Pages

Thursday, June 7, 2012

పెరిగిన గందరగోళంఈ వారం రోజులలోనూ రాష్ట్ర దేశ రాజకీయాలలో అనేక విషయాలు స్పష్టంగా రుజువయ్యాయి.

1.జగన్‌ ను బెయిల్‌పై విడుదల చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారని సిబిఐ వాదిస్తే హైకోర్టు ఆమోదించింది. అయితే బెయిలుపై రానవసరం లేకుండా జైలులోనుంచే నేరుగా జడ్జిలనే తారుమారు చేసిన గాలి జనార్థనరెడ్డి కొత్త సంచలనం సృష్టించారు. తెలుగు దేశం న్యాయ స్థానాలను మేనేజ్‌ చేస్తుందని ఇంతకాలం ఆరోపిస్తూ వచ్చిన వైఎస్‌ఆర్‌ పార్టీ ఈ విషయమై పెద్దగా స్పందించక పోవడం విశేషం.
2.జగన్‌ మా పార్టీలో వుంటే కేంద్ర మంత్రి ముఖ్యమంత్రి అయ్యేవాడని నోరు జారిన కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌ తర్వాత వివరణ పేరుతో సవరణ జారీ చేశారు.అయితే ఇదంతా కాంగ్రెస్‌లో నెలకొన్న అయోమయానికి అద్దం పట్టింది. చాలా వరకూ విజయమ్మ షర్మిల ప్రచారంలో కూడా సోనియా మాట విననందుకే కక్ష సాధిస్తున్నారన్న మాట వినిపిస్తోంది.అయితే 2 జి స్పెక్ట్రంలో రాజా కనిమొళి గాని, ఇతరులు గాని సోనియా గాంధీ కాపాడాలని చూసినా జైలుకు వెళ్లాల్సి వచ్చిందని ఉభయులూ మర్చిపోతున్నారు. ఆఖరకు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌పైనే అన్నా బృందం ఆరోపణలు సంధిస్తే సోనియా రంగంలోకి దిగి సమర్థించాల్సి వచ్చింది. కాకుంటే అన్నా బృందాన్ని మరుసటి రోజునే బిజెపి అద్యక్షుడు నితిన్‌ గడ్కరీ పరామర్శించడం వల్ల వారికి కాస్త రాజకీయ నేపథ్యం కాస్త బయిటపడినట్టయింది.ఇదే సమయంలో కేజ్రీవాల్‌ రామ్‌దేవ్‌ రణాలు రాజీలు కూడా. అన్నా బృందం బిజెపి వారి పేర్లు చెప్పడం లేదన్న విమర్శలు ఒక పక్క వస్తుంటే మరో పక్క సాక్షాత్తూ అద్వానీనే తమ వ్యవహారాలు బాగా లేవని ఒప్పుకోవలసిన స్థితి. యుపిఎ ఎన్‌డిఎ పోటీ పడుతున్నట్టు అనిపిస్తుంది. కనక అవినీతిని ఎవరూ కప్పిపుచ్చలేరు, కాపాడలేరు
3.మోపిదేవి వెంకట రమణ తర్వాత ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్యను సిబిఐ విచారించడం మంత్రులకు ఆందోళన పెంచడంలో అశ్చర్యం లేదు.ప్రస్తుతం పొన్నాలను ఇండియా సిమెంట్స్‌కు అదనంగా నీటి సరఫరా విషయంలోనే ప్రశ్నించినా రేపు జలయజ్ఞం అడ్వాన్సుల సంగతి వస్తే మరింత ఇరకాటం కావచ్చు.
4.జగన్‌ అరెస్టు తర్వాత కొన్ని చోట్ల ఆయన పార్టీ ప్రభావంలో తగ్గుదల వుందని వివిధ ఛానళ్ల వర్గాల సర్వేలలో తెలుస్తున్నది.తెలుగు దేశంలో కాస్త ఆశలు చిగురిస్తున్నా చంద్రబాబు నాయుడు తప్ప మరెవరూ ప్రచారం చేయలేకపోతున్నారన్న విమర్శ వుంది. విశ్వసనీయత కావలసినంత పెరగడం లేదన్న దిగులూ వుంది.
5.వరంగల్‌ జిల్లా పరకాలలో బిజెపి టిఆర్‌ఎస్‌లు పరస్పరం వాగ్యుద్ధాలు సాగిస్తున్న తీరు చూస్తే మొన్నటి వరకూ చెట్టపట్టాలు వేసుకున్న పార్టీలు ఇవేనా అని సందేహం కలుగుతుంది. మహబూబ్‌నగర్‌ విజయంతోనే బిజెపి అతిగా అంచనా వేసుకుంటుందని మాత్రం అనిపిస్తుంది. కారణం ఏదైనా టిఆర్‌ఎస్‌ బిజెపి మత రాజకీయాలను నేరుగా విమర్శించడం మరో విశేషం. రాజకీయ ప్రయోజనాల ఘర్షణ వచ్చాక రాష్ట్ర విభజన అజెండా వెనక్కు పోయి పరస్పర విభేదాలే ప్రధానం కావడం స్పష్టం. సర్వేలు మాత్రం టిఆర్‌ఎస్‌కే మొగ్గు చూపిస్తున్నాయి.
6.పశ్చిమ బెంగాల్‌లో అరు మునిసిపాలిటీలకు జరిగిన ఎన్నికలలో నాలుగు పాలక తృణమూల్‌ గెల్చుకున్నా హాల్దియా సిపిఎం నిలబెట్టుకోవడంలో ఒక విశేషం వుంది. వామపక్ష ప్రభుత్వంపై దుమారం మొదలైన నందిగ్రామ్‌ ప్రాంతంలో సిపిఎం ఈ విజయం సాధించడమే ఆ ప్రత్యేకత. ఇప్పటికీ టిఎం సి ఆధిక్యత వున్నా కాంగ్రెస్‌ను కూడా త్వరితంగా దూరం చేసుకుంటున్న తీరు దానికి నష్టం చేస్తుందని విమర్శకులు అంటున్నారు.

No comments:

Post a Comment