Pages

Thursday, May 10, 2012

పత్ర స్వేచ్చ- పుత్ర స్వేచ్చ!విషయాలు కలగాపులగమైపోయినప్పుడు వివాదాలు వికృతంగా తయారవుతాయి. వ్యక్తిగత వ్యూహాలు కీలకమైనప్పుడు వ్యవస్తాగత కోణాలు తారుమారవుతాయి. జగన్‌ మోహన రెడ్డి ఆక్రమాస్తుల కేసుగా పేరొందిన వ్యవహారంలో ఇప్పుడు సాగుతున్న తర్జనభర్జనలు అలాగే వున్నాయి. దీనిపై నన్ను వ్యాఖ్యానం కోరినప్పుడు మూడు ముక్కలు చెప్పాను- ఖాతాలు స్తంభింపచేయొచ్చు గాని జీతాలు స్తంభింపచేయకూడదు, పత్ర(పత్రికా) స్వేచ్చకు పుత్ర స్వేచ్చకు మధ్య చాలా తేడా వుంటుంది. ఈ ఘటన బ్లాక్‌ డేనా షాక్‌ డేనా అన్నది వారి వారి ధృక్కోణాలను బట్టి వుంటుంది.
ఇలాటిది జరుగుతుందని ఎప్పుడో వూహించామని స్వయానా జగన్‌ వ్యాఖ్యానించారు గనక ఇది అనూహ్య పరిణామం కాదని అనుకోవాలి. అంత ముందుగా వూహించిన వారు దానికి విరుగుడు కూడా వూహంచి వుంటారని మనం వూహించవచ్చు. అవన్నీ ఉద్యోగుల జీవన భద్రతకు అక్కరకు వస్తాయని ఆశించాలి. పిసిసి అద్యక్షులు బొత్స సత్యనారాయణ ఈ మేరకు భరోసా ఇస్తున్నారు గాని ఇప్పటి వరకూ ఈ కేసుతో తమకు సంబంధం లేదంటున్న కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం నేరుగా చేయగలిగిందేముంటుంది? ఇక మానవ హక్కుల సంఘం తన దగ్గరకు వచ్చిన విజ్ఞప్తికి సమాధానం ఇచ్చేందుకు నెల రోజుల వ్యవధి వరకూ ఇచ్చింది గనక మరీ తీవ్రంగా తీసుకోలేదని తెలుస్తుంది. న్యాయస్థానం కూడా కేసు విచారణ రేపటికి వాయిదా వేసింది గనక తక్షణ సమస్యగా పరిగణించలేదని అర్థమవుతుంది. జగన్‌ వ్యాపార సామ్రాజ్యం రాజకీయ యంత్రాంగం విస్తారమైంది గనక ఈ విషయంలో చట్టరీత్యా చేయగలిగినవన్నీ వారు చేస్తారనేది నిస్సందేహం. దానిపై న్యాయ స్థానాలు ఏం చేస్తాయనేది న్యాయమూర్తుల చిత్తం. మామూలు వాళ్లకు
గాని రాజకీయ పార్టీలకు గాని ఇందులో ఎలాటి పాత్ర వుండటానికి లేదు.
ఖాతాల స్తంభనకు ముందు రోజు జగన్‌కు కోర్టు సమన్ల వార్త ప్రముఖంగా వచ్చింది.దీన్ని మిగిలిన పత్రికలన్ని తీవ్ర రాజకీయ పరిణామంగా ఇస్తే వారి పత్రికలో మాత్రం కేవలం సాంకేతికమైందిగా, అభియోగపత్రంపై అభిప్రాయాలు తెలుసుకోవడానికి అందిన ఆహ్వానంగా రాసుకున్నారు. కాని మరురోజున ఖాతాల స్తంభన దగ్గర కొచ్చే సరికి మిగిలిన పత్రికలన్నిటికీ భిన్నంగా సాక్షి స్పందించి పత్రికా స్వేచ్చపై దాడిగా ఖండించింది. ఎన్నికల పర్యటనలో వున్న జగన్‌ కూడా ఇంచుమించు అలాగే స్పందించారు. అయితే ఆ క్రమంలో సిబిఐని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజకీయ పార్టీలను మాత్రమే గాక ఆంధ్రజ్యోతితో సహా రెండు పత్రికలను ఒక టీవీ ఛానెల్‌ను కూడా తెగనాడారు. పత్రికా స్వేచ్చ సిద్ధాంతం ప్రకారమైతే ఇలాటి దాడికి ఆస్కారముండదు. కాని మన రాష్ట్ర రాజకీయాలలో చాలా కాలంగా పార్టీలు మీడియా కుటుంబాలు సినిమాలు వ్యాపారాలు నేరాలు కోర్టులు దర్యాప్తులు అన్ని కలగలసి పోయిన కల్లోల స్థితి రీత్యా ఇది పెద్ద వింతేమీ కాదు. ఈ కక్ష సాధింపునకు రేపటి ఉప ఎన్నికల తీర్పుతో ప్రజలు సమాధానమిస్తారన్నట్టు ఆయన మాట్లాడారు. ఎన్నికల తీర్పు ఎవరు ఎంఎల్‌ఎ కావాలో చెబుతుంది తప్ప ఏ కేసు దర్యాప్తు ఎలా వుండాలో ఎవరిది ఏ మేరకు దోషమో నిర్ధారించేందుకు అక్కరకు రాదు.ఎన్నికల్లో ఘన విజయాలు సాధించినా అపరాధాలు మాఫీ అయిపోవని లాలూ యాదవ్‌, జయలలిత, ఎడ్యూరప్ప, చాలా ఏళ్ల కిందట ఆంతూలే, తాజాగా కనిమొళి తదితరుల ఉదంతాలు తెలియజేస్తున్నాయి. తనపై ఆరోపణలన్ని నిజం కాదని వాదించే హక్కు జగన్‌కు వుండొచ్చు గాని దాన్ని రాజకీయ సత్యంగా చెప్పేస్తే చెల్లెబాటు కాదు. చట్టం, ధర్మం, రాజకీయం ఇవన్నీ మూడు వేర్వేరు రంగాలు తప్ప దేన్ని ఏదీ మాఫీ చేయదు. కోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చిన ప్రజల తీర్పు రద్దు కానట్టే ప్రజల తీర్పు అనుకూలంగా వచ్చినా కోర్టు వ్యవహారాలు ఆగవు.ఈ ప్రాథమిక సత్యాన్ని ప్రతివారూ అంగీకరించాల్సిందే. ఒక వైపున విచారణకు పూర్తిగా సహకరిస్తామంటూ మరో వైపున దేన్ని అంటుకోకూడదు, అరెస్టు చేయకూడదు అంటే ఇక ఎవరిపైనైనా దర్యాప్తు ఎలా సాధ్యం?తమపై చర్యలకు వ్యతిరేకంగా గాని ఇతరులపై చర్యలు కోరుతూ గాని కోర్టులను ఎన్ని సార్లయినా ఆశ్రయించవచ్చు గాని ఎవరికి వారు క్లీన్‌ చిట్‌లు ఇచ్చేసుకుంటే కుదిరేపని కాదు.
సాక్షి ఖాతాల స్తంభన సందర్భంలో ఉద్యోగుల జీవితాలకు నష్టం కలగించకుండా చూడాలనేది ప్రతివారి కోర్కె. ఇందులో ఎలాటి తేడాలు లేవు. అయితే ఐజెయు కార్యదర్శి  అమర్‌, మాజీ సంపాదకుడు ఆ పత్రిక రచయిత అయిన ఎబికె ప్రసాద్‌ తదితరులు ఇది పత్రికా స్చేచ్చపై దాడి అంటున్నారు. ఏ ఇందిరమ్మ పేరిట అయితే వైఎస్‌ వుండగా ఈ ఛానెల్‌ ఎర్పాటైందో ఆ ఇందిరమ్మ విధించిన ఎమర్జన్సీ కన్నా అన్యాయమంటున్నారు. పత్రికలో వచ్చే వార్తలపైన గాని రాసిన పాత్రికేయులు సంపాదకుల పైన గాని వృత్తిపరంగా వార్తాపరంగా ఆంక్షలు విధించడం వేరు. ఆస్తుల పరంగా యాజమాన్యం వనరులను తాత్కాలికంగా పరిమితంగా నిలిపేయడం వేరు. భారత దేశంతో సహా అన్ని చోట్ల పత్రికలు కార్పొరేట్‌ యాజమాన్యాలలో వున్నప్పుడు వాటికి బహు ముఖ యాజమాన్య ప్రయోజనాలు ఆ క్రమంలో వచ్చే ఆర్థికమైన చట్టపరమైన వివాదాలు వుండొచ్చు. వీటన్నిటినీ పత్రికా స్వేచ్చతో ముడిపెట్టడం సాధ్యమా? అనేది లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న. గతంలో మార్గదర్శి వ్యవహారం వచ్చినపుడు యాజమాన్యం ఆర్థిక ప్రయోజనాలు పత్రికా వ్యవహారాలు వేర్వేరని నాటి ముఖ్యమంత్రిగా వైఎస్‌ వాదించారు. ఇదే గమనం శీర్షికలో నేనూ రాశాను.(2006,నవంబరు15). మీడియాను ఎవరూ నిష్కామకర్మగా నిర్వహించడం లేదని కూడా అందులో స్పష్టం చేశాను. సాక్ష్యాలు లక్ష్యాలు ఏమైనా అవి ఇప్పటికీ వర్తిస్తాయి. రాజకీయంగా వ్యతిరేకించడం, న్యాయపరంగా పోరాడ్డం వేరు గాని ఆక్రమాస్తుల కేసు దర్యాప్తును పత్రికా ప్రజాస్వామిక విలువలతో ముడిపెట్టి చూపడం వేరు.
దురదృష్టం ఏమిటంటే ఈ మొత్తం ఉదంతంలో మౌలికమైనన విధానపరమైన అంశాలు బొత్తిగా చర్చకు రాకపోవడం. జగన్‌ వ్యవహారం అన్నప్పుడల్లా రామోజీని లేదా చంద్రబాబును తెరపైకి తెచ్చి వాదించడం వైఎస్‌ ఆర్‌కాంగ్రెస్‌కు పరిపాటిగా మారింది. వారితో సహా ఎవరి గురించైనా విమర్శలు చేయొచ్చు గాని అది మరొకరికి సమర్థన ఎలా అవుతుంది?ఇప్పుడు దాఖలైన మూడో ఛార్జిషీటులో విశాఖ రాంకీ ఫార్మాసిటీ కోసం కేటాయించిన భూమిని రియల్‌ ఎస్టేట్‌ కింద అమ్మేసుకుని 133 కోట్లు సొమ్ము చేసుకున్నారని, అందులో పది కోట్లు ప్రతిఫలంగా పెట్టుబడి పెట్టారని పేర్కొన్నారు. గాలి జనార్థనరెడ్డి నిర్వాకం హత్య కన్నా తీవ్రమైన నేరమని న్యాయస్థానమే అభిశంసించింది. ఇలా ప్రజల ఆస్తులను ప్రకృతి వనరులను అప్పణంగా కట్టబెట్టిన విధానాలపై చర్చ జరక్కపోగా వ్యక్తిగత కోణాలే ప్రధానమవుతున్నాయి. పాలక కాంగ్రెస్‌ రాజకీయ గజిబిజి అస్తవ్యస్త పరిస్తితి దీన్ని మరింత అధ్వాన్నం చేస్తున్నాయి. ప్రభుత్వం వల్ల మేలు పొందడానికి సంబంధించిన క్విడ్‌ ప్రో కో సిద్ధాంతాన్ని ఆమోదించాలంటే జగన్‌తో పాటు నాటి ప్రభుత్వ నేతలను కూడా ముగ్గులోకి తీసుకురాకతప్పదు. అలాగే తనయుడితో పాటు తండ్రినీ ప్రస్తావించకతప్పదు. కాని తలకు ఏమీ కాకుండా పైనున్న ఫలానికి ఎక్కుపెట్టినట్టు వైఎస్‌ఆర్‌ను వదలి జగన్‌పైనే దాడి చేయాలనే విన్యాసం కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెడుతున్నది.ఈ క్రమంలో సిబిఐ వేగం, మందగమనం వంటి సందేహాలు కూడా కలుగుతున్నాయి.ఇలాటి చర్యలు కీడులో మేలులా పరిణమిస్తాయా అన్న సందేహం కూడా సర్కారీ నేతలకు వుంది. ఎలాగూ అనుకూల ఫలితాలు వుండవనే అంచనాతోనే ఇప్పుడు కొన్ని తీవ్ర చర్యలకు దిగినట్టు స్పష్టమవుతుంది గాని అసలు మలుపు మే 28న హాజరు కావాలని జగన్‌కు ఇచ్చిన సమన్లతో ముడిపడి వుంటుంది. ఈ లోగా ఎలాటి పరిణామాలైనా జరగొచ్చు.ఆ రోజునా న్యాయమూర్తి విచక్షణను బట్టి మరేదైనా జరగొచ్చు. జరిగేవన్నీ మంచికనో చెడ్డకనో అనుకోవడం కాదు కావలసింది- జరగాల్సినవి జరుగుతున్నాయా లేదా అనేదే ప్రశ్న. ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్నదానితో నిమిత్తం లేకుండా దర్యాప్తులు జరగాల్సిందే. నిజాలు జనాలకు తెలియాల్సిందే. వాటికి సమాంతరంగా ప్రభుత్వం అనుచితమైన భూ సంతర్పణలు కేటాయింపులు తక్షణం రద్దు చేయడానికి కూడా నడుం కట్టాలి. రాజకీయ లాభనష్టాల కన్నా రాష్ట్ర ప్రజల విశాల శ్రేయస్సు ముఖ్యమన్నది అందరూ అంగీకరిస్తే వ్యక్తిగత కోణాలకే పరిమితమై పోరు. అంత ఉదాత్తమైన అంశాలు ఈ సందర్భంలో లేవు కూడా.
ఆంధ్రజ్యోతి గమనం- మే10,2012

7 comments:

 1. పత్రికా స్వేచ్చ -
  సాక్షి నిర్వచనం - తన వాడు మాత్రమే మంచి వాడు అని చెప్పడం
  ఈనాడు నిర్వచనం - తన వ్యతిరేకి ప్రజల వ్యతిరేకి చెడ్డవాడు అని చెప్పడం

  ReplyDelete
 2. సాక్షి పత్రికలో రామోజీరావు గురించి వ్రాసేటప్పుడు "రావణోజీరావు" అని వ్రాసినది పత్రిక స్వేచ్ఛని ఉపయోగించుకునే కదా. మన దేశంలో పత్రిక స్వేచ్ఛ లేదంటారేమిటి సాక్షివాళ్ళు.

  ReplyDelete
 3. ఈనాడు నిర్వచనం - తన వ్యతిరేకి ప్రజల వ్యతిరేకి చెడ్డవాడు అని చెప్పడం

  Just like Hitler's Nazi isam

  ReplyDelete
 4. /ఇందిరమ్మ విధించిన ఎమర్జన్సీ కన్నా అన్యాయమంటున్నారు./

  చాలా బాగా చెప్పారు
  /వైఎస్‌ఆర్‌ను వదలి జగన్‌పైనే దాడి చేయాలనే విన్యాసం కాంగ్రెస్‌ను ఇరకాటంలో పెడుతున్నది./
  ఆవేశంతో కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది మరి. మెల్లిగా ఆచితూచి సిబీఇతో అడుగులేయించడానికి కారణం, జగన్ చేతిలో అధిష్టానం జుట్టు వుండటమే అనిపిస్తోంది. జగన్ మొండి ధైర్యానికి కారణం కూడా అదే అయ్యుంటుంది. జగన్ చేతిలో ఏయే ట్రంప్ కార్డ్లు వున్నాయో అని కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. నరాలు తెగే వుత్కంఠత. :)

  ReplyDelete
 5. జగన్ అక్రమాస్తుల కేసులో త్వరితంగా విచారణ జరిగి అతడు దోషి అని తేలితే కఠిన శిక్ష పడి తీరాల్సిందే. కాని ఈ కేసుల విషయంలో C B I తీరు చిత్రాతి చిత్రంగా ఉంది. రాజ శేఖర రెడ్డి ప్రబుత్వం వల్ల పొంద గూడని మేలు పొందిన లబ్దిదారులు జగన్ సంస్థలలో పెట్టు బడి పెట్టారన్నది ఆరోపణ.అటువంటప్పుడు మొదట రాజశేఖర రెడ్డి ప్రభుత్వం తప్పుని రుజువు చేయాలి. ఆ తరువాత ఆ లబ్ది దారులు పెట్టిన పెట్టుబడులకు ఉన్న లింకు (nexus) ని రుజువు చేయాలి.అట్లా కాకుండా గుఱ్ఱం ముందు బండిని కట్టినట్లుగా సాగిన సాగుతున్న విచారణ ఈ కేసులో CBI నిష్పాక్షికత శంకించబడేటట్టుగా ఉంది.ఇది ఆ సంస్థకు మచ్చ తెచ్చేదే.పత్రికా స్వేచ్ఛ గురించి-- పత్రికలకు సామాన్యుల కంటే అదనంగా స్వేఛ్ఛ ఉండాల్సిన పని లేదు. కాని పత్రిక నడవడానికి వీల్లేకుండా అకవుంట్లు ఫ్రీజ్ చేస్తే అది పత్రికా స్వేఛ్ఛకి ఆటంకమే. రామోజీ విషయంలో మార్గదర్శి మీద కేసు పెట్టినందుకే, ఈ నాడు పత్రిక నడవడానికి ఏ ఆటంకం కలిగించక పోయినా పత్రికా స్వేచ్ఛని హరించారని గగ్గోలు పెట్టిన వారు ( ప్రధాన ప్రతిపక్ష నేతా, ఆ రెండు పత్రికలూ) ఈ రోజు జరిగిన దానిని హర్షించడం చూస్తే వారి నిష్పాక్షికత బయట పడుతుంది. మరొక్క విషయం-- జగన్ పేపర్లో షేరుని 350 రూపాయలకు అమ్మడం వెనుక పెద్ద మతలబు ఉందన్న వారికి , రామోజీ 5 లక్షల పై చిలుకు ధరకి నష్టాల్లో ఉన్న కంపెనీ షేరుని ఎలా అమ్మగలిగాడని ఆశ్చర్యం కలుగక పోవడం వెనుక మతలబు ఏమిటి? ఈ విషయం గురించి మాట్లాడని వారి నిష్పాక్షికతని కూడా శంకించ వలసి వస్తుంది. అన్ని విషయాలలోసమగ్ర విచారణ జరిపి దోషుల్నందరిలీ కఠినంగా శిక్షించాలి. ఈ పని జరగడం లేదు. జగన్తో పాటు జైల్లో ఉండాల్సిన వారు చాలా మందే ఉన్నారని పిస్తోంది.

  ReplyDelete
 6. రవి గారు ఎప్పటిలాగే మీ శైలిలో చక్కగా చెప్పారు,
  కాని ఇంకా కొంతమంది ఎదుదాడి చేయడం మానలేదు. ఒక వేల CBI ముందు కొన్ని కేసుల్లో జరిగిన పొరపాట్లను సవరించుకొని ఇప్పుడు నిష్పాక్షికంగా దర్యాప్తు జరుపుతుంది అనుకుందాం.ఈ కేసు అయిన తరువాత లేదా ఈ ఎదురుదాడి సంఘం నాయకులూ అంతా కలసి ఇంతకుముందు ఏవైనా పొరపాట్లు జరిగిఉంటే వాటి మీద పోరాడాలి దానికి ప్రజాస్వామ్య వాదులు ప్రతి పౌరుడు తప్పక మద్దతు ఇస్తారు ఇవ్వాలి కూడా.ప్రజా దనాన్ని ఎవరు దోచుకొన్న వారికి శిక్ష పడాల్సిందే. అలాగాక ఇప్పుడు జరుగుతున్న విచారణను తప్పు అని చెప్పడం మాత్రం న్యాయం కాదనిపిస్తుంది.

  ReplyDelete
 7. గురూజీ, ఇంతకీ జగన్ అరెస్ట్ అవుతాడా లేదా ?

  ReplyDelete