Pages

Sunday, February 20, 2011

వాస్తవిక దృష్టితో తెలుగు భాషా వికాసం.


విష్వక్సేనుడు అన్న మాట ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సక్రమంగా ఉచ్చరిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని జగన్‌ పార్టీ నేత అంబటి రాంబాబు కొద్ది కాలం కిందట సవాలు చేశారు. ఈ రెంటిలో ఏదీ జరగలేదు. జరగవు కూడా. అయితే ఈ క్రమంలో తెలుగు భాషకు సంబంధించిన కీలకమైన అంశాన్ని గుర్తించడానికి మాత్రం ఈ వివాదం ఉపయోగపడుతుంది.
ముఖ్యమంత్రి తెలుగు పండితుడు కావాలన్న నిబంధన ఏమీ లేదు గనక ఆయన ఎలా మాట్టాడుతున్నారనేది పెద్ద సమస్యగా తీసుకోనవసరం లేదు. అయితే తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగులో ధారాళంగా మాట్టాడేందుకు శ్రద్ధ చూపకపోవడం ఇంగ్లీషు భాషా బోధన ప్రాబల్యాన్ని చెప్పకనే చెబుతుంది. రెండవది తెలుగు భాషా పటిమను పరీక్షించడానికి ఎంచుకున్న విష్వక్సేనుడు అనే పదం తెలుగేనా? సంసృతమా? ప్రాచీన ప్రమాణాల ప్రకారం భాషను బంధించ దలచిన సనాతన వాదనలను మనం ఇంకా భుజాన మోయవలసిన
అవసరం లేదు. కనక ఒకటి ఇంగ్లీషు ప్రభావమైతే మరొకటి సంసృత ప్రభావం ఇప్పటికి రాహు కేతువుల్లా తెలుగు భాషను పట్టి పీడిస్తూనే వున్నాయని అర్థమవుతుంది.
ముఖ్యమంత్రి తెలుగులో మాట్లాడ్డంపై పరీక్షకు నిలవాల్సిన అవసరం లేదు గాని తెలుగు పిల్లలకు ప్రాథమిక తరగతుల్లోనే తెలుగు నేర్చుకునే అవసరం అవకాశం లేకుండా చేస్తున్న పరిస్తితిని మాత్రం తప్పక సరిదిద్దాలి. అందరూ ఇంగ్లీషు మీడియంనే కోరుతున్నారనే పేరిట తగు ఏర్పాట్లు శిక్షణ నియామకాలు లేకుండానే వున్న పాఠశాలలను ఎకాఎకిన ఇంగ్లీషు మీడియంలోకి మార్చాలనుకోవడం అవాస్తవికతకు అనాలోచిత వైఖరిని అద్దం పడుతుంది.రకరకాల కారణాలతో దీనికి వంత పాడే వారు కూడా వున్నారు. కాని ఇందులో రెండు ప్రధాన సమస్యలున్నాయి. మొదటిది- ప్రాథమిక తరగతుల్లో మాతృభాష ద్వారా జ్ఞానం అబ్బినంత తేలిగ్గా ఇంగ్లీషు ద్వారా అబ్బదు. రెండు- నియామకాలు లేని కారణంగా ఇప్పుడున్న సిలబస్‌ చెప్పడానికే ఉపాధ్యాయులు అల్లాడి పోతుంటే వారినే ఏకంగా ఇంగ్లీషులో చెప్పాలని ఆదేశించడం బాధ్యతా రాహిత్యం. ఇంగ్లీషును ఎవరూ వ్యతిరేకించరు గాని తెలుగును చులకన చేసి తెలుగు పిల్లలకు దాన్ని తెలియకుండా చేయొద్దని మాత్రం పట్టుపడతారు. ముఖ్యమంత్రి గారు ఆ విషయంలో ఎక్కువ శ్రద్ద పెడితే ఉపయోగంగా వుంటుంది. కాని ఇప్పుడు ప్రపంచీకరణ తాకిడికి పరుగులు పెడుతున్న వారంతా ఇంగ్లీషు ఎకాఎకిన అందలం ఎక్కించేస్తుందని భ్రమపడుతున్నారు. అణగారిన వర్గాల ప్రతినిధులం అనే వారు కూడా ఆంగ్లమే అభివృద్ధి సోపానమనే ఆశాస్త్రీయ భావనను ఆదరిస్తున్నారు.ఈ క్రమంలో పేద బలహీన వర్గాల పిల్లలు ఉభయ భాషా ప్రవీణులు కావడానికి బదులు ఉభయ భాషా భ్రష్టులవుతున్నారు. పై తరగతులు వర్గాల వారు మరింతగా పైకి దూసుకుపోవడానికి నిచ్చెన మెట్టుగానే మిగిలిపోతున్నారు.
వేష భాషల్లో భారతీయులుగా వుంటూనే భావాల్లో తమకు దగ్గరగా పనిచేసే తరాన్ని తయారు చేయడం మెకాలే విద్య లక్ష్యం. ఆ లక్ష్యంలో వారు పూర్తిగా కృతకృత్యులైనారు. అలాగే ఈనాడు కింది తరగతుల్లో ఉన్నత విద్యలు నేర్చిన వారు కూడా సహజ విజ్ఞాన క్రమాన్ని విస్మరించి అరకొర ఇంగ్లీషు మీడియం తరగతులే ఎదుగుదలకు సోపానాలని నమ్మమంటున్నారు. నిజానికి విద్యా బోధన సిద్ధాంతాలు గాని ఏ దేశ అనుభవాలు గాని ఈ వాదనను బలపర్చడం లేదు. మాతృభాష లేకుండానే మహౌన్నత సహజతరమైన అభివృద్ధి సాధ్యం కాదు.
ఇక తెలుగు పరిరక్షణ పేరిట తాపత్రయ పడేవారిలో కూడా అనేక రకాల వారున్నారు. వైవిధ్య భరితమైన ప్రజాస్వామిక భాషా వికాసాన్ని కాక సంకుచితమైన చాందసమైన భావనలకు వీరు పట్టం కడుతుంటారు. సంప్రదాయ వాదమే తెలుగు చరిత్ర అన్న భావన వీరిలో తొణకిస లాడుతుంది. తెలుగు సినిమా పాటల్లో అదుర్తి వరవడికి ఆయన సహాయకుడుగా వచ్చి కళాతపస్విగా ఎదిగిన విశ్వనాథ్‌ పాటల వరవడివకి ఎంత తేడా వుంటుందో ఆధునిక సంప్రదాయ భాషా వాదుల మధ్య అంత తేడా వుంటుంది. శ్మశానాల వంటి నిఘంటువులు దాటి చందస్సుల సర్ప పరిష్వంగాలు వీడి తెలుగు భాషను ప్రజల మార్గం పట్టించకపోతే భాషాభిమానాన్ని తిరోగమన దిశలోకి మరల్చే శక్తులకు లోటు లేదు. ప్రజల భాషను ప్రమాణీకరించడం తప్ప ప్రమాణాల ప్రకారం ప్రజలను మాట్లాడమని చెప్పడం కుదిరే పని కాదు. కొలతలు మనిషిని కాలాన్ని బట్టి వుంటాయి తప్ప కొలతలను బట్టి మనిషి కాలం నడవడం జరగదు. ప్రాచీన భాష హౌదా కోసం సాగిన ఆందోళన సందర్భంలో చెప్పినట్టు మనకు ఆదికవులు సోదికవులు కూడా కావాలి. మొదటి వారినే పట్టించుకుని రెండవ వారిని వదిలేయడం వల్లనే మనం తమిళం వలె తెలుగు భాషా చరిత్రను నిర్మించుకోలేకపోయాము. ఆ ప్రధాన గుణపాఠం వదలిపెట్టి వారు భాష కోసం చూపించే కొన్ని దురభిమాన ధోరణలను ఆదర్శంగా ప్రచారం చేయడం వల్ల ఉపయోగం లేదు. తమిళనాడును భాషా విషయమైన స్వర్గధామంగా చిత్రించడం పూర్తిగా వాస్తవమూ కాదు. హిందీ వ్యతిరేకతతో ఇంగ్లీషును గొప్పగా నెత్తిన పెట్టుకున్న తమిళనాడు విధానంలోనూ లోపాలు పైత్యాలు చాలా వున్నాయి. అవి ఇతర దక్షిణాది భాషలను అపహాస్యం చేసే స్తితికి కూడా దారి తీస్తుంటాయి. కనకనే పరస్పర గౌరవంతో ప్రజాస్వామిక భాషా విధానం ద్వారా సర్వతోముఖాబివృద్దికి మనం కృషి సాగించాలి.
ఇటీవలి కాలంలో ప్రాంతీయ ఉద్యమాల కారణంగా తెలుగు వారసత్వంపైన కూడా వివాదాలు సాగిస్తున్నారు. ఎవరు ఎక్కడ మాట్టాడే ఏ తె లుగు గొప్పదన్న మీమాంస అర్థం లేనిది. తెలంగాణా రాయలసీమ కోస్తా ప్రాంతాల్లో మాట్టాడే తెలుగు ఒక్కటి కాదన్న మాట అసలే అశాస్త్రీయం. మూడు ప్రాంతాలలోనూ మాట్టాడే తీరుపై తేడాలుండటమే కాదు, ప్రతి ప్రాంతంలోనూ అంతర్గతంగా అనేక తేడాలుంటాయి. వాటన్నిటిని భాషలుగా లెక్కవేయడానికి ప్రాతిపదిక లేదు. అయితే ఇందులో ఏది గొప్ప ఏది తక్కువ అనే వివాదం మరీ హానికరం. వైవిధ్య భరితమైన శైలులను ఆదరించడం ద్వారా తెలుగు మరింత వెలుగు తుంది తప్ప దెబ్డ తినదు. కానైతే ఏలిన వారి నిర్లక్ష్యం వల్ల మొ త్తంగా తెలుగు వెనకపట్టు పడుతుంటే ఇందులో ఏది ఎక్కువ ఏది తక్కువ అనే పరిశీలనే అవాంచనీయం.
రెండు మూడేళ్ల కిందట ఆర్బాటంగా సాగిన ప్రాచీన భాష హౌదా వచ్చినా భాషా పరంగా మనం ముందుకు పోయిందేమీ లేదు. ఆధునిక ప్రజాస్వామిక వైజ్ఞానిక లక్షణాలు పెంచుకోవడానికి బదులు ప్రాచీనత కోసం పాకులాడినా ప్రయోజనమూ లేదు. కాకపోతే ఆ ఖాతాలో వచ్చిన వంద కోట్లు ఏ విధంగా తెలుగు భాషా వికాసానికి వెచ్చిస్తున్నారనేది మాత్రం అందరూ తెలుసుకోగోరతారు.
మీడియాలో ఇంగ్లీషు పదాలను అనవసరంగా కూడా వాడుతున్నారు గనక తెలుగును ఖూనీ చేస్తున్నట్టు తిట్టిపోయడం కూడా పాక్షికత్వమే కాలానుగుణంగా ఎవరి తంటాలు వారు పడినప్పటికీ మొత్తంపైన మీడియా తెలుగు భాషాసంసృతులకు చేస్తున్నమేలు చాలా వుంది. పత్రికల కారణంగానే చాలా పద సంపద అదనంగా తెలుగులో వచ్చి చేరింది. టీవీ వేగంగా తక్షణంగా కనిపించే మీడియా గనక అందరికీ వెంటనే తెలుగు పదాలు తట్టకపోవచ్చు. వుండకపోవచ్చు కూడా. మీడియా అన్న మాటకే మంచి తెలుగు పదం లేదు. ప్రసార సాధనాలు అన్న మాట కృతకమైంది. ఇలాటి వాటి వల్లనే తెలుగు వికాసం మందగమనంలో పడింది. పాఠశాల అనడానికి చదువు రాని తెలుగు వారైనా సిద్ధంగా వుంటారా? కాలేజీ అని గాక కళాశాల అని , ఆస్పత్రి లేదా హాస్పిటల్‌ అనిగాక వైద్యశాల అని అనే వారుంటారా? తెలిసీ మనం కృత్రిమ పదజాలాన్ని పట్టుకు వేళ్లాడ్డం వల్లనే సహజమైన తెలుగు పదాలు పెరగలేదు. శాస్త్ర సాంకేతిక పరికరాలకు మాత్రమే కాక ఆధునిక సామాజిక రాజకీయ పదజాలాలు చాలా వాటికి తెలుగులో సమానార్థకాలు లేవు. థాంక్స్‌, జెస్చర్‌, ఇంటర్‌ యాక్షన్‌, మేనేజర్‌, ఫెసిలిటేటర్‌, కాన్సెప్ట్‌, కంట్రిబ్యూట్‌, వైస్‌ ఛాన్సలర్‌( కులపతి అన్నది నిజంగా సరైన పదమేనా?) రిసెర్చి స్కాలర్‌, అకాడమీ, గవర్నర్‌, టెక్నిక్‌ వంటి చాలా పదాలకు సరైన తెలుగు మాటలు లేవు. సమీప పదాలు వున్నచోట కూడా ఆ పదాలను ఏ రూపంలో సందర్భంలో వాడుతున్నామనే దాన్ని బట్టి సమస్య వస్తుంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే తెలుగు భాష ఆధునీకరణ క్రమం మనం కొనసాగించడం లేదు. తెలుగు భాష మీద సంపూర్ణమైన ప్రేమతోనే మనం ఈ మాట చెప్పుకోవచ్చు. నేనెప్పుడూ తెలుగు పదాలనే వాడుతుంటాను. తెలుగులో సులభంగా చెప్పగలిగేది ఇంగ్లీషులో చెప్పనవసరం లేదు. ఇంగ్లీషు పదం సులభంగా తెలిసే చోట చాందసంగా క్రత్రిమ తెలుగు పదాలను వాడవలసిన అవసరమూ లేదు. ఏనాడో గిడుగు రామ్మూర్తి చెప్పినట్టు సామాజిక జీవనాన్నే గీటురాయిగా పెట్టుకుని బాషా వికాసాన్ని సాధించుకోవాలి. పరభాషా వ్యామోహాన్ని పరస్పర అపార్థాలను పోగొట్టుకోవాలి. వచ్చిండు వచ్చాడు వచ్చినాడు, ఏ రూపం ఉపయోగించినా తెలుగు తియ్యదనం తగ్గదు.కాని వెంట్‌ అని ఇంగ్లీషులో చెప్పడం గొప్ప అనుకున్ననాడు ఏ రూపమూ మిగలదు.అది అసలు ముప్పు. తెలుగు గొప్పతనం పేరిట వెనక్కు చూడటం కాక తెలుగును ముందుకు నడపడం ద్వారా తెలుగు వారూ నడవాలి. మాతృభాషాభివృద్ధి ఒక ప్రజాస్వామిక అవసరం.

32 comments:

 1. This comment has been removed by the author.

  ReplyDelete
 2. రవిగారు,విశ్లేషణ బాగుంది.

  @శివగారు, మీరన్నట్టు కొత్త పదాలను తర్జుమా చేయకపోతే భాష అభివృద్ది ఖచ్చితంగా ఆగిపోవల్సిందే...దీనివలన అరువు తెచ్చుకుంటున్న పదాలను అలానే వాడాల్సివస్తుంది లేదా వాడుకలో ఉన్న పదాలనే మళ్ళీ మళ్ళీ వాడాల్సిన దౌర్భాగ్యం పడుతుంది.ప్రపంచంలో నాగరికతకు అనుగుణంగా ఎప్పటికప్ఫుడు కొత్త పదాల సృష్టి జరుగుతూనే ఉంటుంది.వీటిని మన భాషలోకి తర్జుమా చెయ్యకపోతే కొన్ని ఏళ్ళ తరువాత తెలుగు భాషాపద ప్రయోగంలో ఇతర భాషల ప్రాబల్యం మాత్రమే కనిపిస్తుంది తప్ప తెలుగు నామమత్రంగా అయిపోయే ప్రమాదం ఉంది.ఎందుకండి ఇటువంటి పరిస్థితిని తీసుకురావడం...ఎంతవరకూ సమంజసం అంటారు..?
  అరువు తెచ్చుకున్న పదాలను అనువదించగల(వాటికనుగుణంగా కొత్త పదాల సృష్టించే) సామర్ధ్యం ఉన్నవారు చేస్తున్నారు కాబట్టి చేసేవారిని చేయనియ్యండి మనము వారిని ఉత్సాహపరచాలే తప్ప నిరుత్సాహపరచడం సరైనదేనా..
  ఇందులో ఎటువంటి బలప్రయోగం లేదు కాబట్టి వాడుకునే వారు వాడతారు, ఇక వాడని వారు వారి వారి కర్మ.కొన్ని పదాలైనా ప్రాచుర్యంలోకి రాకుండా పోవు కదా.మీరన్నట్టు దీనిని భాషాభిమానులు (ఎవరికి తోచిన రీతిలో)కాకుండా సంపూర్ణ భాషా పరిజ్ఞానుల, భాషావేత్తల సమక్షంలో వీటి సృష్టి జరిగితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నాను.లేకపోతే అనువాదం చేయబడినవి అర్ధరహితంగాను మరియు అటూ ఇటూ కాకుండా(ౠతులు) పోయే అవకాశం ఉంది.

  అన్నట్టు భాషాభిమానులందరికీ అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవ శుభాకాంక్షలు.

  నెనరులు
  ప్రవీణ్.

  ReplyDelete
 3. This comment has been removed by the author.

  ReplyDelete
 4. రవిగారు చాలా బాగుంది మీ వ్యాసం - చర్చలలో మీ విశ్లేషణలు మాదిరిగానే. మీరన్నట్టు కొత్త పదాలను అసహజముగా తర్జుమా చెయ్యాల్సిన అవసరము లేదు. ఆ పదానికి సమానార్థకమైన పదము తెలుగులో ఉంటే మాత్రము తప్పకుండా దానిని వాడాలి. అలాగే క్రియా పదాలనూ విశేషణాలనూ తప్పని సరిగా తెలుగులోనే వాడాలి. "లైక్" చేసాను. "రీడ్"చేసాను లాంటి ప్రయోగాలను మానెయ్యాలి. Wonderful గా ఉంది అనే బదులు అద్భుతముగా ఉంది అని అనటము మరింత అందముగా ఉంటుంది.

  ReplyDelete
 5. ఇంగ్లీషు పదం సులభంగా తెలిసే చోట చాందసంగా క్రత్రిమ తెలుగు పదాలను వాడవలసిన అవసరమూ లేదు......

  బ్రతికించారు.....

  హాయిగా సరళంగా మాట్లాడుకోగల్గిన మాతృభాష చావకుండా చూసుకోవడం అవసరమే కానీ నాలుకకు, మెదడుకు లొంగని కరాళ మరాళ పదాల్ని తెచ్చి తెలుగు పేరిట, స్థానికీకరణ పేరిట తెలుగులో కలపడానికి నేను కూడా శుద్ధ వ్యతిరేకిని!

  ఇటువంటి మాటలు confusion కి దారి తీస్తాయి తప్ప ఇవి ఎన్నేళ్ళయినా వాడుకలోకి వచ్చే సూచనలు కానరావు.ఎదుటివారికి అర్థమయ్యేంత సులభంగా ఆంగ్ల పదాలుంటే వాటినే వాడటం అనువుగా కనపడుతుంది. ముఖ్యంగా కంప్యూటర్ ని కలన యంత్రమనడం, లాప్ టాప్ ని అంకోపరి అనడం వంటివి నేను జీర్ణించుకోలేను. ఆ పదాలంటూ ఉన్నాయని తెలియడమే కాని వాస్తవిక ప్రపంచంలో వాటిని వాడేవాళ్ళు ఎక్కడైనా కనిపిస్తారా?

  మరీ తెలుగు కావలసి వస్తే Dredger కి తవ్వోడ అని సృష్టించుకున్నట్లు, సామాన్య ప్రజలే వారికి అనువుగా ఉండే పదాలను సృష్టించుకుంటారు.

  రవి గారూ, మాతృభాషా దినోత్సవం రోజు మంచి వ్యాసం అందించారు. కృతజ్ఞతలు!

  ReplyDelete
 6. తెలుగులో కొత్తపదాలు అవసరమా కాదా? అన్న వాదన చాలా రోజులనుండీ జరుగుతున్నదే. నా స్వానుభవం ఇది.

  మూడు నాలుగు భారతీయభాషలు ఉన్న సెల్లుఫోను ఏదైనా ఒకటి తీసుకోండి. అందులో "సెర్చ్", "డిస్ప్లే","కాల్" వంటి ఓ పదిపదహైదు పదాలకు వివిధభాషల్లో అనువాదాలు పరికించి చూడండి. మీకు మీరే కనుగొనగలిగే విషయం ఏమంటే - తెలుగు భాషలో మాత్రం ఆయా ఇంగ్లీషుపదాలు అలానే తెలుగులో ఉంటున్నాయి. సెర్చికి బదులు శోధన, కాల్ కు బదులు పిలుపు - ఒక్క తెలుగువాడికి మాత్రమే ఎబ్బెట్టు. కన్నడ వాడు scheduler, unit converter వంటి పెద్దమాటలకు కూడా సమయసారణి, ప్రమాణపరివర్తని అని వాడుతున్నాడు. తేడా ఎక్కడుంది?

  నా ఉద్దేశం ప్రకారం కొత్తపదాలు అవసరమే. భాషాభిమానం పైత్యం స్థాయికి చేరుకుంటే తప్ప బాగుపడని రోజులు వచ్చాయి. అంచేత కొన్ని పదాలు ’ఎబ్బెట్టు’ (ఉదా: అంకోపరి) అయినా సృష్టించుకోవలసిందే. ఏవో కొన్ని పదాలు వచ్చి చేరినంతమాత్రాన మనకేమీ కాదు అనుకునే సౌలభ్యం ఇప్పుడు తెలుగుకు లేదు. భాష మీద అభిమానం కాదు, తీవ్రమైన ఉన్మాదస్థాయి అభిమానం వస్తే తప్ప తెలుగు బాగుపడదు.

  ReplyDelete
 7. కొత్త పదాలు సృష్టించడం వేరు, అది వాడుకలోకి రావడం వేరు! ఎయిల్ టెల్ వాడి బిల్ లో "నెలసరి శుల్కం" అని ఇస్తాడు. అది బయట ఎవరైనా వాడతారా?

  పదాలు భాషలో చేరినంత మాత్రాన అన్ని పదాలూ వాడుకలోకి రావు, అవి సహజంగా లేనంత వరకూ!

  ReplyDelete
 8. /*ముఖ్యంగా కంప్యూటర్ ని కలన యంత్రమనడం, లాప్ టాప్ ని అంకోపరి అనడం వంటివి నేను జీర్ణించుకోలేను*/ ఇలా కూడా అంటున్నారా? ఇంటర్నెట్ ని అంతర్జాలం అంటున్నారన్న విషయాన్ని నేనింకా ఒప్పుకోలేక పోతున్నాను అసలు .

  ప్రజలు దేనికి అలవాటు పడతారో అదే వాడుక భాష అవుతుంది. ప్రతీ పదాన్ని తెలుగులో మాట్లాడాలి అంటే చూపులు కలసిన శుభవేళ సినిమా లో గుర్రం గుర్నాథం లా తయారవుతాం.

  వాడుక భాష కాకుండా ప్రాచీన భాష వాడితే, సామాన్యుడు దానిని పట్టించుకోడు...దాదాపు 120 ఏళ్ళ క్రితం రాసిన కన్యాశుల్కం ఇప్పటికి అర్థం అవుతుంది, ఇప్పటికీ చదువుతున్నారు, అదే గ్రాంధికం లో రాసిన రామాయణ కల్ప వ్రుక్షమ్ ఎంతమంది చదువుతున్నారు ?

  ReplyDelete
 9. సంజు,

  అంతర్జాలం అనే మాట నాకూ నచ్చదు. నేను ఇంటర్నెట్ అనే వాడతాను. కానీ కొన్ని దినపత్రికలు ఆ మాట వాడుతున్నాయి. మళ్ళీ అదే చెప్తున్నా...పత్రికా భాష వేరు, మనం వాడే భాష వేరు. అంతర్జాలమనే మాట పత్రికల్లో, బ్లాగుల్లోనే తప్ప మాట్లాడే భాషలో ఎవరూ వాడరు.

  ReplyDelete
 10. చాలా మంచి వ్యాసం. తెలుగువాళ్ళందరూ ఆలోచించాల్సిన అనేక ముఖ్య విషయాలున్నాయిందులో.

  సుజాతగారు, "confusion" బదులు హాయిగా "గందరగోళం" అని వాడొచ్చుగా! :-)

  ఇంగ్లీషు మాటలకి తెలుగు సేత గురించి నా అభిప్రాయం ఇది. తెలుగు మాటలు పుట్టించాల్సిన అవసరం ఉందని అందరూ ఒప్పుకుంటున్నారనే అనుకుంటాను. వాటి స్వరూపం గురించే భేదాభిప్రాయాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం భాషలో పదాలని రెండు ప్రధాన భాగాలుగా గుర్తించాలి. ఒకటి సామాన్యులు రోజువారీగా వాడుకలో మాట్లాడేవి. Hospital లాంటివి. రెండు, ప్రత్యేకమైన వృత్తికి లేదా వర్గానికి సంబంధించిన విశేష పదాలు. ఉదాహరణకి Laptop. ఒక చదువురానివాడిక్కూడా hospital అంటే తెలుస్తుంది, laptop అంటే తెలియదు. నిత్య వ్యవహారంలో ఉండే పదాలు ప్రజల నోళ్ళల్లో సహజంగానే రూపాంతరం చెందో, మరొకటయ్యో తెలుగులో కలుస్తాయి. వీటి గుఱించి మనం ప్రత్యేకంగా కృషి చెయ్యాల్సిన అవసరం లేదు. అలా తెలుగు చెయ్యబడిన పదాలని సుబ్బరంగా వాడుకోడమే. ఉదాహరణకి hospitalకి ఆసుపత్రి అన్న తెలుగు పదం చక్కగా తయారయ్యింది.
  అయితే ఒక ప్రత్యేక తరగతికో, వృత్తికో చెందిన పదాలు ఇలా తెలుగు చెయ్యబడడం (ముఖ్యంగా ఇంగ్లీషు చదువుకున్న తరగతి వాళ్ళు వాడేవి) జరగదు. ఎందుకంటే ఆ తరగతి వాళ్ళు ఇంగ్లీషు పదంతో బాగా అలవాటు పడి ఉంటారు కాబట్టి. ఇలాంటి పదాలని తెలుగు చెయ్యాల్సిన అవసరం ఉందా లేదా? ఉందని నా అభిప్రాయం, పైన వ్యాఖ్యలో రవి దానికి కారణాలు చెప్పారు. అయితే వీటి అనువాదం ప్రత్యేకంగా పూనుకొనే ఎవరో ఒకరు చెయ్యాలి. అయితే అలా చేసినవి మళ్ళీ ప్రజాబాహుళ్యంలో (ఆ వర్గంలో ప్రజలందరి) ఆమోదం పొందినప్పుడే వాటికి ప్రామాణికత వస్తుంది. కాని ప్రయత్నమంటూ ఎవరో ఒకరు చెయ్యాలి కదా. అంచేత అలాంటి ప్రయత్నాన్ని వ్యతిరేకించడం సమంజసం కాదు. ఎవరి అభిరుచి బట్టి వారు అనువాదం చెయ్యవచ్చు. అది మిగిలిన వాళ్ళకి నచ్చకపోతే దాన్ని వాడనక్కర లేదు. నచ్చితే వాడవచ్చు. ఈ తరానికి ఎబ్బెట్టుగా ఉన్న పదాలు కాస్త నలిగి వచ్చే తరానికి అలా అనిపించకపోవచ్చు. లేదా అసలు ఎవ్వరికీ నచ్చక వాడుకనుండి పూర్తిగా తొలిగిపోవచ్చు. మరొక కొత్త పదం పుట్టవచ్చు. ఇదంతా జరగాలంటే అనువాదాలన్నవి మాత్రం జరగడం అవసరం. ఎంత ఎక్కువగా జరిగితే అంత మంచిది. ఎన్ని రకాలుగా జరిగితే అంత మంచిది!

  ReplyDelete
 11. This comment has been removed by the author.

  ReplyDelete
 12. కామేశ్వర రావు గారూ, ఆ మాటకు తెలుగు కాసేపు ఆలోచించాను గానీ గందర గోళం అనే మాట తట్టలేదు. తికమక అని తట్టింది. అది నప్పదనిపించి ఇంగ్లీషే రాశాను:-))

  ప్రయత్నాలను వ్యతిరేకించడం కాదు గానీ ఆ ప్రయత్నాలు ఇందాక చెప్పినట్లు ఏదో కరాళ మరాళాలను సృషించేటట్లు ఉండకూడదని నా అభిప్రాయం! ఆ పదాలు త్వరగా జనామోదం పొందగలిగేలా ఉండాలి! ధూమ శకటం అనే మాట కంటే పొగబండి అనే మాట ఆమోదం పొందినట్లుగా! ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు, టెక్నికల్ ఉద్యోగాలు చేసేవాళ్ళు మామూలుగా సహజంగా తెలుగు మాట్లాడగలిగే సందర్భాల్లో కూడా ఇంగ్లీషే మాట్లాడే రోజులివి. అలాంటి వాళ్ళ మీద అంకోపరి, కలన యంత్రం వంటి మాటల్ని వాడుక లోకి తెచ్చే బాధ్యత ఏ ధైర్యంతో పెడతాం?

  ఈ తరమే ఇలా ఉంటే ఇంకా వచ్చే తరం మీద ఆశలు కూడానా?( ఈ విషయాన్ని కాలం నిర్ణయిస్తుందనుకోండి)


  అయితే ఒకటి కాకపోతే మరొకపదమైనా జనామోదం పొందగలిగే "అవకాశం" కొంత శాతమైనా ఉంది కాబట్టి అనువాదాలు అనేకాలు ఉండాలనే విషయంలో మీతో ఏకీభవిస్తున్నా!


  రవి గారూ, కాస్త ఆ వర్డ్ వెరిఫికేషన్ తీసివేయండి సార్! కామెంట్ రాయడం చాలా ఇబ్బందిగా ఉంది

  ReplyDelete
 13. కామేశ్వర్రావు గారు, సమస్యను విడదీశారు. సాంకేతిక పదాల అనువాదంలో భీషణమైన, ఛాందసమైన పదాలు ఉండటాన్ని వ్యక్తిగతంగా నేనూ వ్యతిరేకిస్తాను. ఉదాహరణకు "మూషికం". ఎవడో తెల్లవాడు వాడి సౌలభ్యం కోసం, ఓ విచిత్రమైన పదం "మౌస్" అనేదాన్ని వాడుకలోకి తెస్తే, మనం దాన్ని మూషికం అని అనువదిస్తున్నాం. బదులుగా ఏ కలనసహాయిక అనో "పెరిఫరల్" కు అనువాదపదమేదైనానో వాడుకలోకి తెస్తే బావుంటుంది. అయితే ఇవన్నీ తరువాత. కొత్తపదాలు సృష్టి ఎవరైనా చేస్తుంటే, కొన్ని లోపాలు పట్టించుకోక వారిని ప్రోత్సహించడం మాత్రం తప్పక చేయాలనే నా అభిప్రాయం.

  ReplyDelete
 14. This comment has been removed by the author.

  ReplyDelete
 15. వ్యాఖ్యలు టపాకి కాస్త దూరంగా జరుగుతున్నాయనిపించినా మళ్ళీ రాయకుండా ఉండలేకపోతున్నాను.

  >>ఉదాహరణకు "మూషికం". ఎవడో తెల్లవాడు వాడి సౌలభ్యం కోసం, ఓ విచిత్రమైన పదం "మౌస్" అనేదాన్ని వాడుకలోకి తెస్తే, మనం దాన్ని మూషికం అని అనువదిస్తున్నాం.

  "mouse"కి "నొక్కుడు మీట" అన్న అనువాదం ఎక్కడో చూసాను. నాకు నచ్చింది.

  ReplyDelete
 16. మంచి వ్యాసాన్ని అందించిన రవి గారికి అభినందనలు. (Typos కనిపిస్తున్నాయి. దిద్దుకోగలరు)
  కొత్త మాటలు పుట్టించడానికి మళ్ళీ సంస్కృతంలోకే పోవడం వల్లనేమో అవి మరీ కృతకంగా ఉంటున్నాయి. అవి జనసామాన్యానికి చేరనూ చేరవు. ఇంకోటి ఈ కొత్త మాటల పొడవు - నొక్కుడు మీట లాంటి మాట సులువుగానే అనిపించినా మౌస్ అనడంలో మరింత సౌలభ్యం ఉంది.
  ఇంగ్లీషులాగే సంస్కృతం కూడా పరభాషే. ఒకప్పుడు సంస్కృత పదాలు నేరుగానూ, డొంకతిరుగుడు గానూ చేరినట్లే, ఇప్పుడు ఇంగ్లీషు మాటలు దూరుతుంటే ఎందుకు అభ్యంతర పెడుతున్నాము? ఇప్పుడు ఏది సంస్కృతమో, ఏది తెలుగో తేల్చుకోలేనట్టు మరో తరం గడిచాక ఇంగ్లీషు మాటలూ కలిసిపోవా?

  ReplyDelete
 17. రవి గారు చాలా చక్కగా తెలుగు భాష గురించి వివరించి వ్రాసారు. చాలా బాగుంది. చక్కటి చర్చ సాగటానికి అవకాశాన్ని ఇచ్చింది.

  ముందరగా అందరికి విజ్ఞప్తి ఎమిటంటే మనకి మనం ఎదో కొత్త పదాలను సృష్టించాల్సిన పని లేదు. ఇప్పటికే తెలుగులో చాలా పదాలందుకు సిద్ధంగా వున్నాయి. ఎటొచ్చి మన భాష మీద అంగ్ల, ఉర్దు, హిందీ, తమిళ ప్రభావం వలన ఆయా పదాలు మరుగున పడి పొయినాయి. మనం మన తెలుగు భాష మీద చర్చించే ముందర కొద్దిగా శ్రమకోర్చి మన వాడుక భాషలో క్రమంగా అంతరించిన పదాలను పరిశోధనచేసి వెలికి తీయాలి. దీనికోసం తెలుగు మీద పరిశోధనా గ్రంధాలను తిరగేయ్యచ్చు , లేదా మన పెద్దవాళ్ళను అడిగి తెలుసుకున్నా సరిపోతుంది. మనం అవ్వేమీ చెయ్యకుండా మనకున్న పరిధిలో ఏదో ఒకటి ఇక్కడ వ్రాసేయటం బాగుండదేమో!!! ఉదాహరణకి ఒక వార్తా టివి వారు జ్యోతిష్య శాస్త్రం గురుంచి "వివరిస్తూ" , మన "విలేఖరులు" ఒక పెద్దాయనను అనేక ప్రశ్నలు వేశారు . దానికి ఆ పెద్దాయన ఇలా చెప్పారు...... నాయనా మీ ప్రశ్నలకి సమాధానం చెప్పేముందు నేనొక ప్రశ్న అడుగుతాను......... మీరు జ్యోతిష్యం గురుంచి ఏ ఏ గ్రంధాలు చదివి ఇవి అడుగుతున్నారు? ముందర అవి చదివి రండి, ఆ తరవాత మీకు సమాధానం చెపుతాను అన్నారాయన.

  సంజుగారు తమ అభిప్రాయాన్ని చక్కగా వివరిస్తూ "రామాయణ కల్పవృక్షం" ఎంతమంది చదివివుంటారో అని సందేహమో, అనుమానమో వెలిబుచ్చారనుకుంటా........ మన పరిధి దాటి వున్న పుస్తకాలు మనకు అలానే వుంటాయి. శ్రీ విశ్వనాధ సత్యనారాయణగారి ఈ గ్రంధము ఎంత ప్రజాదరణ పొందిందంటే మనం ఉదాహరణ చెప్పుకునేంత.

  శివా గారన్నట్లు వున్నది వున్నట్లు తెలుగులోనికి మార్చినా కష్టమనిపిస్తుంది.. ఇది చూడండి......రైల్వే వారి అన్నౌన్సుమెంట్.........పూర్తి తెలుగులో: బండెక్కువారు చక్కగా వినగలరు........ ఆదిలాబాదు నుండి తిరుపతికి పోవు తొందరగావెళ్ళే కృష్ణా పొగ బండి ఒకటవ అంకె బండవద్దకు వచ్చుచున్నది. ఇంతకన్న మంచి తెలుగులోనికి మార్చవచ్చేమో చూడండి.

  చివరలో రవి గారు చెప్పినట్లు ఇతర భాషలలో వున్న సాంకేతిక పదాలను వున్నది వున్నట్లు కాకుండా ఆ వస్తువు పనిబట్టి కూడా వాడుకలోనికి తేవచ్చును. కాని ఇవి సామాన్య ప్రజాదరణ పొందాల్సి వున్నది. మనవాళ్ళు కొందరు ట్రైన్ అనే పదానికి "పొగబండి" అని నామకరణం చేశారు... కాని అది నిలవలేదు. ట్రైన్ "రైలు బండీ" అయినది. నిజానికి రైల్ అనేది కూడా ఇంగ్లిషే కాని దానర్ధం వేరు. కానీ ట్రైనుకి పర్యాయ పదంగా తెలుగులో రైలు అయినది. కాబట్టి మనకి మనం మన గదిలో కూర్చుని కాకుండా....మనం అనేక ప్రాంతాలలో తిరిగినప్పుడు సామాన్యులు వాడే మనకు తెలియని, మనకి కొత్తగా వినపడేవి సేకరించి వాటిని ఇలాంటి వేదిక మీద పంచుకుంటే చాలా బాగుంటుందని నా అబిప్రాయం.  రాధాకృష్ణ,
  విజయవాడ.

  ReplyDelete
 18. అందరూకలసి ఒక చర్చావేదికగా మార్చేశారుగా...
  ఆధునిక తెలుగు పట్టని/గిట్టని వారు పట్టనట్టు/గిట్టనట్టు ఉంటే సరిపోతుంది.దీని కోసం పద సృష్టి చేసేవారిని తిట్టుకోవల్సిన అవసరం లేదు/పదాలను ద్వేశించటం అవసరంలేదు.

  @రాధాకృష్ణ గారు,
  మీ వ్యాఖ్యలతో నేను పూర్తిగా విభేదిస్తున్నా...మీరన్నట్టు ఉన్నపదాలనే తిరిగి తిరిగి అవేపదాలను వాడాల్సి వస్తుంది.ఆఖరికి నానార్దాలు,పర్యాయపదాలు ప్రకృతి వికృతులు అన్నీ కలిపి నికృష్టంగా తయారవుతుంది.పదసృష్టే లేకుంటే భాషాభివృద్ది సన్నగిల్లుతుంది, కుంటుపడుతుంది ఆఖరికి ఆగిపోతుంది.

  @శివ గారు,
  మీరిచ్చిన లింకులను ఇంతకు పూర్వమే చూసానండి.తెలుగు అనువాదం లేద పదసృష్టి చేయడానికి కొన్ని పద్దతులు గట్రా ఉన్నాయికదండి మీరు ఇచ్చినలింకులో ఇతర భాషనుంచి చేయబడింది ఆ పదాల సృష్టి.ఒకవేళ తెలుగులో ఆ పద కుటుంబానికి సంభందించిన పదాలు ఏవీ లేనట్టయితే ఈ విధంగా ఆ భాష నుంచే కొంత భాగం(ధ్వని లేదా ఇతర) తీసుకుని సంక్రమించిన పదంగా గుర్తించి అనుగుణంగా చేస్తారు.ఇలా చేసినపుడు ఆ పదానికి క్రియ, పదకుటుంబాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చెయ్యాల్సిఉంటుంది.మిడి మిడి జ్ఞానం ఉన్న వారు చేయడం వలన ఇటువంటి సమస్యలు ఎక్కువవుతూఉంటాయోమో...
  నిజానికి నేను కూడా కొంత వరకూ ఏకీభవిస్తున్నాను.నిజానికి మీరన్నట్టు డ్రాయింగ్ రూమ్ నే తీసుకుంటే దీనికి సంభందించిన పదం ఒక వేళ మన తెలుగులో లేక పోయినట్టయితే అపుడు ఆ ఆంగ్ల పదాన్ని ఆధారంగా నిర్మాణం జరిగుతుంది.ఇలా అయిన పదాలు అచ్చం మీరిచ్చిన లింకులో ఉన్న వాటి మాదిరి ఉంటాయి.వీటిని ఇలా తర్జుమా చేయడం మంచిదని భావిస్తున్నాను.

  అంతర్జాలం(internet)-inter(అంతర)+net(జాలం)=అంతర్జాలం
  ఇదికూడా అనువాదంలో ఒక పద్దతి.ఈ పదం ఇట్టే ఆకర్షించే లక్షణం వలనే ప్రజాదరణ పొందుతుందని కూడా గమనించాలి.

  ఎవరికైనా అనువాదం గురించి తెలుసుకోవాలంటే "అనువాదం చెయ్యటం ఎలా..?" బూదరాజు రాధాకృష్ణ గారి రచన చదవొ చ్చు.ఇది కేవలం సమాచారం కోసమే ఎవరైతే ఆసక్తి ఉందో వారికి మాత్రమే సూచిస్తున్నా...

  నెనరులు,
  ప్రవీణ్.

  ReplyDelete
 19. This comment has been removed by the author.

  ReplyDelete
 20. This comment has been removed by the author.

  ReplyDelete
 21. @రాధాకృష్ణ గారు ...రామాయణ కల్ప వ్రుక్షమ్ గొప్పదనాన్ని నేను ప్రశ్నించడం లేదండి. నా వాదన అల్లా 'తెలుగు' లో రాసిన కన్యాశుల్కం ఎంత మంది చదివారు, 'తెనుంగు' లో రాసిన కల్ప వ్రుక్షాన్ని ఎంతమంది చదివారు అని ...మీ ప్రొఫైల్ లో రాసుకున్నారు కదా ..మీకు విశ్వనాథ సత్యనారాయణ గారి పుస్తకాలు ఇష్టం అని, అందువల్ల మీకు ఆ గ్రంధాన్ని నేను తక్కువ చేసి మాట్లాడాను అని అనిపించేదేమో, నేను కేవలం ఆ గ్రంధాన్ని కన్యాశుల్కం కి ఉన్న ప్రజాదారణ తో పోల్చడానికి ప్రయత్నించాను :)

  @శివ ....మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నా...వాడటానికి తేలికగా ఉన్నప్పుడు, ఆ పదం వాడితే మిగతా అందరికి అర్థం అవుతునపుడు ఆ పదం ఏ భాష లోది అయితేనేం ? రైలు బండి అన్నా ట్రైన్ అన్నా చదువురాని వాడికి కూడా అర్థం అవుతుంది, అదే ధూమశకటం అంటే చదువుకున్న వాడు కూడా వింతగా చూస్తాడు . ప్రజలు మాట్లేడేదే భాష అవుతుంది కాని, ఒక లైబ్రరీ లో కూర్చొని నిఘంటువులు తిరగేసి ఈ పదం వాడండి అప్పుడే అది తెలుగు భాష లో మాట్లాడినట్టు అని అంటే ఆ వ్యక్తిని పట్టించుకునే వారు తక్కువ.

  ReplyDelete
 22. ప్రవీణ్ గారూ మీరు నాతో విభేదించినందుకు కృతజ్ఞతలు. ఎందుకంటే విభేదించకుండా వుంటే చర్చ సాగదు, కావల్సినది బయట పడదు కదా!!! ఇది ఏకపక్షంగా సాగే వార్తా పత్రిక కాదుకదా.......

  నేను చెప్పినది కొత్త పదాలను సృష్టించద్దని కాదు , వున్న పదాలకే కొత్తవి సృస్టించవద్దని. మనం ముందరగా మనకు తెలియని అనేక తెలుగు పదాలను తెలుసుకుంటే మనం సృస్టించడానికి ప్రయత్నించే పదం దానిలో వుండవచ్చు కదా...... మన పరిధిలో తెలిసిన పదాలే కాక అనేకం వున్నయి అని మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి కొన్నాళ్ళ తరవాత మామ్మి డాడీలు పెరిగి అమ్మా నాన్నలు అనే పదాలను పూర్తిగా మర్చేపొయమనుకొండి అప్పుడు వాటికి కూడా కొత్త పదాలను సృస్టించాల్సి రాకూడదని నా అభిప్రాయం. మనతో విభేదించినవారందరు తిట్టుకుంటున్నారో/ద్వేషిస్తున్నారనో అనిపించటం విచారకరం.

  అయినా, వాదన కోసం కాక పోతే మనం మన నిత్య జీవితంలో ఇక్కడ ఉదహరించినట్లుగానే మాట్లాడుతున్నామా?.......... నేతి బీరకాయ సామెతలాగా.......... అదే కొత్త సామెత..........ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ అసుపత్రికీ, మునిసిపల్ బళ్ళకి వెళ్ళకుండా కార్పొరేటు అసుపత్రికి, స్కూళ్ళకి వెళ్ళినట్లు.....


  రాధాకృష్ణ,
  విజయవాడ.

  ReplyDelete
 23. ఆధునిక తెలుగు పట్టని/గిట్టని వారు పట్టనట్టు/గిట్టనట్టు ఉంటే సరిపోతుంది.దీని కోసం పద సృష్టి చేసేవారిని తిట్టుకోవల్సిన అవసరం లేదు/పదాలను ద్వేశించటం అవసరంలేదు.............

  ఇక్కడ కొత్త తెలుగు పదాల పట్ల అందరూ ద్వేషం ప్రదర్శిస్తున్నట్లు లినక్స్ ప్రవీణ్ గారు ఏ ఆధారంతో నిర్థారణకు వచ్చారో తెలీకుండా ఉంది!

  అందరికీ అర్థం కావడానికి, సులభంగా జనామోదం పొందడానికి ఒక పదం తెలుగులో ఉన్నా, ఆంగ్లంలో ఉన్నా వాడటం మంచిదే! పొగబండి అనేది అనువాదం సులువుగా ఉండొచ్చని చెప్పడానికి సూచించిందే గానీ అదే వాడాలని కాదు. రైలు అంటే అందరికీ అర్థమవుతుంది కాబట్టి అదే వాడుతున్నారు. అలాగే సీడీ, హార్డ్ డిస్క్ వంటివి కూడా!

  అనువాదం ఎంత సరళంగా ఉండాలో, నిజానికి అందులో ఎన్ని సమస్యలున్నాయో రా.రా రాసిన అనువాద సమస్యలు చదివితే కూడా తెలుస్తుంది.


  జనబాహుళ్యంలోకి సులభంగా చేరిపోయే పదాలు ఒక పద్ధతి ప్రకారం అనువదించినవి కాదు.

  శివ గారు, మక్కీ కి మక్కీ ..ప్రయోగానికి సంబంధించి ఒక చిన్న కథ ఉంది(అంటే నిజం కూడా కావొచ్చు)

  పూర్వం తాళ పత్రాల మీద రచనలు సాగే కాలంలో వాటిని కాపీ చేయడానికి "రాయసకారులు" అనేవారు ఉండేవారుట. అలా ఒక రాయస కారుడు ఒక తాళ పత్రాన్ని కాపీ చేస్తుండగా ఒక తాటాకు మీద చచ్చి ఎండి అతుక్కుపోయిన ఈగ కనపడిందిట. అతగాడు అది కూడా కాపీ చేస్తున్న పత్రంలో ఉండాలి కాబోలనుకుని కొత్తగా ఒక ఈగను (మక్కీ--ఈగ)పట్టి చంపి మరీ కొత్త తాళపత్రంలో అంటించాడట. అది మక్కీ కి మక్కీ అయింది.

  నిజానికి కొన్ని అనువాదాలు ఇలాగే ఉంటాయి చూడండి. గట్టిపళ్ళెం..మృదు సామాను వంటివి.

  ReplyDelete
 24. చాలా మంచి వ్యాసం అందించి చక్కని చర్చకి తెర తీసిన రవి గారికి ధన్యవాదములు మరియు అభినందనలు.

  శివ, సుజాత గారి అభిప్రాయాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. ఇక్కడ నాకో విషయం గుర్తొస్తున్నాది. ఒకసారెప్పుడో వేటూరివారన్నారు.... internet అన్నదాన్ని ఇంటర్నెట్టు అని తెలుగులో రాస్తే అది తెలుగయిపోయినట్టే అని. పైన ఇచ్చిన ఆసుపత్రిలాంటి ఉదాహరణలు చూస్తే ఇది చాలా నిజమనిపిస్తుంది. పైన ఎవరో చెప్పినట్టు తెలుగులోకి తర్జుమా చేసే దిశలో మనం సంస్కృతం నుండి ఎక్కువగా తీసుకుంటున్నాం....ఏదైనా పరభాషే కదా మనకి.

  అంతర్జాలం అని విన్నప్పుడల్లా నాకు మార్జాలం అనే గుర్తొస్తుంది...అలాగే మంటనక్క, జ్వాలాజంబూకం వంటి పదాలు నిజంగా కృతకంగా కనిపిస్తాయి. అంకోపరి లాంటి పదాలు వాడడానికి ఎబ్బెట్టుగా ఉండి జనబాహుళ్యంలోకి చొచ్చుకు వెళ్లగలిగేవిగా కనిపించట్లేదు.

  ఇలా కొత్త పదాలు కనిపెట్టాలి అనే ప్రక్రియకి బదులు మరుగునపడిపోయిన మన తెలుగు పదాలని ఎందుకు వెలికి తీసుకురాకూడదు? ఉదాహరణకి good morning అన్నదానికి చక్కని తెలుగు పదం మేలిపొద్దులు...ఇది అందరూ వాడుకలోకి ఎందుకు తీసుకురాకూడదు? అలాగే confusion కి గందరగోళం అని తరచుగా వాడొచ్చు. ఇలా మరుగునపడిన అచ్చ తెలుగు పదాలని వెలికితీసే దిశలో కృషి చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.

  ReplyDelete
 25. This comment has been removed by the author.

  ReplyDelete
 26. శివగారు,
  నేను లినక్స్ మహాశయున్ని కాదండి బాబోయ్! లీనస్ గారు వింటే కంగారు పడవచ్చు. :-)

  "ఆధునిక తెలుగు పట్టని/గిట్టని వారు పట్టనట్టు/గిట్టనట్టు ఉంటే సరిపోతుంది.దీని కోసం పద సృష్టి చేసేవారిని తిట్టుకోవల్సిన అవసరం లేదు/పదాలను ద్వేశించటం అవసరంలేదు" - ఈ వాఖ్యను కేవలం పాల్గొంటున్న వారినో లేదా విభేదించిన వారినో లక్ష్యంగా చేసినది కాదండోయ్.నాకెందుకో ఇలాంటి వారు కూడా ఉన్నారని అనిపిస్తుంది.వీరిని ఉద్దేశించి చేసానే తప్ప మీ మనోభావాలను భాధపెట్టే ఉద్ధేశ్యంతో కాదని గమనించగలరు.ఎవరినైనా భాధించి ఉంటే మన్నించగలరు.

  రాధాకృష్ణ గారు,
  మీరన్నది మరో విధంగా అర్ధం చేసుకోవడం వలన విభేదించాను...నేనేమనుకున్నానంటే ఇటీవలి చాలా ఆంగ్ల పదాలకు అంటే దాదపు మూడు లేదా నాలుగు పదాలకు ఒకటే అర్ధానిచ్చే పదమే వాడుతున్నారు.ఉదాహరణకి నిర్వాహణ, నిర్వాహకుడు అనే వాటినే తీసుకున్నట్టయితే అడ్మిన్ లేదా మానేజ్ ఇలా ఆంగ్లంలో ఉన్న చాలా పదాలకు వాడుతున్నారు.ఇలా వాడేటప్ఫుడు చదివేవారికి సుస్పష్టంగా అర్ధంకాదు కదా...ఇటువంటివి వాటిని ఎక్కువగా వాడకుండా ఉండటమే మేలనిపిస్తుంది.మీ ఉద్దేశ్యం ఇపుడు అర్ధమయింది లేండి.

  ఇక రైలు బండిని ఇది వరలో "ధూమశకటం లేద పొగబండి" అని పిలిచేవారు అప్ఫట్లో పొగ వచ్చే రైల్లు ఉండేవి కనుక వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ పదం సృష్టించి ఉంటారేమో...ప్రస్థుతం ఎక్కువగా విద్యుత్ మీద వాడేవే కనుక దానిని వాడటం అర్ధరహితం. గూడ్స్ రైళ్ళనే ఉదాహరణకి తీసుకుంటే ఇది సంకరణ పదం ఆంగ్లంలో ఉన్న (గూడ్స్ -సరుకులు) సరుకుల రైలు అనలేం కదా ఎందుకంటే అది చొచ్చుకు పోయిన పదం మరి.ఫైర్ ఫాక్స్ వంటివి నకలుహక్కులు కలిగినవి ఇటువంటి వాటిని ఎలా ఉన్నాయో అలా పలకడమే మంచిది వీటిని కూడా మార్చడం మంచిది కాదు అందులోను హాస్యాస్పదంగా నప్పని, కృత్రిమ పద్దతుల్లో మంటనక్క అనడం ఏ మాత్రమూ బాగాలేదు.

  నెనరులు,
  ప్రవీణ్.

  ReplyDelete
 27. శివ గారూ శుభోదయం అన్నది సంస్కృత పదం.....కానీ మేలిపొద్దులు అచ్చ తెలుగు పదం. ఇది కొత్తగా సృష్టించినది కాదండీ, ఎప్పటినుండో ఉన్నదే...కాకపోతే వాడుకలో లేదు అంతే.

  మీరన్నది నిజమే నమసారం అనో, బాగున్నారా అనో పలకరించుకోవడం పరిపాటి...కానీ పద్ధతులు మారుతున్నాయిగా..ఈమధ్య అందరూ good mornig అనే పలకరిస్తున్నారు.

  ఈ ఒక్క విషయమే కాదు...వాడుకలో లేని అచ్చ తెలుగు పదాలు వెలికి తీసి వాడుకని కల్పించడం మన బాధ్యత అని నా ఉద్దేశ్యం. దీని మీద ఒక టపా రాసాను. వీలైతే చదవండి.
  http://vivaha-bhojanambu.blogspot.com/2010/05/blog-post_05.html

  ReplyDelete
 28. ఈ బ్లాగులో తెలుగు భాషపై మంచి చర్చ జరిగుతోంది. అందరికీ ధన్యవాదములు

  ReplyDelete
 29. This comment has been removed by the author.

  ReplyDelete
 30. మంచి చర్చ, రవి గారికి వ్యాఖ్యాతలకు ధన్యవాదాలు.

  రాధాకృష్ణ గారు చెప్పినట్లు పాత పదాలను బయటికి తీసుకు రావల్సిన అవసరం కూడా ఉంది. నా చిన్నప్పుడు living roomని జగిలి అని పిలిచేవారు. ఇప్పుడు ఆ పదమే వినబడడం లేదు.

  మరుగున పడిన పదాలను పరిచయం చేయడానికి ఒక వెబ్సైట్ ఉంటే బాగుంటుందని అనిపిస్తుంది.

  శివ గారు చెప్పినట్టు వాడుక భాష స్పూర్తి తోనే పదసృష్టి జరగాలి. అందుకోసం వాడుక భాషను మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. వాడుక భాష అంటే మాండలికాలే కాబట్టి, ముందు మాండలికాలను చిన్నచూపు చూడడం మానాలి.

  ReplyDelete
 31. రెండేళ్ల క్రితం జరిగిన చర్చ అది. ఆ చర్చ గురించి నాకు గుర్తు లేకపోయినా ఈ మధ్యనే గూగుల్‌లో వెతికితే కనిపించింది. ఈ లింక్ చదవండి: tidbits.co.in/blog/life/పరిహాసకులకి-సమాధానం నేను తెలుగు బాషని పరిహసించలేదు కానీ శుద్ధ గ్రాంథిక బాషలో మాట్లాడితే బాష అర్థం కాదు అనే అనుకుంటాను.

  ReplyDelete
 32. This comment has been removed by the author.

  ReplyDelete