Pages

Tuesday, May 15, 2012

ఆత్మ అడుగులు, మఠాధిపతులు ముఠాలు


పుట్టపర్తి సాయిబాబా ఆఖరి ఘట్టంలో ఆశ్రమ నిర్వాహకుల అనుమానాస్పద వ్యవహారాలు, ఆయన రక్త సంబంధీకుల ఆరోపణలు ప్రపంచమంతా చూసింది. అయినా ప్రభుత్వ పెద్దలు దానిపై నిజానిజాలు తేల్చాలని అనుకోలేదు. కాని బాబా లేని ప్రశాంతి నిలయానికి భక్తుల రాక తగ్గిపోవడం నిర్వాహకులను నిరుత్సాహం కలిగించడం సహజమే. ఆయన ప్రథమ వర్థంతి తర్వాత ఇప్పుడు మళ్లీ భక్త సందోహాన్ని ఆకట్టుకునేందుకు ఆత్మ కథ ఒకటి వచ్చింది.బాబా ఆత్మ తిరుగుతుందని అడుగులు పడ్డాయని అధికారికంగానే అనధికారిక సమాచారం అందించి ఆపైన విస్త్రత ప్రచారం కూడ కల్పించారు. బాబాను నమ్మడం వ్యక్తిగత విశ్వాసం అయినా ఆయన వున్నంత కాలం ఆయనే చూసుకునే వారనుకోవచ్చు. ఇప్పుడు ఆయన అస్తమయం తర్వాతనైనా ఆయన పేరిట సాగే ప్రహసనాలను జాగ్రత్తగా పరిశీలించి జనాన్ని మభ్యపెట్టకుండా చూడాల్సిన బాధ్యత అధికారులకు ప్రభుత్వానికి వుంది. పరమాత్మగా పూజలందిన వ్యక్తి ఆత్మ కావడం వారి నమ్మకాలకు కూడా విరుద్ధమైన విషయం. కోరికలు తీరని వారు ఆత్మలుగా పరిభ్రమిస్తారనేది ఒక మూఢ నమ్మకం. లేదా చాలా మంది చెప్పే నమ్మకం. కాని దైవాంశసంభూతుడుగా పూజలందుకున్న బాబాకు అదెలా వర్తిస్తుంది? పోనీ అనుకున్నా ఆత్మ అడుగులు పడేలా నడుస్తుందా? ఫోటోల నుంచి విభూతి రాల్చడానికి చాలా చిట్కాలున్నాయని జన విజ్ఞాన వేదిక వంటివి ప్రత్యక్షంగా చూపిస్తూనే వున్నాయి. కాని బాబా పునరుద్థానం పేరిట సాగే తతంగం విషయంలో భక్తులు బహుపరాక్‌! ఈ లోగా అఘోరాలో ఘోరాలో వచ్చారంటున్నారు గనక మరింత పరాక్‌.
ఇది ఇలా వుంటే కర్నూలు బాలసాయిబాబా ఆశ్రమం ఆయన లేక వెలవెలబోతున్నదంటూ కథనాలు. గత శివరాత్రి నాడు నోట్లో నుంచి లింగాలు తీస్తానన్న బాలబాబా నీళ్లు మింగుతూ బాగా ఒత్తిడికి గురవుతూ ఎలాగో అయిందనిపించిన ఉదంతం మీడియాలో అందరూ చూశారు. ఆర్థిక నేరాలు, ఆరోపణలు వగైరాల మధ్య పుట్టపర్తి బాబా మరణానంతరం కూడా పెద్ద ప్రభావం చూపలేకపోయినందునే బాలబాబా జెండా ఎత్తేస్తున్నారన్న కథనాలు కాదనడం కష్టమే.

ఇది ఇలా వుంటే నిత్యానందస్వామి నిస్సిగ్గుగా మరో పీఠం ఎక్కి కూచున్నాడు. ఆయన లీలలు రోత పుట్టించినా తనకు మాత్రం కాస్త సంకోచం లేకపోగా జుగుప్సాకరమైన చిరునవ్వులు చిందిస్తున్నాడు.ఆయన అధీనతా పీఠం చేజిక్కించుకోవడంపై పరమ పవిత్రమైనదిగా భావించబడే కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి(ఈయనా హత్య కేసులో అరెస్టయిన వారే) మిగిలిన స్వాములను కూడదీసి సవాలు చేస్తున్నారు. ఆధ్మాత్మిక నిలయాలు కావలసిన మఠాలు ఇలా ముఠాల కుమ్ములాటలకు దిగడం ఏ విలువలకు ప్రతీక భక్తులే ఆలోచించాలి మరి.

వివేకానందుడు ఏనాడో చెప్పినట్టు దైవ స్వరూపులమంటూ వూరేగే బూటకపు స్వాములు బాబాల పట్ల అప్రమత్తత భక్తులకే చాలా అవసరం. 

No comments:

Post a Comment