Pages

Saturday, July 16, 2011

పేపరాజ్జి వరవడిలోనే మేడిపండు మీడియా

మీడియా సామ్రాజ్యాధినేత రూపర్ట్‌ మర్డోక్‌ యాజమాన్యంలోని న్యూస్‌ ఆఫ్‌ ద వరల్డ్‌ మూసివేతకు దారి తీసిన వ్యవహారాలు ఆ రంగంతో సంబంధం వున్నవారికి తలవంపులు తెస్తున్నాయి. వ్యక్తుల ప్రైవేటు సంభాషణలు ప్రైవేటుగా విని ప్రచురించి ఆకర్షణీయమైన కథలుగా ప్రచారం చేసుకోవలసిన దురవస్థ ఎందుకు దాపురించింది? ప్రిన్సెస్‌ డయానా 1997లో పారిస్‌ వీధుల్లో చవకబారు పత్రికా సైన్యం వెంటతరుముతుండగా తప్పించుకోబోయి దుర్మరణం పాలైంది. ఆమె మరణానంతరం పదేళ్లకు బ్రిటిష్‌ ఎడిటర్ల సంఘం ఇందుకు క్షమాపణలు ప్రకటించడమే గాక ఇలాటి వికృతాలు పునరావృతం కానివ్వబోమని ప్రకటించింది. అయితే ఇటీవల ఒక బాలిక అపహరణ, పైశాచిక హత్య విషయంలో మర్డోక్‌ మీడియా వ్యవహరించిన తీరు అదెంత ఘోరంగా ఉల్లంఘించబడిందో నిరూపించింది. దీనిపై ఇప్పుడు కూడా మర్దోక్‌ క్షమాపణలు చెప్పి నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఆ పత్రికను మూసివేస్తున్నట్టు కూడా ఘనంగా ప్రకటించారు. దేశ దేశాలలో పత్రికలు ఛానళ్లను శాసించే మర్డోక్‌కు ఇదో లెక్కలోది కాదు గాని దీనివల్ల ఒరిగేది కూడా వుండదు. తప్పు చేయని జర్నలిస్టులు, సిబ్బంది కూడా వీథుల పాలు కావడం తప్ప ఇలాటి దుస్సంప్రదాయాలు మాత్రం మూత పడేది వుండదు. మీడియాపై చాలా మందికి చాలా భ్రమలు వుంటాయి గాని నిజానికి సంపన్న దేశాలలో అది రాను రాను మరీ వికృత పోకడలకు నిలయమవుతున్నది. మన మీడియా సంస్థలు కూడా అదే కోవలో నడిచి అనేకసార్లు జుగుప్సకు కారణమవుతుంటాయి. వ్యక్తుల చిల్లర మల్లర విషయాలకు గాక వ్యవస్తాగతమైన మూలాలకు ప్రాధాన్యత రావాలంటే మీడియా యాజమాన్య స్వరూపంలోనూ మార్పు రావాలి. వినోదపు ఛానళ్లలో నేరుగా విదేశీ భాగస్వామ్యం అనుమతించే ప్రస్తుత నిబంధనల వల్ల భవిష్యత్తులో పరిస్థితి మరింత దిగజారినా ఆశ్చర్య పోనవసరం లేదు.

1 comment:

  1. This fellow is a big sensation here in US. People like Strausskan are proved innocent...dont know how this will affect his media kingdom.

    ReplyDelete