Pages

Tuesday, December 27, 2011

మోత్కుపల్లి వృథావేశం అవాంఛనీయం

ఈ వారం నల్గొండ జిల్లా తెలుగు దేశం నాయకుడు మోత్కుపల్లి నరసింహులు చేసిన వ్యాఖ్యలు బొత్తిగా అవసరం లేనివి. చంద్రబాబు నాయుడు రైతు పోరు పేరిట చేసిన యాత్ర పూర్తి కావడం మంచిదే. దాన్ని అడ్డుకుంటామని మొదట ప్రకటించిన కోదండ రామ్‌ తర్వాత దాన్ని సవరించుకున్నారు కూడా. ఈ వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోయే బదులు తెలుగు దేశం నాయకులు టిఆర్‌ఎస్‌పైనా ముఖ్యంగా ఆ పార్టీ అధినేత కె.సి.ఆర్‌పైన ధ్వజమెత్తడానికి ప్రాధన్యాత నిచ్చారు. తెలంగాణా రాజకీయ క్షేత్రంలో ఈ రెండు పార్టీల మధ్య తీవ్ర వైరుధ్యం వున్న మాటా నిజం. టిఆర్‌ఎస్‌ తెలుగుదేశంపై దాడి కేంద్రీకరిస్తున్న మాటా నిజం. కెసిఆర్‌ రాజకీయ విన్యాసాలు వివాదాలు ఎలా వున్నా ఆ కారణంతో మోత్కుపల్లి మాటలు సమంజసమై పోవు. ఎందుకంటే ఉరేసుకుందాం రమ్మని సవాలు చేయడం, ఒక ప్లాస్టిక్‌తాడుతో ప్రత్యక్షం కావడం బాద్యత గల రాజకీయ నేతలు చేసే పని కాదు. పైగా అనేక బాధాకర ఘటనల తర్వాత ఇప్పుడెప్పుడే స్తిమితపడుతున్న తెలంగాణా ప్రాంత ప్రజలకు అసలే మంచిది కాదు. కెసిఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో విశ్రాంతి తీసుకుంటున్నాడనుకుంటే
తెలుగు దేశం నేతలు తాము చేయగలిగిన ఉద్యమాలు తాము చేసుకోవచ్చు. నిజానికి కెసిఆర్‌ది తుపాను ముందరి ప్రశాంతి అని, తుపాకిలా వేళ్లాడుతున్నారని టిఆర్‌ఎస్‌ నేతలు అన్నప్పుడు తుపానుల వల్ల ప్రజలకు కలిగిన కష్టనష్టాలు ఇక చాలని తుపాకులు పేల్చేబదులు రాజకీయ పరిష్కారం సాధించేందుకు అందరూ తమ విధానాల మేరకు పనిచేయవచ్చునని నేనన్నాను. రాజకీయ విమర్శలకు బదులు ఆయననే లక్ష్యంగా చేసుకుని ఉరి తాళ్లతో సవాలు చేయడం ఎక్కడి రాజకీయం? తర్వాత మాటలు మరింత తీవ్రమైనవి. కెసిఆర్‌ కోదండరామ్‌ల వైఖరిలో లోపాలు అనేకం వున్నా ఈ ధోరణి సహేతుకమైంది కాదు.
తెలుగు దేశం నేతలు ఎంత హడావుడి చేసినా టిఆర్‌ఎస్‌ తరహాలో తెలంగాణా సమస్యలో కెసిఆర్‌ తరహాను అనుసరించడానికి వారి పరిమితులు వారికున్నాయని మర్చిపోకూడదు. దీనికి చంద్రబాబు ఆమోదం వుందా అనేది ఒక ప్రశ్న అయితే అసలు టిటిడిపి మొత్తంగా దీన్ని ఆమోదిస్తుందా అనేది కూడా సందేహమే.దీనిపై నేను ఈ రెండు రోజుల్లోనూ అనేక విమర్శలు చేశాను. మంగళవారం టీవీ 9 చర్చలో మరింత సూటిగా చెప్పాను. తర్వాత ఫోరం కన్వీనర్‌ దయాకరరావు మోత్కుపల్లి మాట్లాడిన మరింత అభ్యంతరకరమైన మాటలతో విడగొట్టుకున్నట్టు చూశాను. రాజకీయంగా ఎవరి ఎత్తుగడలు వారు అనుసరించవచ్చు గాని శ్రుతి మించిన వ్యాఖ్యలు, కావాలని కవ్వించడాలు వాతావరణాన్ని ఉద్రిక్తం చేయడానికే ఉపయోగపడతాయి. ఈ మాటలకు స్పందిస్తూనే కేసిఆర్‌ సంక్రాంతి తర్వాత ఉద్యమిస్తామని ప్రకటించారు గనక ఆ లోపల విద్యుత్‌ ఛార్జీల పెంపు వంటి అంశాలపై పోరాడితే అన్ని ప్రాంతాల ప్రజలకూ ఉపయోగం. ఉపశమనం. తెలుగుదేశం నాయకత్వం కూడా తమ నేతలు కొందరి శైలిని సమీక్షించుకుంటే మంచిది. రానున్న ఉప ఎన్నికలలో ఇలాటి ధోరణులు మేలు చేస్తాయనుకోడం అవాస్తవాలోచన మాత్రమే. ఎందుకంటే ప్రజలెవరూ ఎక్కడా అవాంఛనీయ వివాదాలు గడబిడలు కోరుకోవడం లేదు. దైనందిన జీవిత భారాలలో తలమునకలవుతున్నారు. పైగా టిఆర్‌ఎస్‌ టిడిపిలు ఇలా ఘర్షణ పడుతుంటే అసలు కారణమైన కాంగ్రెస్‌ హాయిగా వినోదం చూస్తున్నది!

1 comment:

  1. అసలే తెలంగాణా ప్రజలు చీకొడుతున్న ఈ సమయంలో పాపం దిక్కు తోచడం లేదు. ఏదో ఒక డ్రామా చేస్తే మళ్ళీ జనంలోకి వెళ్ళోచ్చని మోత్కుపల్లి వారి తాపత్రయం. దాన్ని కూడా మీరు తప్పు పెడితే ఎలాగండీ?

    ReplyDelete