Pages

Wednesday, December 7, 2011

అస్థిర విశ్వాసం
'నేనోడిపోయి గెలుపొందినాను, గెలిచానని నవ్వనా ఏడ్వనా' అంటూ నలభయ్యవ దశకంలో వచ్చిన పండంటి కాపురంలో పాట వుంటుంది. మనసా కవ్వించకే నన్నిలా అన్న పల్లవితో సాగిన ఆ పాటలోని పై చరణాలు మొన్న శాసనసభలో అవిశ్వాస తీర్మాన సన్నివేశానికి అచ్చంగా సరిపోతాయి. ఈ తీర్మానం రాష్ట్ర రాజకీయ పరిస్థితిలో స్థిరీకరణ తీసుకువచ్చిందని ఒక కోణంలో అస్థిరత్వాన్ని స్థిరపరచిందని మరో కోణంలో చెప్పొచ్చు. పరస్పర విరుద్ధంగా కనిపించే ఈ అభివర్ణనే అత్యంత వైరుధ్య భరితంగా వున్న ప్రస్తుత రాజకీయ స్తితికి సరైన నిర్వచనం.
జగన్‌పై కేసుల దర్యాప్తు, సకల జనుల సమ్మె, ప్రస్తుతం తెలంగాణా విభజన సాధ్యం కాదని ప్రధాని వ్యాఖ్య, చంద్రబాబు అస్తులపై దర్యాప్తుకు హైకోర్టు ఉత్తర్వులు, కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఏడాది పూర్తి ఇవన్నీ ఇటీవల కొన్ని ముఖ్యమైన మలుపులు. కాగా అవిశ్వాస తీర్మానం వాటన్నిటికి పరాకాష్ట. అది చెప్పుకోదగినంత తేడాతో వీగిపోయింది గనక విజయం తమదేనని అధికార పక్షమైన కాంగ్రెస్‌ చెప్పుకోవచ్చు. అయితే జగన్‌ 16 మంది ఎంఎల్‌ఎలను తీసుకుపోవడం వల్ల కొట్టిన గండి ఆ ఆనందాన్ని ఆవిరి చేసేస్తుంది. రాష్ట్ర కాంగ్రెస్‌ అంతర్గత కలహాల చరిత్రలో ఇంత తీవ్రమైన గండి గతంలో చూసి వుండకపోవచ్చు. ప్రజారాజ్యం పార్టీని ముందస్తు జాగ్రత్తతో విలీనం చేసుకోవడం వల్ల మజ్లిస్‌ మద్దతు వల్ల గండం గడిచి గట్టెకిని గండి మాత్రం పూడదు. పైగా రేపెవరైనా మరో గండి పడితే విజేత చిత్రంలో వలె ఆదుకోవడానికి మరో మెగాస్టార్‌ కూడా వుండరు. జగన్‌ శిబిరం మొదట చెప్పుకున్నట్టు అరవై మందిని గాక
పాలక పక్షీయులు 16 మందినే( మరో ముగ్గురు ఇతరులు) తీసికుపోయి వుండొచ్చు. కాని ఆ సంఖ్య కూడా తక్కువేమీ కాదు. 29 నుంచి 19కి ఆయన వర్గీయులను దించిన తర్వాత మరింత మందిని రాబట్టే ప్రయత్నంలో ప్రభుత్వ ప్రతినిధులు విఫలమైనారన్నది వాస్తవం. ఇప్పుడు ఆ 16 మందినైనా అనర్హతకు గురి చేసేందుకు తటపటాయించచడంలోనూ కాంగ్రెస్‌ కలవరం స్పష్టం.
అవిశ్వాసం వచ్చింది కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వంపైన అయినా అందరి దృష్టి జగన్‌ వైపే కేంద్రీకృతమైందంటే వారు చలామణిలో పెట్టిన అంచనాలు, ఆశలే కారణం .ఒక్కసారి తెలుగు దేశం అవిశ్వాసం పెడితే ప్రభుత్వం కుప్పకూలిపోతుందని వారు గట్టిగానే చెప్పారు. అయితే ఆ అవకాశం వచ్చేసరికి మాత్రం చాలా పరిమితంగానే వుండిపోయారు. తెలుగు దేశం ఆలస్యంగా తీర్మానం తెచ్చిందని ఆరోపించవచ్చు గాని దానివల్ల తమ బలం పెరగదు. పైగా ఒకవైపున విమర్శలు చేస్తూ కేసులు వేస్తూ ఆ పార్టీ తమ మాట ప్రకారం నడుచుకుంటుందని ఆశించడమే అవాస్తవం.అలా చేయకపోవడం వారి అపరాధమంటే చెల్లుబాటూ కాదు. అదే విధంగా కాంగ్రెస్‌ ప్రలోభాలు ప్రయోగించిందని తిట్టిపోసినా ఫలితం శూన్యం, తమతో నిలబడిన 19 మంది విలువలకు నిలువెత్తు ప్రతిరూపాలని చెప్పుకోవచ్చు గాని ఇక్కడ విలువల కన్నా విభేదాల విన్యాసాల పాత్రే ఎక్కువ. విజయమ్మ ప్రథమ ప్రసంగం ప్రత్యక్ష ప్రమేయం కూడా ఆ కుటుంబ వ్యూహాలలో ప్రాధాన్యత గల అంశాలే. ఆమె మాటలపై ఇటునుంచి బొత్స, అటునుంచి సీతక్క ఇచ్చిన జవాబులివ్వడం అందువల్లనే జరిగిందనుకోవాలి. వ్యక్తిగత సామాజిక ఆర్థిక అనుబంధాలు కారణమైనంతగా ఇందులో విలువల ప్రసక్తి కనిపించదు. కాంగ్రెస్‌ ప్రయోగించిన ప్రలోభాల మాట ఒకటైతే వారిని నిలబెట్టుకోవడానికి పదే పదే సమావేశాలు సమాలోచనలు జరిపి భరోసాలు గుప్చించడం బహిరంగంగానే సాగింది. ఉద్దేశ పూర్వకంగా రాజకీయ అనుబంధాలు మార్చే శాసనసభ్యులను ఎవరో దారి మళ్లించారని చెప్పడం పొసిగేది కాదు. అలాటి ఆరోపణలు అవతలి వారూ సంధిస్తున్నారు గనక ఇదో పెద్ద ప్రహసనం. ఇప్పుడు వున్నవారిపైనైనా అనర్హత వేటు వెనువెంటనే అందరిపై గుండుగుత్తగా వేస్తే ఉప ఎన్నికల్లోకి వురకవచ్చన్న ఉబలాటం ఆ శిబిరంలో బాగా కనిపిస్తుంది.తద్వారా తమ నిజమైన బలాన్ని పరీక్షించుకోవాలనీ భావిస్తుండవచ్చు.
జగన్‌ వర్గం నిష్క్రమణకు ముందే కాంగ్రెస్‌లో ప్రవేశించిన చిరంజీవి తీర్మానం తర్వాత కూడా ప్రజారాజ్యం అస్తిత్వం ప్రత్యేకంగా వున్నట్టే మాట్లాడారు.ఆ పార్టీని విలీనం చేయడమే అనివార్యమైన అవసరంతో జరిగింది తప్ప ఐచ్చికంగా కాదు. తాను కాదంటే తమ ఎంఎల్‌ఎలు గోడదూకుతారని ఆయనకు అప్పుడూ ఇప్పుడూ తెలుసు. వారిని సంతృప్తి పర్చడానికే తగు సన్నివేశం చూసుకుని ఆగ్రహం అభినయించారు.ఆ క్రమంలో అనుగ్రహం ప్రదిర్శంచిన కాంగ్రెస్‌ నేతలు తర్వాత దానికి కట్టుబడి వుంటారా ? ఆయన రాజకీయ విజయమా లేక విశ్వసనీయతకు విఘాతమా అన్నది ముందు ముందు అధిష్టానం స్పందనను బట్టి చూడాలి. తమ వారిపై ప్రలోభాల వల ప్రయోగించారని చిరంజీవి చేస్తున్న ఆరోపణ నిజానికి జగన్‌ శిబిరానికి టిఆర్‌ఎస్‌కు మధ్యన ఏదైనా బందం వున్నదా అన్న సందేహానికి బలం చేకూర్చేదిగా వుంది. ఇలాటి విషయాల్లో నిజానిజాలు ఎన్నటికీ తేలేవి కావు. అయితే ప్రభుత్వాన్ని కూల్చి అస్థిరత్వం తీసుకురావాలని అమితంగా ఆకాంక్షించిన పక్షాలలో టిఆర్‌ఎస్‌ది రెండవ స్థానం అనే మాట కాదనలేనిది. ప్రత్యేక రాష్ట్ర సమస్య సంక్లిష్టత, కాంగ్రెస్‌ అగ్రనేతల కపట నీతి అన్ని తెలిసి కూడా అవిశ్వాసఘట్టంతో ఏదో వొరిగిపడుతుందని వారు ఆశించడమే ఆశ్చర్యకరం. మజ్లిస్‌, ప్రజారాజ్యం ప్యాకేజీలు సాధించుకోగా కాంగ్రెస్‌ తెలంగాణా సభ్యులు ఈ సందర్భాన్ని ఉపయోగించుకుని ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించలేకపోయారని ఆ పార్టీ నేతలు పదే పదే విమర్శించడంలోనే ఆ అవాస్తవికత కనిపిస్తుంది. ప్రాంతీయ నామ స్మరణ చేస్తూనే ప్రభుత్వాన్ని కాపాడుకుంటామని కాంగ్రెస్‌ వారు కుండబద్దలు కొట్టి చెబుతున్నా ఎందుకు భ్రమలు పెంచుకున్నారో ప్రజల్లోనూ పెంచుతూ వచ్చారో అర్థం కాదు.
ఈ వ్యవహారంలో మజ్లిస్‌ గురించి చెప్పవలసింది లేదు గాని వారు సమైక్యతకు కట్టుబడి వుంటామని మరోసారి స్పష్టం చేయడం ఒకటైతే మైనారిటీలకు సంబంధించిన కోర్కెలను వారి మద్దతును ముడిపెట్టడం అటూ ఇటూ వున్న మత శక్తులకు వూతమవుతుంది.వామపక్షాలు యధావిధిగా ప్రజా సమస్యలపైన పాలక పక్షం దివాళాకోరు పోకడల పైనా పరిమితంగా ప్రస్తావనలు చేశాయి. లోక్‌సత్తా జెపి మాటలు ఓటింగు తీరు ఆయన రాజకీయ విధాóనాల స్వరూప స్వభావాలను కళ్లకు కట్టింది. సవ్యసాచిలా అటూ ఇటూ బాణాలు సంధించి సూక్తులు గుప్పించి ముఖ్యమంత్రిని ప్రశంసించి ఆపైన అవిశ్వాసంపై తటస్ట పాత్ర తీసుకోవడం కొంతకాలం కిందట ఆయన ప్రత్యేకంగా చేసిన రైతు యాత్రను గుర్తు చేస్తుంది. వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తున్న చిల్లర వ్యాపారంలో ఎఫ్‌డిఐ ప్రవేశాన్ని యుపిఎ అధికారికంగా నిలుపు చేస్తుంటే తను ప్రత్యేకంగా దాన్ని ప్రశంసించడం రాజును మించిన రాజభక్తిలా అనిపిస్తుంది. అణువొప్పందం తరుణంలోనూ, చిల్లర వ్యాపారంలో ఎఫ్‌డిఐల విషయంలోనూ జెపి మన్మోహన్‌లు ఒకేలా ప్రవర్తించడంలో ప్రపంచ బ్యాంకు రాగాలే ప్రతిధ్వనిస్తే అది వాటి తప్పు కాదు.
ఇక తీర్మానం ప్రతిపాదించిన తెలుగుదేశం చాలా కాలం తర్వాత రాజకీయ చొరవ తమ చేతుల్లోకి వచ్చిందని ఆనందించవచ్చు. అయితే వారు కూడా ప్రత్యేకంగా సంతోషించాల్సిన అంశాలేమీ లేవు. ప్రభుత్వ వైఫల్యాలపై అవినీతిపై ధ్వజమెత్తడం, వైఎస్‌ రాజశేఖర రెడ్డిని, ప్రస్తుత ముఖ్యమంత్రిని కూడా తూర్పార పట్టడం రాజకీయంగా వారికి ఉపయోగపడవచ్చు. అయితే అవిశ్వాసానికి ముందు సన్నాహాలు సమన్వయం చేయడంలో తగు జాగ్రత్తలు తీసుకున్నారా? చర్చ సమస్యలపై కేంద్రీకృతమయ్యేట్టు వ్యూహం రూపొందించారా అంటే కొంత వరకే సమాధానం లభిస్తుంది. టిఆర్‌ఎస్‌ కూడా ( పోలవరం సమస్యపై కెటిఆర్‌ ఆగ్రహావేశాలు మినహా) పేరెత్తి రాజకీయ విమర్శలు చేయని సభ పరిస్థితిని గమనిస్తే తెలుగు దేశం నాయకత్వం మరింత పకడ్బందీగా నిర్మాణాత్మకంగా వ్యవహరించి వుండొచ్చు. వైఎస్‌ హయాం నాటి వ్యక్తిగత దూషణ ఘట్టాలను నివారించి వుండొచ్చు.
ముఖ్యమంత్రి చివరలో పథకాలు ఏకరువు పెట్టడంపైనే కేంద్రీకరించడం వ్యూహాత్మకమైనా మధ్యలో ఉభయ నేతలు అంతగా రెచ్చి పోవలసిన అవసరం ఏముంది? ధర్మాన ప్రసాదరావును మినహాయిస్తే మంత్రివర్గ సభ్యులు సమిష్టి బాధ్యతగా స్పందించింది కూడా నామమాత్రమే. సబిత, సత్తిబాబు స్పందనలు ప్రధానంగా వ్యక్తిగత ఆరోపణలకు సమాదానాలు మాత్రమే. కనక మంత్రివర్గ సమిష్టి బాధ్యత లేదన్న విమర్శ సభా వేదికపైనా ప్రదర్శితమైంది. ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడంలో తప్ప తమలో తమకు సఖ్యత లేదని సచివులు చాటు కున్నట్టే అయింది.ఇంకో విధంగా చూస్తే అవిశ్వాస చర్చ ఆఖరి క్షణాలలో సత్తిబాబు సమరోత్సాహం కూడా ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ను చుట్టుముట్టే అంతర్గత సమస్యలకూ సవాళ్లకు సంకేతం అనడం నిస్సందేహం.
మొదట్లో చెప్పుకున్నట్టు అవిశ్వాసం వీగిపోయినా స్థిరత్వం సంప్రాప్తించే సూచనలు బొత్తిగా లేవు. అనర్హత వేటు వేస్తే ఒక విదంగా వేయకపోతే మరో విధంగా పాలకపక్షం ఇరకాటాన్ని ఎదుర్కోవడం అనివార్యం. సమస్యల విషయంలో పునరాలోచన చేస్తామని చెప్పిందేమీ లేదు గనక అవి మరింత తీవ్రమవడమూ, తత్ఫలితంగా ప్రజల అసంతృప్తి మరింత పెరగడమూ తథ్యం. ఈ లోగా న్యాయస్థానాల విచారణలూ సిబిఐ దర్యాప్తులు ఏ మలుపులు తీసుకుంటాయో తెలియదు. కనకనే మొన్నటి బలపరీక్షలో వచ్చింది అస్థిర విశ్వాసం మాత్రమే!

No comments:

Post a Comment