Pages

Friday, May 27, 2011

పున:పున: ప్రతిష్టంభనం..




మహబూబ్‌ నగర్‌ జిల్లాలో మంత్రులిద్దరూ ఎందుకు ఘర్షణ పడుతున్నారు? అంతకు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో తెలుగుదేశంలోనూ వైరుధ్యాలు ఎందుకు పొడసూపాయి? కరీం నగర్‌లో తెలుగు దేశం తెలంగాణా రణభేరిపై కొన్ని వర్గాలు ఎందుకు ముందేభేరీ మోగిస్తున్నాయి? స్పష్టమవుతున్నదొకటే- ప్రాంతాల గురించి ఎంత చెప్పినా వాస్తవంలో ప్రయోజనాల ఘర్షణ ప్రతిబింబాలే ఇవన్నీ. ఒకే ప్రాంతంలో ఒకే జిల్లాలో ఒకే పార్టీలో ఇంత బాహాటంగా కీచులాడుకుంటున్న నేతలు ప్రతిదీ ప్రాంతాల రేఖలతో చూపించాలనుకోవడం కుదిరే పని కాదు. ఏదో ఒక రీతిలో మేము ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నామంటూ సభలు జరిపే వారిని కూడా నిలవరించడంలో కనిపించేది
రాజకీయ పెనుగులాట తప్ప ప్రాంతీయ ప్రేమ కాదు. ఇక్కడ ఇలా వుంటే అక్కడ ఢిల్లీ స్థాయిలో మరోసారి రెండవ ఎస్సార్సీ గురించిన ఆలాపన మొదలవడం కూడా అనూహ్యం కాదు. రాజమాత, యువ రాజుల సన్నిధిలోనే వారి స్వరాష్ట్రమైన యుపి వేదికగా చేసిన తీర్మానం సెగలు ముందుగా ఎపిపై పడటంలోనూ వింతేమీ లేదు. ఆ తర్వాత కేంద్ర మంత్రిణి పురంధేశ్వరి కూడా ఆ భావాన్నే మరింత సుస్పష్టంగా వివరించడంలో అధిష్టానం ఆశీస్సులు లేవనుకోవడం అవాస్తవికమవుతుంది. అధికార స్వరాలు అలా వినిపిస్తుంటే ఇక్కడ ప్రజా ప్రతినిధులు మా నాయకత్వంపై మాకు నమ్మకం వుందని ప్రకటించడం అసహాయతకే అద్దం పడుతుంది.ఇంతకు ముందు కూడా ఇలాటి నమ్మకంతోనే తేదీలు గడువులు ప్రకటించిన వారి పరిస్థితి ఆఖరుకు ఏమైందో చూడనే చూశాం. ఇన్నీ ఆయ్యాక మేము పాత వైఖరికే కట్టుబడి వున్నామనడంలో చిదంబర రహస్యమేమిటో ప్రవచించిన వారు మాత్రమే చెప్పగలుగుతారు. ఏతావాతా ఇవన్నీ కలసి రాష్ట్ర పరిస్తితిని పెనం మీద నుంచి పొయ్యిలోకి వేసిన చందంగా మార్చాయన్నది ఎవరూ కాదనలేని సత్యం.అనిశ్చితికి ఆలవాలంగా మారిన ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ పున: పున: ప్రారంభ ప్రహసనాలు ప్రజల పట్ల అలక్ష్యానికి పాలకుల బాధ్యతా రాహిత్యానికి నిదర్శనాలు.

పాత చరిత్రను పక్కన బెడితే డిసెంబర్‌ 9 ప్రకటనలోనే కావలసినంత అస్పష్టత సంధిగ్ధత వున్నాయి. తర్వాతి ప్రాంతీయ రాజకీయాలు దాన్ని ఇంకా తీవ్రం చేశాయి. ఈ క్రమంలో ప్రధాన పార్టీలన్ని వాటి పాత్ర అవి పోషించాయి. భాషా రాష్ట్రాల విభజన వద్దనే సిపిఎం మినహా మిగిలిన పార్టీలన్ని తమ తమ వంతు గందరగోళం తాము చవి చూశాయి. అఖిలపక్ష సమావేశం, ఆ పైన శ్రీకృష్ణ కమిటీ నివేదిక, ఆ నివేదికలో సమైక్యత అత్యుత్తమని చెప్పడాన్ని ఆహ్వానించిన వారు కొందరు, విభజన తర్వాత మెరుగని చెప్పడంపై నొక్కిన వారు కొందరు. కేంద్రం మాత్రం ఏమీ చెప్పకుండా మరో సమావేశం పిలిచి మరింత ప్రతిష్టంభనకు కారణమైంది. పిలిచే వారు ఎందుకు పిలిచారో ఏమనుకుంటున్నారో చెప్పకుండా అపనిందను అవతలివారిపై నెట్టే పని కేంద్రం చాలా జయప్రదంగా చేసింది. మొదటి సమావేశంలో మరింతగా అభిప్రాయ సేకరణ చేయాలన్నది,ఆ పైన శ్రీకృష్ణ కమిటీకి అభిప్రాయ నివేదన, దాని నివేదికలో ఏదో ఒక భాగాన్ని స్వాగతించడం అన్ని పక్షాలూ చేశాయి.ఎటొచ్చీ కేంద్రం ఏదీ తేల్చకుండా నాన్చి ప్రతిష్టంభన పెంచింది. దీన్ని ఉపయోగించుకుని జెండాలు లేని ఏకాంశ అజెండా అంటూనే ఎవరి రాజకీయ వ్యూహాలు ప్రతి వ్యూహాలు వారు అమలు చేసుకున్నారు. ప్రభుత్వం ప్రేక్షక పాత్రలోకి మారి పక్షపాతం ఆరోపణలు పక్షవాతం అపహాస్యాలు మూటకట్టుకుంది. సమాంతరంగా సమస్యలు పేరుకుపోయి సామాన్యులు అవస్తల పాలైనారు. సంఘాల వారీ ఉద్యమాలు నడిపే వామపక్ష శ్రేణులను మినహాయిస్తే తక్కిన ప్రధాన శక్తులన్ని ప్రాంతీయ వాదాలలో ఉక్కిరి బిక్కిరవుతూ వుండిపోయాయి. అదనంగా అధికార పక్షం జగన్‌ రూపంలో అంతర్గత సవాళ్లను అస్తిత్వ సమస్యలను కూడా ఎదుర్కోవలసి వచ్చింది.
అయిదు రాష్ట్రాల ఎన్నికలు కడప ఉప ఎన్నికలు అయ్యాక ఈ సమస్యపై ఏదో ప్రకటన వెలువడుతుందని స్పష్టత వస్తుందని ప్రచారం జరిగింది.కాంగ్రెస్‌ తెలంగాణా నాయకులు, టిఆర్‌ఎస్‌ నేతలు కూడా ఈ మేరకు ఆశాభావం కలిగించారు. తీరా జరిగింది వేరు. ఫలితాల వెనువెంటనే విచ్చేసిన గులాం నబీ ఆజాద్‌ ఎజెండానే మార్చేశారు.ఆయన సాగించిన అభిప్రాయ సేకరణ తతంగం యావత్తూ ముఖ్యమంత్రిపై ఫిర్యాదుల స్వీకరణకు అవకాశం ఇవ్వడంగానే నడిచింది తప్ప ఆంధ్ర ప్రదేశ్‌ భవిష్యత్తుకు సంబంధించిన సమగ్ర దృక్పథం అందులో నాస్తి. వెళ్లేముందు చేసిన ప్రకటనలోనూ కాంగ్రెస్‌ పటిష్టత గురించి చెప్పడం తప్ప అనిశ్చితి తొలిగించే ఆలోచనే లేదు. ఒక విధంగా రాజకీయ దృష్టిని అధికార పక్ష అసమ్మతి వైపు, పదవుల పంపకం వైపు మరల్చడం అధిష్టానం ఆలోచనగా తేలిపోయింది. ఆ పైన ముఖ్యమంత్రి ఢిల్లీ యాత్ర కూడా ఆ దిశలోనే సాగింది.ప్రతిష్టంభనలో పడిపోయిన ప్రజా సమస్యల పరిష్కారం గురించి ప్రభుత్వంలో ఏకీభావనను కదలికను తీసుకురావడం గురించి మాత్రం ఇసుమంతైనా ఆలోచించినట్టు కనిపించదు. అసమ్మతి స్వరాలు అధికారంలో వాటా విషయానికి వచ్చే సరికి మళ్లీ ప్రాంతాల తేడా లేకుండా కాంగ్రెస్‌ నేతలు ఆసక్తి చూపుతున్నారు. ఆక్షేపించిన వారిపై ఆగ్రహిస్తున్నారు. పదవి వస్తే తీసుకోవడం రాకపోతే ప్రాంతీయ నినాదం ఎత్తుకోవడం కోసం ముఖ్యులే ఎదురు చూస్తున్నారు.ఈ విషయంలో ఎంపిల కన్నా ఎంఎల్‌ఎలకు ఎక్కువ ఆసక్తి గనక వారి వారి స్పందనలలోనూ తేడా కనిపిస్తున్నది.
తెలుగు దేశం నాయకత్వం తెలంగాణా సమస్యపై ఎదుర్కొంటున్న తర్జనభర్జనలు తడబాట్ల ఫలితం నాగం ప్రహసనంలో ప్రస్పుటమైంది. అస్పష్టతే కాంగ్రెస్‌ విధానం కూడా అయినప్పటికి సంస్థాగత నిర్వహణలో తెలుగుదేశం ఎక్కువ గజిబిజికి గురి కావడానికి చాలానే కారణాలున్నాయి. టిఆర్‌ఎస్‌ ప్రత్యక్ష పరోక్ష దాడి కూడా ఎక్కువగా తెలుగుదేశంపైనే కేంద్రీకృతమవుతున్నది. తెలుగుదేశం ఇక్కడ పూర్తిగా దెబ్బ తినిపోయిందంటున్న టిఆర్‌ఎస్‌ నేతలు ఈ విమర్శలతో ఎందుకు దానికి ప్రాధాన్యత నిస్తున్నారో అర్థం కాదు. ఎప్పటికైనా తమ కోర్కె కేంద్రం ద్వారా నెరవేర్చుకోవాలి గనక కాంగ్రెస్‌తో మరీ సూటిగా తలపడకూడదన్న ఆలోచన వారిది. పైగా కాంగ్రెస్‌ ఎప్పటికప్పుడు ఏవో వలలు విసురుతూనే వుంది. తెలుగుదేశం ద్వంద్వ వైఖరి సమర్థనీయం కాకున్నా దాన్ని బట్టే కేంద్రం నిర్ణయం తీసుకోలేకపోతున్నదని చెప్పడం తర్క విరుద్ధంగా వుంటుంది. పైగా ఏ నిర్ణయం తీసుకున్నా దాని వల్ల రాజకీయ లబ్ది తమకే లభించాలనుకుంటున్న కాంగ్రెస్‌ నేతలు మరెవరో రాసే లేఖను బట్టి నిర్ణయం తీసుకుంటారనుకోవడం కూడా అసంబద్దం. ఈ విషయంలో టిఆర్‌ఎస్‌కే ఘనత రాకూడదని వారు భావిస్తుంటే తెలుగుదేశం లేఖతో తలకిందులయ్యేది వుండదు. ఇప్పటి వరకూ తెలుగుదేశం ముఖ్య నాయకుడుగా వున్న నాగం ఇంతగా ధ్వజమెత్తుతున్నారంటే వ్యక్తిగత వ్యూహాలు వుంటాయనుకోవడం సహజం. గతంలో ఆయనను తీవ్రంగా విమర్శించిన టిఆర్‌ఎస్‌ బయిటకు వచ్చే వరకూ అనుకూలంగా మాట్లాడినా ఆ ఘట్టం ముగిశాక ఆయన స్వంత వేదిక ఏర్పాటు చేసుకోవడాన్ని స్వాగతిస్తుందనుకోలేము. రెండు ప్రధాన పార్టీలలాగానే ద్వంద్వ వైఖరిని పాటిస్తూ తన పునాదిని ఏర్పాటుచేసుకోవడానికి వైఎస్‌జగన్‌ ప్రయత్నించే అవకాశమూ వుంటుంది. పార్టీల వైరుధ్యాలు వివిధ సంఘాల వ్యక్తుల శక్తుల ఘర్షణల మధ్య కనక తెలంగాణా రాజకీయ రంగ స్థలంపై ఆనేక మలుపులూ కుదుపులూ చూడవలసే వుంటుంది. ఈ క్రమంలో దెబ్బతినిిపోయేది జన బాహుళ్యం జీవిత పోరాటాలే.
ఇలాటి స్థితిలో కేంద్రం రెండవ ఎస్సార్సీ గురించి మాట్లాడ్డం అనుచితమే కాక ఆందోళన కరం కూడా. స్వాతంత్రానంతరం బ్రిటిష్‌ పాలనలోనూ రాజుల పాలనలోనూ రెండుగా చీలి వున్న దేశాన్ని పునరవ్యవస్థీకరిచండానికి ఎస్సార్సీ అవసరమైంది.ప్రధానంగా భాషా ప్రాతిపదికన,చరిత్ర భౌగోళికత కూడా కొలబద్దలుగా ఏర్పడిన రాష్ట్రాలు ఇప్పటి వరకూ ఒద్దికగానే నడిచాయి. స్వల్ప మినహాయింపులు సమస్యలు వున్నా వాటన్నిటినీ తిరగదోడి తేనెటీగల తుట్టెను కదల్చవలసిన అవసరమే లేదు. రాజకీయంగానే గాక రాజ్యాంగ పరంగానూ ఆ అవసరం లేదు. ఒక చోట తనే సృష్టించిన సంక్షోభాన్ని పరిష్కరించకుండా దేశ వ్యాపితంగా విస్తరింపచేయడానికే అది పనికి వస్తుంది.దేశ భద్రత, ప్రజల ఆహార సరఫరా, అధిక ధరలు, అవినీతితో సహా అనేక సమస్యలు పట్టిపీడిస్తుంటే వాటిని వదలి కొత్త సమస్యలు సృష్టించుకోవడం అవివేకం. అనర్థకం. (ఆంధ్రజ్యోతి గమనం- 26,5,11)

No comments:

Post a Comment