Pages

Thursday, December 27, 2012

ఐనను పోయిరావలయు హస్తినకు...ఐనను పోయిరావలయు హస్తిన, కచ్చటి సంధిమాటలె
ట్లైనను,శత్రురాజుల బలాబల సంపద జూడవచ్చు, మీ
మానసమందుగల్గు ననుమానము తీర్పగవచ్చు, తత్సమా
ధానము మీ విధానమును తాతయు ఒజ్జయు విందులెల్లరున్‌

ే తరచూ వినిపించే ఈ పాండవోద్యోగ విజయాల పద్యం ఇప్పుడు ఢిల్లీలో తెలంగాణా సమస్యపై జరిగే అఖిలపక్ష సమావేశానికి అచ్చంగా సరిపోతుంది. సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్రమే దానికి ఎలాటి ప్రాధాన్యత లేదన్నట్టు మాట్లాడింది. హౌం మంత్రి షిండే ప్రకటనే ఆలస్యంగా స్పష్టత లేకుండా ఇచ్చారు.మరుసటి రోజునే గులాం నబీ ఆజాద్‌ హైదరాబాద్‌ వచ్చి కేవలం కొత్తగా శాఖ చేపట్టిన షిండే అవగాహన కోసమే అఖిలపక్షం అని తేలికచేశారు. ప్రత్యేకంగా లేఖ రాసి స్పష్టత ఇస్తామన్న తెలుగు దేశం ఆ లేఖలో అఖిలపక్షం వేస్తే చెబుతామని చెప్పి సరిపెట్టింది. అయతే ఆ లేఖ తమకు అందలేదని చప్పరించిన షిండే ఎంపిలు( నిజానికి తమ పార్టీ వారు) సూచించిన మేరకు అఖిలపక్ష సమావేశం నిర్వహించుతున్నట్టు లేఖలో రాశారు. ఆ సూచన ఎప్పుడు చేసిందీ అంటే ఎఫ్‌డిఐ ఓటింగులో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా వున్నప్పుడు! అధిష్టానంపై వత్తిడి పెట్టి ఏదో ప్రకటన తెప్పిస్తామన్న వారు ఆఖరుకు సాధించిందేమిటంటే నిర్దిష్ట అజెండా లేని అఖిలపక్షం. సమావేశం జరిపితే చెప్పేస్తామన్న ప్రతిపక్షం చెప్పేదేమంటే వారు చెబితే మేము చెబుతామన్న దాట వేత. ఈ ఇద్దరి మధ్య అసలు ఆ వూసే మాట్లాడని మూడో పక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌.
ే మొత్తంపైన ఇప్పుడు పాలిస్తున్న పార్టీ బాధ్యతారాహిత్యం ఒకటైతే గతంలో పాలించి మళ్లీ పాలించాలనుకుంటున్న పార్టీ, మేమే పాలనకు వస్తామంటున్న పార్టీ కూడా దాగుడు మూతలతో కాలం గడిపేశాయి. 28వ తేదీ ముంగిట్లోకి వచ్చి నిలబడినా సమావేశానికి ఎవరు వెళ్తారన్నది గాని వెళ్లిన వారు ఏమి చెబుతారన్నది గాని బయిటపెట్టడం లేదు. పారదర్శకంగా ప్రజాస్వామికంగా నడవాల్సిన రాజకీయ ప్రక్రియ ఈ విధంగా సస్పెన్స్‌ చిత్రంలాగా మారిపోయిందంటే అందుకు అవకాశవాదం తప్ప మరో కారణం లేదు. మా నిర్ణయమే
కీలకమైనప్పుడు మేమెలా ముందు మా అభిప్రాయం చెబుతామని కాంగ్రెస్‌, వారు చెప్పకుండా మాతో చెప్పించి చిక్కుల్లో పెట్టాలని చూస్తున్నారని తెలుగు దేశం, రాజకీయ ప్రధానమైన వ్యాఖ్యలతో వైఎస్‌ఆర్‌సీపీ కాలం గడుపుతున్నాయి. మా అభిప్రాయం చెప్పేప్రసక్తి లేదని పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణ మొదట్లోనే అన్నారు. తర్వాత పరిపరివిధాలుగా మాట్లాడి ఇప్పుడు వ్యక్తిగతంగా తాను సమైక్యవాదినేనని అయితే రెండు రాష్ట్రాలుంటే తప్పేమిటని గజిబిజిగా మాట్లాడుతున్నారు. జెసి దివాకరరెడ్డి వంటి వారు రాయలసీమ వాదం చేస్తుంటే తెలంగాణా ఎంపిలు తమ ప్రాంతం వాదన వినిపిస్తున్నామంటూ అనేక రకాల విన్యాసాలు చేస్తూనే అంతిమంగా అధిష్టానానికి విధేయత చాటుకుంటూ అధికారాన్ని కాపాడుకుంటున్నారు. ఇది స్థూలంగా కాంగ్రెస్‌ వ్యవహారం.
ే తెలుగు దేశం సంగతి కూడా పెద్ద భిన్నంగా లేదు. కాకపోతే అధికారంలో లేకపోవడం వల్ల, టిఆర్‌ఎస్‌ దాడి దానిపై కేంద్రీకరించబడటం వల్ల కొంత ఆత్మరక్షణ కొంత అసహనం కనిపిస్తుంటాయి. కాంగ్రెస్‌ ధోరణిని ఎండగట్టి తాను సూటిగా పరిష్కారం సూచించే బదులు తెలుగు దేశం కాంగ్రెస్‌ను మించిన సంక్షోభంలో కూరుకుపోయింది. మిగిలిన వారు తమను దెబ్బ తీయాలని చూస్తున్నారని ఆరోపించడం ఆ పార్టీ నేతలకు పరిపాటి అయింది. కాంగ్రెస్‌, జగన్‌ పారీÊ,టిఆర్‌ఎస్‌లు తెలుగు దేశంకు వ్యతిరేకంగా గాక అనుకూలంగా ఎందుకు వ్యవహరిస్తాయి? రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీలు దెబ్బ తీసేందుకు ప్రయత్నించడంలో పెద్ద ఆశ్చర్యం ఏముంది? దాన్ని కారణంగా చూపి తాము విధాన ప్రకటన చేయకుండా దాటవేయడం ఎలాటి బాధ్యత? పోనీ అదైన ఖచ్చితంగా చెప్పకుండా ఏదో చెప్పినట్టు చేయడం వల్ల ప్రయోజనమేమిటి? ఎన్నికల ముందే గాక తర్వాత అఖిలపక్ష సమావేశంలోనూ తెలంగాణా రాష్ట్ర విభజనకు అనుకూలంగా మాట్లాడిన వారు తర్వాత తమ వైఖరి మార్చుకోవడానికి గల కారణాలు లేదా మార్చుకోలేదన్న స్పష్టీకరణలు ఇవ్వాల్సిన అవసరం లేదా? ఆ పని చేయకుండా ఎప్పుడో ప్రణబ్‌ ముఖర్జీ కమిటీకి ఇచ్చిన లేఖ గురించే అదేపనిగా మాట్టాడ్డం వల్ల ఫలితమేముంటుంది? చాలా కాలం పాటు కాంగ్రెస్‌లాగే తెలుగు దేశం నాయకులు కూడా రెండు చోట్ల రెండు రకాలుగా మాట్లాడలేదా?ఇప్పుడైనా నిగూఢ నిశ్శబ్దం తప్ప విశ్వసనీయంగా మాట్లాడలేకపోతున్నారు. సుజనా చౌదరి తదితరుల విషయంలో తీవ్ర స్వరం వినిపించి తర్వాత సర్దుకున్న నాయకులే ఇప్పుడు కూడా ఏదో చేయబోతున్నామన్న భావన కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు. కాని చివరకు వచ్చేసరికి కాంగ్రెస్‌ చెప్పకపోతే మేము ఎందుకు చెబుతాం అని ఎదురు ప్రశ్న వేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తుంటే ఆఖరు వరకూ అలా అస్పష్టంగా అట్టి పెట్టి ఆ రోజున ఎలాగో దాటేసే పద్ధతిని అనుసరించాలని భావిస్తున్నట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్‌ను అడగడం బాగానే వుంది గాని తాము చెప్పకుండా అడగడంలో ఔచిత్యం గాని విశ్వసనీయత గాని ఎవరూ సమర్థించరు.
ే తెలంగాణా ప్రాంతంలో బలం పుంజుకుంటున్నామని రాబోయే ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుస్తామని చెబుతున్న జగన్‌ పార్టీ అసలు సమస్యపై ఇంత వరకూ మాట్లాడింది లేదు.కడప ప్లీనంలో ఏదో ప్రకటన చేశామంటుంటారు గాని అలాటిదేమీ లేదు. వారు గత సమావేశాలకు హాజరైందీ లేదు గనక మొదటి సారి ఇప్పుడే చెప్పడమవుతుంది. సామాజిక సమీకరణల ప్రాతిపదికన, టిఆర్‌ఎస్‌ వ్యతిరేకుల వేదికగా తాము బలపడుతున్నామనేది వారి ప్రధాన కథనం. కొండా సురేఖ పరకాల ఉప ఎన్నికల్లో గణనీయంగా ఓట్టు తెచ్చుకోవడం, కొందరు కాంగ్రెస్‌ తెలుగు దేశం నేతలు తమవైపు రావడం ఇందుకు ఉదాహరణ అంటున్నారు. టిఆర్‌ఎస్‌ కూడా క్రమేణా తన విమర్శలు దాడులు తెలుగుదేశం పై కన్నా జగన్‌పార్టీ వైపు మళ్లించడం ప్రత్యక్ష ఘర్షణలు ఇటీవల చూశాం. వైఎస్‌ హయాంలో తెలంగాణాలో ఎక్కువ స్థానాలు వచ్చాయనేది వారి వాదన కాని అందుకు అనేక కారణాలున్నాయి. ఓట్ల చీలిక, మొదటి దశ ఎన్నికల్లో ఆయన అనుకూలంగా భ్రమ కలిగించే రీతిలో మాట్లాడ్డం ఇందుకు కారణాలు. అయితే మలిదశ మొదలైన మొదటి రోజునే కెసిఆర్‌ గెలిస్తే తెలంగాణాలోకి వీసా సుకోవాలంటూ చేసిన వ్యాఖ్య ముఖ్యమంత్రి స్థాయికి తగనివిగానూ వైఎస్‌ నాయకత్వానికి శాశ్వత కళంకంగానూ మిగిలిపోయాయి. కెసిఆర్‌ గెలిస్తే అని తాను చెప్పానని ఆయన సవరణ చేశారు గాని నిజానికి ప్రాంతీయ కోణంలోనే ఆ మాటలు వాడారన్నది స్పష్టం.
ే 1999 లో టిఆర్‌ఎస్‌ ఇంకా ఏర్పడక ముందే సీఎల్పీ నేతగా తెలంగాణా ఎంఎల్‌లతో ప్రత్యేక రాష్ట్రం కోసం సోనియాకు మెమోరాండం ఇప్పించిన వైఎస్‌ ఇలా మాట్లాడ్డం ద్వారా తీవ్ర విమర్శకు గురైనారు. అయితే ఆయన మరణానంతరం జగన్‌ తిరుగుబాటు కారణంగా టిఆర్‌ఎస్‌ చాలా కాలం అక్కడ వారు ఇక్కడ మేము అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చింది. అక్కడ నుంచి ఇక్కడ కూడా పాగా వేసేం అవకాశాలు కనిపించగానే విమర్శల స్వరం పెంచింది. జగన్‌ ముఖ్యమంత్రి అయితే తెలంగాణా కొల్లగొడతారన్నట్టు కెసిఆర్‌ ఇటీవలే వ్యాఖ్యానించారు. ఇదంతా ఎన్నికల విమర్శల పర్వం తప్ప రాజకీయంగా లోతైంది కాదు. తెలంగాణాలో ఎక్కువ స్థానాలు తెచ్చుకోవడమే టిఆర్‌ఎస్‌ వ్యూహాత్మక లక్ష ్యం గనక అందుకు ఆటంకంగా కనిపించే జగన్‌ పార్టీపైనా విమర్శలు చేస్తున్నది.అయితే కాంగ్రెస్‌తో విలీనం వరకూ సంసిద్ధత ప్రకటించడం అక్కడ వారు ఇక్కడ మేము అన్నట్టు మాట్లాడి ఇప్పుడు విమర్శలు చేయడం టిఆర్‌ఎస్‌పై ప్రతివిమర్శల జోరును తగ్గించలేకపోయాయి. అఖిల పక్ష సమావేశం విషయంలోనూ మొదట పూర్తిగా అపహాస్యం చేసి తర్వాత తెలుగు దేశం అద్యక్షుడే హాజరు కావాలని, అంతా అక్కడే తేలిపోవాలని తీవ్ర స్వరంతో మాట్లాడ్డం అస్తిమిత వ్యవహారంగానే కనిపిస్తుంది.2014 ఎన్నికలతో తేల్చుకోవాలి తప్ప ఈ సమావేశానికి ఏ ప్రాధాన్యత లేదన్నప్పుడు ఎందుకు ఈ షరతులు పర్వం అన్న ప్రశ్నకు సరైన మాధానం లేదు. హాజరయ్యే ప్రతినిధుల విషయంలోనూ మొదట కోదండరాంను తీసుకు వెళ్లాలని భావించిన కెసిఆర్‌ వూహించినట్టే జెఎసిలోని ఇతర భాగస్వామ్యపార్టీల విమర్శల తర్వాత వెనక్కుతగ్గి నాయని నరసింహారెడ్డిని వెంటపెట్టుకుని వెళ్లడం తెలంగాణా వుద్యమంలో రాజకీయ విభేదాలను వెల్లడిస్తున్నది.
ే సిపిఐ, బిజెపి ఇప్పటికే తెలంగాణా విభజనకు అనుకూలంగా వైఖరి తీసుకున్నాయి. మజ్లిస్‌ విభజన వద్దనే అంటూ హైదరాబాదు కలసి వచ్చేలా కొన్ని ప్రతిపాదనలు చేస్తుంటుంది. ఇప్పుడు కూడా వారు ప్రకటించిన ప్రతినిధుల వివరాలు, ప్రకటనల తీరు ఆ దిశలోనే వున్నాయి.
ే తన వైఖరి అందరికన్నా ముందే స్పష్టంగానూ సూటిగానూ ప్రకటించిన సిపిఎం ఈ సారి సమావేశానికి ముందే లేఖ రాయడం మిగిలిన పార్టీలకు కూడా ఒక మార్గం కనుగొనేందుకు దోహదకారి అయింది. ఇతర విమర్శలు ఎలా వున్నా ముందు నిర్దిష్ట ప్రతిపాదనతో రావలసింది కేంద్రమేనని సిపిఎం తేల్చిచెప్పింది.అదే సమయంలో సమైక్యంగా వుండాలన్న తన వైఖరిలో ఎలాటి మార్పులేదని కూడా తేల్చిచెప్పింది. వివిధ పార్టీల విన్యాసాలను గమనించిన తర్వాత స్పష్టమైన విధానం వున్న తాను హాజరు కావడం అవసరమని భావంచి ప్రతినిధులను ప్రకటించింది. గతంలో హాజరైన రాఘవులు, జూలకంటి రంగారెద్డి ఈ సారి కూడా హాజరై అదే విషయం స్పష్టం చేయొచ్చు. కాని మొదట్లో అఖిలపక్షంపై తలపట్టుకుని కూచున్న పార్టీల నేతలు కాంగ్రెస్‌ను కేంద్రాన్ని నిలదీయడమే కీలకమనే వరకు అవగాహనకు రావడం ఒక మలుపు. తాము ఏమీచెప్పడం జరగదని ఆ పార్టీ కేంద్ర రాష్ట్ర నాయకులు చెప్పేశారు గనక కథ మళ్లీ మొదటే వుంటుంది. కాకపోతే మొదటి అఖిలపక్షం తర్వాత నియమితమై రెండవ అఖిలపక్షంలో నివేదిక అందించిన శ్రీకృష్ణ కమిటీ సిఫార్సుల పట్ల కేంద్రం వైఖరి ఏమిటనేది కేంద్రం చెప్పవలసి వుంటుంది. ఆ కమిటీ నివేదికలో అందరికీ సంబంధించిన అన్ని సిఫార్సులూ వున్నాయి.దాని కథ ముగిసిపోయిందిన అనధికారికంగా ప్రకటిస్తున్న హౌంశాఖ దానిపై వివరణ కూడా ఇవ్వాల్సి వుంటుంది. లేకపోతే రేపు తీసుకునే నిర్ణయాలు వేసే కమిటీల విలువేమిటన్న ప్రశ్న వస్తుంది.
ే ఢిల్లీ అఖిల పక్షం ముంద ప్రత్యేకించి అధికార పక్షం ముందు ఇన్ని సవాళ్లు వున్నాయి. ఎవరు ఏం చెబుతారో ఎలా బయిటపడతారో ఎలాటి విన్యాసాలు ప్రదర్శిస్తారో చూడవలసి వుంటుంది. ఎవరి రంగు ఏమిటో ప్రజలకు వెల్లడికావలసి వుంటుంది. అందుకే అన్ని పార్టీలూ అయినను పోయిరావలయు హస్తినకు అంటూ బయిలుదేరుతున్నాయి. కాకపోతే ప్రధానపార్టీలు ఇంకా వ్యక్తులను తేల్చకుండానే వ్యవహారాలు నడుపుతున్నాయి!

No comments:

Post a Comment