Pages

Tuesday, December 6, 2011

అవిశ్వాసపర్వంలో ఎవరేమిటి? తర్వాతేమిటి?అనుకున్న విధంగానే అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అయితే రాష్ట్ర రాజకీయాల పొందికను స్పష్టీకరించేందుకు దోహదం చేసింది.చాలా కాలంగా చాలా విషయాల్లో ఎదురు దాడికి గురవుతున్న ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం తన స్థానాన్ని పునరుద్ఘాటించుకోడానికి, చొరవ చాటుకోవడానికి సందర్భమైంది. రైతు సమస్యలపై తీర్మానం అని చెప్పినప్పటికీ నిజంగా సమస్యలపై కేంద్రీకరణ తక్కువేనని చెప్పాలి. మరోవైపున అవినీతి వ్యవహారాలు, మంత్రివర్గంలో అనైక్యత, రాజకీయ అనిశ్చితి, జగన్‌ వర్గం సవాళ్లు తదితర అంశాలను చర్చించేందుకు కూడా అవకాశం చిక్కింది.
ఇక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అనుకున్న మేరకు బలాన్ని సమీకరించడంలోనూ వున్న వారిని పూర్తిగా నిలబెట్టుకోవడంలోనూ విఫలమైనప్పటికీ- దాదాపు ఇరవై మంది సభ్యులు పాలకపక్షం నుంచి విడగొట్టుకునేట్టు చేయడంలో కృతకృతమైంది. ఇందులో త్యాగం సిద్ధాంతాలు వంటివి ఏమీ లేకున్నా అధికార పక్షంలో రాజకీయ సంక్షోభ వాతావరణం తీసుకురాగలిగింది.అయితే పదే పదే పడగొట్టడం గురించి తాము చేసిన సవాలు సమీపంలోకి కూడా రాలేకపోవడం వారికి ఎదురుదెబ్బ లాటిదే.ఇప్పుడు విప్‌ను ధిక్కరించిన తమ వారిపై వెంటనే అనర్హత వేటు వేయించుకుని ఎన్నికలకు వెళ్లాలన్న ఆతృత జగన్‌ తదితరుల్లో కనిపిస్తున్నది.

బేషరతుగా లీనమై పొరబాటు చేశామని పశ్చాత్తాప పడుతున్న ప్రజారాజ్యం కాస్త బెట్టుచేసి ఏవో హామీలు సంపాదించుకోవడానికి కూడా అవిశ్వాసం అక్కరకు వచ్చింది. ప్రభుత్వం తమ వల్లే నిలబడిందని చెప్పుకునే అవకాశం లభించింది.అయితే అవసర సమయంలో బేరసారాలు చేయడం భవిష్యత్తుపై ఎలాటి ప్రభావం చూపిస్తుందో చెప్పడం కష్టం. మజ్లిస్‌ విషయంలో కొత్తగా చెప్పాల్సింది లేదు గాని
వారు సమైక్యతకు కట్టుబడి వుంటామని గట్టిగా చెప్పడం గమనించదగ్గది.పైగా ఆ రోజునే హైదరాబాద్‌ మేయర్‌తో రాజీనామా చేయించడం చూస్తే రాజకీయ బేరాలు ఎంత ఖరాఖండిగా వుంటాయో తెలుస్తుంది.
జగన్‌ వర్గంతో దీటుగా ప్రభుత్వాన్ని పడగొట్టడం గురించి అవిశ్వాసం గురించి పదే పదే సవాళ్లు విసిరిని టిఆర్‌ఎస్‌ ఓటు ఇటే వేసినప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని సాధించడంలో ఏ మాత్రం సఫలం కాలేదు.చంద్రబాబు ఆ వూసే ఎత్తుకోకపోయినా ఆ తీర్మానాన్ని బలపర్చింది. కొత్తగా ప్రాంతీయ సమస్యపై దానితో కలసి వచ్చిన వారు లేకపోగా వేణుగోపాలాచారి వంటి వారు మాతృసంస్థ గూటిలోకి చేరినట్టు కనిపించింది.తెలంగాణా కాంగ్రెస్‌ నాయకులను టిఆర్‌ఎస్‌ ఎంతగా విమర్శించినప్పటికీ - వారు మొదటి నుంచి ప్రభుత్వాన్ని కాపాడుకుంటామని చెబుతూనే వున్నారన్నది కాదనలేని నిజం. ప్రజారాజ్యం లాగా మజ్లిస్‌లాగా తెలంగాణా కాంగ్రెస్‌ నాయకులు ప్యాకేజీ కింద ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకోలేకపోయారని కెటిఆర్‌ వంటి నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవానికి చాలా దూరంగా వున్నాయి కిషన్‌ రెడ్డి కూడా టిఆర్‌ఎస్‌ను మించి పోయేలా ప్రత్యేక రాష్ట్రం గురించి మాట్లాడారు గాని ఇది పార్లమెంటులో ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరుకు భిన్నంగా వుండటం విశేషం.
వామపక్షాలు వాటి స్వభావం ప్రకారమే ప్రజా సమస్యలపైన పాలక పక్షం దివాళాకోరు తనంపైన కేంద్రీకరించాయి. సిపిఐ కూడా ప్రత్యేక రాష్ట్ర వాదనను వినిపించితే సిపిఎం సభ్యుడు రంగారెడ్డి ప్రధాన పార్టీల ద్వంద్వ భాషణాన్ని ఎండగట్టారు. అయితే అన్నిటికన్నా విచిత్రమైన ప్రసంగం చేసిన వ్యక్తి లోక్‌సత్తా జయప్రకాశ్‌ నారాయణ్‌.ఏ మాత్రం కేంద్రీకరణ లేకుండా అన్ని పక్షాలనూ ఒకే గాట కడుతూ షరామామూలుగా సూక్తిముక్తావళి వినిపించారు. ముఖ్యమంత్రి అవినీతి రహితంగా వున్నారని చెప్పడం ఎలా వున్నా ఈ సందర్బంలో అది పాలకపక్షానికి కితాబులాగా అనిపించింది. పైగా తటస్టం అంటూనే ప్రభుత్వం వైపు మొగ్గినట్టనిపించింది. సంక్షేమ కార్యక్రమాలను ఎద్దేవా చేయడం, చిల్లర వ్యాపారంలో ఎఫ్‌డిఐలను స్వాగతించడం ఆయన అసలైన స్వభావాన్ని మరోసారి విదితం చేసింది.
సభా నాయకుడు ప్రతిపక్ష నాయకుడు పదునుగా మాట్లాడ్డంలో తప్పు లేదు గాని పరస్పర దూషణలతో సమయం పోగొట్టడం శోచనీయమని చెప్పకతప్పదు.తను కూడా వెనకబడకూడదని సత్తిబాబు ఆఖరులో ప్రదర్శించిన అత్యుత్సాహం భవిష్యత్తులో కిరణ్‌ కుమార్‌ రెడ్డికి కూడా శుభ సంకేతం కాదు.
సకల జనుల సమ్మె విరమణ, రాష్ట్ర విభజన ఇప్పుడు సాధ్యం కాదని ప్రధాని ప్రకటన, కిరణ్‌ ఏడాది పాలన పూర్తి, అవిశ్వాస తీర్మానం వీగిపోవడం ఇవన్నీ రాజకీయ పొందిక ఒక కొలిక్కి రావడానికి కారణం అవుతున్నాయి. అయితే అత్తెసరు మెజారిటీతో బతికి బట్టకట్టిన ప్రభుత్వం భవిష్యత్తులోనూ అస్తుబిస్తుగా ప్రతివారి బెదిరింపులకు భయపడుతూ మనుగడ సాగించాల్సిందే.
ఇక తమపై ఆనర్హత వేటు వేయమని జగన్‌ శిబిరం సవాళ్లు విసరడం ఉప ఎన్నికల ఉత్సాహాన్ని సూచిస్తుంది. అనవసరంగా దాదాపు 27 స్థానాల్లో ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలున్నాయి. ఇవి రాబోయే ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌వంటివే. అయితే ఆ విషయం స్పష్టం కావడానికి కొన్ని రోజులు ఆగాల్సిందే!
రెండోది ప్రధాన పాత్రధారులు కోర్టు కేసులు సిబిఐ దర్యాప్తులలో చిక్కుకుని వున్నారు గనక ఆ పరిణామాలు కూడా ప్రభావం చూపించడం అనివార్యం. ఏతావాతా అస్థిరత్వం కొనసాగడం తథ్యం.


No comments:

Post a Comment