Pages

Wednesday, May 30, 2012

రిజర్వేషన్లపై పారని పాచిక: బడుగుల మధ్య చీలిక!


విభజించి పాలించడం అనే నీతి బ్రిటిష్‌ వారితోనే పోలేదు. పాలకవర్గాలకు ఎప్పుడూ అలవాటైన ఎత్తుగడ అది. మన దేశంలో రిజర్వేషన్ల విధానం అందుకు సరైన ఉదాహరణ. ఉపాధికి చేటు తెచ్చే సరళీకరణ విధానల వల్ల ప్రభుత్వ ఉద్యోగాలే హరించుకుపోతుంటే రిజర్వేషన్ల పేరిట ప్రజల్లో వివిధ తరగతుల మధ్య చిచ్చు పెట్టేందుకు పాలకులు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే వుంటారు. ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం రిజర్వేషన్లపై ఎడతెగని ప్రతిష్టంభన అందులో భాగమే. సామాజిక వెనకబాటు తనమే కొలబద్దగా చూస్తే ముస్లిం మైనారిటీలలో పెద్ద భాగం దళితుల కన్నా వెనకబడిన స్థితి వుందని జస్టిస్‌ రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌ నివేదిక స్పష్టంగా పేర్కొంది. వారికి పది శాతం రిజర్వేషన్‌ కల్పించాలని సిఫార్సు చేసింది.ఇప్పుడున్న రిజర్వేషన్లకు ఇబ్బంది లేకుండా ఆ అవకాశం కల్పించాలి. అవసరమైతే అందుకు రాజ్యాంగ సవరణ అందరి సహకారంతో తీసుకురావాలి. అయితే ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం 27 శాతంగా ఉన్న బిసి రిజర్వేషన్లలో 4.5 శాతం ముస్లిం మైనారిటీలకు ఇస్తూ ఆర్డినెన్సు తెచ్చింది. దీనిపై అభ్యంతరాలు వస్తే హడావుడిగా కమిషన్‌ వేసి మమ అనిపించింది. నిజానికి అవకాశం కల్పించబడిన వారంతా ముస్లింలైనా వెనకబడిన కులాలకు చెందిన వారే. కాకుంటే వారికి ముస్లింల పేరిట కోటా ఇవ్వడమే సమస్యకు కారణమైంది. ఇటీవలి శాసనసభ ఎన్నికల సందర్భంలో కేంద్రం కూడా అదే పని చేసింది. హడావుడిగా ఒక ఉత్తర్వు విడుదల చేసి మైనారిటీలకు రిజర్వేషన్‌ ఇస్తానన్నది. తీరా ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్‌ హైకోర్టు దాన్ని కొట్టి వేసింది. ఆ రీత్యా ఈ తీర్పు దేశమంతటా ప్రభావం చూపిస్తుంది.దీనికి పరిష్కారం రాజ్యాంగ సవరణతో రంగనాథ్‌ మిశ్రా సిఫార్సులు అమలు చేయడమే.దానికి బదులుగా సుప్రీం కోర్టులో సవాలు చేయనున్నట్టు కేంద్ర మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌ ప్రకటించారు.అక్కడ ఏం జరుగుతుందో వూహించవచ్చు.ఈ లోగా బిసి వర్గాలకు ముస్లింలకు మధ్య వైరుధ్యాలు పెరుగుతాయి. పాలకుల పాచిక పారుతుంది. కనకనే ఈ విషయంలో కేంద్రం ఎత్తుగడను సరిగ్గా అర్థం చేసుకోవాలి. అలాగే మత ప్రాతిపదికన రిజర్వేషన్‌ వుండరాదని వాదించే వారు దాన్ని తిరస్కరించినా అదే విమర్శ వర్తిస్తుందని గుర్తించాలి. కొంతమంది ఓటు బ్యాంకు పేరుతో దీన్ని తెగనాడతారు. ఎందుకంటే వారి ఓటు బ్యాంకులకు అది అవసరం గనక. ముస్లింలు క్రైస్తవులు బౌద్ధులు జైనులు ఎవరైనా ఈ దేశ ప్రజలందరికీ ఒకే కొలబద్ద వుండాల్సిందే. కాకపోతే వీరంతా ఒకటే తరగతి ఎలా అవుతారని కోర్టు ప్రశ్నించడం చట్టరీత్యా సమంజసమే. కనకనే వారి వెనకబాటు తనం నిరూపించేందుకు అందుకు అవసరమైన శాసనాలు చేసుకోవాలి. ప్రజల అవగాహనా పెంచాలి.

2 comments:

  1. If backwardness(economical) is the basis of reservations, it can be extended to all those are backward irrespective of caste/ race/ religion.

    There is a need to form & nurture such vote banks.

    ReplyDelete