Pages

Wednesday, March 21, 2012

ఉప ఎన్నికల ఫలితాలుఉప ఎన్నికల ఫలితాలపై ఇంతకు ముందే స్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తం చేసినందువల్ల కొత్తగా రాయాల్సింది కనిపించడం లేదు. టిఆర్‌ఎస్‌ సంఖ్యాబలం పెరగడంతో పాటు తెలంగాణా ప్రాంతంలో ప్రధాన పార్టీగా లేదా ప్రథమ పార్టీగా ఆవిర్భవించే అవకాశాలు ఇప్పుడు పెరిగాయి.ఇంతకు ముందు కాంగ్రెస్‌ తెలుగు దేశం తర్వాతి స్థానంలో ఆ పార్టీ వుండేది. ఇప్పుడు బలమైన రాజకీయ శక్తిగా పెంపొందడానికి భూమిక ఏర్పర్చుకుంటున్నది. భవిష్యత్తులోనూ ఆ పార్టీ నాయకుల దృష్టి ఉద్యమాలపై కన్నా ఈ కోణంపైనే ఎక్కువగా కేంద్రీకృతం కావచ్చు.
అయితే మెజార్టిలు, ఇతరుల డిపాజిట్ల గల్లంతు వంటి విషయాల్లో టిఆర్‌ఎస్‌ ప్రచార వ్యాఖ్యలు చాలా వరకూ నెరవేరలేదు. తెలంగాణా రాజకీయ క్షేత్రంలో ఇతర పార్టీలు కూడా చోటు సంపాదించాయి. నాగం జనార్ధనరెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరకుండా తన స్వతంత్రత నిలబెట్టుకున్నాడు. బిజెపి మహబూబ్‌నగర్‌లో హౌరాహౌరీ పోరాటంలో విజయం సాధించింది. గెలిచిన కొన్ని చోట్ల ఆధిక్యతలు పరిమితంగా వున్నాయి. ఇన్ని కారణాల రీత్యా టిఆర్‌ఎస్‌ ప్రధాన శక్తిగా వచ్చినా ఏకపక్ష వాతావరణం వుండబోదని
స్పష్టమవుతున్నది. బహుశా ఎడతెగని రాజినామాలు ఉప ఎన్నికల రాజకీయాలకు కూడా ఇదే ఆదరణ వుండకపోవచ్చు.
తెలుగుదేశం పార్టీ ఎన్ని ప్రయాసలు పడినా ప్రహసనాలు నడిపినా మూడు చోట్ల డిపాజిట్‌ కోల్పోక తప్పలేదు. కడియం శ్రీహరి వంటి బలమైన అభ్యర్థి కూడా పెద్ద తేడాతోనే ఓడిపోయారు. అంటే టిఆర్‌ఎస్‌ నేతలపై ఎంతగా దాడి చేసినా తెలుగు దేశం విశ్వసనీయత పెరగలేదు. కనీసం కాంగ్రెస్‌ స్థాయిలో కూడా అది ఓట్లను తెచ్చుకోలేకపోయింది.
కాంగ్రెస్‌ విషయానికి వస్తే ప్రతిచోటా అది దెబ్బ తినిపోయింది. ఫలితాలు వస్తుండగానే తెలంగాణా కాంగ్రెస్‌ నేతలు భిన్న స్వరాలు మొదలు పెట్టారు. పార్టీ వైఖరికి తమకూ సంబంధం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. నేను పాల్గొన్న ఒక చర్చలో జెఎసి చైర్మన్‌ కోదండరాం కూడా కాంగ్రెస్‌ నేతలకు కలసి రావాలన్నట్టు మాట్లాడారు. అయితే కేంద్రం ప్రకటన చేయకుండా రావణ కాష్టం కొనసాగిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అసలే పట్టించుకోకపోతే దాంతో ఏం సంబంధం లేనట్టు ఈ నాయకులు మాత్రం ప్రాంతీయ జపంతో పబ్బం గడుపుకోవడం అర్థరహితమే అవుతుంది. కనక ప్రభుత్వ పక్షం ప్రధాన ప్రతిపక్షం కూడా స్పష్టమైన వైఖరితో ప్రజల ముందుకు రాకపోతే మరింతగా దెబ్బ తినక తప్పదు. తెలుగు దేశం కంటే మేము మెరుగని ముఖ్యమంత్రి, గతం కంటే ఇప్పుడు మెరుగని చంద్రబాబు చెప్పడం వల్ల ప్రయోజనం శూన్యం.
బ్లాగు మిత్రులు కొందరు ఎలాగూ అడుగుతారు గనక సిపిఎం గురించి కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రధాన తెలంగాణా ప్రాంతీయ రాజకీయ వ్యూహాలలో ఆ పార్టీకి పాత్ర లేదు. రాష్ట్ర విభజనను వ్యతిరేకించే ఆ పార్టీది ఒక రకంగా ఎదురీత గనక బాగా తక్కువ ఓట్లు రావడంలో ఆశ్చర్యం ఏమీ లేదు.నిజానికి ఆ పార్టీ పోటీ చేయడమే ఒక విశేషం. కాంగ్రెస్‌, తెలుగు దేశం, వైఎస్‌ఆర్‌ పార్టీలు కూడా ఆ విధంగా తమ వైఖరి స్పష్టం చేయాలనే ప్రజలు కోరుతున్నారు. లేకపోతే భవిష్యత్‌ పరిణామాలు కూడా ఇంతకంటే తీవ్రంగా వుండొచ్చు.
అమెథీలో కాంగ్రెస్‌ ఓటమి ఎలాటిదో మహబూబ్‌నగర్‌లో టిఆర్‌ఎస్‌ ఓటమి, బిజెపి గెలుపు అంత ఆసక్తి కలిగిస్తాయి. ఇక్కడ జెఎసి ఎటూ తేల్చుకోలేకపోవడం తెలంగాణా రాజకీయాల్లో భవిష్యత్‌ వైరుధ్యాలను సూచిస్తుంది. ఏమైనా ఇది అన్నిచోట్లా జరుగుతుందని కూడా చెప్పలేము. బిజెపి ప్రాంతీయ నినాదానికి తోడు మత పరమైన సామాజిక పరమైన సమీకరణలు కూడా ఈ ఫలితానికి దోహదం చేశాయని చెప్పొచ్చు.మహబూబ్‌నగర్‌లో ప్రముఖ అభ్యర్థులకు పరిమితమైన ఆదిక్యతలే రావడం స్థానిక రాజకీయాలు వారి పట్ల వున్న అసంతృప్తులకు ప్రతిబింబం.
ఇవన్నీ ఒక ఎత్తయితే రాబోయే ఎన్నికల వరకూ వూపు నిలబెట్టుకోవడం టిఆర్‌ఎస్‌కు పెద్ద సవాలే.
ఇక కోవూరులోనూ వైఎస్‌ఆర్‌ పార్టీ అభ్యర్థి ప్రసన్న విజయం వూహించిందే . ఇక్కడ కూడా తె లుగు దేశం హౌరాహౌరి పోటీ అయినా ఇవ్వలేకపోవడం ప్రాధాన్యత గల విషయం. ఇక కాంగ్రెస్‌ మూడో స్తానంలో పడిపోయింది. సిపిఎంకు కూడా గతంతో పోలిస్తే బాగా తక్కువ ఓట్లు వచ్చాయి. ఇది వెంటనే పెద్ద మార్పులకు దారి తీయదు గాని జరగాల్సిన 17 స్తానాల ఉప ఎన్నికల ఫలితాలకు సూచిక అవుతుంది.

7 comments:

 1. వైఖరుల పరంగా చూసినపుడు ఓట్ల సంఖ్యను చూడాల్సిన పనిలేదు. ఆ మేరకు సీ.పీ.ఎం తన వాదంతోనే దొంగాట లేకుండా పోటీ చేసింది. ప్రజలలో తెలంగాణా వాదం బలంగా ఉందనేది మరోసారి ఓటర్ల నాడిని బట్టి అర్ధమవుతోంది.బీ.జే.పీ గెలుపు టీ.ఆర్.ఎస్ కు సవాలే. తెలుగుగుదేశంను రెండు చోట్లా విశ్వసించే స్థితిలో రాష్ట్రప్రజలు లేరని ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికైనా తెలుగుదేశం దొంగాట మానాలి. టీ.ఆర్.ఎస్, జగన్‌ల సఖ్యత నాటకం ఇక తెరపైకి వస్తుంది. ఈ ఫలితాలు రానున్న రోజులలో సమీకరణాలకు ఖచ్చితంగా ప్రేరణ అవుతాయి. రాష్ట్ర రాజకీయంలో కొత్త మార్పులైతే స్పష్టంగా రూపుదిద్దుకోక పోయినా సంకేతాలు అందిస్తున్నాయి. తెలంగాణాలో్ జగన్‌ ఎంట్రీకి , నాగం లాంటి నేతల భవిష్యత్తుకీ, టీ.ఆర్.ఎస్ కొత్త వ్యూహానికి, బీ.జే.పీ ఆశలకీ, కాంగ్రెస్-తెలుగుదేశంల ఎదురీతకీ ఈ ఫలితాలు కొత్త పాఠం చెపుతాయి. కేంద్రం ఎత్తుగడలు అసలే బ్రహ్మపదార్ధమైన కాంగ్రెస్ నేతల టక్కుటమారాలు ఇంకెంతకాలం తెలంగాణా ప్రజలతో - రాష్ట్రప్రజలతో ఆడుకుంటారో చూడాలి. వాడుకోవచ్చని అంటకాగినా , అనవసర తుట్టెలను కదిపితే మొదటికే మోసం వస్తుందని ఇప్పటికైనా కాంగ్రెస్ గ్రహిస్తుందా? లేదా? తెలంగాణా సమస్యకు ప్రధానంగా సమాధానం చెప్పాల్సిన కాంగ్రెస్ అధిష్టానం ఏమి చేస్తుందో చూడాలి.

  ReplyDelete
 2. /ఇవన్నీ ఒక ఎత్తయితే రాబోయే ఎన్నికల వరకూ వూపు నిలబెట్టుకోవడం టిఆర్‌ఎస్‌కు పెద్ద సవాలే/

  వూపు నిలుపుకోవడం అంటే మళ్ళీ మళ్ళీ రాజీనామా చేస్తూ పోటీచేస్తూ వుండటమే! :) వూపు వుంటేనే వసూళ్ళు, చక్రాలు, సిపార్సులు గట్రా తిప్పుకోవచ్చు. వూపు వుండి, నాలుగు సీట్లుంటేనేఇటాలియనాంబ ప్రసన్నురాలవుతుంది.

  కాబట్టి, తెరాస మళ్ళీ రాజీనామా చేసి, తెలంగాణ పట్ల తమ నిబద్ధతను స్పష్టంగా రెన్యువల్ చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. :D

  ReplyDelete
 3. "అమెథీలో కాంగ్రెస్‌ ఓటమి ఎలాటిదో మహబూబ్‌నగర్‌లో టిఆర్‌ఎస్‌ ఓటమి, బిజెపి గెలుపు అంత ఆసక్తి కలిగిస్తాయి"

  అమేథీలో కాంగ్రెస్ ఓడిపోవడానికి మహబూబ్ నగర్ తెరాస ఓటమికి ఒక్క ముఖ్యమయిన వ్యత్యాసం ఉంది. 2009లో లోకసభకు కెసిఆర్ చచ్చీచెడీ గెలిచినా తెరాసకు జిల్లాలో ఎక్కడా ఒక్క సీటు కూడా రాలేదు. ఒక రకంగా దక్షిణ తెలంగాణాలో (Kollapur) మొదటి సారి గెలిచి తెరాస తమ area of influence పెంచుకుండానే చెప్పొచ్చు.

  తెలంగాణా పట్ల భాజపా చిత్తశుద్ది ఎవరూ ప్రశ్నించలేరు. ఇప్పటికయినా తెరాసకు ఒక విశ్వసనీయమయిన తెలంగాణావాద పోటీ రావడం శుభసూచకం.

  ReplyDelete
  Replies
  1. /తెలంగాణా పట్ల భాజపా చిత్తశుద్ది ఎవరూ ప్రశ్నించలేరు. విశ్వసనీయమయిన తెలంగాణావాద పోటీ/

   అవునా?! ఏదీ, అదవానీ ఆలె నరేంద్రకు రాసిచ్చిన రౌండుసీలు రాజపత్రం ఓ సారి ఓ సారి గట్టిగా పైకి చదవండి. బూతు వీడియోలు చూసుకోవడానికే బిజెపి వాళ్ళకు అసెంబ్లీల్లో తప్ప వేరే చోటు లేదు, విశ్వసనీయత అంటూ వాళ్ళను వేధించకండి గొట్టిముక్కుల గారు. తనది కాకపోతే తాటిపట్టకు... లాంటి చిత్తసుద్ది వారి స్వంతం.

   Delete
  2. అది పదేళ్ళ కిందటి వ్యవహారం. పైగా అప్పటిలో తెదేపా కబంధ హస్తాలలో భాజపా ఉన్న రోజులవి.

   Delete
 4. తెలంగాణా విషయంలో రాష్ట్రంలోని అన్ని పార్టీలూ దాగుడుమూతలు ఆడుతున్నాయి.
  రాష్ట్ర ప్రగతి ఇంకా వెనకబడకముందే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి.

  ReplyDelete
 5. కోవురు లో సిట్టింగ్ యం యల్ ఎ టి డి పి వ్యక్తి అతను గత 20 ఏళ్లు గా ఎం ఎల ఎ గ ఉంటునండు అతనికి వచ్చిన మెజారిటీ అతను టి డి పి నుంచి తీసుకెళ్ళిన వోట్లే టి డి పి పోటి ఇవ్వలేకపోతే 55వేల వోట్లు ఎల్క సాధించగలిగేది

  ReplyDelete