Pages

Thursday, June 7, 2012

అపసవ్య వ్యాఖ్యాతలు


ఇది సుందరయ్య శత జయంతి సంవత్సరం. ఆంధ్ర ప్రదేశ్‌లోనే గాక దక్షిణ భారతమంతటా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి పునాదులు వేసిన ఆ మహానాయకుడి జీవితాదర్శాన్ని, ఆశయ బలాన్ని, మననం చేసుకుంటున్న సందర్భం. ఆంధ్రజ్యోతిలో ఆయన పుట్టిన రోజైన మే మొదటి తేదీన 'మార్క్సిస్టు గాంధీ' పేరిట ఒక నివాళి ప్రచురిస్తూ ఆయన ఔన్నత్యాన్ని అనేక విశిష్ట లక్షణాలను ప్రస్తావించారు. స్థూలంగా ఆ వ్యాసంలో ఆక్షేపించాల్సిన అంశాలేమీ లేవు. సుందరయ్యను కమ్యూనిస్టు గాంధీ అనడం అనేక దశాబ్దాలుగా ఇతరులు చేస్తున్నదే గనక అందులోనూ తప్పు పట్టాల్సింది లేదు. కాకపోతే రచయిత్రి రంగనాయకమ్మ మాత్రం అటు గాంధీని, ఇటు సుందరయ్య బాటలో కృషి చేస్తున్న కమ్యూనిస్టులను కూడా అపహాస్యం చేస్తూ తనదైన శైలిలో 'అస్తవ్యస్త సంస్కర్తలు' అంటూ వ్యాసం రాశారు. ఈ వ్యాసం ప్రధానంగా కొంత కాలం కిందట మరణించిన కె.జి.సత్యమూర్తి/ శివసాగర్‌కు సంబంధించింది అయినా సుందరయ్య ప్రస్తావనతో ముగించడం బట్టి చూస్తే కావాలనే ి ఈ సందర్బాన్ని ఉపయోగించుకున్నారని తెలుస్తుంది. ఇంకా ఇదే ఎడిట్‌ పేజీలో దళిత బహుజనులు మార్క్సిస్టులు, మార్క్కిస్టు సిద్దాంత అన్వయం, సత్యమూర్తి పాత్ర, కమ్యూనిస్టుల నిబద్దత తదితర అంశాలపై అనేక వ్యాఖ్యానాలు వచ్చాయి..
శివసాగర్‌ నగ్జలైట్‌ ఉద్యమంలోనూ అంతకు ముందూ నిర్వహించిన పాత్ర, చేసిన రచనలు, సుప్రసిద్ధాలే. అట్టడుగున పుట్టి ఆశయాల బాటలో పయనించిన ఆయన చైతన్యాన్ని, అక్షరాన్ని శక్తివంతంగా ఉపయోగించిన ఆయన సామర్థ్యాన్ని అందరూ గౌరవిస్తారు.. శివసాగర్‌ రచనల సంకలనం వెలువడినప్పుడే ఒక విమర్శనాత్మక సమీక్ష రాశాను. అది ప్రజాశక్తిలో పునర్ముద్రితమైంది.(దీనిపైనా విమర్శలు రాకపోలేదు) విప్లవ కవిత్వమంటే కొట్టు నరుకు అనడమేనన్న భావాలు బలంగా వ్యాపించి వున్న కాలంలో ఆయన వర్ణనాత్మకంగా శిల్పసమన్వితంగా కవిత్వం రాశాడు.అయితే అందులోనూ యాంత్రిక ధోరణులు నిర్జీవ పదాలు లేక పోలేదు. వాటిని ఎలాగో అర్థం చేసుకోవచ్చు గాని ఆయనను వియత్నాం విప్లవ నేత హౌచిమన్‌తో పోలిస్తే తనూ ఆమోదపూర్వకంగా మాట్టాడ్డం అతిశయోక్తి అని ఎత్తి చూపించాను. విప్లవ రాజకీయాల్లో కుల సమస్యను దళిత సమస్యను కూడా చేర్చాలనే పేరుతో
చైర్మన్‌ మావోను వదలి కన్షీరాంను చైర్మన్‌గా చేసుకోవడం, కొద్ది కాలంలో ఆయననూ వదలి తనే మరో పార్టీ పెట్టడం ఇవన్నీ పొంతన లేని విషయాలు. సత్యమూర్తిని ఎంతగా కీర్తించినా ఈ ప్రాథమిక వాస్తవాలు విస్మరించలేము. .కేవలం ఆయన వ్యక్తిగత చాంచల్యమే గాక ఆయన చేపట్టిన సిద్దాంత పంథా గందరగోళాన్ని కూడా ఇందులో వుంది.
అయితే సత్యమూర్తి వంటి వారి అస్థిరతను పట్టి చూపడానికి అసలు వారు ముందుకు తెచ్చిన సామాజిక సమస్య ప్రాధాన్యతనే చూడ నిరాకరించడానికి చాలా తేడా వుంది. రంగనాయకమ్మ రాసిన 'బుద్ధుడు చాలడు అంబేద్కరూ చాలడు, మార్క్స్‌ కావాలి' అన్న పుస్తకంపై 'శ్రుతి తప్పిన అతి తర్కం' అని అప్పట్లో సమీక్ష రాశాను. గతి తర్కానికి అతి తర్కానికి మధ్య చాలా తేడా వుంది. వేర్వేరు కాలాలకు భావజాలాలకు సంబంధించిన వ్యక్తులను పోల్చి వాదించడమే అశాస్త్రీయం. తన కాలానికి చాలా గొప్ప ఆలోచనా పరుడైన బుద్ధున్ని ఈ జాబితాలోకి తీసుకుకావడం కన్నా అశాస్త్రీయం మరొకటి వుండదు. ప్రతిదీ చలనంలో చూడటం మార్క్సిజం ప్రధాన లక్షణం. సమాజాన్ని ఒక జడ పదార్థంగా పరిగణించి శాశ్వత భాష్యాలుగా మార్క్స్‌ సూక్తులను వుటంకించడం యాంత్రికత. మార్క్కిజాన్ని వల్లె వేయడం తప్ప సామ్రాజ్యవాద యుగానికి దాన్ని అన్వయించిన లెనిన్‌ కూడా ప్రామాణికంగా తీసుకోనివారు ఆ సామ్రాజ్యవాద ప్రపంచీకరణ ప్రచండ రూపాన్ని గాని ప్రమాదకర పర్యవసానాలను గాని పసిగట్టగలుగుతున్నారా అనేది పెద్ద ప్రశ్న. ఆ ప్రపంచీకరణ ముందుకు తెచ్చిన సైద్ధాంతిక వైపరీత్యాల్లో అస్తిత్వ వాదం పేరిట వర్గ చైతన్యానికి మంగళం పాడించడం ఒకటి. అస్తిత్వ వాదాల పరిమితులు లోపాలపై ప్రజాశక్తి ఒక పుస్తకమే ప్రచురించింది. అయితే సైద్ధాంతిక విమర్శ వేరు, అస్తిత్వ వాదం వైపు ఆకర్షిస్తున్న సామాజికాంశాలను సమస్యలను వివక్షలను ప్రత్యేకంగా ప్రతిఘటించడం వేరు. కమ్యూనిస్టులు తమ రాజకీయ వర్గ ఉద్యమాలు చేస్తూనే కుల వివక్షపైన, అణగారిన వర్గాలపై పెరుగుతున్న పీడనపైన ప్రత్యేకంగా పోరాడుతున్నాయి. మన రాష్ట్రంలో ఇటీవల సబ్‌ ప్లాన్‌ కోసం జరిగిన సమైక్య ఆందోళన అలాటి వాటిలో ఒకటి.ఇవన్నీ సమూల పరిష్కారాలని ఎవరూ చెప్పడం లేదు గాని సమస్యలుగా పరిష్కారం కావలసి వున్నాయనేది గుర్తించవద్దా? ఎవరైనా మార్క్స్‌ దాకా రాలేక అంబేద్కర్‌ దగ్గరే ఆగిపోతే వారిని కలుపుకొని రావలసిన బాధ్యత మార్క్సిస్టులనే వారికి వుండదా? అసలు సంస్కరణలనేవే పాక్షికమైనప్పుడు అస్తవ్యస్త సంస్కర్తలు అంటూ వేరే వుంటారా? పాక్షిక మార్పుల కోసం పోరాడే సంస్కర్తలు గౌరవనీయులు కాకుండా పోతారా? ప్రజా వ్యతిరేకులైన దోపిడీ దారులను శత్రువులను ఖండించే బాషతో అణగారిన వర్గాల వాదనలను అపహాస్యం చేయడం ఎలాటి సవ్యత?
వర్గ దృక్పథంతో చూస్తే గాంధీజీలో చాలా పరిమితులు పొరబాట్లు వుండొచ్చు. కాని అవేవీ ఈ దేశ ప్రజా జీవితంలో రాజకీయ చైతన్య వ్యాప్తిలో గాంధీ నిర్వహించిన సానుకూల పాత్రను మటుమాయం చేయవు. సుందరయ్యను కమ్యూనిస్టులెప్పుడూ గాంధీగా వర్ణించలేదు.కాని ఇంకెవరో అంటే వ్యతిరేకించాలా? గాంధీలోని కొన్ని వ్యక్తిగత ఆదర్శ గుణాలు తనపై చూపిన ప్రభావాన్ని స్వయంగా సుందరయ్య ఆత్మకథలో రాసుకున్నారు.ఇన్నేళ్ల తర్వాత ఈ అవినీతి మయ ప్రపంచంలో వాటిని పేర్కొనే బదులు ఆయన ఏదో చేశాడని సంచలన చరిత్ర కారులు అదే పనిగా చెప్పే చవకబారు కథనాలలో మునిగితేలాలా? ఈ నాటికి దేశంపైనే గాక ప్రపంచంపైన కూడా గాంధీజీ సానుకూల ప్రభావం వుంది. గాంధీజీపై ఈ దేశంలో కమ్యూనిస్టుల విమర్శల గురించి హౌచిమన్‌ను అడిగితే మా దేశానికి నేనే గాంధీని అని ఆయన చమత్కరించారట. ఏ దేశంలోనైనా సంఘ సంస్కరణోద్యమం, జాతీయోద్యమం, కమ్యూనిస్టు ఉద్యమం అన్నవి వేర్వేరు స్రవంతులుగానే వుంటాయి. వాటి మధ్య వుండే తేడాను అంతస్సంబంధాన్ని కూడా సవ్యంగా అర్థం చేసుకోవాలంటే చారిత్రిక దృష్టితో అధ్యయనం చేయాలి తప్ప అరకొర వ్యాఖ్యలకు అపహాస్యాలకు పాల్పడటం తగని పని. ఆ అవగాహనే వుంటే సుందరయ్య స్థాయి నాయకుడి వర్ధంతి సభకు 'బూర్జువా' పార్టీల నాయకులు కూడా ఎందుకు వస్తారో కమ్యూనిస్టులు ఎందుకు రానిస్తారో అర్థమయ్యేది. దేశీయ మార్క్సిజం జాతీయ మార్క్సిజం అనే మాటల శాస్త్రీయతను పక్కనపెడితే మార్క్సిజం అన్వయంలో ఏ దేశానుభవం ప్రత్యేకత దానికి వుంటాయి. ఈ జాతీయానుభవాలన్ని కలిసిందే అంతర్జాతీయ సారం. అంతే తప్ప సులభ శైలి ప్రశ్నలు జవాబుల తరహాలో ఎక్కడా రాసి వుండలేదు. ఎవరూ రాయలేరు కూడా. మార్క్స్‌ బోధలను మారిన ప్రపంచ పరిస్తితులకు ఎలా అన్వయించి ఆయన ఆశయం సాధించాలా అని ప్రజా పక్ష మేధావులు ఆర్థిక సామాజిక వేత్తలు ఎందరో అహౌరాత్రాలు కృషి చేస్తున్నారు.ప్రపంచమంతటా వందలాది గ్రంధాలు వెలువడుతున్నాయి.అనునిత్య పోరాటాలు జరుగుతున్నాయి. ఈ సమకాలీన సామాజిక రాజకీయ సంక్లిష్టతలు గ్రహించకుండా పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టు మాట్టాడ్డం అపరిపక్వత అవుతుంది.
అపరిపక్వత ఒకటైతే అవకాశవాదం మరొకటి. సత్యమూర్తిపై వచ్చిన విమర్శలనే అవకాశంగా తీసుకుని వ్యక్తుల లోపాలకు ఆయా ఉద్యమాలు పార్టీలే బాధ్యత వహించాలంటూ ఎపివిఠల్‌ మరో భాష్యం చెప్పారు. ఎంచుకున్న మార్గంలో ఆఖరి వరకూ నిలవలేక జారిపోయిన జావ కారిపోయిన నేతల తప్పు లేదు గాని ఆ పార్టీలదే తప్పట! ఈ వితండ వాదనకు మద్దతుగా ఓంకార్‌, నృపేన్‌ చక్రవర్తి వంటి వారి పేర్లతో అతకని ఉదాహరణలు.వీరు సిపిఎంలో నుంచి బహిష్కరించబడటం ఏ పరిస్థితుల్లో జరిగిందో అందరికీ తెలుసు.ఈ తప్పిదాలు ఏవైనా తర్వాతి కాలంలోనూ వామపక్ష భావాలకు వారు స్థూలంగానైనా కట్టుబడి వున్నారు గనకే గౌరవంగా వీడ్కోలు పొందారు. తప్పులు చేయడమే గాక తప్పుడు వాదనలతో ఆఖరు వరకూ కమ్యూనిస్టులపై బురద జల్లే ందుకు సుందరయ్యను అర్థ రహితంగా ఉటంకించే జీవిత చరిత్ర కారుల సంగతి వేరు. ఉదాహరణకు సిపిఎం విప్లవ పార్టీనో కాదో ఆచరణలో తేలాలని సుందరయ్య అన్న మాటలను విఠల్‌ వక్రంగా ప్రస్తావించారు. ఆ మాటల్లో ఆయన వ్యక్తం చేసింది ఉద్యమ స్పూర్తిని తప్ప ఉత్తుత్తి అనుమానాలను కాదు. నగ్జలిజం పైన రివిజనిజం పైన తన తీవ్ర వ్యతిరేకతను సుందరయ్య చాలా గట్టిగా రాశారని కూడా ఇక్కడ గుర్తు చేయాలి. అదే సుందరయ్య తొలి దశనుంచి ఆఖరు వరకూ దళితులు మహిళలు వంటి వారి సమస్యలపై ప్రత్యేకంగా కృషి చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెబుతూనే వున్నారు. కనక ఇవి మరీ కొత్త విషయాలు కావు. కాకుంటే వైరుధ్యాలు కొత్త కోణాలు సంతరించుకుంటున్న తరుణంలో ఈ సామాజిక సమస్యలపై కేంద్రీకరించాల్సిన అవసరం పెరుగుతున్నది. అది మార్క్సిజంలో లేనిదీ కాదు, మార్క్స్‌ వద్దన్నదీ కాదు. కువిమర్శకులను వదిలేసినా సత్యమూర్తి భక్తులూ ,రంగనాయకమ్మ వంటి విమర్శకులూ కూడా సమగ్ర కోణంలో ఆలోచిస్తేనే న్యాయం జరుగుతుంది.

16 comments:

  1. మీరు సుందరయ్యను గాంధీతో పోల్చడాన్ని పదేపదే సమర్థించారు. సుందరయ్యను కమ్యూనిస్టు గాంధీ అని పిలవడం అనేక దశాబ్దాలుగా ఇతరులు చేస్తున్నదే గనక అందులో తప్పు పట్టాల్సిందేం లేదు, మేం కూడా అలాగే పిలుస్తాం, ఎవరైనా పిలవ్వచ్చు అనే అర్థం వచ్చేటట్టు రాశారు. గాంధీజీ నిర్మించదలచిన రామరాజ్యం కన్నా, సుందరయ్య కాంక్షించిన సమసమాజమే మిన్న అని నూటికి నూరుపాళ్లూ నమ్మే కమ్యూనిస్టుల నోట ఈ మాట రావడం నిజంగా ఆశ్చర్యకరం. "అందరూ పిలుస్తున్నారు, మేమూ అనుసరిస్తాం, తప్పేంటి?" అని వాదించడం logical గా లేదు. అందరూ దోపిడీ చేస్తున్నారు, కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తున్నారు, అదే ప్రపంచం అనుకుంటున్నారు - కమ్యూనిస్టులూ అదే అనుసరిస్తే, బూర్జువా మూసలో ఒదిగిపోతే దేశాన్ని కాపాడేది ఎవరు??

    గాంధీ స్వయంగా కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తూ స్వాతంత్ర్యోద్యమాన్ని నడిపిన రోజుల్లోనే అన్ని స్థాయిల్లోనూ అత్యధికశాతం కాంగ్రెస్ నాయకులు బూర్జువాలే, భూస్వాములే, అగ్రకుల పెత్తందార్లే!! గాంధీజీ సిద్ధాంతాలు (ఇవి ఎప్పుడూ అసంపూర్తిగానే ఉంటాయి) ఇప్పటికీ భారతదేశ ప్రజలకే, ఆమాటకొస్తే కాంగ్రెస్ నాయకులకే సరిగ్గా తెలియదు. భూములు కబ్జా చేసి, వేలకోట్లు సంపాదించుకున్నా సరే, జాతీయజెండా భుజాన వేసుకుని అటూ ఇటూ గెంతి "నాదే గాంధేయవాదం" అంటాడు లగడపాటి!!

    ఈనాటికీ దేశంపైనే గాక ప్రపంచంపైన కూడా గాంధీజీ సానుకూల ప్రభావం ఉంటే ఉండవచ్చు. కానీ గాంధీ సిద్ధాంతాల్లో డొల్లతనమూ, వాగాడంబరమే తప్ప స్పష్టత లేదు. దేశంలో సానుకూలత ఉన్న నాయకులందరితోనూ సుందరయ్యను పోల్చేసుకుంటూ పోతామా?? రేపు సుందరయ్యని ఎవరైనా YSR తో కూడా పోలిస్తే కమ్యూనిస్టులం, మనం కూడా పిలుస్తామా?? సానుకూలత ఉంటే సరిపోతుందా, సిద్ధాంతాల్లోనూ ఆలోచనల్లోనూ, ఆచరణలోనూ సారూప్యత ఉండక్కర్లేదా??

    స్వాతంత్ర్యోద్యమాన్ని నడిపినంత మాత్రాన ఒక బూర్జువా నాయకుడితో ఒక కమ్యూనిస్టు నాయకుణ్ణి ఎట్లా పోల్చగలం?? కడవరకూ కమ్యూనిస్ట్ సిద్ధాంతవ్యాప్తికే అంకితమైన సుందరయ్యను, ఆ కమ్యూనిజాన్ని ఒక బూచిగా చూపిన బూర్జువా నేతతో పోల్చడం ఏ విధంగా సమర్థనీయం?? సుందరయ్యను లెనిన్ తోనో, హోచిమిన్ తోనో, చే గువేరా తోనో పోల్చగలం గానీ గాంధీతో, నెహ్రూతో ఎట్లా పోలుస్తాం??

    ఆనాడు హోచిమిన్ "మా దేశానికి నేనే గాంధీని" అన్నది "గాంధీ భారత స్వాతంత్ర్యోద్యమ నేత అయినట్టు, నేను వియెత్నాం స్వాతంత్ర్యోద్యమ నేతను" అన్న ఉద్దేశ్యంతో కావచ్చు. అంతే గానీ "నేను వియెత్నాం విప్లవ నేతను, గాంధీ భారత విప్లవ నేత!!" అనే అర్థంలో తీసుకోవడం, దీన్ని ఉదాహరణగా చూపుతూ సుందరయ్య గారిని గాంధీతో పోల్చడం అస్సలు బాలేదు.

    "అంతరానితనం పోవాలి, కానీ కులాలు మాత్రం ఉండాలి", "హింస వద్దు, కానీ ప్రజలు పోరాటాలు చేస్తే అణిచెయ్యటానికి పోలీసులు కావాలి!!" అంటూ పాక్షికంగా కంటితుడుపు బూర్జువా భ్రమల సంస్కరణలు చెయ్యబోయిన గాంధీతో, కులం, మతం లాంటి అసమానతలు, దోపిడీ పీడనలు లేని శ్రామిక స్వర్గాన్ని కాంక్షించిన సుందరయ్యను పోల్చడం సుందరయ్యను గౌరవించినట్టు అవుతుందో, అవమానించినట్టు అవుతుందో తేల్చుకోవాలి.

    ReplyDelete
  2. అవినాశ్‌,

    దూషించడం, దుర్భాషలాడటం చేసే వాళ్లకు నేను సమాధానాలు రాయను. తప్పనిసరైతే తీసేస్తాను. మీరు ఆ కోవలో వారు కాదనుకుంటున్నాను. కాని మీరు నాకు నేను రాయని ఉద్దేశాలు ఆపాదించడం సరి కాదు. కమ్యూనిస్టులు ఆయనను ఎప్పుడూ గాంధీతో పోల్చలేదు,పోల్చరు అని స్పష్టంగా రాశాను.అయితే ఆ ఇద్దరినీ గౌరవించేవారెవరైనా అలా అంటే దాన్ని తప్పు పట్టి నిప్పులు చెరగాల్సిన అవసరం లేదని మాత్రమే పేర్కొన్నాను. గాంధీజీలో వర్గ పరంగా ఎన్ని లోపాలు లొసుగులు వైరుధ్యాలు చూపించినా ఆయన దేశ రాజకీయాలకు అందించిన సానుకూల భాగాన్ని కూడా చూడాలని చెప్పడం మార్క్సిస్టు సూత్రాలకు లోబడిన మాటే.చైనాలోనూ మావోకు ముందు సన్‌యెట్‌ సేన్‌ వున్నాడు. ఇలా చాలా ఉదాహరణలు చెప్పవచ్చు. కనక యాంత్రికమైన అన్వయం మంచిది కాదు. మీరు నేను రాసినట్టుగా అన్నట్టుగా ప్రస్తావించిన మాటలు యధాతథంగా ఒక్కటైనా పొందుపరిస్తే తప్పక వివరణ ఇస్తాను. ధన్యవాదాలు.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. రవి గారూ,

    మీ జవాబుకు ధన్యవాదాలు.

    మన దేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమవ్యాప్తికి ఆజన్మాంతం నిస్వార్థంగా, అచంచలమైన చిత్తశుద్ధితో, సిద్ధాంతబద్ధతతో అనుపమానమైన కృషి చేసిన సుందరయ్యను, బూర్జువా నేత అయిన గాంధీతో పోల్చడాన్ని జీర్ణించుకోలేక, కొంచెం ఆవేశపడ్డాను.

    చివరికి కొంతమంది కమ్యూనిస్టులు కూడా సుందరయ్యను గాంధీతో పోల్చడం చూసి, మీరు కూడా స్వయంగా ఆ పోలిక చేస్తున్నారన్న అర్థంలో మీ వ్యాసాన్ని interpret చేసుకున్నాను. ఇందుకు క్షమించండి. చర్చించడం, తద్వారా మరింత స్పష్టత తెచ్చుకోవడం మాత్రమే నా ఉద్దేశ్యం.

    కమ్యూనిస్టులు సుందరయ్యను ఎప్పుడూ గాంధీతో పోల్చకూడదు అన్నది మాత్రమే నా అభిప్రాయం. కాకపోతే సుందరయ్యనూ, గాంధీనీ ఇద్దరినీ గౌరవించేవారు, వాళ్లను పోలిస్తే మనం తప్పు పట్టి నిప్పులు చెరగాల్సిన పని లేదంటున్నారు మీరు.

    కానీ గాంధీనీ, సుందరయ్యనూ పోల్చేవాళ్లు ఈ మధ్య ఎక్కువ కావడం వల్ల కమ్యూనిస్టు శ్రేణుల్లో, ముఖ్యంగా ఇప్పుడిప్పుడే విప్లవభావజాలానికి ఆకర్షితులవుతున్న మాలాంటి వాళ్లలో కొంత గందరగోళం నెలకొంటున్నది. కమ్యూనిజమే అత్యున్నత మానవతావాదం అని మేము నమ్ముతున్న దశలో, గాంధీగారి అసంపూర్ణ సిద్ధాంతాలు కూడా సమానంగా గొప్పవేననీ, అందుకే సుందరయ్యను గాంధీతో పోలుస్తున్నారనీ అనిపించి అయోమయానికి గురయ్యాం.

    ఈ పోలికే mainstream పత్రికల్లోనూ, మన పత్రికల్లోనూ కూడా ఎక్కువ ప్రచారం పొందుతున్నది. ఈ పోలికను బహిరంగంగా, పత్రికాముఖంగా కమ్యూనిస్ట్ నాయకులెవరూ ఖండించినట్టు కనబడకపోవడం వల్ల ఈ పోలికతో కమ్యూనిస్టులు comfortable గానే ఉన్నారన్న సంకేతం ఇచ్చినట్టయింది యువశ్రేణులకు. ఈ పద్ధతి ఇట్లాగే కొనసాగితే, ఈ పోలికే సరైన వాదంగా స్థిరపడిపోయే ప్రమాదమున్నది, ఇప్పుడు మేం confuse అయినట్టుగా.

    సుందరయ్యనూ, గాంధీనీ పోల్చడం సరికాదన్నదే కమ్యూనిస్టుల, సుందరయ్య అభిమానుల అభిమతమని కిందిస్థాయి యువశ్రేణులకు స్పష్టంగా తెలియాల్సిన అవసరమున్నది. ఇట్లా పోల్చేవాళ్లను మనం సున్నితంగానైనా తప్పుపట్టకపోతే అదే సరైనవాదమని వామపక్ష శ్రేణులూ, ప్రజలూ అనుకునే ప్రమాదమున్నది. ఆ పోలిక సుందరయ్య స్థాయిని తగ్గిస్తుందే తప్ప, పెంచేది ఐతే కాబోదు.

    కాబట్టి, ఎవరైనా సుందరయ్యను గాంధీతో పోల్చడాన్ని పార్టీలోనూ, బయటా discourage చెయ్యడం అవసరం అన్నది నా అభిప్రాయం. మీ అభిప్రాయం చెప్పగలరు.

    ReplyDelete
    Replies
    1. అవినాశ్‌,
      మీరు క్షమాపణ చెప్పాల్సినంత పెద్ద పొరబాటు చేశారని నేననుకోవడం లేదు. కాకపోతే విషయాలను చారిత్రిక దృష్టితో వాస్తవిక కోణంలో చూడటం అవసరం. మీరన్నట్టు కమ్యూనిస్టులు ఆయనను గాందీతో పోల్చకూడదు. అది సైద్ధాంతిక తప్పిదం అవుతుంది. అయితే గాంధీజిని అత్యున్నత నాయకుడుగా పరిగణించే దేశంలో ఆయనతో సుందరయ్యను పోల్చి ఎవరైనా తమ గౌరవం ప్రదర్శిస్తామంటే - ఉదాహరణకు ఒక సభలో వర్ణిస్తే, ఒక వ్యాసంలో రాస్తే తప్పు అని ఖండించాలా? నిరాడంబరత్వం, ప్రజా సేవ వంటి ఉమ్మడి లక్షణాలున్నా సైద్ధాంతికంగా ఇద్దరూ భిన్న ధృవాలని సున్నితంగా చెప్పాలా?ఇదే ఇక్కడ కీలక ప్రశ్న. ౖ నంబూద్రిపాద్‌ యాభైల లోనే గాంధీజీ ఆయన సిద్దాంతాలు అన్న పుస్తకం రాశారు. సుందరయ్య తన ఆత్మకథలో గాంధీజీ ప్రభావం గురించి చాలానే రాశారు. ఎవరిని ఎవరు ఏ కోణంలో గౌరవిస్తారనేది అవతలివారికి సంబంధించిన విషయం. ఇది ప్రజాస్వామ్య దృష్టికి, వ్యక్తిగత సంస్కారానికి సంబంధించిన సమస్య తప్ప రాజకీయ తీర్మానమో రాజ్యాంగ వివాదమో కాదు ... దీనిపై చాలా చెప్పుకోవచ్చు.

      Delete
  5. రవి గారూ,

    నిరాడంబరత్వం, ప్రజాసేవ వంటి ఉమ్మడి లక్షణాలున్నా, సైద్ధాంతికంగా సుందరయ్యా, గాంధీ భిన్నధృవాలు కాబట్టి ఎవరైనా ఇద్దరినీ పోలిస్తే, తప్పు తప్పు అని గగ్గోలు పెడుతూ పోల్చిన వాళ్ల మీద ఇంతెత్తున లేవటం వాస్తవికం కాదు. అట్లాగని మౌనంగానూ, అర్ధాంగీకారం తెలుపుతున్నట్టు ఉండిపోడం కూడా సరికాదు.

    సుందరయ్యను గాంధీతో పోలుస్తున్న వాళ్లు మనస్ఫూర్తిగా పోలుస్తున్నారు, సుందరయ్య చాలా గొప్పవాడు అన్న ఉద్దేశ్యంతో పోలుస్తున్నారు. అవమానించటానికి పోల్చటం లేదు కదా అని మౌనంగా ఉన్నా ఆ పోలిక పెద్ద blunder అనిపిస్తున్నది. ఎంత ఆలోచించినా ఒక conclusion కి రావటం సాధ్యపడట్లేదు.

    సున్నితంగా తిరస్కరించాలా, లేక మౌనంగా అంగీకరించాలా అన్న విషయం ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదండీ!!

    ReplyDelete
    Replies
    1. వదిలేయండి. చైతన్యవంతులైన వారు చేయాల్సిన పనులు ఇంకా చాలా వున్నాయి. స్పష్టత వచ్చినప్పుడే వస్తుంది.

      Delete
  6. రవి గారూ. రంగనాయకమ్మ గారి పుస్తకంపైన "శౄతి తప్పిన అతి తర్కం" అన్న మీ గ్రంధం కొసం ప్రజాశక్తి లొ చుశాము యక్కడా కనిపించలేదు.పొనీ మీరు సారాంశంగా రొడు ముక్కల్లొ చెప్పండి అందులొ ఏమి శౄతి తప్పిందొ.

    ReplyDelete
  7. ‘దళిత సమస్య పరిష్కారానికి..’ పుస్తకంపై మీరు ఏ పత్రికలో సమీక్ష రాశారు? దాన్ని మీ బ్లాగులో పోస్టు చేస్తే మీరు ఏం రాశారో తెలుసుకోగలుగుతాం.

    ఓ సూచన: మీ బ్లాగులో కామెంట్ మోడరేషన్ ఉండేలా సెటింగ్స్ మార్చండి. వ్యక్తిదూషణల కామెంట్లు కూడా మీ ప్రమేయం లేకుండా వచ్చెయ్యటం, తర్వాత వాటినీ, మీకు నచ్చనివాటినీ డిలీట్ చేసే పని పెట్టుకోవటం అనవసరం కదా?

    ReplyDelete
  8. This comment has been removed by the author.

    ReplyDelete
  9. ఆ పుస్తకంపై నేను సమీక్ష రాశాననడమే అవాస్తవమైనట్టు ఆరోపిస్తూ లేక అర్థరహితమైన అపహాస్యం చేస్తూ ఇటీవలనే ఆంధ్రజ్యోతిలో ఒక లేఖ ప్రచురితమైంది. సమాధానం రాయడం ఎందుకుటే అని రాయలేదు. పీపీ అనే కలం పేరుతో రాసినట్టు అది గుప్తనామమైనట్టు సిపిఎం రహస్య పార్టీ కానప్పుడు గుప్త నామం ఎందుకన్నట్టు సదరు లేఖకుడు చాలా వ్యాఖ్యలు చేశారు.పత్రికా రంగంలో నిరంతరం రాసేవారు రకరకాల కలం పేర్లు వాడడం సర్వసాధారణమని అర్థం చేసుకుంటే ఇంత రాసి వుండేవారు కాదు. ఏమైతేనేం నేను వాడిన వాడుతున్న అనేక కలం పేర్లలో అదొకటి. అయితే తర్వాత కాలంలో వీక్షణ- సమీక్షణ పేరిట వెలువడిన నా సమీక్షల సంకలనంలో అది వుంది. ఇటవలనే 100 పుస్తకాల పరిచయం పేరిట వెలువడిన సంకలనంలోనూ దాన్ని పునర్ముద్రించాం. ఆసక్తి వున్నవారు చూడొచ్చు.లేదంటే త్వరలో బ్లాగులో దాన్ని అందించే ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తాను.

    ReplyDelete
    Replies
    1. అనేక కలం పేర్లతొ రాయవలసిన అవసరం ఏముంది?. మీ పేరుతొ రాసే దైర్యం మీకు లేదా? కమ్యునిస్టు బుర్జువా గారూ.

      Delete
  10. రామ్మోహన్‌ గారూ,
    నేను మీకు చాలా గౌరవంగా బాధ్యతగా జవాబు రాశాను. దాన్ని కాపాడుకోండి. వృత్తిపరమైన జర్నలిస్టులు కలం పేరు వాడటం భయంతోనే అనుకోవడం అజ్ఞానం. చాలా కారణాలుంటాయి. అవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరినైనా అడిగితెలుసుకోండి. పేరుతో చాలా రాస్తుంటాను. ఇప్పుడూ ఆంధ్రజ్యోతిలో పదిహేను రోజులకుఒకసారి, ప్రజాశక్తిలో వారానికి ఒక సారి రాస్తున్నాను. అయినా తర్వాత నా పేరుతో వచ్చిన రెండు పుస్తకాలలో దాన్ని ముద్రించానని చెప్పాక కూడా ఇలా వ్యాఖ్యానించం మీ దురభిప్రాయాలను(ప్రిజుడిసెస్‌) తెలియజేస్తుంది. ప్రజాశక్తిలో వెతికాను,కనిపించలేదు అన్నప్పుడే మీ ధోరణి తెలిసింది. ఎప్పుడో కొన్నేళ్ల కిందట రాసింది మీరెలా వెతకగలరు? కనీసం ఆంధ్రజ్యోతి లేఖకుడైనా పాత క్లిప్పింగు తేదీ ఇచ్చారు. మీరు నేను ఎవరికి భయపడ్డానని అనుకుంటున్నారో వారిపౖెెనా పేరుతోనే రాసిన వ్యాసాలున్నాయి. అన్ని రకాల విమర్శకులను లక్షలాది మంది ఎదుట ఎదుర్కొనే వారికి భయమేమిటి? మారు పేర్లతో ఉత్తరాలు రాయించేవారు, భక్తులతో ఆరోపణలు చేయించేవారు భయపడాలి గాని నాకు భయమెందుకు? తప్పుగా ఏం మాట్లాడాను గనక. కమ్యూనిస్టు గనక వీడిపట్ల జాగ్రత్తగా వుండాలని కొందరు, వీడు కమ్యూనిస్టు కాదని మరికొందరు అదే పనిగా రాసుకోవడంలో ఆంతర్యం ఎవరికి తెలియదు? విషయానికి పరిమితమై స్పందించండి.

    ReplyDelete
  11. ఒక వివరణ. శృతి తప్పిన అతి తర్కం అన్నది ఒక సమీక్షా వ్యాసం. పుస్తకం కాదు.

    ReplyDelete
  12. రవి గారూ ! అదే పనిగా కావాలని విమర్శించే వారికి పదే పదే వివరణలు ఇచ్చినా వారి చెవికెక్కదు. కేవలం రంగనాయకమ్మ చెప్పిందే వేదం లా కొందరికి కనిపిస్తుంటుంది. మీ బ్లాగులొ వేణు గారు సూచించినట్లు కామెంట్ మోడరేషన్ ఉంచండి . ప్రవీణ్ లాంటి పనీ పాటా లేని అడ్డమైన చెత్త వాదనలు ముందు పబ్లిష్ చేయడం తరువాత తొలగించడం వల్ల ఇబ్బంది అనేది నా అభిప్రాయం.

    ReplyDelete