Pages

Tuesday, June 12, 2012

ఉధృత పోలింగ్‌: ఫలితాలపై వూహలు


దేశాన్ని రాష్ట్రాన్ని కూడా ఆకర్షించిన అనవసర ఉప ఎన్నికల పోలింగ్‌ తతంగం ముగిసింది. జగన్‌ను అరెస్టు చేసిన తర్వాత పరిణామాలు చాలా భీకరంగా వుంటాయన్నట్టు ఆయన ఇతరులు కూడా పరస్పరం ఆరోపణలు చేసుకున్నప్పటికీ ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజానీకం అలాటి వాటికి ఆస్కారం లేకుండా శాంతిని కాపాడుకోవడం అభినందనీయం. నిజానికి ఎన్నికల ప్రచారంలోనూ ప్రధానమైన మూడు పార్టీల నేతలు బాధ్యతా రహితంగా ఆరోపణలు గుప్పించుకున్నారు.జగన్‌ పార్టీ వారైతే ఆయన అరెస్టుతో పాటు రాజశేఖర రెడ్డి మరణాన్ని కూడా ఎన్నికల సమస్యగా మార్చేందుకు యత్నించారు. అయినా ప్రజలు సంయమనం పాటించడం వారి చైతన్యానికి సంకేతం. పోలింగ్‌ పూర్తి అయ్యీకాకముందే కాంగ్రెస్‌ ఎంపిల లగడపాటి రాజగోపాల్‌ తనవైన సర్వేలతో ముందుకొచ్చారు. కొన్ని ఇంగ్లీషు ఛానళ్ల సర్వేలు కూడా వచ్చాయి.ఇవన్నీ వూహించినట్టే వైఎస్‌ఆర్‌పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయని చెబుతున్నాయి.అదే జరుగుతుందన్న భావన సర్వత్రా వ్యాపించి వుంది.అయితే ఈ పరిస్థితి ఈ ఉప ఎన్నికల రంగానికి సంబంధించిందే తప్ప దీర్ఘ కాలం ఇదే వాతావరణం వుంటుందని చెప్పడానికి లేదు. అయితే పాలక కాంగ్రెస్‌ అంతర్గత కలహాల తాకిడికి గురి కావడం,తెలుగు దేశంలోనూ కొన్ని తీవ్ర పరిణామాలు సంభవించడం సాధ్యమే. అదే సమయంలో జగన్‌ జైలులో వుండగా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ కూడా తన వూపు ఏ మేరకు నిలబెట్టుకోగలుగుతుందన్న ప్రశ్న కూడా విస్మరించరానిది. ఎందుకంటే విజయమ్మ షర్మిల ప్రచారాల ప్రభావం తాత్కాలికమే తప్ప నిలకడగా వుంటుందని ఆ పార్టీ వారే అనుకోవడం లేదు. ఉప ఎన్నికల వెనువెంటనే ఉధృతంగా వలసలు జరక్క పోతే ఆ తర్వాత కొంత కాలం స్తబ్దత అనివార్యం.ఈ లోగా రాజకీయాలను తెలంగాణా సమస్యపైకి మరల్చడానికి అన్ని శక్తులూ రంగంలోకి దిగనున్నాయి.

No comments:

Post a Comment