Pages

Thursday, September 15, 2011

వికల దృశ్యంలో సకల సమ్మె


ఇప్పుడు అందరి దృష్టి తెలంగాణా ప్రాంతంలో జరుగుతున్న సకల సమ్మెపై కేంద్రీకృతమై వుంది. ఈ మాటను ఇంగ్లీషులో ఏమంటారు అని ఎవరో అడిగారు.మామూలుగా జనరల్‌ స్ట్రెక్‌ అన్నప్పుడు సార్వత్రిక సమ్మె అని అనువదించడం జరుగుతుండేది. ఈ సకల జనుల సమ్మె మాటను యూనివర్సల్‌ స్ట్రైక్‌ అనొచ్చు. పేరు నిర్వచనం ఏమిటనే దానికంటే ఎంత విస్త్రతంగా వుధృతంగా జరుగుతుందనేది ముఖ్యం. ఇప్పుడున్న నేపథ్యంలో ఈ సమ్మె ఉధృతంగానే మొదలవుతుందని అందరూ అనుకున్నారు.ఎక్కడ ఏ తరగతులు ఏ మేరకు కలసి వస్తారనేది అలా వుంచితే వుద్యోగుల వరకూ పాల్గొంటారన్నదీ ముందే స్పష్టమైంది. అదే జరిగింది కూడా. ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు కూడా గొంతు కలపడం దీనికి మరింత వూతమిచ్చినట్టయింది. అత్యవసర సర్వీసులను మినహాయించినా పరోక్షంగా గని కార్మికుల సమ్మె ఆ మినహాయింపును మించిపోయింది. ఏ పోరాటంలోనైనా ప్రజలపై ఎంతో కొంత ప్రతికూల ప్రభావం పడటం తప్పనిసరి గాని ఇక్కడ ప్రత్యేకంగా ప్రాంత ప్రజలకు ఎక్కువ నష్టం కదా అన్న ప్రశ్నలు వస్తుంటాయి. రాజకీయ పరిష్కారం సూచనలేమీ లేనప్పుడు ఈ పోరాటం ఎంత కాలం సాధ్యమన్న ప్రశ్న కూడా వస్తుంది. ఎందుకంటే ముఖ్యమైందేమంటే తెలంగాణా సమస్య 2014 వరకూ తేలేది కాదని స్వయంగా కెసిఆర్‌ వ్యాఖ్యానించి వున్నారు. ఢిల్లీకి ప్రదక్షిణల ప్రహసనం జరుపుతున్న కాంగ్రెస్‌ నేతలు కూడా అయోమయంగానూ ఆశాభంగంతోనూ తిరిగి వస్తున్నారు. ఏదో ఒక ప్రకటన వస్తుంది అని తప్ప తమకు అనుకూలంగా వస్తుందని తెలంగాణా కాంగ్రెస్‌ నాయకులు చెప్పలేకపోతున్నారు. అన్ని పార్టీలూ వస్తేనే అఖిలపక్ష సమావేశం సాధ్యమని కేంద్ర హొంమంత్రి చెబుతుంటే తాము హాజరుకాబోమని ప్రధాన ప్రతిపక్షం ప్రకటిస్తున్నది. వీటన్నిటిలోనూ భవిష్యత్‌ పరిణామాలు దాదాపుగా అర్థమవుతూనే వున్నాయి. పైగా తెలంగాణా క్షేత్రంలోనూ టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, తెలుగు దేశం, బిజెపి తమ తమ ప్రయోజనాల కోణాలను తాము అనుసరిస్తున్నాయి. అందరూ తెలంగాణా ప్రజల పేరు చెబుతున్నా జరుగుతున్నది ప్రయోజనాల పాకులాట అని జనం చూడగలుగుతున్నారు. అందువల్లనే సకల జనుల సమ్మెకు సాద్యమైనంత హేతుబద్దమైన ప్రజాస్వామికమైన పరిష్కారం కనుగొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై వుంటుంది. ఈ లోగా ఇరు ప్రాంతాలలోనూ ప్రధాన పార్టీల నాయకులు కవ్వింపు ధోరణులతో మాట్లాడ్డం మానుకోవాలి కూడా.ఏ ప్రాంత ప్రజల మనోభావాలు ఏమైనప్పటికీ ఈ దుర్భాషలు దూషణలు మాత్రం వారు కోరుకోవడం లేదు.1969లో తెలంగాణాలోనూ, 1972లో ఇతర చోట్ల స్వార్థపరులైన నేతల ప్రచారాలను నమ్మి సమ్మెలు చేసి కష్టనష్టాల పాలైంది ప్రధానంగా ఉద్యోగులు విద్యార్థులే. ఆ అనుభవాలను ఇప్పుడు కూడా గుర్తుంచుకున్నామనే ఉద్యోగ నాయకులు చెబుతున్నారు.కనకనే అందరూ విజ్ఞతగా వ్యవహరిస్తారని ఆశించాలి.

No comments:

Post a Comment