Pages

Monday, February 21, 2011

భాష గురించి చర్చ,కొన్ని అనుభవాలు,అభిప్రాయాలు



నా వ్యాసంపైన కాదు గాని నా వ్యాసంతో మొదలై తెలుగు భాష గురించి చాలా చర్చ జరగడం సంతోషకరం... నిత్య పరివర్తనాశీలమైన భాష వంటి విషయంలో పట్టువిడుపులతో వాస్తవికంగా వ్యవహరించడం తప్ప మరో మార్గం లేదు. కొన్ని అనుభవాలు,అభిప్రాయాలు చెప్పి దీన్ని ముగిస్తాను.
తెలుగులో రాయడంతో పాటు ప్రముఖుల రచనలనూ, జాతీయ నేతల ఉపన్యాసాలనూ కూడా నేను విస్త్రతంగా అనువదించాను. నేనూ ఉపన్యాసాలు విరివిగా చేస్తుంటాను. వీటిలో రకరకాల అనుభవాలున్నాయి.
ఒకసారి నేను పాల్వంచలోనో ఇల్లెందులోనో గంట సేపు మాట్లాడాక
ఒక ఇంజనీరు(దీనికి తెలుగు?)వచ్చి ఒక్క ఇంగ్లీషు మాట రాకుండా ఇంత సేపు మాట్లాడవచ్చునని నాకు తెలియదు అంటూ అభినందించారు.పీప్లీ లైవ్‌ చిత్రం పురస్కారం( దీనికి అవార్డు అని వచ్చేస్తుంది) పొందినప్పుడు దర్శకుడు నీలకంఠ తో ఐ న్యూస్‌లో చర్చలో పాల్గొన్నాను. అంకెం రవి సంధానకర్త. అంతా అయ్యాక నీలకంఠ కూడా తెలుగులో ఈ విషయాలను ఇంత విశదంగా మాట్టాడవచ్చని తెలుసుకున్నానంటూ అభినందించారు. న్యాయమూర్తి కీ.శే. ఆవుల సాంబశివరావు గారు ఒక్క ఇంగ్లీషు మాట లేకుండా మాట్లాడ్డం విన్నాను. అలాగే శాంతా బయోటెక్‌ వర ప్రసాద రెడ్డి గారు కూడా.
సమస్య ఏమంటే ఇల్లలికిన ఈగ లాగా మనం అమ్మ భాషలో అన్నీ మాట్లాడలేమనే భావనకు వచ్చేశాం. కష్టమైనా అలా మాట్టాడ్డానికి మనలో మనం తక్షణ తర్జుమా లేదా తెలుగీకరణ ప్రక్రియ సాగించుకుంటూ వుండాలనేది కూడా నిజం. తెలుగులోనేే రోజుల తరబడి కూడా మాట్లాడేవారు వుండొచ్చు గాని అది పెద్ద పరీక్ష కాదు.సోవియట్‌లో గోర్బచెవ్‌ పెరిస్త్రోయికా అనేది అమలు చేస్తున్నప్పుడు తెలుగు పత్రికలు దాన్ని పునర్యవస్థీకరణ అని అనువదించాయి. ఆరుద్ర తిరగనేత అన్న మాట బాగా సరిపోతుందన్నాడు. నిజంగా సరిపోతుందా? గుడ్‌మార్నింగ్‌కు శుభోదయం సరైన పదమేనా? సుప్రభాతం సరైందా? సుప్రభాతం తర్జుమానా? మౌలికమా? ప్రశ్నలు ప్రశ్నలే ప్రశ్నలు.
బోద్ధలగు వారు మత్సర పూర్ణమతులు, ప్రబల గర్వ విభూషితుల్‌ ప్రభువులు అని భర్త్రహరి మరో సందర్భంలో అన్నట్టు- పండితులు తమ తమ స్వాతిశయాలతో పాక్షిక కోణాలతో సహకరించరు.పాలకులకు ఇలాటివి పట్టవు. అందుకే తెలుగు భాషా వికాసం జరగాల్సినట్టు జరగలేదు.

అయితే నా అభిప్రాయంలో తెలుగు భాషకు కొన్ని చారిత్రిక పరిమితులు వున్నాయి. అవి దిద్దుకోలేని లోపాలు కావు,
1.దైనందిన వ్యవహారాలను బంధాలను, రాగ ద్వేషాలను, రాజరిక సిద్ధాంతాలను, భక్తి రక్తి వంటి గుణ విశేషాలను వర్ణించే పదజాలానికి లోటు లేదు.
2.ప్రజాస్వామ్య పదజాలం,సామాజిక సమధర్మం సూచించే పదాలు చాలా తక్కువగా వుంటాయి. ఎందుకంటే అవి తెలుగు భాష పెంపొందిన కాలంలో లేవు.
3.మన దొంతరల వర్ణ వ్యవస్థ ప్రభావం ఎక్కువగా వుంటుంది. ఒకసారి రామచంద్రమూర్తి గారు థాంక్స్‌ అన్న మాటకు తెలుగేమిటి అని ప్రశ్నిస్తే అదే సంచికలో మృణాళిని షాపింగ్‌కు తెలుగుందా అని ఆశ్చర్య పోయారు. నమస్కారాలు ఆశీర్వాదాలు మాత్రమే తెలిసిన వ్యవస్థలో ధాంక్స్‌ వంటి జెస్చర్స్‌కు సంబంధించిన పదాలు సహజంగా వుండవు. సంతకెళ్లడం అన్న మాటకు షాపింగ్‌ వెనక వున్న వినియోగదారి మార్కెట్‌(బజారు) సంసృతికి సరిపోదు.
4. సామాజిక సహ జీవన పదజాలం కూడా తక్కువగానే వుంటుంది.
5.ఆధునిక రాజ్యాంగాలు న్యాయ వ్యవస్థ రాజకీయ సిద్దాంతాలకు కూడా పదాలు కూర్చుకోవలసిందే.
6.అందరికీ తెలిసినట్టే సాంకేతిక పరికరాలకు అసలే మాటలుండవు. మహా భారతంలో కంప్యూటర్ల గురించి ఎలా వుంటుంది? ఆగేయాస్త్రమే క్షిపణి, బ్రహాస్త్రమే అణుబాంబు వంటి మాటలు గొప్పల కోసం బాగుంటాయి గాని నప్పవు.
ఈ పరిమితులకు కారణం మొదట చాందసుల పిడివాదం వల్లనూ, తర్వాత కాలంలో పరాయి పాలకుల పెత్తనం వల్లనూ సామాన్య జన విద్యా వికాసం దెబ్బ తినడమే.అయినా భాష ఇంత పెరిగిందంటే ప్రజా దృష్టి గల ప్రతిభా మూర్తులు ప్రజాస్వామిక వాదుల కృషి మాత్రమే కారణం. రాజకీయాలలో వలెనే భాషా సాహిత్యాలలో కూడా జన బాహుళ్య ప్రయోజనాలు ప్రతిబింబించకపోతే ప్రజాస్వామ్యం సంపూర్ణం కాదని గురజాడ అన్న మాట నిజం. అంతర్గత అంతర్జాతీయ ప్రతిబంధకాల మధ్య మనం తెలుగును అభివృద్ధి పర్చుకోవాలి. కేంద్రం కూడా దేశంలోని భాషలన్నిటి వికాసానికి సహకరించాలి.పదం నిలుస్తుందా లేదా అనేది వినియోగంలోనే తేలిపోతుంది. కృతకమైన పదం ఎన్ని తంటాలు పడినా నిలవదు. బాగానే వున్న పదం ఖచ్చితంగా సరిపోకపోయినా నడుస్తుంది. కేవలం మాతృభాష సూత్రం కోసం చేసే ప్రయోగాలు విఫలం కావడం అనివార్యం. కుదరనిది కుదరదు. కుదిరింది చెదరదు. అంతే.
భాష అంటే ఇంకా చాలా చెప్పాలనిపిస్తుంది గాని - ఇప్పటికి విరామం. అచ్చు తప్పుల గురించి శ్రీనివాస్‌ గారు చేసిన సూచనను పాటించి దిద్దుకుంటాను. వ్యాఖ్యల నమోదుపై సుజాత గారి సూచనను పరిశీలిస్తాను.
ధన్యవాదాలు.

3 comments:

  1. అను నిత్య పరివర్తనాశీలమైన మన భాష గురి0చి బెంగలేదు లే0డి. మీ భావన నిజ0. ఏమైనా, వెలుగు ఉన్న0తకాల0., తెలుగు ఉ0టు0ది.ఇది నిజ0.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. రవి గారూ,
    "కృతకమైనా ఒక మాటను వాడుతూ ఉంటే, కొన్నాళ్ళకు అదే మామూలు మాటౌతుంది" అనే వాదనను నేను సమర్ధిస్తున్నాను. నేను మా పల్లెటూరి నుంచీ పట్టణానికి వచ్చిన తొలినాళ్ళలో "థాంక్స్" అని ఇతరులకు చెప్పటం చాలా కృతకం గా, హెచ్చులు పోవటం గా అనిపించేది నాకు. కానీ అవసరార్ధం నేను చేస్తున్న ఉద్యోగ రీత్యా వాడీ వాడీ ఇప్పుడు థాంక్స్ చెప్పటం మామూలైపోయింది.
    ఒక మాట సంస్కృతమైనా, అచ్చ తెలుగైనా,కృతక పదమైనా ఇంగ్లీషు కి బదులు గా వాడటం వలన, మన భాష మీద ఇంగ్లీషు ఆక్రమణ ని తగ్గించినట్లౌతుంది. ఇంగ్లీషు ప్రభావం తగ్గించటమెందుకంటారా? మన భాష చచ్చిపోకుండా ఉండటానికి. సంస్కృతం గానీ ఉర్దూ గానీ మనలను ఆయా భాషలలో ఆలోచించే స్థితికి తీసుకొని పోలేక పోయాయి. కానె ఇంగ్లీషు ఆ దిశ గా మనలని తీసుకొని పోతోంది. కాబట్టీ సంస్కృతం గానీ , ఉర్దూ కానీ చెయ్యలేని పనిని (తెలుగు భాషని చంపటం) ఇంగ్లీషు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది . ముందు ఆంగ్లాన్ని మొత్తం గా తొలగించటానికి ప్రయత్నిస్తే, తరువాత కనీసం దానిని తగ్గించటం లో నైనా విజయం సాధిస్తామేమో!
    ధన్యవాదాలు,
    ప్రసాదు.

    ReplyDelete