రెండున్నర గంటల వ్యవధిలో ముగిసే చలన చిత్రంలా రెండున్నర ఏళ్లలో ప్రజారాజ్యం కాంగ్రెస్ రాజ్యంలో కలిసిపోయి కథ ముగించుకుంది. సోనియా నివాసం 10 జనపథ్ ముందు చిరంజీవి తన పార్టీ పేరు కూడా ప్రస్తావించకుండానే విలీనం చేస్తున్నట్టు ప్రకటించేశారు. ఆమెను కలుసుకున్న తర్వాత తమతో మాట్లాడి ప్రకటన చేస్తారనుకున్న ముఖ్య నాయకులు కూడా ఆశ్చర్య పోక తప్పలేదు. ఆకర్షణలు సామాజిక సమీకరణల అతిశయోక్తి అంచనాల మధ్య అమిత ప్రచారార్భాటంతో ఆవిర్భవించిన ఒక రాజకీయ పక్షం ఆ విధంగా తనకు తానే స్వస్తి చెప్పుకుంది. ఒక ప్రభుత్వం అనిశ్చితిలో వున్నప్పుడు తృతీయ స్థానంలో వున్న ప్రతిపక్షం అస్తిత్వాన్ని రద్దు చేసుకుని సంలీనం కావడం
దేశ చరిత్రలో ఎరగని విపరీతం.ఇది మిశ్రమ ప్రభుత్వాల కాలమనీ, అందరూ పొత్తులు పెట్టుకున్నారని ఏవో పొంతన లేని సమర్థనలు వినిపిస్తున్నాయి గాని కాంగ్రెస్‌తో ఎలా ఎందుకు కలిశారో చెప్పాలన్న దానిపై సూటిగా వివరణ లేదు. ఈ సామూహిక ఫిరాయింపునకు సామాజిక న్యాయం అనే రక్షణ కవచాన్ని తగిలించే ప్రయత్నం బొత్తిగా చెల్లేది కాదు..కలహాల నుంచి బయిటపడటానికి ప్రజారాజ్యంను రాబట్టుకుంటున్న కాంగ్రెస్ వచ్చిన వారిని వెంటనే నెత్తిన పెట్టుకుని కొత్త కలహాలు తెచ్చుకోవడం అంత సులభంగా జరిగేది కాదు.
చిరంజీవి రాజకీయ యాత్ర ఇతర పార్టీల నుంచి వచ్చిన వలస దారులు, చలనచిత్రాభిమానులు, సామాజిక అనుయాయులు, ఔత్సాహిక నేతలతో మొదలెట్టారు. అంతకు ముందే మాజీ వామపక్షీయులు కొందరు ఆయన తరపున తరగతులు నిర్వహించి దాని గురించిన సానుకూల భావన కలిగించేందుకు దోహదకారులైనారు. కమ్యూనిస్టులు ఈ చారిత్రిక సందర్భాన్ని గుర్తించడంలేదని శాస్త్రీయ సూత్రీకరణలు గుప్పించారు. అయినా పార్టీ స్థాపనపై ఎడతెెగని వూగిసలాట సాగింది. ఎట్టకేలకు శ్రీశ్రీ నేనుసైతం మోగుతుంటే తిరుపతిలో మెగాస్టార్ మాటల కోసం అన్నిచోట్లా కోట్ల మంది ఎదురు చూశారు. ప్రేమేలక్ష్యం, సేవే మార్గం అన్న క్యాప్షన్‌తో మొదలైన ఆ పార్టీకి విధాన స్పష్టత పూజ్యమని అప్పట్లోనే ఇక్కడ రాసిన వ్యాసంలో పేర్కొన్నాను. ఎన్టీఆర్ సంచలనం సృష్టించినట్టే చిరు కూడా చేయగలరా అనే ప్రశ్న పదే పదే అడుగుతుండేవారు. అప్పటికీ ఇప్పటికి పరిస్తితులలో తేడా వుందని చెబుతుండేవాణ్ని. సినిమాల్లోనైతే కథ స్క్రీన్‌ప్లే అన్ని హీరో చుట్టూ తిరుగుతాయి గాని ప్రజా జీవితంలో ఎవరికి వారు తమ స్థానం సాధించుకోవలసి వుంటుందని కూడా నొక్కి చెప్పాను. చిరంజీవి ఎకాఎకిన ముఖ్యమంత్రి అవుతారని, సీట్లు తక్కువొచ్చినా ఏదో ఒక విధంగా సర్దుబాట్లలో పదవి నలంకరిస్తారని ఆయన తరపు ప్రతినిధులు చెబుతుండేవారు. ఇలాటి వారే ఇవేవీ జరక్కపోవడంతో నిరాశోపహతులైనారు. వచ్చిన 18 స్థానాలు, 18శాతం ఓటింగు చిన్న విషయాలు కాదని తెలిసినా ఓపిక పట్టగల స్థితి లేకపోయింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆపరేషన్ ఆకర్ష అప్పటికే మొదలై పోయింది. జెండా పీకేయడం గురించిన కథనాలూ పొంగిపొర్లాయి. వీటిపై ఆయన ఆగ్రహావేశాలతో వూగిపోయారు గాని పరిస్తితిలో పెద్ద మార్పు రాలేదు. తాను ఆగ్రహించింది శీర్షికకే తప్ప కథనానికి కాదని ఇప్పుడు వివరణ! తనకు వచ్చిన ఓట్లు కేవలం వ్యక్తిగత అభిమానమే తప్ప రాజకీయ ప్రత్యామ్నాయంగా భావించి వేసినవి కాదని మరో విశ్లేషణ. తమ కొద్ది పాటి రాజకీయ చరిత్రపైనా వచ్చిన గణనీయమైన ఓటింగు పైన ఇలా అధినాయకుడే సూత్రీకరించడం గతంలో ఎప్పుడూ జరిగి వుండదేమో. చారిత్రిక పాఠాలూ, రాజకీయ వాస్తవాలూ, వ్యక్తిగత పరిమితులూ గమనించకుండా తాడూ బొంగరం లేని సూత్రీకరణలు చేసిన పండిత ప్రకాండులకు ఇది గొప్ప గుణపాఠం. కాగా నిలకడ లేని రాజకీయ శక్తికి ఓటు వేయడం వల్ల రావలసిన ప్రజా తీర్పు తారుమారు కావడం రాష్ట్రం చెల్లించిన మూల్యం. అంతా అయిన తర్వాత అధికార పక్షంలో కలగలసి పోవడం పదవీ లౌల్యం.
వచ్చిన ఓట్లు సీట్లతో నిమిత్తం లేకుండా వున్న బలాన్ని కాపాడుకుంటూ ప్రజల కోసం పని చేయడంలో నిమగమైతే ఎవరికీ మనుగడ గురించిన సందేహాలు రావు. అయితే మొదటి నుంచి కార్పొరేట్ తరహా కలలు సినిమా తరహా వూహలు అంకెకు రాని లెక్కలు, వ్యక్తిగత ధోరణులూ ప్రజారాజ్యంను పెడతోవ పట్టించాయి. విధాన స్పష్టత అవసరాన్ని గుర్తు చేయడం అపరాధంగా తోచింది. పార్టీలో టికెట్ల పంపిణీతోనే మొదలైన కిష్కిందకాండ అపజయంతో అరణ్యకాండగా మారిపోయింది. దాన్ని దీర్ఘకాలం పాటు నిలబెట్టాలన్న యోచన లేదని అందరికీ అర్థమైంది. వైఎస్ మరణం తర్వాత కాంగ్రెస్‌లో కల్లోలం, ప్రాంతాల వారీ ప్రకంపనలు ప్రజారాజ్యంను పట్టి కుదిపేశాయి. గ్రేటర్ హైదరాబాదు కార్పొరేషన్ ఎన్నికల సందర్భంలో పొత్తు గురించి పిసిసి పీఠాధిపతి స్వయానా ప్రకటించి తర్వాత తోసిపుచ్చినా ప్రజారాజ్యం ప్రతిస్పందన కరువైంది. రాజ్యసభ ఎన్నికల్ల మద్దతు సందర్బంలో అత్యుత్సాహం అపభాస్యానికి గురైంది. రోశయ్య ప్రభుత్వానికి మద్దతు నిస్తామని చిరు చెప్పినప్పుడు ఆయన ఆ అవసరం లేదు అంటే దానిపైనా మౌనమే. జగన్ సవాలు నుంచి ప్రజారాజ్యం ఆదుకుంటుందని కథనాలు నిత్యకృత్యమైనాయి.కిరణ్ కుమార్ రెడ్డి రాక, జగన్ నిష్క్రమణ ఈ క్రమాన్ని వేగవంతం చేశాయి. సోనియా గృహ ప్రాంగణంలో ప్రకటన దానికి పరాకాష్ట..
ఈ విలీనంపై మొదట్లో కాకా వెంకటస్వామినుంచి అనేక మంది నేతలు మాట్టాడినా ప్రజారాజ్య రాకనూ తెలంగాణాపై నిర్ణయాన్ని ముడిపెట్టి పెద్ద పెద్ద జోస్యాలు చెప్పడానికి లేదు. ఎందుకంటే కాంగ్రెస్‌కు దాగుడు మూతలే విధానంగా నడుస్తున్నాయి. అధిష్టానం విధానమే తనదని చిరు కూడా ప్రకటించేశారు. తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ నేతలు దీనిపై చేస్తున్న వ్యాఖ్యలు కేవలం రాజకీయ జాగ్రత్తలో భాగాలు కనకే పొత్తును హర్షిస్తున్నట్టు కూడా ప్రకటించారు. వాస్తవంలో వైఎస్ వున్నప్పటినుంచి ఇలాటి మంతనాలు జరుగుతున్నాయని ఉండవల్లి అరుణ్‌కుమార్ ఒక లేఖను పాక్షికంగా బయిటపెడితే జగన్ శిబిరం మండిపడింది. అప్పుడే మొదలైన ఈ తతంగాన్ని నేడు వైఎస్ వారసులు హర్షించలేకపోతున్నారంటే వారి రాజకీయ ప్రయోజనాలకు అది ప్రతిబంధంకంగా వుండటమే కారణం. ఈ క్రమంలో మొత్తం లేఖను బయిటపెట్టాలా అన్న సవాలుకు వారి నుంచి సమాధానం లేదు. కనక బయిటకు రావలసిన విషయాలు ఇంకా చాలా వున్నాయని స్పష్టమవుతుంది. ఈ లోగానే టిఆర్‌ఎస్‌ను కూడా కాంగ్రెస్‌తో కలుపుకుంటారన్న కథనాలను అధికార పార్టీ అదేపనిగా వ్యాపింపచేస్తున్నది. వీటిని టిఆర్‌ఎస్ ఖండిస్తున్నా తెలంగాణా ఏర్పాటుకు అంగీకరిస్తే సోనియా కాళ్లు పాలతో కడుగుతానని ఇంకా ఇలాటివే పలు వ్యాఖ్యలు చేసిన వారి గత భాషణాలు అనుమానాలు ప్రజల సందేహాలను నిశ్శేషంగా తొలగించలేకపోతున్నాయి. అధికారంలో వున్న కాంగ్రెస్ కంటే అన్యులపైనే దాడి కేంద్రీకరిస్తున్న వైఖరి కూడా మారడం లేదు.
విలీనం తర్వాత చిరు తదితరుల భావి స్థానాలపై వూహాగానాలు వదిలేస్తే- జగన్ శిబిరంలో ఎంఎల్‌ఎల హాజరు తగ్గిందన్న సూచనలకు ఇది కారణమైంది.తెలుగు దేశం అవిశ్వాస తీర్మానం తీసుకురాలేదని జగన్ వర్గం,టిఆర్‌ఎస్‌లు విమర్శిస్తున్నా తాము కూడా ఆ దిశలో ఏమీ చేయలేని స్థితి. ఇటీవల కాలంలో ఫిరాయింపుల నిరోధ చట్టాన్ని విస్త్రతంగా వినియోగిస్తున్నందున అనర్హతను కొనితెచ్చుకోవడానికి జగన్ శిబిరం ఎంఎల్‌ఎలలో ఎక్కువమంది సిద్దంగా లేరు. అటు వున్నారనుకున్న కొందరు సభ్యులు తిరిగి వెళ్లి అధిష్టానానికి విధేయత ప్రకటించడమూ ఆసక్తి పెంచింది. ఈ నేపథ్యంలో రానున్న ఉప ఎన్నికలపైనే జగన్ గురి వుంటుందనేది అంచనా. మరోవైపున తమపై వస్తున్న అవినీతి ఆరోపణలకు ప్రతిగా చంద్రబాబుపైనా వరుసగా అరోపణా లేఖలు న్యాయస్థానాలకు రాస్తున్నారు. ప్రభుత్వం మాత్రం వీటిలో వేటిపైనా స్పందించడం లేదు.
రచ్చబండ రాజకీయానికి అనిశ్చితి గుడిబండలా వుంటుందని ఈ శీర్షికలో చెప్పుకున్నది ఆచరణలో నిజమైంది. ఎట్టకేలకు మొక్కుబడిగా జరిపామనిపించుకోవడంలో ముఖ్యమంత్రి కృతకృతులైైనా ప్రజల నిరసనలు పలు రూపాలలో వ్యక్తమైనాయి. పొలీసుల వినియోగమూ ఎక్కువగానే జరిగింది. తెలంగాణా విభజన వాదుల నిరసనలు వున్నా అక్కడా ఇదే పద్ధతిలో నిర్వహణ కొంతవరకూ జరగడానికి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు సహకరించారు. అదే సమయంలో తెలంగాణా వాదాన్ని వినిపించడంలోనూ పోటీ పడ్డారు. ఈ రకరకాల రాజకీయ విన్యాసాల మధ్య శాసనసభ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమవుతున్నది. బయిట జరిగిన రాజకీయ పునస్సమీకరణల పూర్తి ప్రభావం అక్కడ మరింత స్పష్టంగా వెల్లడి అవుతుంది. కాగా శాసనసభ సమావేశాలకు ముందే దళిత గిరిజన ఆవాసాల సమస్యలపై తలపెట్టిన ఆందోళనలు యాత్రలు, ఇతర సంఘాల కార్యక్రమాలు కూడా కోర్కెలు ముందుంచనున్నాయి.
ప్రజారాజ్యం కాంగ్రెస్‌లో విలీనమవుతుందని కొందరు ముందే ఊహించారు కానీ ఇంత తొందరగా విలీనమవుతుందని అనుకోలేదు. సినిమా గ్లామర్ మీద స్థాపించిన పార్టీలు అంతగా సక్సెస్ అవ్వవు.
ReplyDelete