Pages

Tuesday, December 11, 2012

పోరాడిన మానవులెవ్వరు? మీడియాలో చోటే ఇవ్వరు!!


దయ్యానికైనా రావలసింది ఇవ్వాలి అన్నది ఒక ఇంగ్లీషు సామెత. గివ్‌ ద డెవిల్‌ ఇట్స్‌ డ్యూ. మీడియాకు ఈ సూత్రం మరింత ఎక్కువగా వర్తిస్తుంది. ఎవరి నేపథ్యం ఏమైనా ఎవరి రాజకీయాలు ఏవైనా సందర్భాన్ని బట్టి సముచిత ప్రాధాన్యత ఇవ్వడం ప్రజాస్వామ్య ధర్మం. కనకనే ఏ పరిణామం జరిగినా దానికి సంబంధించిన నాయకులు ఎక్కడ వున్నా వెంటబడి మరీ ఇంటర్వ్యూలు చేయడం, ఫోన్‌ఇన్‌లు పెట్టడం జరుగుతుంటుంది. పత్రికలైతే ఆ వార్తతో పాటే దానికి కారకులైన ఉద్యమాల చిత్రాలు వివరాలు ఘట్టాలు విపరీతంగా గుప్పిస్తాయి. మొదటి పేజీలో ఇండికేటర్స్‌ ఇస్తాయి. కాని చారిత్రాత్మకమైందిగా చెప్పుకుంటున్న ఎస్‌సి ఎస్‌టి సబ్‌ప్లాన్‌ వాస్తవ రూపం దాల్చిన సన్నివేశంలో మాత్రం ఎందుకనో మన మీడియా ఈ సంప్రదాయాన్ని పాటించకలేదు!
సబ్‌ ప్లాన్‌ కేవలం మా వరప్రసాదం దక్క మరొకటి కాదని చెప్పుకోవడానికి కాంగ్రెస్‌ నేతలు నానాతంటాలు పడ్డారంటే అదో రకం. ఒకటి రెండు సీట్లు వున్న పార్టీలకు భయపడబోమని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ధైర్య సాహసాలు ప్రకటించినా సరిపెట్టుకోవచ్చు( వాస్తవానికి అలా పరోక్షంగా ప్రస్తావించడంలోనే ఆయన ఎంతగా భయపడుతున్నదీ తెలుస్తుంది. తుమ్మితే వూడే ముక్కులా ప్రతి సభ్యుడిని ప్రాధేయ పడాల్సినస్థితిలో వున్న సర్కారు నేత తిరుగులేని ఆధిక్యతకు తనే ప్రతిరూపంలా మాట్లాడ్డం మరీ హాస్యాస్పదం) ఆయన ధోరణి ఒకటైతే నిష్పాక్షితకు నిలువుటద్దాలమనీ, నిర్భీతికి నిదర్శనాలమనీ చెప్పుకునే మీడియా సంస్థలు వ్యాఖ్యాతలూ కూడా అదే ఫక్కీలో పడటాన్ని ే ఏమనాలి? సబ్‌ ప్లాన్‌కోసం 2002తో మొదలు పెట్టి దశాబ్ద కాలంగా పోరాటాలు జరుగుతూనే వున్నాయి. బి.వి.రాఘవులు తదితరులు ఒక పర్యాయం, జాన్‌ వెస్లీ మరొకసారి, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు ఆ తర్వాత దఫదఫాలుగా నిరవధిక నిరాహారదీక్షలు చేయడం పోలీసులు రకరకాలుగా స్పందించడం జరుగుతూనే వచ్చింది.ఒకసారి అర్థరాత్రి దాకా బైఠాయింపు అరెస్టులు ఆ తర్వాతనే ప్రభుత్వం సమ్మతించడం జరిగింది. మాజీ ఉన్నతాధికారులు, దాదాపు 900 సంఘాలు, ఈ పోరాటంలో పాలు పంచుకున్నాయి. శాసనసభ లోపలా, వెలుపలా పదే పదే ప్రస్తావనలు వచ్చాయి. ఇన్ని పోరాటాల ఫలితంగానే సబ్‌ ప్లాన్‌ ముందుకు వచ్చిందన్న సత్యాన్ని సముచిత రీతిలో తెలియజెప్పాల్సిన బాధ్యత మీడియాకు లేదా?
ఒకవైపు చూపు...
సబ్‌ ప్లాన్‌మొసాయిదా శాసనసభలో ప్రవేశపెట్టిన రోజున పత్రికల్లో టిఆర్‌ఎస్‌అద్యక్షుడు కె.చంద్రశేఖరరావు వ్యాఖ్యలు ప్రముఖంగా వచ్చాయి.గతంలో గల్లంతు చేసిన25 వేల కోట్టు ఇప్పుడు కక్కించాలన్నట్టు
ఆయన మాట్లాడిన మాటలు మెయిన్‌ ఎడిషన్లలో వచ్చాయి. అంత వరకూ బాగానే వుంది. కెసిఆర్‌ దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్న నాయకుడు గనక, తెలంగాణా ఏర్పాటుతో పాటు సబ్‌ ప్లాన్‌ ప్రాధాన్యతను కూడా గుర్తించి మాట్లాడారు గనక అలా ఇవ్వడంలో పొరబాటు లేదనుకోవచ్చు. కాని అదే రోజు హైదరాబాదు విజ్ఞాన కేంద్రంలో ఈ సమస్యపై పోరాటానికి నాయకత్వం వహించిన సంఘాలు మల్లేపల్లి లక్ష్మయ్య, జాన్‌ వెస్లీ, రాఘవులు తదితర నేతలనేక మందితో రౌండ్‌ టేబుల్‌ నిర్వహించాయి. ముసాయిదాపై సమగ్రంగా చర్చించడమే గాక ప్రభుత్వం అవరోధాలు కలిగించే అవకాశముందని హెచ్చరించాయి. ఏది ఏమైనా సానుకూల దృక్పథంతో ముందు ఆమోదింపచేసుకోవడం ముఖ్యమని పిలుపునిచ్చాయి. మన పత్రికలు వేటిలోనూ ఇది ప్రముఖమైన వార్త కానేలేదు. ఏదైనా సాధించినప్పుడు పోరాటానికి ఆధ్వర్యం వహించిన వారి స్పందనను ప్రముఖంగా ఇవ్వడమనే కనీస సంప్రదాయాన్ని కూడా ఎందుకు పాటించలేదో వాటికే తెలియాలి. మళ్లీ సబ్‌ ప్లాన్‌ను స్వాగతించడంలో మాత్రం పోటాపోటీనే! ఇందులో సామాజిక న్యాయాన్ని గౌరవించడమనే సమస్యతో పాటు రాజకీయంగా ప్రత్యామ్నాయ శక్తులను ఆదరించలేకపోవడమనే జాడ్యం కూడా స్పష్టం.

స్వతంత్రత గిట్టదు!
వామపక్షాలు తెలుగుదేశంతోనే కాంగ్రెస్‌తోనో టిఆర్‌ఎస్‌తోనో వుంటే మీడియాకు ఎక్కడ లేని ఆసక్తి. సీట్లకోసం రాజీ పడుతున్నాయని ఆరోపిస్తూనే ప్రచారంలో చోటిస్తాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీల మధ్యన ఎప్పుడైనా వివాదం రేగితే కథలే ప్రచురిస్తాయి. ప్రచారం చేస్తాయి. కాని కమ్యూనిస్టులు ఏదైనా సానుకూల క్రియాశీల కార్యాచరణ జరిపి ఫలితాలు సాధిస్తే ప్రభావం చూపిస్తే మాత్రం చూడనట్టే నటిస్తాయి. ఇతరేతర అంశాలపైనే దృష్టి మరలుస్తాయి. సబ్‌ప్లాన్‌ విషయంలో మంత్రి కొండ్రు మురళిలాటివారు ఆలస్యంగానైనా అనివార్యంగా రాఘవులు సైకిల్‌ యాత్ర నిరాహారదీక్ష వంటి వాటిని ప్రస్తావించారు గాని మీడియాకు అంతమాత్రం 'మనసు' రాలేదు. ఒక ఛానల్‌(హెచ్‌ఎంటివి)మాత్రమే దీనిపై పోరాట ప్రముఖులతో చర్చ నిర్వహించింది. ఇతరులు 'బైట్‌'లతో సరిపెట్టారు. కొన్ని పత్రికలకైతే ఆ రోజటి రౌండ్‌ టేబుల్‌ సమావేశం టేబలాయిడ్‌ వార్త కూడా కాలేకపోయింది. ఇంతకన్నా ద్వంద్వ నీతి ఏముంటుంది? జగన్‌ మీడియా అనీ, ఎల్లో మీడియా అనీ పరస్పరం ఆరోపించుకుంటారు గాని కమ్యూనిస్టులకు సముచిత ప్రాధాన్యత నిరాకరించడంలో మాత్రం అంతా ఒకటిగానే వ్యవహరిస్తుంటారు. జాతీయంగానూ అణు ఒప్పందం తర్వాత వామపక్షాల పట్ల కార్పొరేట్‌ మీడియా వ్యవహరిస్తున్న చాలా తేడాగా వుంది. అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఇచ్చిన ప్రచారం ఏ ప్రముఖ వామపక్ష నాయకుడికన్నా మించిపోయిందంటే యాదృచ్చికం కాదు. మన రాష్ట్రంలో సుపరిచితులైన అరడజను మంది నేతలలో ఒకరైన రాఘవులు నిరాహారదీక్ష చేసిన అంశం ఆచరణకు వస్తున్నా సరే ఆ పోరాటానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం యాదృచ్చికం అని ఎలా అనుకుంటాం? గతంలో ఆయన దేవాలయ ప్రవేశాలు, సైకిల్‌ యాత్రలు వంటివి చేసిన రోజున అపహాస్యం చేసిన లేదా ఎగతాళి చేసిన వారు ఇప్పుడైనా పొరబాటు సవరించుకోకపోగా అదేమీ జరగనట్టే వ్యవహరించడం విడ్డూరంగా వుంది.

నిరంతరం.. నిర్దేశం
ధన ప్రధానమైన ప్రస్తుత ఎన్నికల వ్యవస్థలో బలాబలాలు ఎలా వున్నా గత ఇరవయ్యేళ్లలోనూ రాష్ట్ర రాజకీయ ఎజెండాను ప్రజల వైపు మళ్లించడంలో వామపక్షాలు సిపిఎం ముఖ్యపాత్ర వహిస్తున్నాయి. 1993-94లో సారా వ్యతిరేక పోరాటం, విజయవాడ ఉమ్మడి ప్రదర్శన వంటివాటితో రంగంసిద్ధం చేశాయి.1999లో కార్గిల్‌ నేపథ్యంలో ఓటమి ఎదురైనా 2000 విద్యుచ్చక్తి ఉద్యమంతో సరికొత్త సమరశీల అధ్యాయం రచించాయి.2007 తర్వాత భూపోరాటంతో కొత్త చైతన్యం నింపాయి. 2009 లో ఓటమి, వైఎస్‌ మరణం, ప్రాంతీయ ఉద్రిక్తతలు వీటన్నిటిమధ్యనా పాలక పక్షాలు విన్యాసాలు చేస్తున్నా సిపిఎం, సిపిఐ ఇతర వామపక్షాలు ప్రజా సమస్యలపై ఐక్య కార్యాచరణ, స్వంత ఉద్యమాలు కూడా నిర్వహిస్తూనే వున్నాయి. ఆ పార్టీల మధ్య రాజకీయ తేడాలు ఇందుకు ఆటంకం కావడం లేదు కూడా.అయితే ఇవన్నీ చూడలేని వారు వామపక్షాలు గతంలో వలె పోరాటాలు చేయడం లేదని పల్లవి ఆలపిస్తుంటారు.మీడియా మిత్రులు వాటినే పదే పదే వినిపిస్తుంటారు. ఇంతకు ముందే చెప్పినట్టు విద్యుత్‌ ఉద్యమం, భూపోరాటం తర్వాత చాలా కీలకమైన ఎస్‌సిఎస్‌టి సబ్‌ప్లాన్‌ ఆందోళన ఫలితం సాధించినా ప్రచారం ఇవ్వడానికి ఇష్టపడరు. తెలుగు దేశం వర్గీకరణ సవరణతో సృష్టించిన నాటకీయత పతాకశీర్షికలాక్రమిస్తుంది. అదే ముఖ్యమంత్రి ఏ పార్టీనైతే శాపనార్థాలు పెట్టారో ఆ పార్టీ కార్యదర్శి ప్రముఖ నాయకుడు సూటిగా సమాధానం ఇస్తే స్థలమే దక్కదు. తాజ్‌ మహల్‌ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు అన్నట్టే సామాజిక న్యాయంకోసం పోరాడిన మానవులెవ్వరు అన్నది అందరికీ తెలిసిన సత్యం.

పాఠాలు నేర్వరా?
వామపక్షాలు ఉద్యమాలు చేయడం లేదని ఆరోపించడంలో వాస్తవానికి రాజకీయ దురుద్దేశం దాచేస్తే దాగని రీతిలో వ్యక్తమవుతూనే వుంటుంది. గతంలో విద్యుచ్చక్తి ఉద్యమం జరిగినపుడు ప్రధాన ప్రతిపక్షంగా వున్న కాంగ్రెస్‌ ప్రత్యక్షంగా పాల్గొన్నది. ఇప్పుడు విద్యుత్‌ రంగంలో నెలకొన్న అవ్యవస్థకు నాడే పునాది పడింది. అది చివరకు ప్రజలపై అంతులేని భారాల పరంపరకు దారితీస్తున్నది. ఇలాటి తరుణంలో ఆ సమస్యపై వామపక్షాలు హైదరాబాదులోనే గాక జిల్లా కేంద్రాలలోనూ సదస్సులు ధర్నాల వంటివి నిర్వహిస్తున్నాయి. కాని మన మీడియాకు చంద్రబాబు షర్మిల పాదయాత్రలు తప్ప ఈ పేద యాత్రలు పట్టవు. అంతెందుకు? ఈ రోజు కూడా విద్యుచ్చక్తి సమస్యపై నిరసన తెల్పుతున్న బి.వి.రాఘవులు పట్ల పోలీసులు ఎంత అమానుషంగా ప్రవర్తించి అందరినీ అరెస్టులకు గురి చేశారో చూడొచ్చు. పోరాడేవాడిదే ఎర్రజండా అని కమ్యూనిస్టులెప్పుడూ పోరాడుతూనే వుంటారు.ఆ పోరాటాల పొడగిట్టని ప్రభుత్వాలు దాడి చేస్తుంటాయి. ఉద్యమాల పట్ల గౌరవం లేని మీడియా దాటవేసి పాలక పక్షనేతలు వారి వారసుల చుట్టూ పరిభ్రమింపచేస్తుంటుంది. బ్రిటిష్‌ మీడియాపై లెవన్‌సన్‌ నివేదిక నుంచి మన దేశంలో నీరా రాడియా, జీ న్యూస్‌ విలేకరుల అరెస్టు వరకూ నేర్చుకోవాలంటే చాలా పాఠాలున్నాయి. లేదంటే పాలకపక్ష నేతల చుట్టూనే తిరుగుతూ భేషుగ్గా గడిపేయొచ్చు. కాకపోతే పాఠకులు గాని ప్రేక్షకులుగాని వెరసి ఆ పాత్ర పోషించే ప్రజలు గాని ఆలోచనా శక్తిలేని వారు కాదు. అన్నీ చూస్తూనే వుంటారు... చూపించనివీ గమనిస్తూనే వుంటారు!!

No comments:

Post a Comment