Pages

Friday, June 29, 2012

రాష్ట్ర భవిష్యత్తుపై కొత్త నాటకం?



మహారాష్ట్ర ఎన్నికల తర్వాత- సోనియా గాంధీ విదేశాల నుంచి వచ్చిన తర్వాత- ఉప ఎన్నికల తర్వాత- రంజాన్‌ తర్వాత ఇలా రాష్ట్ర భవిష్యత్తుపై నిర్ణయం వాయిదా వేయడానికి కేంద్రం రకరకాల కారణాలు చూపిస్తూ వచ్చింది.ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నిక తర్వాత పరిష్కారం చెప్పేస్తామన్నట్టు మాట్లాడుతున్నారు. అందరినీ సంప్రదించాలని చెప్పే హౌం మంత్రి చిదంబరం కూడా సాధ్యమైనంత త్వరలో నిర్ణయం తీసుకోవాలని ప్రకటించారు. మూడు మాసాల్లో తెలంగాణా ఏర్పాటు జరిగిపోతుందని తాము చేసిన ప్రకటన నిజమనడానికి ఇది నిదర్శనమని టిఆర్‌ఎస్‌ నాయకులు లేదా ఇతర పార్టీల తెలంగాణా నాయకులు కొందరు అప్పుడే అంటున్నారు.మొన్నటి ఉప ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌కు మరో గత్యంతరం లేదని కూడా వారు ముక్తాయిస్తున్నారు.నిజానిక ఉప ఎన్నికల వెను వెంటనే ఈ అస్త్రంబయిటకు తీస్తారని నేను బ్లాగులో ఇది వరకే రాసిన సంగతి మిత్రులకు తెలుసు. అయితే ఇప్పుడు నడుస్తున్న నాటకం అంతకంటే రసవత్తరంగా వుంది. కేవలం తెలంగాణా నాయకులు మాట్లాడ్డమే కాదు- వారికంటే ముందే ఇతర ప్రాంతాల నేతలు నిరసన స్వరాలు వినిపించడం మొదలెట్టారు. లగడపాటితో మొదలైన ఈ దుమారం టిజివెంకటేష్‌, ఏరాసు ప్రతాపరెడ్డి వంటి మంత్రుల మాటలతో మరింత తీవ్రమైంది. రాయల తెలంగాణా అనీ, రాయలసీమలో కర్నూలు అనంతపురం జిల్లాలను కలిపి ఇస్తారని ఇలా రకరకాల కథనాలకు కాంగ్రెస్‌ నేతలే వూతమిస్తున్నారు.మరో వైపున
టిఆర్‌ఎస్‌ను విలీనం చేసుకోవడం తథ్యమని కూడా ప్రచారం చేస్తున్నారు.విభజనకు అంగీకరిస్తే ఏదైనా పరిశీలిస్తామని చర్చిస్తామని టిఆర్‌ఎస్‌ నేతలు చెబుతున్నారు. హైదరాబాదుతో కూడిన తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేస్తామంటే దేన్నయినా చర్చిస్తామని, మరీ తప్పనిసరైతే ఆ రెండు జిల్లాలను కలుపుకోవడానికి కూడా వెనుకాడబోమని ఒక ముఖ్యమైన టిఆర్‌ఎస్‌ నేత చర్చల మధ్య బ్రేక్‌లో నాతో అన్నారు.మాది తెలంగాణా ఏకైక అజెండాగా వున్న పార్టీ గనక అందుకు అంగీకరిస్తే విలీనం కూడా పరిశీలించడానికి సిద్ధమేనని ఆయన చాలా కాలం కిందట కూడా ఒకసారి చెప్పారు.ఎటొచ్చీ కాంగ్రెస్‌ రాజకీయ మాయాజాలంలో ఇవన్నీ తీవ్రమైన ప్రతిపాదనలా అన్న సందేహం ఆయనకూ వుంది.ఇప్పుడైతే రాష్ట్రపతి ఎన్నిక కోసం తాత్కాలికంగా పల్లవి మార్చారన్నది స్పష్టం.వచ్చే ఎన్నికలకు ముందు ఏ వాగ్దానం చేసినా దానికి పెద్ద ఆచరణాత్మక విలువ వుండదు.కనక కాంగ్రెస్‌ పార్టీ, కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాన్ని ఒకటిగా వుంచుతారో విభజించుతారో దానిపై తమ ఆలోచనలు ప్రతిపాదనలు పారదర్శకంగా త్వరితంగా ప్రజల ముందుంచితే ఈ సుదీర్ఘ అనిశ్చితి కాస్తయినా సడలిపోతుంది. లేకపోతే ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజలకే గాక అధికార పక్షానికి కూడా నష్టం అనివార్యం. అలాటి స్పష్టమైన విశ్వసనీయమైన ప్రకటనలేమీ లేవు గనకే నా వరకు నేను కేంద్రం ఏదో తీవ్రంగా ఆలోచిస్తుందని గాని ప్రకటిస్తుందని గాని అనుకోలేకపోతున్నాను.

No comments:

Post a Comment