సమాచారమూ వినోదమూ కలగలసి పోయిన ప్రస్తుత వ్యవస్థను ఐస్(ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్,ఎంటర్‌టైన్‌మెంట్) అంటుంటారు గాని ఇది మృత్యుశీతలం కాకూడదని నేను తరచూ చెబుతుంటాను. ఇప్పుడున్నది డెమోక్రసీ కాదు, మీడియోక్రసీ అనే మాట కూడా అలాటి వాటిలో ఒకటి. నామ్ చామ్‌స్కీ పుస్తకం మొదటి అధ్యాయాన్ని సుదీర్ఘ ఉపోద్ఘాతంతో అనువదించి ప్రచురించేప్పుడు 'మీడియా మాయాజాలం' అని దానికి నామకరణం చేశాను. అన్ని మీడియా వల్లనే జరుగుతున్నాయనీ, మీడియా అంటే నిర్వికార తీర్పరి పాత్ర పోషిస్తుందని కొందరిలో వున్న భ్రమలను పోగొట్టడానికి, కొందరు కల్పించే భ్రమలను తిరస్కరించడానికి ఈ పదాలన్ని సృజించబడ్డాయి. ఇందుకు అర్థ శతాబ్దం ముందే మహాకవి పెట్టుబడికి కట్టుకథకు పుట్టిన విష పుత్రికలపై ధ్వజమెత్తి వున్నాడు కూడా.. ఈ విమర్శలన్ని ప్రపంచీకరణ క్రమంలో వందల వేల రెట్లు వికృతంగా తయారైనాయి.
కళ్లముందు జరుగుతున్న రూపర్ట్ మర్డోక్ జుగుప్సాకర ప్రహసనమే తీసుకుంటే తన మాటల్లోనే 53 వేల మంది సిబ్బంది పనిచేసే గ్లోబల్ మీడియా బేరన్, డాన్! అంతటి వాడు న్యూస్ ఆఫ్ ద వరల్డ్ దొంగచాటు ఫోన్ ట్యాపింగ్ కుంభకోణంలో దొరికి పోయి చెంపలు వాచేలా క్షమాపణలు
చెప్పుకుంటున్నాడు. పేజీలకు పేజీలు సంజాయిషీలు ప్రకటిస్తున్నాడు. విచారణలకు హాజరై విచారం ప్రదర్శిస్తున్నాడు. ఇవన్నీ సమాచార విస్పోటనంలో విధ్వంస పార్శ్యాన్ని కళ్లకు కడుతున్నాయి. మనం ప్రతిదానికి ప్రజాస్వామిక నమూనాగా ప్రస్తుతించే పాశ్చాత్య ప్రజాస్వామిక సమాజంలో ప్రబలిన క్షీణ హీన ధోరణులను వెల్లడిస్తున్నాయి. ఇందులో ఎవరు ఎక్కడ ఏం చేశారనేది ఒకటైతే ఈ మొత్తంలో స్పష్టమవుతున్న సారాంశమేమిటన్నది అసలు ప్రశ్న. 1950 లలో ఆడెలైడ్ టైమ్స్ అనే పత్రిక స్థాపనతో మొదలైన మర్డోక్ మీడియానం 1968లో న్యూస్ ఆఫ్ ద వరల్డ్ హస్తగతం చేసుకోవడంతో పెద్ద మలుపు తిరిగింది.తర్వాత టైమ్స్, సండే టైమ్స్, స్టార్ న్యూస్ ఛానల్ ఇలా పెరుగుతూ పోయింది. అనేక దేశాలలో ప్రసారాలు ప్రారంభించిన తొలి విదేశీ మీడియాధిపతి కూడా ఆయనే.ఇప్పుడాయనకు 20 సెంచురీ ఫ్యాక్స్,హాపర్ కాలిన్స్ ప్రచురణ సంస్థతో సహా సుప్రసిద్ధమైన సంస్థలెన్నో వున్నాయి. ఇరవై ఏళ్లకిందటే ఆయన ఇండియాలోనూ ప్రవేశించాడు.ఎనిమిది భాషల్లో టీవీ ప్రసారాలు స్వయంగా చేయడమే గాక అమృత బజార్ గ్రూపులో 26 శాతం వాటాలు పెట్టాడు. టాటా స్కైలోనూ ఆయనకు 20 శాతం భాగముంది.ఇవి ఆయన మీడియా రాజ్యం విస్త్రతిని తెలిపే కొన్ని ఉదాహరణలు మాత్రమే.ఇంతగా అల్లుకుపోయిన గ్లోబల్ మీడియా క్షుద్ర విన్యాసాలతో నేరస్త చర్యలతో చవకబారు సంచలనాలు సృష్టించడానికి నీచాభిరుచులు మప్పడానికి వేదిక అయ్యింది. వ్యక్తిగత వ్యవహారాలు, చవులూరించే నేర కథనాలు, అసభ్య శృంగార లీలలు , తెరచాటు భాగోతాలు వంటివాటి చుట్టూనే పాఠకులు ప్రేక్షకులను పరిభ్రమించ చేసి మతి భ్రమింపచేసే పద్మవ్యూహానికి ప్రారంభస్థానమైంది. మనం రోజూ మన ఛానళ్లలలో పత్రికలలో చూసే అనేకానేక కథనాల మూలాలు వెతుకుతూ పోతే అవి మర్డోక్ వంటి వారి దగ్గరే దొరుకుతాయి. ఎందుకంటే మనది బలహీనమైన దేశవాళీ అనుసరణ మాత్రమే.
ప్రపంచాన్ని కుదిపేసి న్యూస్ ఆప్ ద వరల్డ్ పత్రిక మూతకూ, మర్డోక్ క్షమాపణలకు కారణమైన టెలిఫోన్ ట్యాపింగ్‌లో నేరాలు లెక్కకు మిక్కుటంగా వున్నాయి. తీగలాగితే డొంక కదిలినట్టు దీని తర్వాత బయిటపడిన కథలు ఇంకా దారుణమైనవి. చెత్త కథలు సేకరించి ప్రసారం చేసి ప్రజలను మభ్యపెట్టడం ఒకటైతే అందుకోసం చట్టవిరుద్ధమైన పద్దతులకు పాల్పడటం మరొకటి. ఇందులో ఇప్పుటికీ సామాన్యులకు అంతుపట్టని సాంకేతికాంశాలున్నాయి. 1980ల మధ్య భాగంలో బ్రిటన్‌లో మొబైల్ ఫోన్ల వాయిస్ మెసేజ్‌లు ప్రవేశపెట్టినపుడు వాటిని ఇతరులు సంపాదించే అవకాశం ఏర్పడింది.121 కి ఫోన్ చేసి తమకు వచ్చిన మెసేజ్‌లు తెలుసుకోగలిగేవారు. అయితే ఈ క్రమంలో ఇతరులకు సంబంధించినవి కూడా తెలుసుకునే అవకాశం చిక్కింది.ప్రిన్స్ హారీ కూడా ఇందుకు గురైనాడు.మిల్లీ డౌలర్ అనే పదమూడేళ్ల బాలికను ఎవరో అపహరించి హత్య చేస్తే అందుకు సంబంధించిన ఆఖరి వాయిస్ మెయిల్ మర్డోక్ పత్రికకు చిక్కింది. దాన్ని పోలీసులకు అందించి తగు చర్యలు ప్రారంభించే బదులు ఆ పత్రిక నిర్వాహకులు ఆ మెయిల్‌ను తీసేసి డౌలర్ బతికే వున్నట్టు కథలు వదిలారు. దానిపై ఉత్కంఠ పెంచి కుటుంబాన్ని తప్పు దోవ పట్టించారు. అది కాస్తా బయిట పడ్డాక మొదట్లో బుకాయించి ఆ పైన క్షమాపణలు మూసివేతలతో సరిపెట్టాలని చూశారు. ఆ పత్రిక ప్రధాన బాధ్యురాలైన రెబెకా బ్రూక్స్‌తో సహా పలువురి తలలు రాలాయి గాని మర్డోక్ మాత్రం తన తప్పు లేదనే అంటున్నాడు.53 వేల మందిలో ఒకరు తప్పు చేస్తే నాదా బాధ్యత అని ఎదురు ప్రశ్నలు వేస్తున్నాడు.
ఈ సందర్బంగా వెల్లడైన విషయాలు చూస్తే తల తిరిగిపోతుంది. తాము దొంగచాటుగా ఫోన్లు వినడం సర్వసాధారణమని గతంలో ఆ పత్రికతో సంబంధం వున్న వారందరూ బల్లగుద్ది చెబుతున్నారు. పైగా దేశ దేశాల్లో ప్రభుత్వాధినేతలతో సన్నిహితంగా మెలుగుతూ స్వప్రయోజనాలు నెరవేర్చుకునే మర్డోక్ బ్రిటిష్ ప్రధాని కామెరూన్‌కు కూడా నెచ్చెలిగా వున్నాడు.పైగా ఈ విధమైన ట్యాపింగ్ కేసులకు పేరు మోసిన ఆండీ కుల్సన్‌ను ప్రధాని కమ్యూనికేషన్ సలహాదారుగా పెట్టుకున్నాడు. అది కూడా ఎప్పుడు?2007లో రాజకుటుంబీకుల ఫోన్లను న్యూస్ ఆఫ్ ద వరల్డ్ ప్రతినిధి దొంగచాటుగా విన్నాడన్న కేసులో దాని ఎడిటర్ పదవికి రాజినామా చేశాక! దీనిపైన అలాగే మర్డోక్‌తో ప్రత్యేక సంబంధాల పైన ఇప్పుడు కామెరూన్ సుడిగుండంలో చిక్కుకుపోయాడు. తమ పత్రికలో ఇలాటి ఘోరాలు మరెన్నో జరుగుతుంటాయని మొదట బయిటపెట్టిన మరో మాజీ సంపాదకుడు సీన్ హౌరే సోమవారం అంతుపట్టని రీతిలో శవమై కనిపించాడు.ఈ తప్పుడు పనుల్లో తమకు పోలీసులు సాంకేతిక సహకారం అందించే వారని కూడా ఆయన బిబిసికి చెప్పేశాడు. అసలు తమ ప్రధాన వార్తా వనరులు వృత్తిగత నేరస్తులేనని కూడా ఈ సందర్భంలో పత్రికా రంగ ప్రముఖులు పలువురు అంగీకరించారు. గతంలో బ్రిటిష్ యువరాణి డయానా దుర్మరణం తర్వాత దశాబ్దానికి 2007లో బ్రిటిష్ సంపాదకులు సిగ్గుతో క్షమాపణలు చెప్పిన విషయం ఇక్కడ గుర్తు చేయాలి. ఆ తర్వాత కూడా వారి తీరు తెన్నులు ఏ మాత్రం మారకపోగా మరింత దిగజారిందని ఇప్పుడు నిస్పందేహంగా రుజువైపోయింది. అమెరికా నుంచి అమలాపురం వరకూ విస్తరించిన గ్లోబల్ మీడియా సార్వత్రిక లక్షణం తప్ప ఇది ఏ ఒక్కరికో ఏ ఒక్క ఘటనకో పరిమితం కాదు. మన దేశంలోనూ ఇలాటి వాద వి వాదాలు చాల చూశాము.
పత్రికా స్వాతంత్రం అన్నది ప్రాథమిక హక్కుతో సమానమైంది. పరిశోధనాత్మక జర్నలిజంలో మీడియా వల్ల జరిగిన మేలు చాలా వుంది. అయితే అంతకు అనేక రెట్లు విమర్శలూ వున్నాయి. అయితే దాన్ని ఇతరుల స్వాతంత్రంపై ప్రయోగించడం వాస్తవంలో వారి హక్కులను హరించడమే. అవస్థలకు కారణమైన వ్యవస్థల మూలాల్ని ఎప్పుడూ పట్టించుకోకుండా పైపై కథనాలతో పాఠకులను ప్రేక్షకులను కట్టిపడేయడం పెద్ద జాడ్యంగా తయారైంది. నివేదించడం తప్ప పర్యవసానాలతో నిమిత్తం లేదనే నిర్బాధ్యత తాండవిస్తున్నది. దైనందిన జీవితాలను అతలాకుతలం చేసే ఆర్థికాంశాలు, దోపిడీ విధానాలు వంటి వాటి జోలికి పోని లైఫ్‌స్టయిల్ కాన్సెప్ట్ జీవితపు లోతులను గాక జిలుగుబులుగులతో చీకటి కోణాల చిత్రణతో కట్టిపడేయడానికి పాకులాడుతున్నది. ఈ అనారోగ్యకర పోకడలలో పోటీ ముదిరి ఒకరిని మించి ఒకరు వికృత గాథలకు సృష్టికర్తలవుతున్నారు. రాజకీయ కార్పోరేట్ అనుబంధాల విషయానికి వస్తే నీరా రాడియా 2 జి స్ప్రెక్ట్రం కుంభకోణం సందర్భంలో ఏ విధంగా పత్రికలను ఆడించిందీ టెలిఫోన్ టేపులతో సహా వెల్లడైంది.కేంద్ర మంత్రివర్గ స్థానాల కోసం ఆమె పత్రికా ప్రముఖులను ప్రలోభపెట్టి ప్రయోగించిన తీరు కూడా తెలిసి వచ్చింది. ఇక 2 జి సొమ్ము దయానిధి మారన్ సన్ టీవీకి, రాజా కనిమెళి కళైంగార్ టీవీకి మళ్లించుకున్న తీరు దేశమంతా మార్మోగుతున్నది. రాష్ట్రంలోనూ జగన్ ప్రచురణలపై అలాటి కేసులే నడుస్తున్నాయి. ఇన్నిటిలోనూ అంతస్సూత్రం అక్రమ పెట్టుబడులతో అపారంగా విస్తరించిన మీడియా అనుచిత పోకడలే. అమెరికా అధీనంలోని సామ్రాజ్యవాద ప్రపంచీకరణకు మీ డియా ఒక ప్రధాన సాధనం. రాజకీయ సాంసృతిక రంగాలలో దాన్ని జొప్పించే సాధనం. మర్డోక్‌పై ఏదో పైపై విచారణ జరిపినా లేక ఏవో హడావుడి చర్యలు చేపట్టినా ఈ మీడియా మాయాజాలం మాత్రం మారేది కాదు.కనక ప్రేక్షకల విమర్శనాత్మక వీక్షణమే విలువలకు రక్ష. వికృత పోకడలను తిరస్కరించడంతో పాటు విభిన్న ప్రయోగాలను విశుద్ధ ప్రయత్నాలను ఆదరించడం మరింత ముఖ్యం
.గమనం, ఆంధ్రజ్యోతి,జులై21,2011
No comments:
Post a Comment