Pages

Friday, June 29, 2012

నాయకత్వ మార్పు కథనాలకు కారకులెవరు?




మీరు కోరుకుంటున్నట్లుగా (నాయకత్వ మార్పు) జరగదు అని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి మీడియా ప్రతినిధులతో అన్నారు.నిజానికి మీడియాకు అలాటి కథనాలు ఇస్తున్న వారు కాంగ్రెస్‌ నేతలే.ఎవరో ఎందుకు? పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ స్వయంగా చేసిన వ్యాఖ్యలు ఏమి చెబుతున్నాయి?గురువారం సాయింత్రం లోకేష్‌ వారసత్వ నాయకత్వ స్వీకరణపై చర్చకు టీవీ9లో వుండగా నేటి మాటలో బొత్స వ్యాఖ్యలు విన్నాను.వాటిని నిశితంగా గమనిస్తే చాలా అర్థం వుంది. తర్వాత దానిపైనా చర్చించాల్సి వచ్చింది. లిక్కర్‌ వ్యాపారులపై దాడులలో విమర్శలను ఎదుర్కొన్న బొత్స తనకు 'అవకాశం వస్తే' మధ్య నిషేదం విధిస్తానని అన్నారు. ఒక్కదెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా వున్నాయీ వ్కాఖ్యలు. మొదటిది మద్యం వ్యాపారంతో సంబంధం వుందన్న ఆరోపణలకు సమాధానంగా నిషేదంగురించి చెప్పడం. అయితే తనకు అవకాశం వస్తే చేస్తానని చెప్పడం ద్వారా అధికారం అప్పగిస్తే చేస్తానని సూచించడం. 'ఇప్పుడు పిసిసి అద్యక్షుడుగా వున్నాను.రేపు ఏదైన అవకాశం వస్తే అందరినీ ఒప్పించి అధిష్టానంతో మాట్లాడి మద్య నిషేదానికి కృషి చేస్తాను' ఇవి బొత్స మాటలు. ఈ మాటలలో ఏమైనా అస్పష్టత వుందా? బహుశా కిరణ్‌ జవాబు బొత్సను ఉద్దేశించినదై వుండొచ్చు. చిరంజీవి అర్హత గురించి జోగి రమేష్‌ అంతకు ముందే చెప్పారు. అభిమానంతో అన్నాడని మెగాస్టార్‌ సమర్థించారు. జెసి దివాకర రెడ్డి, శంకర రావు వంటి వారు అంతకు ముందే వ్యాఖ్యానించారు. టికాంగ్రెస్‌ నేతలు కొందరు తీవ్రమైన విమర్శలే చేశారు.ఇవన్నీ తమ వారి నుంచే జరిగిపోతుంటే
ముఖ్యమంత్రి మీడియా కోరుకుంటున్నదని అనడం విడ్డూరమే.ఇంతకూ ఆ అవకాశం చాలా వుందనే కాంగ్రెస్‌ నేతలంటున్నారు. ఎప్పుడు ఎలా ఎవరు అన్నవే ప్రశ్నలు. ఈ సారి మారిస్తే తెలంగాణా ప్రాంత నాయకుడిని తీసుకోవాల్సిందే గనక సామాజిక కోణం కూడా కలసి వచ్చే దామోదర నరసింహ, జానారెడ్డి, అప్పుడప్పుడూ జైపాల్‌ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.డి.శ్రీనివాస్‌ పేరు వున్నా ఎన్నికల్లో తిరస్కరణకు గురైనందున బాగుండదని ఒక వాదన.విచిత్రంగా కాంగ్రెస్‌ తరపున మాట్లాడే ఒక నాయకుడు కొద్ది రోజుల కిందట కబుర్లలో మర్రి శశిధర రెడ్డి కూడా అధిష్టానం దృష్టిలో వున్నాడంటూ ఏదో తర్కం చెప్పారు. నిజంగానే శుక్రవారం పత్రికల్లో ఆ పేరు కూడ కనిపించింది! ఇంకో తమాషా ఏమంటే ప్రతిపక్ష తెలుగు దేశం ప్రతినిధులు ముఖ్యమంత్రి మారడంటే మారడని నొక్కి వక్కాణించడం. ఇవన్నీ చూస్తుంటే ఏదో మార్పు జరిగినా జరగొచ్చనిపిస్తుంది. మంత్రుల అరెస్టులు విచారణల తర్వాత ఏదో ఒక పునర్యవస్థీకరణైతే తప్పదు గనక అప్పుడు ముఖ్యమంత్రిని కూడా ముగ్గులోకి తేకుండా వుంటారా అన్నది ప్రశ్న.

No comments:

Post a Comment