Pages

Saturday, July 16, 2011

ప్రాంతాల ప్రజ్వలనలో కొత్త దశ?

విజయవాడలో కోస్తా, రాయల సీమ జిల్లాల కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు సదస్సు జరపడం గతంలోనే చెప్పుకున్నట్టు ప్రాంతీయ వివాదాలు పెంచే పాలక పక్ష వ్యూహంలో కొత్త దశను సూచిస్తుంది. దీనికి ఉత్తరాంధ్ర ప్రతినిధులు హాజరవలేదని మరో సమాచారం. అంటే అదో ఉప స్రవంతి. రేపు రాయలసీమ లేదా ఉత్తర తెలంగాణా వంటి తేడాలు కనిపించినా ఆశ్చర్య పోనవసరం లేదు. ఇంతకూ అన్ని చోట్లా వారే వుండి ఎవరికి వారే అన్నట్టు వ్యవహరిస్తూ ఒకే అధిష్టానానికి మొరపెట్టుకుంటూ ప్రభుత్వాన్ని మాత్రం కాపాడుకోవడం పెద్ద రాజకీయ వైపరీత్యం. కేంద్రం ప్రాంతీయ క్రీడకు ఆజాద్‌ వ్యాఖ్యలు పరాకాష్ట అని లోగడ ఈ బ్లాగులో రాశాను. ఆ రసవత్తర క్రీడలో పాలక పాత్రధారులు అటూ ఇటూ కూడా విజృంభించనున్నారనడానికి ఇందిరా పార్కు ధర్నా, వెనువెంటనే జరిగిన విజయవాడ సదస్సు నిదర్శనాలు. ఇన్నిటి మధ్యనా కె.సి.ఆర్‌ రెండు వారాల్లో తెలంగాణా వచ్చేస్తుందని చెప్పడం అక్షరాలా ఆశ్యర్యకరమైన ప్రకటన. గతంలో గడువులు ప్రకటించి ఆచరణలో ఏం జరిగిందో చూశాక కూడా ఆయన అదే ధోరణి కొనసాగిస్తున్నారంటే తన వెనకనున్న వారిలో విశ్వాసాన్ని నిలబెట్టడం కోసమే అనుకోవాలి.ఇంతకూ ఆశతో వుండటం వేరు, ఆధారం లేని ఆశలు కల్పించడం వేరు. వాటిని కారణంగా చూపించి మరో వైపున వాతావరణాన్ని వేడెక్కించడం వేరు. ఇవన్నీ ఒకే రాజకీయ జాలంలో భాగాలు. ఇందులో తెలుగు దేశం కూడా తన వంతు పాత్ర తాను పోషిస్తున్నది. మొదటి దోషి కాంగ్రెస్‌, రెండవ దోషి తెలుగు దేశం అని ఎవరో అంటే మూడవ దోషి టిఆర్‌ఎస్‌ కూడా అని ఇటీవల ఒక చర్చలో అన్నాను.దోషం ఎవరిదైనా నష్టం జరిగేది ప్రజలకే. ప్రాంతాల వారీ వివాదాలు పెరుగుతుంటే పాలకులు చక్కగా పెట్రోలు వగైరా ధరలు పెంచేస్తారు. స్కాములతో దేశాన్ని దోచేస్తారు. ఎందుకంటే ఆ విషయంలో వారికి ఏ ప్రాంతీయ తేడాలు వుండవు. ప్రజలపట్ల బాధ్యతా లాంఛనంగానే భావిస్తారు.

No comments:

Post a Comment