Pages

Tuesday, December 27, 2011

నిజరూపాల నిరూపణ, కొనసాగిన ప్రజా కార్యాచరణ

కాలగతిలో కరిగిపోతున్న 2011 చివరి ఘట్టం. సమీక్షకూ సమాలోచనకు సందర్భం. సంవత్సరం పొడుగునా చూసిన సమస్యలు సవాళ్లు సంవాదాలు సమరాలు సంచలనాలు సంతోష విషాదాలను బేరీజు వేసుకోవడానికి సరైన సందర్భం. కాలం ముందుకే పోతుంది తప్ప వెనక్కు నడవదు. గడియారాలు ఆగిపోవచ్చు గాని ఘడియలు ఆగవు. పరిణామ క్రమం కూడా అంతే..ప్రతికూలతలను ప్రతిఘటిస్తూ ముందుకు సాగడమే మానవాళి స్వభావం. కట్టుకథలు పటాపంచలు చేసి కఠోర సత్యాలను కళ్లకు కట్టడం, కల్పనలనూ కట్టుకథలను కుప్పకూల్చి కఠినతర పరీక్షలకు ప్రజా రాశులను సమాయత్త పర్చడం కాలసూత్రం.
2011 నే తీసుకోండి. ధర్నా చౌక్‌ నుంచి వాల్‌స్ట్రీట్‌ వరకూ ప్రతిచోటా కనిపించిన దృశ్యం ప్రతిఘటనే.సంస్కరణల పేరిట నల్లేరు మీద బండిలా నడిపించుకుపోవాలన్న నయవంచక పథకాలను వామపక్ష ప్రజాస్వామిక శక్తుల నుంచి అడుగడుగునా నిరసన వ్యక్తమవుతూ వచ్చింది. అది కూడా పరిమితులలో ఆగిపోకుండా అంతకంతకూ విస్తారమవుతూ వచ్చింది. ఇన్ని సమస్యల మధ్యనా సాధించుకున్న కోర్కెలు నిలువరించిన ప్రమాదాలు చాలా వున్నాయి. వీటిని చూసి బెంబేలెత్తిన సామ్రాజ్యవాదం మరింత తీవ్రంగా విరుచుకుపడుతున్న స్థితి.2007లో సద్ధాం హుస్సేన్‌ ఉరితీతతో ముగిసిపోతే 2011 కల్నల్‌ గడాపీని కడతేర్చడంతో ముగిసింది. అయితే అప్పటికీ ఇప్పటికీ చాలా తేడాలు. ఇరాక్‌లో తిష్ట వేసిన సైన్యాలు ఇంటి దారి పడితే అరబ్‌ దేశాలలో అనుకున్నట్టల్లా అడటానికి అనేక ఆటంకాలను ఎదుర్కొవలసిన స్థితి అమెరికాకు ఎదురవుతున్నది.ఆఖరుకు ఉపగ్రహం వంటి పాకిస్థాన్‌ సైనిక కూటమి కూడా పూర్తిగా లొంగిపోవడానికి నిరాకరించడంతో ఉద్రక్తత పెరుగుతున్నది. ఇరాక్‌పైన దురాక్రమణ సమయంలో కన్నా ఇప్పుడు ప్రపంచం అమెరికా అసలు వ్యూహాలను అర్థం చేసుకోగలుగుతున్నది. లిబియా తర్వాత ఏ దేశంపైన దాడి చేస్తారో అని ప్రతివారూ ముందస్తుగానే
గమనిస్తున్నారు. ప్రపంచాన్ని సముద్ధరించే సత్తా తమకే వుందన్న అగ్రరాజ్యం అప్పులు తెచ్చుకునే పరిమితిపై అంగీకారం కుదరక అస్థిరత్వంలో కూరుకుపోయి ఆఖరులో బయిటపడింది. అయితే ఇంతటికీ కారణమైన గుత్తపెట్టుబడిదారీ బహుళజాతి సంస్థల ఆధిపత్యాన్ని ఆక్షేపిస్తూ వారికి గుండెకాయ వంటి వాల్‌స్ట్రీట్‌నే ముట్టడించిన సంఘర్షణాత్మక సన్నివేశం సద్దుమణగలేదు. 2011 పొడుగునా ప్రపంచం చూసిన ప్రతిఘటనలకు ఒక విధంగా అది తలమానికమని చెప్పొచ్చు.
నిన్న అమెరికాకు దీటుగా నిలిచిన సోషలిస్టు దుర్గం సోవియట్‌ యూనియన్‌ విచ్చిన్నమై పోయిన తర్వాత ఏర్పడిన రష్యాలోనూ ఇదే పరిస్థితి. తిరుగులేని నాయకుడుగా ప్రచారం పొందిన వ్లదీమర్‌ పుతిన్‌ ప్రజాదరణలో వెనకబడి పోతే కమ్యూనిస్టులు బలం పెంచుకోవడం కనిపిస్తుంది. చైనా ఆర్థిక సామర్థ్యం పెంచుకుంటూ సంక్షోభాలను సవాళ్లను అధిగమిస్తూ తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగింది. లాటిన్‌ అమెరికాలోనూ ప్రగతిశీల శక్తుల ప్రస్థానం కొనసాగుతూనే వుంది. అన్నిటినీ మించి అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీల శిఖరాగ్ర సభ నూతనోత్సాహాన్ని ఇచ్చే విధంగా పోర్చుగల్‌లో జయప్రదంగా జరిగింది.
అమెరికాను అంటకాగడం కోసం మన పాలకులు రుద్దిన అణు ఒప్పందం అసలు రంగు కూడా ఈ ఏడాది బయిటపడి పోయింది. జపాన్‌లో సునామీ తర్వాత అణు విద్యుత్తు గురించిన ఆందోళన ప్రపంచమంతటా దట్టంగా అలుముకుంది. పైగా ఒప్పందంలో వున్న షరతులకైనా కట్టుబడకుండా ఇండియాను మరింత లొంగదీసుకునే అమెరికా వత్తిడి ప్రభుత్వానికి కూడా ఇరకాటంగా పరిణమించింది.వామపక్షాలు నాడు చేసిన హెచ్చరికలు నిజమయ్యాయని ప్రతివారూ ఒప్పుకోక తప్పని స్థితి. నాడు అణు ఒప్పందం విషయంలో పట్టుపట్టినట్టే ఇప్పుడు చిల్లర వ్యాపారంలో ఎప్‌డిఐల ప్రవేశానికి కూడా ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మొండి పట్టుపట్టడం, పార్లమెంటులో చర్చ లేకుండానే దాన్ని దేశంపై రుద్దడం తీవ్ర నిరసనకు దారి తీసింది.తాత్కాలికంగా పక్కకు పెట్టినా ఏ క్షణంలోనైనా దాన్ని పైకి తీసేందుకు ప్రభుత్వం ఇప్పటికీ సిద్ధంగా వుంది. దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టతను చర్యలు తీసుకోకపోగా చిల్లర బతుకులను కూడా ఛిద్రం చేసే ప్రమాదాన్ని ఈ ఏడాది ఎత్తి చూపించింది. ఈ చివరి ఘట్టంలోనే రూపాయి విలువ పతనం పాలకుల గొప్పలను పటాపంచలు చేసింది. ఆఖరుకు మన్మోహన్‌ సింగ్‌ దేశ పారిశ్రామిక వేత్తలను సమావేశ పర్చి పెట్టుబడులకు దేశం అనుకూలం కాదన్న అభిప్రాయాన్ని తొలగించాలని వేడుకుంటే ముఖేష్‌ అంబానీ తాను 70 వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతానని ప్రకటించాడట.
కార్పొరేట్‌ శక్తులతో కుమ్మక్కయిన పాలకులు అవినీతికి తలుపుల తెరచి ప్రజా ధనాన్ని ప్రకృతి వనరులను కూడా ధారాదత్తం చేస్తున్న వైనం అనేక విధాల బహిర్గతమైంది. టు జి స్పెక్ట్రం, కామన్వెల్త్‌, ఆదర్శ, ఓబులాపురం గనులు వగైరా అనేకానేక కుంభకోణాలు అక్రమ వ్యవహారాలు దేశాన్ని కలవరపర్చాయి. ఘనత వహించిన మంత్రులు ఎంపిలు ఎంఎల్‌ఎలు పరిశ్రమాధిపతులు ఆశ్రిత పెట్టుబడిదారులు కన్నంలో దొరికి పోయి కటకటాలు లెక్కపెట్టాల్సి వచ్చింది.ప్రపంచీకరణ ప్రైవేటీకరణ విధానాలు ప్రజలకు ఎంత చేటు తెచ్చిందీ దాచేస్తే దాగని సత్యంలా రుజువు కావడం ఈ ఏడాది ప్రత్యేకత. అవినీతి భారతం అంతు తేల్చాలనే ఆగ్రహావేశాలు సగటు భారతీయుల్లో సర్వసాధారణమయ్యాయి. ఈ కారణంగానే అన్నా హజారే లోక్‌పాల్‌ బిల్లుకై నిరాహారదీక్ష ప్రారంభించినపుడు ప్రజలు వేనోళ్ల హర్షించారు. అయితే ఆయన ఉద్యమానికి వున్న పరిమితులు, కొన్ని పాక్షిక ధోరణులు కూడా గమనించారు. ఎట్టకేలకు ఒక లోక్‌ఫాల్‌ బిల్లు ముసాయిదా ప్రవేశపెట్టవలసిన పరిస్థితి పాలక పక్షానికి ఎదురైంది. పార్లమెంటులో దానిపై జరిగే చర్చతో ఈ తతంగం సమాప్తం కానుంది. బహుశా సమగ్ర రూపంలో ఆమోదించడం తర్వాతి ఏడాదిలో జరగొచ్చు. ఈ సమయంలోనే అన్నా నిరాహారదీక్ష కార్యక్రమంపై ముంబాయి హైకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా గమనించదగ్గవి. పైన చెప్పుకున్న నేపథ్యంలో కార్పొరేట్‌ చొరబాటను పట్టించుకోకుండా ఆదర్శ సూత్రాల్లా అవినీతి వ్యతిరేకత వల్లించడం వల్ల ప్రయోజనం వుండదని కూడా పుట్ట పగులుతున్న అవినీతి వ్యవహారాలు తేటతెల్లం చేస్తున్నాయి.
ఈ క్రమంలో ఆంధ్ర ప్రదేశ్‌ దేశ రాజకీయ పటంలో ప్రత్యేక స్థానం సంపాదించింది. వైఎస్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక సంతర్పణలపై న్యాయ స్థానాలు దర్యాప్తుకు ఆదేశించడం సంచలనం కలిగించింది. ఈ కేసులన్ని వాస్తవానికి సరళీకరణ విధానాల దుష్ఫలితాలే. వైఎస్‌ జగన్‌పై రాజకీయంగా ప్రభావం ఏమిటని ఆలోచిస్తున్నంతగా చాలామంది వీటి వెనక వున్న విధానపరమైన అంశాలను పట్టించుకోవడం లేదు. ఇవి జగన్‌కే పరిమితమైనవి కాదు.తర్వాత దశలో చంద్రబాబు హయాంలోని లావాదేవీలపైన సిబిఐ దర్యాప్తుకు ఆదేశాలు రావడంతో పూర్తిగా రాజకీయ వాదోపవాదాలు పెరిగి దీని వెనక వున్న విధాన పరమైన అంశాలు మరుగున పడ్డాయి. ఇప్పుడు చంద్రబాబుతెదితరులపౖౌౖె దర్యాప్తు తాత్కాలికంగా నిలిచిపోగా మిగిలినవి కొనసాగుతున్నాయి. సిబిఐ గనక నిజంగా వాస్తవాలు వెలికి తీయగలిగితే. ప్రైవేటీకరణ భజన పరులకు అనేక విలువైన పాఠాలు లభిస్తాయి
రాష్ట్ర రాజకీయాలలోనూ ఈ ఏడాది అనేక మలుపులు వచ్చాయి. పాలక పక్షం అస్తిత్వ సమస్యలు, ప్రాంతీయ సమస్య కొనసాగింపు వాటిలో ముఖ్యమైనవి. జగన్‌ స్వంత పార్టీ ప్రకటించుకుని కడప ఉప ఎన్నికలలో విజయం సాధించడంతో ఒక ఘట్టం పూర్తయింది. తర్వాత శాసనసభలో అవిశ్వాస తీర్మానం సందర్భంలో ఆయన బలం వెల్లడైంది. ఇక ఆయన వెంటనడిచిన ఎంఎల్‌ల నియోజకవర్గాల్లో తెలంగాణాలో పార్టీలనుంచి రాజీనామా చేసిన కాంగ్రెస్‌ తెలుగు దేశం స్థానాల్లో ఉప ఎన్నికలు ఇప్పుడు జరగాల్సి వుంది.దాన్ని బట్టి భవిష్యత్‌ రాజకీయాలు ఎలా వుంటాయో సూచన ప్రాయంగా తెలుస్తుంది. అవిశ్వాస తీర్మానం వీగిపోయిన తర్వాత అధికార పక్షంలో అంతర్గత కలహాలు తీవ్రమవడం మరీ ముఖ్యంగా మంత్రివర్గంలో ప్రతిబింబించడం ఏడాది చివరలో ప్రస్పుటమైంది. ప్రాంతీయ వివాదాలకు సంబంధించి పరిపరివిధాల పాచికలు విసురుతూ గడువులు ప్రకటిస్తూ వచ్చిన కేంద్రం, దానిపై నమ్మకం కలిగించేలా మాట్లాడిన టిఆర్‌ఎస్‌లు మాటలు నిజం కాలేదు. సకల జనుల సమ్మె తర్వాత కొంత స్తిమితం ఏర్పడింది. 2009లో రగిలిన రావణ కాష్టం చల్లారకుండానే 2011 ముగిసిపోతున్నది.కాకపోతే ఈ అనుభవం ప్రజలకు ఎవరేమిటో తెలియడానికి బాగా ఉపయోగపడింది.
ఇన్ని సవాళ్ల మధ్యనా వామపక్షాలు ప్రజా సంఘాలు ఉద్యోగ కార్మిక సంఘాలు సమస్యలపై పోరాటాలు సాగించాయి.పలు కోర్కెలు సాధించుకున్నాయి కూడా. ప్రాంతీయ సమస్యపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించిన సిపిఎం ప్రజా సంఘాలు సమరశీల సంప్రదాయాన్ని కొనసాగించి పలు సత్ఫలితాలు సాధించాయి. అవాంఛనీయ ఉద్రేకాలను పెంచిన పార్టీలే సంక్షోభంలో పడిపోగా భాషా రాష్ట్రాల సూత్రానికి కట్టుబడిన సిపిఎం ఖచ్చితమైన వైఖరిని ప్రజలు ఆర్థం చేసుకున్నారు. ఈ కాలంలో నిరంతరాయంగా జరిగిన ఉద్యమాలకు ప్రచారం ఎంత వచ్చిందనే దానితో నిమిత్తం లేకుండా సంబంధిత తరగతులను కదిలించగలిగాయి.సభ్‌ ప్లాన్‌కై పోరాటంతో సామాజిక న్యాయ సమరం కొత్త శక్తి కూర్చుకుంది.ఈ సమయంలో కూడా 104 ఉద్యోగుల కోర్కెలపై నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. వివిధ సంఘాల కార్యక్రమాలు మహాసభలు జయప్రదంగా పూర్తి కాగా ఇప్పుడు సిపిఎం రాష్ట్ర మహాసభకు ఖమ్మం స్వాగతం పలుకనున్నది.నిస్సందేహంగా ఈ సభ సమరశీల ఉద్యమాలకు దిశా నిర్దేశం చేస్తుందని విశాల ప్రజా రాశులు ఉద్యమ శ్రేణులు ఎదురు చూస్తున్నారు.
జాతీయంగానూ పశ్చిమ బెంగాల్‌లో సుదీర్ఘ వామపక్ష పాలన తర్వాత ఎన్నికల పరాజయం ఎదురైనా ఉద్యమ స్థయిర్యం నిలబెట్టుకోవడంలో సిపిఎం సఫలీకృతమైంది. మమతా బెనర్జీ పాలన తొలి దశలోనే విడ్డూరపు పోకడలు, కలసి కత్తి కట్టిన మావోయిస్టులపైనే దాడులు చేసి కిషన్‌జీని హతమార్చడం వంటి ఘటనలు అమానుష రాజకీయాల అనివార్య ఫలితాలను తేటతెల్లం చేశాయి.కేరళలోనూ బొటాబొటిగా గద్దెక్కిన యుడిఎఫ్‌ పరిస్థితి సజావుగా లేదు.మతతత్వ బిజెపి కొత్తగా కోలుకున్నది లేకపోగా రకరకాల విభేదాలు గందరగోళాలు దాన్ని వెంటాడుతున్నాయి. కర్ణాటక గనుల కుంభకోణంలో గాలి అరెస్టు,ఆ పైన యడ్యూరప్పకు ఉద్వాసన దీనికి పరాకాష్ట. ఈ నేపథ్యంలోనే యుపితో సహా అయిదు రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల పోరాటం కూడా దేశ రాజకీయాలను తదుపరి పార్లమెంటు ఎన్నికల తీరును సూచించనున్నది. కొత్త ఏడాది మొదట్లోనే జరిగే ఆ ఎన్నికలకు ముందస్తుగా యుపి ని నాలుగు రాష్ట్రాలుగా విభజించాలన్న ముఖ్యమంత్రి మాయావతి ప్రతిపాదనపై కాంగ్రెస్‌ బిజెపిల స్పందన వాటి ద్వంద్వ నీతికి అద్దం పట్టింది. భారత దేశంలో భాషా రాష్ట్రాల నిర్నిబంధ పునర్విభజన అంత సులభం కాదని అర్థమైంది.
సాంసృతికంగానూ సామాజికంగానూ కలిగిన పరిణామాలు కూడా చెప్పుకోదగినవే. పుట్టపర్తి సత్యసాయిబాబా మరణం, అంతకు ముందు సాగిన వివాదాలు ఆధ్యాత్మికత పేరిట అల్లుకుపోయిన మాయా జగతి మర్మాలను వెల్లడించాయి. ఇప్పుడు అక్కడ సందడి కూడా తగ్గు ముఖం పట్టగా సందేహాలే మిగిలాయి.వస్తు వినిమయ సంసృతి పెంచిన వికృతాలకు నేరస్త పోకడలకు మహిళలపై అత్యాచారాలకు తీవ్ర నిరసన వ్యక్తమైంది. రకరకాల మాఫియాల బారి నుంచి మత చాందసాల నుంచి సామాజిక జీవితాన్ని రక్షించుకోవాలన్న మెళకువ పెరిగింది.ఈ క్రమంలో మీడియా, న్యాయ వ్యవస్థ వంటివి కూడా విమర్శల బారి నుంచి తప్పించుకోలేకపోయాయి.
అందుకే కఠోర సత్యాలను నిరూపించిన కాలంగా, కార్యాచరణను నొక్కి చెప్పిన కాలంగా 2011 ను చెప్పుకోవచ్చు.ఈ అవగాహన రాబోయే ఏడాదిలో కర్తవ్యాలను మరింత బాగా నెరవేర్చడానికి దోహదం చేస్తుందని ఆశించాలి.

No comments:

Post a Comment