Pages

Thursday, July 21, 2011

ప్రజల పేరిట నేతల భీషణ దూషణలేల?

రాష్ట్రంలో ప్రజలందరూ ప్రాంతాల వారిగా విడిపోయారన్నది నిరంతరం వినిపించే ఒక మాట. తమ ప్రాంతం విభజన జరగాలని కోరుకోవడం వేరు, మరో ప్రాంతానికి చెందిన వారిని నిరంతరం ప్రస్తావిస్తూ విరుచుకుపడటం వేరు.ఉదాహరణకు తెలంగాణా ప్రాంతంలో చాలా మంది రాష్ట్రం వస్తే బాగుంటుందని అనుకుంటుండవచ్చు. కాని మరో ప్రాంతానికి సంబంధించి ఉద్రేక పూరితంగా మాట్లాడాలనుకోవడం లేదు. అలాగే కోస్తా, రాయలసీమ ప్రాంతాల వారిలోనూ తక్కిన వారిపై ఎలాటి కోపభావమూ లేదు.ఎందుకంటే ప్రజలు ఎక్కడైనా ప్రజలే. చారిత్రిక నేపథ్యాలు ప్రాంతీయ అసమానతలు రాజకీయ వేత్తల మాయోపాయాల నేపథ్యంలో వారు పరిపరి విధాల స్పందిస్తుంటారు. అనుభవాల నుంచి నేర్చుకుని అవకాశవాదులకు పాఠాలు నేర్పుతుంటారు. అయితే ఏ దశలోనూ తెలుగు మాట్లాడే సామాన్య ప్రజలు ప్రాంతాల వారిగా కోపతాపాలకు గురి కాలేదు. కాని తమ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామని చెప్పే నాయకులే అటూ ఇటూ ద్వంద్వ భాషణం చేస్తూ వాతావరణం కలుషితం చేస్తున్నారు. ఈ విషయంలో మొదట విమర్శలకు గురైంది టి.ఆర్‌.ఎస్‌. కెసిఆర్‌, హరీష్‌ రావు తదితరులు వివిధ సందర్భాలలో వివాదాస్పదంగా మాట్లాడ్డంపై అందరూ విమర్శలు చేశారు. అవి న్యాయమే కూడా. అయితే మరో వైపున కాంగ్రెస్‌ నాయకులు టిజివెంకటేష్‌, లగడపాటి రాజగోపాల్‌, పొన్నం ప్రభాకర్‌, మధుయాష్కీ తదితరులు అంతకంటే ఏమీ తీసిపోని రీతిలో ఉద్రేక భాషణలు చేశారు. ఈ జాబితాలో ఇప్పుడు తెలుగు దేశం నేతలు కూడా చేరిపోయారు. రెండు ప్రాంతాలలో రెండు రకాలుగా మాట్లాడ్డం ఒకటైతే ఆ మాటల తీవ్రత ఎవరూ ఆమోదించలేని రీతిలో వుంది. అగ్ని గుండం గా మార్చడం గురించి కెసిఆర్‌ అన్నప్పుడు నా లాటి వాళ ్లమంతా సరికాదని వ్యాఖ్యానించాము. కాని ఎర్రం నాయుడు, పయ్యావుల కేశవ్‌ వంటి వారు కూడా అదే భాషలో మాట్లాడినప్పుడు తేడా ఏముంది?దీనిపై టివి5 చర్చలో ప్రస్తావిస్తే తాను అలా అనలేదని కేశవ్‌ ఖండించారు. కాని తర్వాత అంత కంటే తీవ్రంగా ఆత్మాహుతి దాడులను గురించి మాట్లాడారు. కాంగ్రెస్‌ ప్రాంతీయ చెలగాటం వల్లనే ఇదంతా జరిగిందని చెప్పే తెలుగు దేశం నేతలు తామైనా అందుకు భిన్నంగా వుండలేక పోవడం నిజంగా శోచనీయం. దయాకరరావు, కేశవ్‌ గీతకు చెరోవైపున నిలబడి భీషణ భాషణలు చేస్తుంటే ఎవరూ హర్షించరు.
ఇంతకూ ఈ మాటలతో పని ఏమిటి? కాంగ్రెస్‌ నాయకులు గాంధీ భవన్‌లోనూ తెలుగు దేశం నాయకులు ఎన్టీఆర్‌ ట్రస్టులోనూ కూచుని కలసి మాట్లాడుకోవచ్చు. అలాగే సీమాంధ్రలో విభజనకు అనుకూలమైన శక్తులు చాలా వున్నాయని చెప్పే టిఆర్‌ఎస్‌ వారిని తెలంగాణా భవన్‌నకు రప్పించి చర్చించవచ్చు. అంతేగాని ఈ విధంగా కవ్వింపు ధోరణిలో మాట్లాడ్డం ఏ ప్రాంతంలోని ఏ నేతలకూ తగదు. వివిధ ప్రాంతాలలో ప్రజలు ఏమనుకుంటున్నప్పటికీ ఈ విధంగా బెదరింపు ధోరణిలో మాత్రం మాట్లాడ్డం లేదు. వారి పేరుతో నాయకులే చేస్తున్నారు. బహు పరాక్‌!

2 comments:

  1. మొదట ఇలాంటి వర్బల్ డయేరియా లక్షణాలు చూపిన వాణ్ణి MISA లాంటి చట్టంతో విచారణ లేకుండా 2ఏళ్ళు మూసేసి వుంటే, ఇది కొనసాగేది కాదు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV9 లలో కవర్ కావాలంటే పాపం వారికి ఇలాంటి స్టేట్మెంట్లు ఇవ్వక తప్పటం లేదు. కెసిఆర్ ప్రళయ తాండవం చేస్తా, భూకంపం పుట్టిస్తా, తలలు నరుక్కుంటా అని డజను సార్లు అన్నాడు, ఏదీ... నేను ఆ శుభగఢియ కోసం ఇంకా ఎదురు చూస్తూనే వున్నా. పైగా రాహుకేతువులు ఒకే ఇంట్లో కూచున్నారని సిద్ధాంతి ఒకటే నస పెడుతున్నారు.

    ReplyDelete
  2. ఇలాంటి పిచ్చి వాగుడు వగేవాళ్లను, వాళ్లకి పబ్లిసిటీ కల్పించడమే జీవితధ్యేయంగా mission statementగా బ్రతికే టీ.వీ. చానళ్ళను వెలివేసి, ఇటువంటి వాచాలతను ఎగతాళిచేయడమే దీనికి పరిష్కారం.

    ReplyDelete