Pages

Tuesday, May 22, 2012

జగన్‌ మాటల ఆంతర్యం? ఆందోళన?వైఎస్‌ఆర్‌ పార్టీ అద్యక్షుడు జగన్మోహన్‌ రెడ్డి తన అరెస్టు అనంతర పరిణామాలపై చేసిన ఊహాత్మక వ్యూహాత్మక వ్యాఖ్యలు ఇప్పటికే చాలా విమర్శలకు దారి తీయడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పటి వరకూ ఆయన మాట్లాడిన తీరుకు ప్రస్తుత వ్యాఖ్యలకు మధ్య హస్తిమశకాంతరం తేడా వుంది. మొదటి సంగతి ఏమంటే ఎలాటి విచారణకైనా సిద్ధమేనని అంటూనే తమ నాయకుణ్ని అరెస్టు చేస్తే రాష్ట్రం అగ్ని గుండం అవుతుందని గతంలో ఆ పార్టీ నాయకులు అనేక బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంలో రెండు రోజుల పాటు అరెస్టు వూహాగానాల మధ్య భారీ సమీకరణలు, విస్త్రత సందేశాల పంపిణీ కూడా జరిగింది. తర్వాత ఆ వాతావరణం కొంత మారినా మళ్లీ ఇటీవల పరిణామాలు వేగం పుంజుకున్నాయి. సాక్షి ఖాతాల స్తంభన, తర్వాత నిమ్మగడ్డ ప్రసాద్‌ అరెస్టు, ఆస్తుల స్తంభన యత్నాలు ఇవన్నీ వేడిని పెంచాయి. అంతిమంగా మే28న జగన్‌తో సహా పలువురికి సమన్లు అందాయి. లాయర్‌ ద్వారా హాజరు అయ్యే అవకాశం వుందని సమన్ల భాషను బట్టి చాలా మంది నిపుణులు చెప్పినా సోమవారం నాడు కోర్టు మొదటి సారి స్వయంగా రావాలన్నట్టు వ్యాఖ్యలు చేసింది.వెళితే అరెస్టు చేయొచ్చనే అంచనాలు కొన్ని
వున్నాయి.దీనిపై కొంత తటపటాయింపు వున్నా ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా అన్నిటికీ సిద్ధమైనట్టే కనిపిస్తుంది. మూడవ ఛార్జిషీటులో వైఎస్‌ను నేరుగా నిందితుడని పేర్కొనడం, మంత్రి మోపిదేవిని కూడా ప్రశ్నించేందుకు రప్పించనుండటం, సంబంధిత మంత్రులలో ఆందోళన ఇవన్నీ పరిస్తితిని పూర్తిగా మార్చేస్తున్నాయి. ఇలాటి నేపథ్యంలోనే జగన్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారనుకోవాలి. అయితే అరెస్టు తర్వాత పెద్ద ఎత్తున అల్లర్లు చేసి ఆ ఆరోపణలు తనపై తోస్తారని ఉప ఎన్నికలు వాయిదా వేయిస్తారని మొత్తం మూడు వూహాగానాలను ఒక్కసారి గుప్పించడంతో రాజకీయ వ్యూహం వుందని ఎవరైనా అనుకోవలసి వస్తుంది. ఎన్నికల ముంగిట్లో గెలుపు అవకాశాలు ఎక్కువగా వున్నట్టు చెబుతున్న పార్టీ నేత ఇలా మాట్లాడ్డం మామూలు సంగతి కాదు. అంటే తలుపులు మూసుకుపోతున్న సంగతి గ్రహించే జగన్‌ ఇలా అంటున్నాడనుకోవాలి. తర్వాతి పరిణామాలకు మానసికంగా సిద్ధం చేయాలనీ అనుకోవచ్చు. ఎంత లేదన్నా గత వారం రోజుల్లోనూ వైఎస్‌ పార్టీ నేతల్లో అసౌకర్యం ఆందోళన కనిపిస్తున్నాయి.కాంగ్రెస్‌ తెలుగుదేశం కోలుకున్నాయని కాదు గాని తమపై ఉచ్చు బిగుస్తోందని మాత్రం వారు గ్రహిస్తున్నారు. జగన్‌ అరెస్టు వల్ల ఒకసారి ఉప ఎన్నికల్లో సానుభూతి కలసి వచ్చినా దీర్ఘ కాలంలో నాయకత్వ లేమితో అయోమయం నెలకొంటుందన్న భావం కూడా వుంది. ఇప్పుడు జగన్‌ మాటలు కూడా అలాటి ఆందోళననే ధృవీకరిస్తున్నాయి. ఏది ఏమైనా ఎన్నికల తరుణంలో భయ సందేహాలు పెంచే వూహాగానాలు వదలడం శ్రేయస్కరం కాదు. ఎందుకంటే ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా వమ్ము చేయగల చేవ చైతన్యం తెలుగు ప్రజలకు వున్నాయి. పోలీసు డిజిపి కూడా అప్రమత్తంగా వుంటామని ప్రకటన చేసినప్పటికీ నిజంగా వుంటారని ఆశించాలి.

8 comments:

 1. రవి గారూ,

  మీ విశ్లేషణ బాగుంది. నాకొక సందేహం సిబిఐ చేస్తున్న దర్యాప్తులో ఎక్కడా లోసుగున్నట్లు గానీ లేదా వారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నట్టు గానీ మీకు అనిపించడం లేదా? జగన్ తప్పు చెయ్యట్లేదని ఎవరూ చెప్పట్లేదు (ప్రజలు). కానీ సిబిఐ లేదా ప్రభుత్వం వ్యవహరిస్తున్న లేదా దర్యాప్తు జరుగుతున్న తీరులో అంతా సవ్యంగా ఉంది అన్న రీతిలో మీ లాంటి విశ్లేషకులు పేర్కొనడం ఒక వ్యతిరేఖ వైఖరిని తెలియచేస్తున్నది తప్ప తటస్థ వైఖరిని కాదు. మీ విశ్లేషణ రెండు వైపులా ఉండాలి అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం. అన్యదా భావించవద్దు. ఆలోచించండి.!

  ReplyDelete
 2. . జగన్‌తో గాని, సిబిఐతో గాని ఏకీభవించాల్సిన అవసరం లేదు. నిందితులుగా వున్న వారు వేసే నిందలకు విలువ పరిమితంగా వుంటుంది. సిబిఐపై వారు తప్పక న్యాయ పోరాటం చేయొచ్చు. అలా చేస్తున్నారు కూడా. సిబిఐ గురించిన విశ్లేషణలు విమర్శలు చాలా వున్నాయి.అవి జగన్‌పై ఆరోపణలను దర్యాప్తు అవసరాన్ని మటుమాయం చేయవు కదా?

  ReplyDelete
  Replies
  1. సరిగ్గా నేను కూడా అదే చెబుతున్నాను. మీరు ఎవరితో ఏకీభవించాల్సిన పని లేదు. జగన్ లేదా ఆయన పార్టీ వేసిన నిందలను సమర్థించమని చెప్పట్లేదు. ఇక్కడ జగన్ లేదా ఆయన సంస్థలు ఎదుర్కొంటున్నది ఆరోపణలు మాత్రమే. ఈ ఆరోపణలను నేరంగా కోర్టు నిర్ధారించినపుడు వారు నిన్దితులవుతారు.

   Delete
 3. జగన్ పై వచ్చిన అభియోగాలపై విచారణను ఎవ్వరూ కాదనడం లేదు. కాని ఇంత వరకూ ఎన్నడూ లేని విధంగా సిబిఐ ఈ కేసు విషయంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తుండడం వెనుక ఏ రాజకీయ శక్తులూ లేవనే మీరు భావిస్తున్నారా? జగన్ కేసులో అవినీతిగురించి దర్యాప్తు నిష్పాక్షికంగా జరగాలంటే మొదట రాజశేఖర రెడ్డి ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా పెట్టుబడిదారులకి లాభం కలిగించిందని నిర్ధారణ చేయవలసిన అవసరం లేదా?.ఎవరైనా నూరు రూపాయలు లాభం పొందితే పది రూపాయలు లంచం ఇచ్చే అవకాశం ఉంటుంది.ఆ విధంగా నూరు రూపాయలు అక్రమంగా లబ్ధి పొందిన వారు ఉన్నారని భావించి నప్పుడు వారి ఖాతాలను ఆస్తులను స్థంబింప జేయకుండా పది రూపాయల లబ్ధి పొందిన వారి ఆస్తులను సీజ్ చేయడంలో నైతికత ఉందా? దీని వెనుక కుట్ర ఏమీ లేదనే మీరు భావిస్తున్నారా? సుప్రీమ్ కోర్టు కలుగ జేసుకునే వరకూ ఈ విషయంలో మంత్రులకు నోటీసైనా ఇవ్వని సిబిఐ తర్వాత కూడా వారిని విచారించడంలో విలంబం చేస్తున్న తీరు మీకు నిష్పాక్షికంగానే కనిపిస్తోందా? సిబిఐ వ్యవహారం చూస్తున్న జగన్ తనని అరెస్టు చేస్తారని అనుకోవడంలో వింతేముంది? దాని మీద వ్యాఖ్య కంటె ఈ కేసులో సిబిఐ వ్యవహరిస్తున్న తీరు గురించి వ్యాఖ్యానించడం అత్యవసరం.అది చాలా సజావుగా సాగుతోందని మీకనిపిస్తే అదే విషయాన్ని వ్రాయండి.తప్పులేదు.అప్పుడు మీ అభిప్రాయాలకి జనం ఇచ్చే విలువ పెరుగుతుంది.

  ReplyDelete
  Replies
  1. లాభం కాదు కదా, న్యాయంగా రావాల్సిన పెన్షన్, డెత్ సర్టిఫికేట్, మేరేజి సర్టిఫికేట్, ప్రమాదంలో మృతుల ప్రబుత్వ పరిహారం ఇలాంటి వాటన్నింటికోసం లంచం ఇవ్వాల్సి వస్తోంది. ప్రస్తుత విషయం లంచం అనకూడదు, ఇది ఒక వ్యవస్థీకృత రాజకీయ క్రిమినల్ గ్యాంగ్ విశృంఖల అవినీతి. CBIది అత్యుత్సాహమే అయివుండవచ్చు. ఆవిషయాన్ని CBI పనితనాన్ని సమీక్షించినప్పుడు ఏకి పారేయవచ్చు, కాని ప్రస్తుతం CBIని ఎందుకు నిరుత్సాహ పరచి దర్యాప్తును నీరుగార్చాల అన్నది అర్థం కాని విషయం. దానివల్ల ప్రజలకు ఒరిగిదేమిటో చెబితే ఆలోచించవచ్చు.
   సిబిఐ దర్యాప్తుపై రాజకీయ వ్యాఖ్యలు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అనే టైమింగ్ పై మంత్రుల ఎత్తులు పైఎత్తులు ప్రతికల్లో వూహాగానాలు రావడం దురదృష్టకరం. వీళ్ళూ చేస్తోది దర్యాప్తా లేక రాజకీయ చెడుగుడు ఆడుతున్నారా అనేలా అనిపించడంలో అనిపిస్తోంది.
   ప్రస్తుతానికి స ఇంద్రః తక్షకాయ స్వాహ అన్నట్లు సర్పయాగం లో మంత్రులు, IASలు, అవినీతి వ్యాపార భాగస్వాముల్తో సహా సర్పయాగాన జగన్ పడాలనే ప్రజలు(1000రూ లకు వోటేసే వారు కాదు) కోరుకుంటున్నారు.

   Delete
 4. సిబిఐ అన్నీ అద్బుతంగా చేస్తున్నట్టు నేనెక్కడా చెప్పలేదు. సిబిఐ కేంద్ర హౌం శాఖ పరిధిలో పనిచేస్తుంది. బాబరీ మసీదు కేసులో అద్వానీపై ఛార్జిషీటు విషయంలో ఎన్‌డిఎ ప్రభుత్వం వున్నప్పుడు అవసరం లేదనీ, యుపిఎ వున్నప్పుడు అవసరమనీ వాదించింది. సిబిఐకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలన్న వాజ్‌పేయి ప్రధానిగా వున్నప్పుడు ఆ పనిచేయలేదని విమర్శలనెదుర్కొన్నారు. ఇప్పుడు లోక్‌పాల్‌ బిల్లు సందర్భంగానూ ఇలాటి అంశాలు వచ్చాయి. అయితే ఈ వ్యాఖ్యలు సిబిఐకి మొత్తంగా వర్తించేవే గాని జగన్‌ కేసుకే పరిమితం కాదు.పైగా సిబిఐ దర్యాప్తునే తప్పుపట్టే వారు జగన్‌పై ఆరోపణల స్వభావాన్ని కాస్తయినా బలపరిస్తే అది వేరు.కేవలం ఆయన మీద భక్తితో సిబిఐపై దాడి చేయడం వల్ల ఉపయోగం లేదు. సిబిఐ పొరబాట్లను సవాలు చేయగల సత్తా యంత్రాంగం జగన్‌కు వున్నాయి. పని చేస్తున్నాయి కూడా.ఈ రోజు కూడా కోర్టులో దాని చర్యలు కొన్ని కొట్టివేయబడ్డాయి. ఇప్పటికైనా నా వైఖరి అర్థమైందని ఆశిస్తాను. దర్యాప్తులో రాజకీయాలు వున్నాయంటూ దాన్ని ఖండించేందుకు రాజకీయాలను ఉపయోగించుకోవడం సరి కాదు కదా!

  సిబిఐ అన్నీ అద్బుతంగా చేస్తున్నట్టు నేనెక్కడా చెప్పలేదు. సిబిఐ కేంద్ర హౌం శాఖ పరిధిలో పనిచేస్తుంది. బాబరీ మసీదు కేసులో అద్వానీపై ఛార్జిషీటు విషయంలో ఎన్‌డిఎ ప్రభుత్వం వున్నప్పుడు అవసరం లేదనీ, యుపిఎ వున్నప్పుడు అవసరమనీ వాదించింది. సిబిఐకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలన్న వాజ్‌పేయి ప్రధానిగా వున్నప్పుడు ఆ పనిచేయలేదని విమర్శలనెదుర్కొన్నారు. ఇప్పుడు లోక్‌పాల్‌ బిల్లు సందర్భంగానూ ఇలాటి అంశాలు వచ్చాయి. అయితే ఈ వ్యాఖ్యలు సిబిఐకి మొత్తంగా వర్తించేవే గాని జగన్‌ కేసుకే పరిమితం కాదు.పైగా సిబిఐ దర్యాప్తునే తప్పుపట్టే వారు జగన్‌పై ఆరోపణల స్వభావాన్ని కాస్తయినా బలపరిస్తే అది వేరు.కేవలం ఆయన మీద భక్తితో సిబిఐపై దాడి చేయడం వల్ల ఉపయోగం లేదు. సిబిఐ పొరబాట్లను సవాలు చేయగల సత్తా యంత్రాంగం జగన్‌కు వున్నాయి. పని చేస్తున్నాయి కూడా.ఈ రోజు కూడా కోర్టులో దాని చర్యలు కొన్ని కొట్టివేయబడ్డాయి. ఇప్పటికైనా నా వైఖరి అర్థమైందని ఆశిస్తాను. దర్యాప్తులో రాజకీయాలు వున్నాయంటూ దాన్ని ఖండించేందుకు రాజకీయాలను ఉపయోగించుకోవడం సరి కాదు కదా!

  ReplyDelete
 5. జగన్ కేసు క్విడ్ ప్రో క్వో కి సంబంధించినది.కొందరు పెట్టుబడిదారులు అక్రమంగా ప్రభుత్వంనుంచి లభ్ది పొంది అందువల్ల జగన్ సంస్థల్లో పెట్టుబడి పెట్టారన్నది అభియోగం.ఇంటువంటి కేసులో మొదటి ఆ పెట్టుబడిదారులు అక్రమంగా లబ్ధి పొందారన్నది ఋజువు చేయడం అత్యావశ్యకం.ఇది చేయకుండా జగన్ని దోషి అని ఏ కోర్టూ నిర్ధారించజాలదు.ఈ విషయం పై దృష్టి పెట్టకుండా తొమ్మిది నెలలై జగన్ ఆస్తులూ జగన్ సంస్థల్లో పెట్టుబడి పెట్టిన వారి ఇళ్లల్లో సోదాలూ అంటూ కాలం గడిపేయడం సిబిఐ చిత్తశుధ్ధితో పనిచేయకుండా ఎవరి మార్గదర్శకత్వంలోనో ఎవరికో రాజకీయంగా మేలు చేయాలనే ఉద్దేశంతో పని చేస్తున్నట్టు స్పష్టమవుతోందికదా?. సుప్రీమ్ కోర్టు నోటీసులిచ్చినా ఆపధ్దతిలో విచారణ చేయకుండా జాప్యం చేయడం వెనుక మర్మ మేమిటి?
  ఈ కేసులో జగన్ కి శిక్ష పడాలంటే రాజశేఖర రెడ్డో అప్పటి మంత్రులో ఆపీసర్లో అక్రమాలు చేశారని నిరూపించి వారికి శిక్ష పడేట్లు చేయాలి.వారిని తప్పింప జేసే ప్రయత్నాలు ఏమైనా జగన్ కి మేలే చేస్తాయి.ఈ కేసులో జగన్ లబ్ధి పొందాడని అందుచేత అతడికి శిక్ష పడాలని కోరుకునే వారెవరైనా సిబిఐ తీరుని తప్పుపట్టక మానరు.
  సిబిఐ ని కాంగ్రెసు బ్యూరో ఆఫ్ ఇన్వెష్టిగేషన్ అని ఓసారి అన్నాము కదా అంటే సరిపోదు.జడ్జీలు కాని, ప్రజలకు నిష్పాక్షికంగా వార్తలను అందిస్తామనే జర్నలిస్టులుకాని నిష్పాక్షికంగా ఉండడమే కాదు ఉన్నట్టు అందరికీ కనిపించాలి.అప్పుడే వారికి విలువ ఉంటుంది.

  ReplyDelete
 6. నిందితులుగా ఉన్నవారు వేసే నిందలకు విలువ పరిమితంగా ఉంటుందన్నారు.నిజమే కదా? నింద నుంచి తమను తాము తప్పించుకునే ప్రయత్నంలో వారు ఏ మైనా చెప్తారుకదా?ఈ దృష్టిలో ఇప్పుడు అరెస్టయిన మంత్రివర్యులు తమకేమీ తెలియదనీ అంతా చనిపోయినాయన చలవే ననీ అం
  టే దానికి విలువేమిటి? మరీ ముఖ్యంగా ఈ కేసులన్నిటిలోప్రభుత్వ కార్యదర్శుల పాత్రేమిటి?.ఏదో ముఖ్యమంత్రో మంత్రులో చెబితే చేశామని వారు తప్పించుకో జూడడం ఎంత వరకు సమర్థనీయం?.వారు వారి పాత్ర లేకుండా అక్రమాలు జరుగు తున్నాయనుకుంటే వెంటనే శెలవైనా పెట్టి అక్కడనుండి తప్పుకోవాలిగదా? అఈ విషయంలో వారి పాత్ర గురించి వ్రాయండి.

  ReplyDelete