ఆయన వీరభక్తులు చెబుతున్నారు. కాంగ్రెస్‌ సంప్రదాయ ఓటింగు జిల్లాలో తొలి సారి విభజించబబడుతున్నందుకు లక్షకు అటూ ఇటూ రావచ్చనే వారు కూడా స్వల్పంగానైనా లేకపోలేదు.ఇందులో ఏది ఎంత వరకు నిజమవుతుందో చూడాలి. మరీ 3 లక్షలకు దరిదాపుల్లో ఆధిక్యత వస్తే తప్ప ఈ విజయం పెద్ద నాటకీయ ప్రభావం కనపర్చకపోవచ్చు. వారి స్థానాలు వారు ఇంత ప్రచారోధృతి తర్వాత కూడా మామూలుగానే నిలబెట్టుకున్నారు అని చప్పరించే అవకాశం వుంటుంది.ఒక వేళ మెజారిటీ తగ్గితే జగన్‌ పార్టీపై మరింత ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇప్పటికే ఈ ఎన్నికల ప్రచారం మొదలయ్యాక ఆయన శిబిరం నుంచి ఇద్దరు ఎం.ఎల్‌ఎలు ఆరోపణలు చేసి అధికార పక్షం వైపు వెళ్లిపోయారు. ఒక వేళ ఆయనకు ఆశించినంత అధికంగా ఓట్లు రాకపోతే ఒక విధంగానూ, మరీ ఎక్కువగా వస్తే ఇంకో విధంగానూ ఆ శిబిరంలోని అసంతృప్తులను ఆయనకు మరింత దూరం చేయడానికి అధికార పక్షం ప్రయత్నిస్తుంది. మిగిలిన అంశాలు ఎలా వున్నా ఈ విషయంలో కొంత వరకూ కృతకృత్యుడైన ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి తన వ్యూహాలను ఇంకా తీవ్రం చేయొచ్చు.
వైఎస్‌ హయాంలో జిల్లాల్లో బాగా ఇబ్బందులు పడిన తెలుగు దేశం అధికార పక్షంలో పరివారంలో వచ్చిన ఈ చీలికను ఉపయోగించుకుని తను నిలదొక్కుకోవడానికి కొంత ప్రయత్నించింది. అయితే ప్రచారంలో చంద్రబాబు నాయుడు తదితరులు గట్టిగా పాల్గొన్న తీరు ఇందుకు నిదర్శనం. అయితే కాంగ్రెస్‌లో ఇంత చీలిక వున్నప్పుడు తాను అత్యధికంగా చొరవ చూపి ప్రయోజనం పొందేందుకు తెలుగు దేశం జిల్లా నాయకులు పూర్తి స్థాయిలో ప్రయత్నించారా అంటే సందేహమే. ఇతర పార్టీల విషయానికి వస్తే సిపిఐ నాయకుడు నారాయణతో సహా తెలుగు దేశంతో కలసి ప్రచారంలో పాల్గొన్నారు. సిపిఎం జిల్లా కమిటీ తెలుగు దేశంకు మద్దతు నివ్వాలని నిర్నయించినా ప్రచారం స్వంతంగానే నిర్వహించడం అందరూ గమనించారు. దీనిపై ఒక వర్గం మీడియా కొన్ని వక్రీకరణలకు పాల్పడినా సిపిఎం జిల్లా నాయకులు సూటిగానే వివరణ నిచ్చారు. కాంగ్రెస్‌ బిజెపిలను ఓడించాలన్న సాధారణ సూత్రం ప్రకారం తీసుకున్న నిర్ణయం ఇది కాగా జగన్‌ పార్టీ విధి విధానాలు స్పష్టం అయితే తప్ప దాని గురించి వైఖరి వెల్లడించడం సాద్యం కాదు. కొంతమందిలా కొన్ని పార్టీల్లా సిపిఎం వ్యక్తులను బట్టి విధానం తీసుకోదన్నది తెలిసిన విషయమే. అందుకే కడపలో పరిమితమైనప్పటికి ఖచ్చితమైన పాత్ర గల సిపిఎం వైఖరి పలువురి హర్షామోదాలు పొందింది.
బిజెపితో పొత్తు లేదని జగన్‌ చెప్పినప్పటికీ ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యానాలు కలకలం రేపాయన్నది వాస్తవం. కడప జిల్లా వరకూ బిజెపితో పొత్తు ఉపయోగం ఏమీ వుండదు గనక జగన్‌ ఇప్పటికి ఆ ప్రసక్తి పెట్టుకోకపోవచ్చు గాని భవిష్యత్తులో ఏం చేస్తారన్నది చూడాల్సిందే. ఈ సందర్భంగానే ఇచ్చిన కొన్ని ఇంటర్వ్యూలలో ఆయన చేసిన వ్యాఖ్యలు అస్పష్టతను పెంచాయి. ఉదాహరణకు తాను బుద్ధదేవ్‌ భట్టాచార్యతోనూ మమతా బెనర్జీతోనూ శరద్‌ పవార్‌తోనూ కూడా మాట్లాడతానని ఆయనన్నదానిలో అనేక అర్థాలు తొంగిచూస్తున్నాయి. బిజెపితో సంబంధాలను కూడా ముస్లిం మైనార్టిలకు రిజర్వేషన్‌ అన్న అంశానికే పరిమితం చేసి మాట్లాడ్డం,వారికి పది శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని సూచించడం కూడా ఎన్నికల దృష్టినే ప్రతిబింబించాయి. ఇంతకన్నా వివరంగా రాజకీయ కోణంలో ఆయన ఏం చెబుతారో చూడవలసే వుంటుంది. బిజెపి నేతలు మాత్రం జగన్‌ను సూటిగా ఏమీ అనకపోగా అనుకూలంగా వున్నట్టు సూచనలు పంపించేందుకు కొన్ని యత్నాలు చేసి తర్వాత సర్దుకున్నారు. మతతత్వ బిజెపితో సంబంధాలు ఈ రాష్ట్రంలో లౌకిక వాదులుగా చెప్పే వారందరికీ కొలబద్దగా వుంటాయని మాత్రం కడప పరిణామాలు మరో సారి స్పష్టం చేశాయి.
అక్రమార్జనలు, నోట్ల పంపిణీ, దౌర్జన్యాలు, దుర్భాషలు,అసందర్భ వ్యాఖ్యానాలు ఇవన్నీ ఎన్నికల ప్రచారంలో పొంగిపొర్లాయి. వెనకబడిన జిల్లాగా కడప అభివృద్ధికి ఏం జరగాలన్న విషయం మాత్రం దాదాపు చర్చకే రాకపోవడం ఒక వైపరీత్యం. వైఎస్‌ పాలనలో నిధులన్ని కడపకే తరలించబడ్డాయన్న ప్రచారం ఒకవైపు వుండగా ప్రజా సమస్యలు పేరుకు పోవడం వాస్తవం. సుదీర్ఘ కాలంగా జిల్లాలో చక్రం తిప్పుతున్న వారు, ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ఇందుకు బాధ్యత వహించక తప్పదు.కాని ఈ సారి ప్రచారం యావత్తూ వ్యక్తిగత ప్రాబల్యాలు, ఆధిపత్య ప్రయోజనాల మధ్య ఘర్షణగానే నడిచి సమస్యలు పూర్తిగా మరుగున పడిపోయాయి. ఫలితాలు వచ్చిన తర్వాత ఆ ఘర్షణ ఇంకా తీవ్రమవుతుందేగాని తగ్గదు. ఏతావాతా జిల్లాలో పేరుకుపోయిన సమస్యలు ఇంకా చాలా కాలం నిరీక్షించవలసిందే.
ఎన్నికను దాదాపు ఏకపక్ష ఆమోదంగా చేసుకోవాలన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఆశలు ప్రచార పర్వంలో ఫలించలేదు గనకే రాజకీయ విమర్శలు వివాదాలు జోరుగా సాగాయి. అవినీతి ఆరోపణలు బాగానే మార్మోగాయి. కాగా పాలక పక్షం మంత్రులను మిక్కుటంగా రంగంలోకి దింపినప్పటికీ పెద్ద సానుకూలత తెచ్చుకోలేకపోయింది. ముఖ్యమంత్రి ప్రచారం కూడా పేలవంగానే నడవడం, ఓడిపోయినా నష్టం లేదని ఆయన స్వయంగా వ్యాఖ్యానించడం పాలక పక్షం పరిస్థితికి అద్దం పట్టింది.(వివేకానంద రెడ్డికి అదనపు అనుకూలత ఆయన కుటుంబ నేపథ్యం తప్ప కాంగ్రెస్‌ రాజకీయ బలం అని ఎవరూ అనుకోలేదు.) ఫలితాలు వూహించదగినవే అయిన ఈ ఎన్నికల సమరం వెను వెంటనే రాష్ట్ర రాజకీయాలను తలకిందులు చేస్తుందనుకోలేము. ఇక కేంద్రం కూడా ప్రకంపనాలకు గురవుతుందనే అంచనా మరింత అతిశయోక్తి కావచ్చు. ఒక వేళ ఏవైనా పరిణామాలు వస్తే అందుకు ఉప ఎన్నికలు ఆజ్యం పోయవచ్చునేమో గాని వాటికవే నాటకీయ మార్పులను తీసుకువస్తాయని చెప్పలేము.ఆ విధమైన రాజకీయ ప్రక్రియకు ఇంకా సమయం పట్టొచ్చు. కాకపోతే పోలింగు ముగియగానే రాష్ట్రంలో ప్రాంతీయ రాజకీయాలు మరో సారి పురి విప్పడానికి సిద్దంగా వున్నాయి గనక దృష్టి ఆ వైపు మరల్చబడవచ్చు.


No comments:

Post a Comment