Pages

Tuesday, December 25, 2012

చారిత్రిక పరిణామంలో తెలుగు,,,


చారిత్రిక పరిణామంలో తెలుగు,,,
తేట తేట తెలుగులా.. తెల్లవారి వెలుగులా.. అని ఘంటసాల పాడుతుంటే హాయిగా వుంటుంది. పాడనా తెలుగు పాట గీతం ఓహౌ అనిపిస్తుంది. తేనెకన్నా తియ్యనిది తెలుగు పాట..అనితల వూగిపోతుంది. తెలుగు'వాడి' గురించిన శ్రీశ్రీ ప్రయోగంలో శ్లేష ఓహౌ అనిపిస్తుంది...
ఇంకాస్త వెనక్కు వెళితే గురజాడ.. ఆ వెనక వేమన్న.. ఆ వెనక తిక్కన. ఆ ముందు నన్నయ్య, నన్నెచోడుడు.. ఇలా కవి పుంగవులు.. పండిత ప్రకాండులు కళ్లముందు కదలాడతారు. అఆలు దిద్దించిన అమ్మలు అమ్మమ్మలు పంతుళ్లు పంతులమ్మలు ఒకరేమిటి చదువుతో ముడిపడిన ప్రతివారూ గుర్తుకొస్తారు. తెలుగు తల్లి, తర్వాత వెలసిన తెలంగాణా తల్లి తదితర వల్లీమతల్లులందురూ మదిలో మెదులు తారు.
మల్లమ్మ పతిభక్తి. రుద్రమ్మ భుజశక్తి, తిమ్మరుసు ధీయుక్తి..కృష్ణ రాయల కీర్తి.. చరిత్ర కళ్లముందు కదలాడుతుంది. స్వాతంత్ర సంగ్రామం, జమీందారీ వ్యతిరేక పోరాటం.. నిజాం నిరంకుశత్వంపై తిరుగుబాటు అన్నీ మదిలో మెదులుతాయి. ఇన్నిటిని కలిపి వుంచిన బంధం అక్షరం. తెలుగు అక్షరం. అందచందాల ఒంపుసొంపుల అక్షర ం. 56 అక్షరాలతో ప్రపంచంలో ఏ భాషా పదాన్నయినా రాయగల తెలుగు అక్షర సంపద అనితర సాధ్యం. అరుదైన సంగీత గుణంతో ఇటాలియన్‌ ఆఫ్‌ ద ఈస్ట్‌ అని పిలిపించుకున్న తెలుగు కు ఆంధ్రం అనీ, తెనుగు అనీ తెనుంగు అనీ పర్యాయ పదాలు. తెలుగు ప్రాతిపదికపై ఏర్పడిన భౌగోళిక విభాగాన్ని విభజించాలన్న కోర్కెతో పాటే తెలుగు భాషలో తేడాలపైనా వివాదాలు నడుస్తున్నాయి గాని తెలుగు ఔన్నత్యంపై భిన్నాభిప్రాయాలు లేవు.
ఇంతకూ ఈ తెలుగు ఎప్పుడు పుట్టింది? దాని తొలి అడుగులేవి?

ప్రసిద్ధ చరిత్ర పరిశోధకుడు పి.వి.పరబ్రహ్మశాస్త్రి అధ్యయనం ప్రకారం తెలుగు భాష క్రీపూ5 వ శతాబ్డం వరకూ తెలుగు అనదగిన భాష లేదు. స్థానిక తెలుగు/ఆంధ్ర, బౌద్ధ మత ప్రచారకుల ప్రాకృతం, విద్వత్‌ బ్రాహ్మణుల అలాగే బౌద్ధ జైన ఆచార్యుల సంసృతం అనే మూడు భాషలు వుండేవంటారు. స్థలనామాలు, నదుల పేర్లు , దేవీ దేవతలపేర్లు వంటివి, పనిముట్ల పేర్లు పక్కనపెడితే లిఖితపూర్వకంగా తెలుగు అని చెప్పదగిన ఆధారాలు లేవని తేల్చేశారు. ఆచార్య నాగార్జునుడు క్రీపూ మొదటి శతాబ్దంలో వ్యాఖ్య రాసిన ప్రజా పారమితను అంధక అనే శాఖకు చెందిన అనేక మంది విస్తరించారు. నాగార్జునుని శిష్యులు మరిన్ని బౌద్దగ్రంధాలు వెలువరించారు. ఈ కాలంలోనే ఆపస్తంభ కృతులు కూడా వెలువడ్డాయి.వైదిక ధర్మాలను వివరించే ఈ గ్రంధాన్నే ఆంధ్ర వేద పండితులు మననం
చేస్తుంటారు.
తెలుగు భాషకు తెనుగు తెలుగు తెనుంగు,తెనుగు అని వివిధ పేర్లతో పిలవడమే గాక ఆంధ్ర ఆంధ్రి అనే నామాంతరాలు కూడా వున్నాయి. తెలుగు,ఆంధ్ర అని రెండు పేర్లు వాటికి మళ్లీ ప్రత్యామ్నాయాలు వుండటాన్ని బట్టి ఈ భాషా పరిణామంలో అనేక దశలున్నాయని అర్థమవుతుంది. ప్రాక్‌ చరిత్ర కాలంలో ప్రాచీన వ్యవసాయ జాతులు అంటే తెలుగువాళ్లు/తైలింగులు అయి వుంటారనీ, ఆంధ్రులు ఉత్తరాది నుంచి దక్షిణాదికి తరలి వచ్చిన వాళ్లయి వుంటారని ఆయన వూహ.ఈ రెండు జాతులు మిళితమైనట్టే వారి భాషలు కూడా కలసి పోయి ఒకే భాష ఒకే ప్రజగా తయారై వుంటారన్నారు.ఇలా కలసిపోయిన వీళ్లను భాషాపరంగా గాని సంసృతి పరంగా గాని నిర్దిష్టంగా ఎత్తిచూపించే తేడాలేమీ కనిపించవు.ఆంధ్రులు తమతో పాటు వందలాది ప్రాకృత పదాలతో సహా ఆర్య లక్షణాలను తీసుకొచ్చారట. ఆ విధంగానే తెలుగులో తత్సమాలు(అంటే అదే అర్థం కలిగినవి), తద్బవాలు(అంటే దాన్నుంచి పుట్టినవి) ఏర్పడ్డాయి.నాగము అంటే పాము కావడం తద్భవం, ఆర్య నుంచి అయ్య రావడం తద్భవం. ఇలా వందలపదాలు వచ్చి చేరడం వల్ల తెలుగు భాష చాలా సుసంపన్నమైంది. క్రీ.శ.మొదటి శతాబ్దం నుంచి నాణేల మీద రాసిన రాతల్లో తెలుగు కనిపిస్తుంది. తద్భవ,తత్సమ దేశి మాటల మిశ్రమ భాష అంధక అని బౌద్ధులు అన్నారు.బౌద్ధ మతాన్ని తప్పించి క్రమేణా వైదిక మతం లేదా బ్రాహ్మణ పౌరాణిక మతం వచ్చింది. తెలుగు భాషమీద ప్రాకృత ప్రభావం కన్నా సంసృత ప్రభావం అధికమైంది. రచయితలు అంతకు బౌద్ద యుగంలో పవిత్రంగా భావించిన పాళీ(ప్రాకృత) భాష స్థానాన్ని సంసృతం ఆక్రమించింది. పాత శాసనాల్ని మార్చి మళ్లీ జారీ చేయడం మొదలెట్టారు. ఇది ఎంత వరకూ పోయిందంటే నల్లమల శ్రీ పర్వతంగానూ, మరొకటి మంగళగిరిగానూ, నల్లబెన్న కృష్ణవేణిగానూ, యనమ దలమహిష శిరగానూ మారిపోయాయి! అయితే ఈ చొరబాట్లన్నింటినీ తట్టుకుని పేర్లలో తెలుగు నిలిచి పోయింది. అంగి, అంకి,పర్రు,కుర్రు,ఊరు వంటివన్నీ ఆ కోవకు చెందినవే.
ఇక లిపి విషయానికి వస్తే భారత దేశంలోని ఇతర భాషల లాగానే తెలుగు లిపి కూడా బ్రాహ్మీ లిపి నుంచి వచ్చింది.మొదట తెలుగు అక్షరాలు తక్కువ సంఖ్యలో వుండేవని క్రీపూ,3 వ శతాబ్దినాటి భట్టిప్రోలు శాసనం చూస్తే తెలుస్తుంది.800 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో అంటే క్రీ.శ.5,6 శతాబ్దాల నాటికి విస్త్రతి సంతరించుకున్నాయి. పదవ శతాబ్డం దాకా తెలుగు కన్నడ లిపులు ఒకటే విధంగా వుండేవి. దాన్ని తెలుగు కన్నడ అనేవారట. తర్వాత నుంచి మారాయి. క్రీపూ. మొదటి శతాబ్దిలో పాలించిన తొలి శాతవాహనుల కాలానికి తలకట్టు వచ్చి చేరింది. అశోకుని కాలం నాటి శాసనాలలో కగత వంటి రూపాలు కోసుగా వుండేవి. అ,క,ర వంటి అక్షరాలు దిగువ అంచులు ఎడమకు వంగివుండేవి. ఇలాగే వివిధ రకాలైన అక్షరాలలో వివిధ మార్పుల వచ్చాయి.ఇలా రకరకాలుగా వున్న తెలుగు అక్షరాలను నన్నయ్య ప్రామాణికం చేశాడనీ అందుకే ఆయన వాగనుశాసనుడయ్యాడని అంటారు. తమాషా ఏమంటే ఈ విషయంలో ఆయనకు సహకరించిన నారాయణభట్టు కన్నడిగుడు కావడం. నన్నయ్య వైదిక ధర్మ పరిరక్షణ, రాజరాజనరేంద్రుని రాజకీయ ప్రయోజనాల పరిరక్షణ కోసం మహాభారతం వ్యాసభారతం ఆధారంగా మొదలెట్టాడు. అదే మొదటి బృహత్‌ కావ్యం అనే ఉద్దేశంతో ఆది కవి అన్నారు. అయితే క్రమంగా అది శ్రుతి మించిన తతంగంగా తయారైంది. ఆదికవి అనడం వల్ల ఆయనతోనే తెలుగు కావ్య రచన మొదలైందన్న పొరబాటు అబిప్రాయం ఏర్పడింది. నిజానికి జానపదులు శ్రమ జీవులు గిరిజనులు తదితరులంతా అనేక విధాల పాడుకుంటూనే వున్నారు.లిఖిత రచన, అందులోనూ బాగా పెద్దదైన కావ్యం మాత్రమే గౌరవ యోగ్యమన్న పొరబాటు భావన ఆదికవి భజనకు దారి తీసింది. సోదికవులను మరిపించేలా చేసింది. ఇదే ఉత్తరోత్తరా మన కొంప ముంచుతుందని అప్పట్లో అర్థం కాలేదు. ప్రాచీన భాష హౌదాకు కనీసం రెండు వేల ఏళ్లు వుండాలని అన్నప్పుడు ఆదికవి రాసింది వెయ్యేళ్లకిందటే కదా అన్న ప్రశ్న ఎదురైంది.
పరబ్రహ్మశాస్త్రి అభిప్రాయాలకు భిన్నమైన భావనలు కూడా వున్నాయి.ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన తెలుగూ తమిళమూ అటూ ఇటుగా రెండు వందల సంవత్సరాల తేడాతో పెరిగనవే నంటారు. క్రీపూ 273 నాటి అశోకుడి శాసనాల్లోనే ఆంధ్రులు వీరులని వున్నప్పుడు భాషా సాహిత్యాలు లేకుండా జరుగుతుందా అని వీరడుగుతారు. నన్నయ్యను ఆది కవి అన్నంత మాత్రాన ఆయనకు ముందు బాష లేదనా? ఆయన తర్వాత వెయ్యేళ్లకు కూడా ఆయన ప్రభావం వున్నట్టే తనకు ముందున్న వెయ్యేళ్ల ప్రభావం ఆయనపై వుండి వుండాలి కదా అని తర్కిస్తారు. జివిపూర్ణచందు వంటివారైతే అసలు తెలుగు తమిళం కన్నా ప్రాచీనమైనదని వాదిస్తారు.
నన్నయ్య దేశి కవితను సంసృత మార్గం పట్టించారన్న అభిప్రాయం వుంది.. తమిళ భాషలో సంగం సాహిత్యం తొలిదశకు సంకేతంగా భావిస్తారు, అందులో ఒకటైన తొల్కాప్రియం లక్షణ గ్రంధం. దాన్ని రాయలేకపోయినా శాబ్దికంగా రికార్డు చేయించారు. మరి ఆ కాలానికి తెలుగులోనూ అలాటి గ్రంధాలు లేవని చెప్పగలమా? వున్నా దొరక్కుండా పోయే అవకాశం లేదా?ప్రాచీన ఆధారాలను సేకరించాలంటే శాస్త్రీయ దృష్టి వుండాలి. తదేక దీక్షతో పరిశీలించాలి. మనకు ఆ విధమైన దృష్టి లేకపోయిందన్నది నిజం. నాటి సనాతన పండితులు రాజాస్థానాల్లోనే సాహిత్య ఉత్పత్తి వ్యుత్పత్తి దాగున్నాయని అనుకున్నారు. శ్రమ జీవుల చమట పాటల్లో సరస్వతిని గుర్తించలేకపోయారు. గుర్తించినా గౌరవించలేకపోయారు. ఆది కవులను కీర్తిస్తూ సోది కవులను విస్మరించారు.తమిళులు కాపాడుకున్న సంగం సాహిత్యంలో కనిపించే పల్లె పదాల వంటివి మన జానపదాల్లోనూ వున్నాయని పాల్కురికి సోమనాథుడు సోదాహరణంగా వివరించాడు. ఆ పల్లె పాటలే కాదు, బౌద్ద జైన విశ్వాసాలకు సంబంధించిన సాహిత్యం కూడా మనకు దక్కలేదు. తమిళంలో లభ్యమవుతున్న తొలి సాహిత్యమంతా చాలా వరకూ జైనులదే. కనక తెలుగులో దాన్ని కాపాడుకోలేకపోవడం పెద్ద లోపంగా మారింది.
అదలా వుంచి మళ్లీ ఆదికవి పద్దతికే వస్తే ఆరుద్ర తెలుగు సాహిత్య పరిణామాన్ని బట్టి 12 యుగాలుగా విభజించారు(బాక్సు చూడండి) ఈ యుగ విభజన ప్రకారమే సమగ్ర ఆంధ్ర సాహిత్యం రాశారు. ప్రబంధ యుగం, జమీందారీ యుగంలో గురజాడతో ఆధునిక భావన ప్రవేశించింది.
గురజాడ,గిడుగు, కందుకూరి వీరేశలింగం వీరిని ఆధునిక తెలుగు వైతాళికులుగా ప్రజలు గౌరవించారు. ఇందులో మొదటి ఇద్దరు భాషా సాహిత్య రంగాలలో కృషి చేసిన వారు కాగా కందుకూరి సామాజిక రంగంలోనూ విజృంభించి పనిచేశారు. అయితే గురజాడ విషయంలో సంస్కరణకు సాహిత్యం తోడైంది. ఇంకా చెప్పాలంటే సామాజిక సంస్కరణకు సాహిత్యం దోహదపడాలంటే భాషా సంస్కరణ అవశ్యమని ఆయన గుర్తించారు. ప్రపంచంలోని చాలా దేశాలలో వలెనే భారత దేశంలోనూ ఆంధ్రలోనూ కూడా భాషా సంస్కరణతోనే జాతీయ భావాలు పొటమరించడం చూస్తాం. భాషను చాందస శక్తుల గుప్పిటి నుంచి తప్పించి జనబాహుళ్యానికి అందుబాటులోకి తేవాలన్న తపనతో పోరాడిన ప్రజాస్వామిక శక్తులే సమాజాన్ని కుదిపేశాయి. గురజాడ తన భావాలను స్పష్టంగానే ప్రకటించాడు.ఆయన కన్యాశుల్కం నుంచి అసమ్మతి పత్రం వరకూ అన్నీ ఆ దిశలో సాగిన ప్రయత్నాలే. ఇందుకు భిన్నంగా తెలుగు తక్కువ రకం భాష అనీ, అందులోరాయడం అవమానమనీ పండితులు భావించారు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి తన కుటుంబంలోనే ఎదురైన అనుభవాన్ని గ్రంధస్తం చేశారు.(బాక్సు చూడండి) అంతకన్నా ముందే వేమన వంటి మహాకవిని గుర్తించకుండా తొక్కిపడితే విదేశీయుడైన బ్రౌన్‌ వెలుగులోకి తెచ్చాడు!
కందుకూరి తన శిష్య బృందం సహాయంతో హౌరాహౌరి పోరాడి జయించారు. గురజాడకు విజయనగరం రాజా అండ వుంది గనక సరిపోయింది. ఇక గిడుగు తనకు తానుగానే బాలకవి శరణ్యము వంటి గ్రంధం రాసి పండితుల గర్వభంగం చేశాడు. కనక తెలుగు నిలదొక్కుకోవడానికి చాలా పోరాటమే అవసరమైంది.ఇంత మహత్తర సేవ చేసిన వీరిని గుర్తుంచుకున్నది స్వల్పం. అభ్యుదయ ఉద్యమాలు బలపడ్డాకనే మళ్లీ వీళ్ల ప్రాధాన్యత పెరిగింది. కమ్యూనిస్టులు వీళ్లను గౌరవించడం సహించలేక కామ్రేడ్‌ వీరేశలింగం అంటూ గేళి చేయసాగారు. గురజాడ దేశభక్తి గీతం కమ్యూనిస్టులే ప్రాచుర్యంలోకి తెచ్చారు. పల్లెటూళ్లలో యువజనసంఘాలు ఆ సాంసృతిక వారసత్వాన్ని విస్త్రతంగా ప్రచారం చేశాయి. దానికి తగినట్టే కమ్యూనిస్టులు వర్గ చైతన్య స్పోరకమైన భాష వాడుకలోకి తెచ్చారు. ప్రజాశక్తి వార్తలు వూరూరా వ్యవసాయ కార్మికులను పోరాటోన్ముఖులను చేశాయి. ప్రజలు చుట్టూ కూచుని పత్రిక చదివించుకోవడం సర్వసాదారణ దృశ్యమైంది. ఇది సహించలేక ప్రజాశక్తి ప్యాస్‌, పెద్దబాలశిక్ష ఫెయిల్‌ అన్న ప్రచారం నడిచింది. ప్రజాస్వామిక వాదులు గనకే కమ్యూనిస్టులు భాషా సంస్కరణకు అంత ప్రాధాన్యత నివ్వగలిగారు. ఈ వరవడిలోంచే తర్వాత కాలంలో అభ్యుదయ కవులు ఉద్భవించారు. ఉత్తమోత్తమ కావ్యాలు సృష్టించారు.శ్రీశ్రీ వంటి వారు నూతన యుగ కర్తలైనారు.
కూర్తునా ముత్యాల సరములు/ కూర్చుకుని తేటైన మాటలు అని గురజాడ అంటే శ్మశానాల వంటి నిఘంటువులు దాటి చందస్సులు సర్ప పరిష్వంగాలు వీడి అని శ్రీశ్రీ అన్నారు. ఏతావాతా ఉభయులూ భాషా సరళీకరణనూ భావాల పదునునూ నొక్కి చెప్పడం గమనార్హం. ఈ లోగా దేశంలోనూ నూతన భావాలు పొటమరిస్తున్నాయి. జమీందారీ వ్యతిరేక పోరాటాలతో పాటే భూస్వామ్య భావజాలంపైనా తిరుగుబాటు బావుటాలు ఎగుర్తున్నాయి.ఇలాటి పరిస్థితుల్లోనే వీర తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటం కూడా ప్రారంభమైంది. మిగిలిన అనేక దుర్మార్గాలతో పాటు నిజాం నవాబు అత్యధిక ప్రజలు మాట్లాడే తెలుగు భాషా వికాసానికి అవకాశం లేకుండా నిషేదాలు విధించాడు.గ్రంధాలయాలు,పత్రికా నిర్వహణ కూడా నేరంగా చేశాడు. ఈ అణచివేతకు ఆంక్షలకు వ్యతిరేకంగానే మొదట సంస్కరణోద్యమం మొదలై ఆ తర్వాత విప్లవ పోరాటంగా విస్తరించింది. భాషా చైతన్యం ఏ విధంగా భావ విస్పోటనానికి దారి తీస్తుందనేందుకు ఇది మరో ఉదాహరణ.
(తెలుగుపై రాసిన చాలా వ్యాసాల్లో ఇదొక భాగం. బ్లాగు మిత్రుల కోసం..)

No comments:

Post a Comment