Pages

Sunday, February 6, 2011

10 జనపథ్‌ ముంగిట ముగిసిన ప్రజారాజ్యం







ప్రజారాజ్యం భవిష్యత్తు ఇప్పటికీ చిరంజీవి అవకాశాలపై కొనసాగుతున్న వూహాగానాల గురించిన నా ఆలోచనలను గత గురువారం ఎంట్రీలో పంచుకున్నాను.దానిపై ఒక్క మిత్రుడు స్పందించిన తీరు కూడా చూశాను.తీరా ఈ ఆదివారం నాడు చిరంజీవి హడావుడిగా 10 జన్‌పథ్‌ ముందు విలీనం అవుతున్నట్టు చేసిన ప్రకటన నేను భావించిన దానికన్నా కూడా ఆత్రుతను ప్రదర్శించింది. కనీసం తన ప్రజారాజ్యం పార్టీ స్తాపన అనివార్యంగా విలీనం చేయడం వంటి అంశాల గురించి ఒక్క ప్రస్తావనైనా చేయకపోవడం ఇందుకు నిదర్శనం.వీరప్ప మొయిలీనే ఆ పార్టీ పేరు ప్రస్తావించారు.
ఇక రాష్ట్ర ప్రయోజనాలు తప్ప వ్యక్తిగత ప్రయోజనాలు లేవని చెబుతూ చిరంజీవి ఉటంకించిన అంశాలు- మహిళా రిజర్వేషన్‌, సచార్‌ కమిటీ, పోలవరం ప్రాణహిత వంటివి అరిగిపోయిన రికార్డుల్లా
అధికార పార్టీ తరచూ చెబుతున్నవే. అవన్నీ చెబుతుండగానే కాంగ్రెస్‌ను వ్యతిరేకించిన మీరు ఇప్పుడెలా కలిశారన్న ప్రశ్నకు జవాబుగా అన్వేషించి చెప్పింది రాజకీయంగా మరిన్ని వైరుధ్యాలకు దారి తీస్తుంది.2004-09 మధ్య వైఎస్‌హయాంలో అవినీతి ఆరోపణలు విపరీతంగా వచ్చాయి గనక తను విమర్శ చేశానన్నారు. మరి ఆ మాటతో కాంగ్రెస్‌ ఏకీభవిస్తుందా?అలా అయితే అందులో సోనియా గాంధీ నాయకత్వానికి బాధయత వుండదా? కేవలం జగన్‌ శిబిరాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మాటలు అన్నా భవిష్యత్తులో కొనసాగించకపోవచ్చు.
ఇంతకూ చిరంజీవి పార్టీని కొనసాగించే శక్తి లేక ఇలా చేశారన్నది పాక్షిక సత్యం. ఆసక్తి లేక అధికార పక్షంతో కలసి పోవడం సులభంగా వుంటుందన్న ఆశ వల్ల కలిసి పోయారన్నది నిజం.దీనికి సామాజిక న్యాయం వంటి సమర్థనలు బొత్తిగా పొసగవు.అవసరం లేదు కూడా.
తెలంగాణా కాంగ్రెస్‌ వాదులు కూడా దీన్ని ఆమోదిస్తారని నేను గతంలోనే రాశాను. అదీ జరిగింది. ఇక కాంగ్రెస్‌లో ఆయన భవిష్యత్‌ స్థానాన్ని గురించి వినిపిస్తున్న అంచనాలు అభిలాషలు ఏ మేరకు నిజమయ్యేది త్వరలోనే తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్‌ కలహాల మధ్య కొత్త నేత ఎకాఎకిన ఎగబాకడం అంత తేలిక కాదు, అలా అనుమతించిన దాఖలాలూ లేవు.
అర్థంతరంగా ముగిసిన ప్రజారాజ్యం స్వప్నం ప్రజా నిబద్దత, విధాన స్పష్టత లేని రాజకీయ పార్టీల విశ్వసనీయత ఏమిటో చెబుతుంది. చిరంజీవి వ్యక్తిగత ఆకర్షణకూ దానికి సంబంధం లేదు. ఆకర్షణ కూడా నిరంతరం ఒకేలా వుంటుందనుకోవడం అవాస్తవికం

No comments:

Post a Comment