కులంతో పోలిస్తే మతాల చిత్రణ తెలుగు సినిమాల్లో ఎక్కువగానే వుంటుంది. ఇందుకు సంబంధించిన కొన్ని మూస ధోరణులు కూడా స్థిరపడిపోయాయి. ముస్లిం పాత్రల వేషభాషలను మన సినిమాలు ప్రత్యేకంగానే చూపించడం పరిపాటి. తెలుగులో అష్టావధానం చేయగల ముస్లిములు కూడా వున్నారని తెలిసినా మన దర్శకులు ఎప్పుడూ కృత్రిమ తెలుగు మాట్టాడే పాత్రలనే సృష్టిస్తుంటారు. వారికి పిల్లిగడ్డం, నెత్తిపైన టోటీ, గళ్లలుంగి లేదా పైజామా వంటి వేషాలు వేయిస్తారు. ముస్లిములతో పోలిస్తే క్రైస్తవ పాత్రలు తక్కువగా వున్నా వాటిపై అల్లిన కథలు ఎక్కువగానే వుంటాయి. వీటిలో అనేకం మత సామరస్యం బోధించేవిగా వుంటాయి గాని కాలక్రమంలో అనేక తేడాలు వచ్చాయి.
విజయా వారి మిస్సమ్మలో కథానాయిక సావిత్రి మేరి ఉద్యోగార్థం హీరో ఎన్టీఆర్ భార్యగా ఒక వూరు వస్తుంది. తర్వాత కథలో ఆమె మత విశ్వాసాలకు హిందూ సంప్రదాయాలకు మధ్యన ఘర్సణ చాలా సన్నివేశాల్లో వుంటుంది. కరుణించు మేరిమాత అన్న పాట ఆ తరహాలో ఒకే ఒక్కటి అని చెప్పాలి. విశేషమేమంటే ఇదే విజయా సంస్థ ఇంచుమించు ఇలాటి ఇతివృత్తంతోనే మళ్లీ 1975లో శ్రీరాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ నిర్మించటం.ఇందులోనూ కథానాయకుడు కృష్ణ అతని యజమాని జగ్గయ్యతో సహా అనేకులు క్రైస్తవులై వుండి బ్రాహ్మణులుగా వేషం వేసి హౌటల్ నడుపుతుంటారు. చివరకు అంతా ఒక్కటే అన్న సందేశంతో ముగుస్తుంది.
విలన్ పాత్రల విలక్షణ నటుడు నాగభూషణం స్వంతంగా నిర్మించిన ఒకే కుటుంబం మరో కోవకు చెందింది. ఇందులో ఎన్టీఆర్ అనుకోని పరిస్థితుల్లో రహీమ్‌గా పెరుగుతాడు. అందరికీ ఒక్కడే దేవుడు అన్న పాటతో మత సామరస్యం బోధించే ఈ చిత్రంలో కుటుంబ కథ మత ప్రభావం పెనవేసుకుని కనిపిస్తాయి. ఈ సమయంలోనే అక్కినేని నిర్మించిన మరో ప్రపంచం చిత్రం కులమతాలు వద్దని చెబుతుంది. అందులో అక్కినేని క్రైస్తవ ఫాదర్ వేషంలో కనిపిస్తాడు. ఆయనే కథానాయకుడుగా విఠలాచార్య ఫ్రెంచి నవల లే మిజరబులే అధారంగా పునర్నిర్మించిన బీదల పాట్లు చిత్రంలోనూ క్రైస్తవ ఫాదర్ ప్రభావంతో మారతాడు. ఎన్టీఆర్ తీసిన రామ్ రహీమ్, హిందీ నుంచి పునర్నిర్మించిన రామ్ రాబర్ట్ రహీం వీటన్నిటిలోనూ వివిధ మతాలకు చెందిన ప్రధాన పాత్రులుంటాయి. చాలా చిత్రాల్లో కథానాయకుడు ఒక మతానికి చెందినవాడై వుండి మరోచోట పెరగడం వుంటుంది. అయితే ప్రధాన పాత్రలుగా చూపించినప్పుడు తప్ప మిగిలిన అన్ని సందర్భాల్లోనూ ఇలాటి పాత్రలను హాస్యానికే
వాడుకోవడం చూస్తాం.
శోభన్ బాబు కథానాయకుడుగా ఎంఎస్‌రెడ్డి నిర్మించిన కోడె నాగుచిత్రంలోనూ క్రైస్తవ మతానికి చెందిన కథానాయికను హీరో ప్రేమించడం పెద్ద సమస్యగా మారి చివరకు వారి ప్రాణబలికి దారితీస్తుంది. ఈ చిత్రంలోని సంగమం పాట జాతీయ ఉత్తమ అవార్డు పొందింది. పాడవోయి భా రతీ యుడా అన్న చిత్రంలో దాసరి నారాయణరావు ఎవడు ముస్లిమెవడు హిందు వెవడు కిరస్తానీ, ఎవరిది తెలుగు ఎవరిదాంగ్లమెవరిది హిందూస్తానీ అన్న పాట అర్థవంతంగా చిత్రించారు.
ఎనభయ్యవ దశకంలో వచ్చిన సీతాకోక చిలుక చిత్రంలో కథానాయిక క్రైస్తవురాలు కావడం ప్రధానాంశం. అప్పట్లో ఆ లేబ్రాయపు ప్రేమకథ సంచలనం కలిగించింది. కొంతకాలం తర్వాత వచ్చిన ముద్దుల మామయ్యలోనూ కథానాయిక విజయశాంతిని క్రైస్తవురాలిగా కనిపిస్తుంది. అనేక చిత్రాల్లో అనాధాశ్రమాలను చూపించాల్సి వచ్చినపుడు మిషనరీలను తీసుకోవడం జరుగుతుంది. ఈ కాలంలోనే జంధ్యాల నెలవంక చిత్రంలో హిందూ ముస్లింల స్నేహాన్ని ప్రధానంగా చూపించారు.
దీంతో పోలిస్తే ముస్లిం పాత్రల చిత్రణలో క్లిష్టత వుంటుంది. ఆ పాత్రలు అన్ని దశల్లోనూ ఒకటిగా వున్నాయని చెప్పలేము. దేశంలో బిజెపి బలపడిన తర్వాత హిందూత్వ ఒకవైపు ఇస్లామిక్ చాందసం మరో వైపు పెరిగిన తర్వాత ఈ పాత్రల చిత్రణ ఉద్రిక్తంగా మారింది. తెలుగులో వచ్చిన నాగార్జున ఆజాద్‌లో ముస్లిం ఉగ్రవాది హిందూ స్వామిగా వేషాలు వేసుకున్నట్టు చూపిస్తారు. అంటే ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టు ఉభయ మతతత్వాలను ఒకే పాత్రకు అంటగట్టడమన్నమాట. నాగర్జునే తీసిన శ్రీరామదాసులోనైతే అసందర్భంగా తానీషాకు వ్యతిరేకంగా ఇప్పటి మత రాజకీయాలను జొప్పించి మాట్లాడించారు. ముస్లిం నవాబులకు భవనాలు కట్టుకోవవచ్చు గాని రాముడికి గుడి కట్టకూడదా అన్న రీతిలో చరిత్రకు సంబంధం లేని విషయాలు పలికించారు. తర్వాత రామదాసును హిందీల డబ్ చేయడం, అద్వానీ విడుదల చేయడం తెలసిన విషయాలే!
ఈ ధోరణి పరాకాష్టకు చేరిన చిత్రం ఖడ్గం. పాకిస్తాన్ విద్రోహ చర్యలను విమర్శించే పేరిట ముస్లిం పాత్రలను పూర్తిగా హిందూత్వ ప్రభావంలో చిత్రించిన దర్శకుడు కృష్ణవంశీ ఉద్రేకాలు కూడా రేకెత్తించాడు. సానుకూల ముస్లిం పాత్రలో ప్రకాశ్ రాజ్‌ను చూపించి తమ వారికి అతనితో బోధలు చేయించి తప్పంతా వారిదేఅన్నట్టు గోద్రా ఘటన వంటిదాన్ని నివారించినట్టు చూపించారు. ఇవన్నీ ఎన్‌డిఎ అధికారంలో వున్నప్పుడే వచ్చినవి కావడం విశేషం. జై అన్నచిత్రంలోనూ భారత పాకిస్తాన్ ఘర్షణను నేపథ్యంగా తీసుకుని చాలా ఉద్రిక్త సన్నివేశాలు చూపించారు.ముస్లిములు అనగానే టెర్రరిస్టులు అన్న భావాన్ని ప్రతిబింబించే చిత్రాలు ఇంకా చాలా వున్నాయి. ఇలాటి సమయంలోనే పవన్ కళ్యాణ్ మాత్రం తన జానీ చిత్రంలో నారాజు కారాకుర అన్నయ్య నజీరు అన్నయ్య అన్న పాటలో హైదరాబాదు చరిత్రను హిందూ ముస్లిం సామరస్యాన్ని బాగా చూపించారు. అంతేగాక ఉభయ మతతత్వవాదులూ స్వార్థపరులే తోడుదొంగలే అన్నట్టు చిత్రించారు. ఆ నాటి పరిస్థితుల్లో ఇది అరుదనే చెప్పాలి.
కరుణామయుడు చిత్రం తర్వాత విజయచందర్‌ను ప్రత్యేకంగా క్రైస్తవ ఫాదర్‌గా చూపించే చిత్రాలు కొన్ని వచ్చాయి. అలాగే ముంబాయి స్మగ్లర్ల పాత్రలు చూపించినప్పుడు ఎక్కువగా ముస్లిం వేషధారణ కనిపిస్తుంటుంది. రజనీకాంత్‌కు గొప్పపేరు తెచ్చిన భాషా నిజానికి భిన్నమతాల స్నేహితుల కథే. చనిపోయిన మిత్రుని పేరు తీసుకుని మాణిక్యం బాషా అవుతాడు!కమల్ హాసన్ హేరాం పేరిట తీసిన చిత్రంలో నేరుగా 1948 నాటి కలకత్తా మతకలహాలు చిత్రించాడు. అందులో ఆనాటి పరిస్తితిని కళ్లకు కట్టినట్టు చూపే ప్రయత్నం చేశాడు. మణిరత్నం ముంబాయి, రోజా వేర్వేరు కోణాల్లో ఈ సమస్యను సృశించాయి. రోజాలో కాశ్మీరీ ఉగ్రవాదులను చూపించితే ముంబాయిలో మతాంతర వివాహం చేసుకున్న జంట మత కలహాల మధ్య ఎదుర్కొన్న మనోవ్యధ చిత్రించారు. భిన్న మతాల కారణంగా కీచులాడుకున్న వారి తండ్రులు చివరకు రక్షించడం కోసం ప్రాణాలర్పించడం చూపించాడు. హాస్య నటుడు రాజేంద్ర ప్రసాద్ తీసిన చిత్రంలో క్రైస్తవ టీచర్‌తో మతాంతర వివాహం చేసుకున్న హీరో కుటుంబ సభ్యులు అతన్ని ఎన్ని తిప్పలు పెట్టారో చూపించారు.
ముస్లిం పాత్రలు ధరించడంలో ఎన్టీఆర్ దిట్ట. ఒకే కుటుంబంలోనే గాక చాలా చిత్రాల్లో ఆయన మారు వేషాలు అరబ్ షేక్‌ల మారువేషాలు వేస్తుంటాడు. అదే హస్యనటుల్లో రాజ్‌బాబు ఎక్కువగా అన్న మత వేషాలు వేశాడు.
ఎక్కువగా మన చిత్రాలు మత సామరస్యం బోధించేవైనా ఇటీవల కాలంలో మత ప్రాతిపదికన ఉగ్రవాదాన్ని చూపించడం కూడా బాగా పెరగడం ఆందోళనకరం. ఇది దేశంలో పరిస్థితికి ప్రతిబింబమే. అయినా సంయమనం చూపించాల్సిన బాధ్యత దర్శక నిర్మాతలపై వుంది.ఇటీవల వచ్చిన ఓనమాలు చిత్రంలో ముస్లిం టైలర్‌కు పండుగ రోజున వూళ్లో వాళ్లంతా వెళ్లి తలా ఒకటి అందించే ఆత్మీయతను చూపించారు. ఇది చాలా ఆకట్టుకుంటుంది. అలాగే ఇరుగు పొరుగున వున్నవారు పెద్దలు మతాలతో సంబంధం లేకుండా ఆదుకోవడం చాలా చిత్రాల్లో చూపిస్తుంటారు. ఇవన్నీ ఆహ్వానించదగిన ప్రయత్నాలు. నిజానికి చాలాచిత్రాల్లో దేవుడికి సంకేతంగా మూడు మతాల చిహ్నాలు చూపించడం సర్వసాధారణం. హీరోలను కూడా వేర్వేరు దేవుళ్ల రూపంలో చూపిస్తుంటారు. తెలుగు సినిమాలు మతసామరస్య సందేశానికి ప్రాధాన్యత నిస్తాయని చెప్పొచ్చు. దాంతోపాటే ఇటీవల కనిపిస్తున్న కొన్ని అవాంఛనీయ ధోరణులను నివారించడం అవసరమనీ చెప్పాలి.
No comments:
Post a Comment