కురుసభలో వుంటూ తింటూ విదుర దేవులు ఎన్ని నీతులు చెప్పినా నిరర్థకమే. ఎందుకంటే వ్యక్తి గొప్పవాడైనంత మాత్రాన చాలదు. వ్యక్తి నడిపించే వ్యవస్థ ఏమిటన్నది అసలు కీలకం. కళంకిత వ్యవస్థలకు నాయకత్వం వహిస్తూ నా విశుద్ధత చూడండని విద్వత్ పరీక్షలను ఆహ్వానించినంత మాత్రాన చాలదు. వరుస కుంభకోణాల తాకిడితో తల్లడిల్లి పోతున్న తన సర్కారును కాపాడుకునే ఆఖరి ప్రయత్నంలో అగత్యం లేక తెర ముందుకొచ్చిన ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రవచనాల ప్రహసనం అలాటిదే. నీతి బాహ్య వ్యవహారాలను సూటిగా ఒప్పుకుని తప్పు దిద్దుకోడానికి సిద్ధపడలేని నీరస నిర్జీవ తతంగం అది. రాజకీయ లాంఛనం లాటి విన్యాసం అది. ఆయనే చెప్పినట్టు వంద కోట్ల పైబడిన జనాభా గల భారత దేశాధినేత, అంత అసహాయంగా ఆత్మ రక్షాణావస్థలో
మాట్లాడ్డం దుర్భర దృశ్యమే. కాకపోతే ఆయన వెనకేసుకొస్తున్న అవినీతి వ్యవహారాలు అసమర్థ పాలనా రీతులు అంతకంటే దుర్భరమైనవి. కామన్వెల్త్, ఆదర్శ, టూ జీ , ఎస్‌బాండ్ ఇలా కేంద్రాన్ని పట్టి కుదిపిన అవినీతి భాగోతాలు అగాధమైనవి. ఏ దశలోనూ వాటిని అరికట్టడానికి గాని, కారకులను కట్టడి చేయడానికి గాని మన్మోహనులు చిటికెన వేలు కదిల్చిన దాఖలాలు లేవు. కాకపోతే కాస్త జాగ్రత్తగా వుండమనీ పారదర్శకత పాటించమనీ సూక్తి ముక్తావళితో పంపిన లేఖ మాత్రం వుంది. మహా శక్తివంతమైన ప్రధాని కార్యాలయం ప్రేమ లేఖలతో సరిపెట్టుకోవడం అంటే కానున్నది కానివ్వడమే. తర్వాత కూడా ఆ రాజా వారికి అదే టెలికాం శాఖ కట్టబెట్టడం- ఏమంటే నాది మిశ్రమ ప్రభుత్వం గనక సంబంధిత పార్టీ చెప్పిన వారికే పదవులు పందేరం చేయక గత్యంతరం లేదనడం వీటన్నిటిలోనూ తొంగి చూసేది అధికార క్రీడ మాత్రమే. ఇంకా చెప్పాలంటే అవకాశవాదం. శంకితుడూ కళంకితుడూ అయిన ఒక మంత్రిని తిరిగి బంగారు బాతులాటి శాఖలో ఆసీనుణ్ని చేసి అది నాచేతుల్లో లేదనడం కంటే అధికారం వదులుకోవడం మంచిది కదా?
ఒక వైపున ప్రధాని తన వ్యక్తిగత నిజాయితీని సచ్చీలతను గురించి అదే పనిగా చెప్పుకుంటున్నారు.ఆయన వంధిమాగధులు లేదా ఆయన వల్ల లాభం పొందేవారు కూడా ఆ మాటే అంటుంటారు. సమస్య వ్యక్తిగా మన్మోహన్ మల్లెపూవంత మంచివారా కాదా అనేది కాదు. ముగ్గురు కేంద్ర మంత్రులు ఆరోపణలూ అవినీతి వ్యవహారాలతో ఇంటి దారి పట్టవలసి వస్తే వారి నాయకుడు మాత్రం నన్ను చూడు నా నీతిని చూడు అని చెప్పుకోవడం కంటే హాస్యాస్పదం ఏముంటుంది?యుపిఎ ప్రభుత్వానికి ఆయన నాయకుడు కావడం రాజకీయ బలం వల్లనో లేక వ్యక్తిగత పునాది వల్లనో జరిగింది కాదు.సోనియా గాందీ పట్ట విధేయత, అంతకంటే దేశ విదేశీ మార్కెట్ శక్తుల విశ్వాసం పొందడం ఆయనకు అందలం తెచ్చిపెట్టాయి. అమెరికా అద్యక్షులు స్వయంగా ఆయన మంచితనం గురంచి అనుభవం గురించి కితాబులిచ్చారు. అణుఒప్పందం విషయంలో వామపక్షాల అభ్యంతరాలకు ఆగ్రహౌదగ్రులై పదవినే వదులుకోవడానికి సిద్ధమనడంలోనే ఆయన భావజాలం బహిర్గతమైంది.ఇప్పుడేమో ఇన్ని రాజకీయ ప్రవచనాల తర్వాత రాజ్‌దీప్ సర్దేశాయి మీరు ఏ దశలోనైనా రాజినామా చేయాలనుకున్నారా అంటే లేదంటే లేదని బల్లగుద్ది చెప్పేశారు! అంటే దేశ సంపద లక్షల కోట్లలో గల్లంతైనా ఫర్వాలేదు గాని అమెరికాతో అణువొప్పందం ఆగిపోకూడదన్నదే ప్రధానికి ప్రధానం!
మన్మోహన్ వైఖరిలోని వైపరీత్యమంతా ఇక్కడే వుంది. ప్రభుత్వ అవినీతిపై వచ్చిన విమర్శలకు జవాబులిచ్చి కఠిన చర్యలు తీసుకోవడానికి బదులు తన ప్రతిష్టను ముందుకు తీసుకువచ్చి చర్చను దారి తప్పిస్తున్నారు. పోనీ అలాగైనా కట్టుబడి వున్నారా అంటే రాజా దారి తప్పించినట్టుచెబుతున్నారు. అలాటి వారిని రెండవ సారి మంత్రివర్గ సహచరుడుగా ఎన్నికోవడం గురించైనా తప్పు ఒప్పుకుంటారా అంటే నా బాధ్యత కాదు. మిశ్రమ ప్రభుత్వంలో సంబంధిత పార్టీదే బాధ్యత అని మరెవరిపైనో తోసేస్తున్నారు. హర్యానాలో దేవీలాల్, ఓం ప్రకాశ్ చౌతాలా వ్యవహారం అప్రజాస్వామికంగా తయారైనపుడు విపిసింగ్ ప్రధాని పదవి వదులుకోవడానికి సిద్దపడ్డారు. కనక నీతిని పద్దతిని ఫణం పెట్టి ప్రభుత్వం లాగాలనుకోవడం కూడా అవినీతి అవదా? పోనీ దీనిపై మీడియాలో కథనాలు వచ్చిన వెనువెంటనేనైనా స్పందించి చర్యలు తీసుకున్నారా?ఇప్పుడు ఎస్.బ్యాండ్ వ్యవహారం హిందూ బయిట పెట్టిన తర్వాత కూడా బలహీనమైన సమర్థన కోసం ఏలిన వారు ఎన్ని తంటాలు పడలేదు? ఆదర్శ, కామన్ వెల్త్ కుంభకోణాలు మిశ్రమ భాగస్వాములవి కాదే.. ?కుంభకోణ రాజ్యాన్ని తాను నడిపిస్తూ దాన్ని ప్రధానంగా చూపించవద్దని మీడియాను వేడుకోవడం వింతల్లో కెల్లా వింత. అద్దం ఎప్పుడైనా వున్న రూపాన్ని చూపిస్తుందే గాని లేని అందం తీసుకురాలేదు. వున్న వికృతాన్ని దాచిపెట్టనూ లేదు.
సమర్థన కోసం ఏమి చెప్పినా లక్షల కోట్ల విలువైన ఈ కుంభకోణాలు ఇంత నిరాఘాటంగా నిర్విరామంగా సాగిపోవడానికి సరళీకరణ విధాóనాల పితామహుడుగానూ మన్మోహన్ సంజాయిషీ చెప్పుకోవలసి వుంటుంది. ఆర్థిక సంస్కరణల వేగం తగ్గలేదని ఈ మీడియా గోష్టిలోనూ ఆయన గొప్పగానే చెప్పుకున్నారు. ఈ రెంటికీ మధ్యన అవినాభావ సంబంధం దాచేస్తే దాగని సత్యం. ఇదే కేంద్ర ప్రభుత్వం నల్లడబ్బు వేల వేల కోట్లలో విదేశాలకు తరలించిన బడాబాబుల వివరాలు వె ల్లడించలేనని అధికారికంగా ప్రకటించింది. అత్యున్నత న్యాయస్థానం గప్రభుత్వ గోదాముల్లో మగ్గిపోతున్న ఆహార ధాన్యాలను జనానికి పంచి పెట్టమంటే ససేమిరా వీల్లేదని సమాధానమిచ్చింది. ఇవన్నీ ద్వంద్వ నీతికి దర్పణాలే. దేశ సంపదలో మూడో వంతును కేవలం లక్షా 26 వేల మంది ఆసాములు అదుపు చేస్తుంటే సరళీకరణ సమానావకాశాలను గురించి మాట్లాడ్డం క్రూర పరిహాసమే. ప్రధాని మాత్రం ఆరోగ్యం, ఉపాధి హామీ వగైరా పథకాల గురించి ఏకరువు పెడుతూ వాటి నేపథ్యం దాటేశారు. మొదటి యుపిఎ వామపక్షాల మద్దతుపై ఆధారపడటం మొదటి కారణం కాగా ఆ పరిస్తితి మారిన తర్వాత (రెండవ) యుపిఎ చరిత్ర సమస్తం కుంభకోణ కళంకితత్వం కావడం యాదృచ్చికం కాదు. పెట్రోలియం ధరలపై నియంత్రణ ఎత్తివేసి ఏకంగా ఏడుసార్లు పెంచడం కూడా దాని కొనసాగింపే. విదేశీ బహుళ జాతి సంస్థల ముందస్తు వాణిజ్యం కారణంగా ఆహార పదార్తాల ధరలు ఆకాశం తాకుతుంటే వాటికి మరింత అవకాశం ఇవ్వడమే పరిష్కారంగా చూపుతున్న వైనమూ ఇందులో భాగమే.ప్రధాని నిజంగా దేశ ప్రజల సమస్యల తీవ్రతకు కారణమైన విధానాలపై ఆత్మ విమర్శ చేసుకోవాలనుకుంటే అవినీతిపై పశ్చాత్తాప పడదలిస్తే ఇలా వచో విన్యాసంతో సరిపెట్టేవారు కాదు. ఆఖరుకు టూజీ స్కాంపై జెపిసి వేసేది లేనిదీ చెప్పకుండా నేను హాజరవడానికి సిద్దం అని సీతమ్మోరి భంగిమ ప్రదర్శించినా అవినీతి రావణ కాష్టం ఆరదు.
ఆంధ్రప్రదేశ్‌ను అతలాకుతలం చేస్తున్న అంశానికి సంబంధించి కూడా ఆయన మాటలు షరామామూలుగా దాగుడు మాతల విధానాన్ని ప్రతిధ్వనించాయి. శ్రీకృష్ణ కమిటీ దర్యాప్తు చేస్తుంది గనక నేనేమీ చెప్పను అని గతంలో అన్నారు. ఇప్పుడు ఆ కమిటీ నివేదిక వచ్చిన తర్వాత కూడా పాత పల్లవినే ఆలపించి తప్పు కున్నారు.జటిలమైన సమస్య గనక ఏకాభిప్రాయానికి సమయం పడుతుందని చెప్పడం అరిగిపోయిన రికార్డే. గత మూడు రోజులుగా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఢిల్లీలో మకాం వేసి ఏదో స్పష్టత తీసుకువస్తామని చెప్పిన మాటలు ఎంత అవాస్తవాలో దీన్ని బట్టే విదితం. అలాగే సహాయ నిరాకరణ పేరిట తలపెట్టిన ఉద్యమం వంటి వాటితో పార్లమెంటులో బిల్లు పెట్టించేయవచ్చునని విభజన వాదులు ఇక్కడ అమలు చేస్తున వ్యూహం కూడా ఎంత ఆధార రహితమో అర్థం అవుతుంది. తమ వాదన తాము వినిపించడంలో తప్పులేదు గాని - కేంద్ర పాలకులు అదే పనిగా దాటవేతలకూ దాగుడు మూతలకు పాల్పడుతున్న పరిస్తితిలో ప్రాంతీయ వివాదాలు ప్రజ్వరిల్లచేసుకోవడం ఎవరికీ శ్రేయస్కరం కాదు. గతంలో రెండు విభజన ఉద్యమాల్లోనూ ముందు నిలబడి అనేక విధాల నష్టపోయిన వారు వుద్యోగులు విద్యార్థులు. కాగా పదవులు పండించుకున్న వారు పాలకవర్గ రాజకీయ వేత్తలే. ఆ పాచికలు ఇప్పుడూ విసురుతూనే వుంటారు. ప్రయోజనాల ఘర్షణ సాగిస్తూనే వుంటారు. కనకనే తెలుగు ప్రజలు అప్రమత్తంగా వుండాలి. ప్రజాస్వామిక విలువలను కాపాడుకోవాలి. అందరినీ వేధించే సమస్యలపై కదిలేందుకు శాసనసభ సందర్భాన్ని వినియోగించుకోవాలి. (ఆంధ్రజ్యోతి గమనం- 17,2,11)
No comments:
Post a Comment